జనజీవన దృశ్యాలే – టీవీ చిత్రాలు

చిత్రకారుడు టి. వెంకట రావు(టీవీ) చిత్రాలు జీవిత సారాంశాన్ని మరియు సమకాలీన సమాజానికి అద్దంపడతాయని ఏపీ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు.
విజయవాడలోని కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ మరియు అమరావతి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ మొగల్‌రాజపురం ఆర్ట్ గ్యాలరీలో టీవీగా పేరుగాంచిన సీనియర్ ఆర్టిస్ట్ మరియు కార్టూనిస్ట్ టి. వెంకట్ రావు చిత్రకళా ప్రదర్శనను మండలి బుద్ధ ప్రసాద్ ప్రారంభించారు. 5 వ తేదీ, ఆదివారం ఉదయం క్రియేటివ్ ఆర్ట్ అకాడమీ, తెలుగు వరల్డ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా బుద్ద ప్రసాద్ మాట్లాడుతూ, టీవీ చిత్రించిన చాలా పెయింటింగ్‌లు కళాకారుడిగా తన కెరీర్‌ను ప్రతిబింబిస్తాయని, గత 60 ఏళ్లుగా ప్రకృతిని, సామాన్యులను ప్రభావితం చేసిన వివిధ సమస్యలు, రాజకీయ అంశాలను తెలియజేస్తున్నాయని అన్నారు. అతని కళా వ్యక్తీకరణలలో ఒక సామాజిక తత్వవేత్తను చూడొచ్చు అన్నారు. తన అనుభవాలకు చిత్ర రూపం కల్పిస్తే వచ్చిన చిత్రాలే ఇవన్నారు బుద్ధ ప్రసాద్. కార్టూనిస్ట్ గా కూడా విశాలాంధ్ర పత్రికలో టీవీ ఎన్నో కార్టూన్లు గీశారన్నారు. ముఖ్యఅతిథి పద్మశ్రీ అవార్డు గ్రహీత, చికాగోకు చెందిన అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలుగు కళాకారుడు ఎస్‌.వి. రామారావు మాట్లాడుతూ టీవీ కళాఖండాలు సామాన్యుడి చుట్టూ తిరుగుతున్నాయని, సమకాలీన రాజకీయ నాయకులను చైతన్యపరిచే అతని సమస్యల చుట్టూ తిరుగుతాయని అన్నారు.

artists TeeVee, SV Ramarao and Aseervaadam

హైదరాబాద్‌కు చెందిన మరో సీనియర్‌ కళాకారుడు జి.వై. గిరి సమాజంలో అణగారిన వర్గాల సమస్యలను తెలియజేయడంలో ఉన్న చైతన్యాన్ని వివరించారు. బుద్ధప్రసాద్‌ చిత్రకారుడు టీవీ ని శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. ఈకార్యక్రమంలో అమలాపురం నుండి ఆశీర్వాదం, గోళ్ళ నారయనరావు, సన్నాల వర ప్రసాద్, నారప్ప, కళాసాగర్, అత్మకూరి రామకృష్ణ, సాండ్ శ్రీనివాస్, పి.యస్. బాబు, రాము, బాలయోగి, మురళీకృష్ణ, పి.రమేష్, విజయవాడ పరిసర ప్రాంతాల్లోని కళాకారులు, కళా విమర్శకులు, కళాభిమానులు పాల్గొన్నారు.
-కళాసాగర్

1 thought on “జనజీవన దృశ్యాలే – టీవీ చిత్రాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap