పాఠకులకు ఒక బహుమానం – ఒక భార్గవి

ఒక భార్గవి’ తప్పకుండా తెలుగు వ్యాసావళి విభాగంలో తెలుగు సాహిత్యానికి ఒక కమ్మని కుసుమ కదంబం.
రచయిత్రి స్వానుభవాల వ్యాసాలన్నీ ఇలా బరువుగా ఉంటాయనుకోకండి. రచయిత్రి తన బాల్యం , యౌవన దశల మీద ఒక పుస్తకం రాయడానికి పూనుకోవాలే కానీ ఆ పుస్తకం ఒక ‘అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ ని మించిపోతుంది. రచయిత్రి తన బాల్యంలోని సంఘటనలను గుర్తు చేసుకుంటూ ‘దెయ్యాల బండిలో నా చదువు’ అనే వ్యాసంలో, “బల్లమీద నా ప్రక్కనే కూర్చున్న అమ్మాయి నాతో ‘డబ్బులు ఎలా వస్తాయో నాకు తెలుసు’ అంది. నేను వెర్రి మొహం వేసుకుని ఎలా’ అన్నాను. ఏముంది ఒక పావలా పాతి పెడితే ఒక చెట్టు మొలుస్తుంది. కొన్నాళ్లకు దాని నిండా డబ్బులు వస్తాయి. కావాలంటే పావలా ఇవ్వు బోలెడు డబ్బులు వస్తాయి’ అంది. ఎలాగోలా ఇంట్లో ఏడ్చి, రాగాలు పెట్టి మా అమ్మ దగ్గర నుండి ఒక పావలా సంపాదించి ఆ అమ్మాయి చేతిలో పెట్టాను. ఇక చూడండి – ఎన్నాళ్ళు ఎదురు చూసినా నా పావలా రాదు, డబ్బు చెట్టూ చూపించదు. మరీ మరీ అడుగుతుంటే మా మావయ్య పోలీస్ తెలుసా’ అని బెదిరించింది”. ఇలాంటి చిన్నతనపు, అమాయకత్వంపు అనుభవాలు రచయిత్రికి బోలెడన్ని.

మనల్ని ముందు కూర్చోబెట్టుకుని కళ్ళు చారడేసి చేసి, నేనైతే కదా ఇలా చెప్తాను…’ అంటూ మన కళ్ళలోకి చూస్తూ ఈ వ్యాసాలన్నీ కబుర్లలాగా చెప్పేస్తున్నట్లు ఉంటుంది. హాశ్చర్యం మీద హాశ్చర్యం’, ‘రామకృష్ణ అని మారు పేరు పెట్టుకొని తిరుగుతున్న పరోపకారి పాపన్న’ ‘రియల్ జెంటిల్మెన్’ (తిట్టు కాదని మనవి). హేమాంత్రపు బాల చంద్ర సారీ బాలాంత్రపు హేమచంద్ర లాంటి
ఛలోక్తులతో ఆద్యంతం ఈ పుస్తకం నవరసభరితంగా సాగిపోతుంది. రచయిత్రి ఛలోక్తులను మరీ అంత తేలిగ్గా తీసుకోవద్దు. పుస్తకం కమ్మగా ఉంది కదా అని చదివేటప్పుడు ఏ కాఫీ కప్పునో కారప్పూసనో నోట్లో పెట్టుకోవద్దు. పొలమారి ఇబ్బంది పడతారు. ఎందుకంటే రచయిత్రి హాస్యం ఎక్కడ ఏ వ్యాసంలో ఎలా ఎదురవుతుందో ఊహించలేము. ఇక్కడ హాస్యం ఏంటి? పాపం డాక్టర్ గారికి మొదటిసారి మెడికల్ సీట్ రాక ఇంటికి తిరిగొస్తే! అని అనుకునే చోటు కూడా గిలిగింతలు ఉంటాయి. కొన్ని వ్యాసాలు అయితే గిలిగింతలతో మొదలై వగలబడి నవ్వే వరకు తీసుకెళ్తాయి.

దీనికి ఉదాహరణ శాతకర్ణా- వాతకర్ణా వ్యాసం- వ్యాసం మొత్తం నవ్వించి నవ్వించి చివరకు “ఈ సినిమా కథ ఏమీ లేదని మేము చెప్పంగాక చెప్పం – మీ వాతలు మీరు వేయించుకోవాల్సిందే” – అంటూ మళ్ళీ నవ్వుల దోవ పట్టిస్తారు. తెలుగు సాహిత్యంలో బహుముఖమైన ప్రక్రియలు ఉన్నాయి. అందులో వ్యాసావళి కూడా ఒకటి. ఒక భార్గవి’ తప్పకుండా తెలుగు వ్యాసావళి విభాగంలో తెలుగు సాహిత్యానికి ఒక కమ్మని కుసుమ కదంబం. పాఠకులకు ఒక బహుమానం. వాశిలోనే కాదు రాశిలో కూడా. ఎందుకంటే అత్యంత నాణ్యమైన ఆర్ట్ పేపర్తో అచ్చు వేయబడిన ఈ పుస్తకం అత్యంత తక్కువ ధరకు అందజేస్తున్నారు రచయిత్రి. వ్యాసానుగుణంగా గిరిధర్ గౌడ్ గీసిన రంగుల బొమ్మలు ఎంతగానో అలరించాయి.

కొన్ని పుస్తకాలకు పుస్తక పరిచయాలు, సమీక్షలు పూర్తి న్యాయం చేయలేవు. ఎన్ని ఉపమానాలు ఉపయోగించినా ఆ పుస్తక సౌందర్యాన్ని వ్యక్తీకరించలేవు. అలాంటి పుస్తకమే ఈ ‘ఒక భార్గవి. పాఠకులు తప్పకుండా వుస్తకం చదివి, అందులోని భావసౌందర్యాన్ని, భాషామాధుర్యాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను.
-పల్లవి జి.

ఒక భార్గవి, రచయిత: డా. భార్గవి పేజీలు: 268 (రంగులలో, Rs. 320/ ప్రతులకు: డా. భార్గవి, భార్గవి నర్సింగ్ హోమ్, పామర్రు, కృష్ణా జిల్లా. ఫోన్: 08674 – 253210, 253366 మరియు నవోదయ బుక్ షాప్, కాచిగూడ, హైదరాబాద్. ఫోన్: 040-24652387.

SA: