‘బొమ్మరిల్లు’ రాజ్యలక్ష్మి

‘బొమ్మరిల్లు’ రాజ్యలక్ష్మి గారంటే తెలియని వారుండరు ఒంగోలు ప్రాంతంలో. ‘బొమ్మరిల్లు’ ఆవిడ ఇంటిపేరు కాదు. బొమ్మరిల్లులోని పిల్లల ఆలనా పాలనలో మమేకమై ‘బొమ్మరిల్లు’నే ఇంటిపేరుగా మార్చుకున్నారు ఆమె. కబుర్లు చాలా మంది చెబుతుంటారు… కలలు కంటారు. ఈ సమాజంలో అనాథలుండకూడదని… సమసమాజం రావాలని ఉపన్యాసాలు ఇస్తారు, పుస్తకాలు రాస్తారు. కొంత మంది మాత్రమే దిక్కులేని వారిని ఆదుకుంటారు. తమకు తోచిన దారిలో సాయంచేసి, అభాగ్యులకు సేవ చేస్తారు అలాంటి వారిలో ఒకరు రాజ్యలక్ష్మిగారు. రాజ్యలక్ష్మిగారు ఒక పక్క ఉద్యోగం చేస్తూనే… మరో పక్క ‘బొమ్మరిల్లు’ పేరుతో ఒంగోలులో అనాథ పిల్లలకోసం వసతి గృహం నడుపుతున్నారు. ఆవిడకు ‘బొమ్మరిల్లు’లోనే సూర్యోదయం. పిల్లల ఆకలి తీర్చి, అందరినీ బడికి పంపించి, తర్వాతే ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆవిడకు రెండు చేతులు కాదు, పది చేతులు. ఒక పక్క ఇంటి నిర్వహణ, మరో వైపు ఆఫీస్ లో ఉద్యోగ విధుల నిర్వహణ, మరో పక్క N.G.O. లీడర్ గా బాధ్యతలు.

ఇన్నిటి మధ్య రచనలు కూడా చేస్తుంటారు. ఏడాది క్రిందట ఫేస్ బుక్ లో ఆవిడ రాసిన ‘ఆత్మకథ’ ఎందరో పాఠకుల అభినందనలను అందుకుంది. అంతే కాదు కథలు కూడా రాస్తారు ఆవిడ. ఒక రూపాయిని పదిరూపాయలుగా పెంచి తమ వారసులకు ఇవ్వాలని ఆలోచించే… డబ్బు వాసన కొట్టే మనుషుల మధ్య… అనాథ పిల్లలకోసం తమ సంపాదను ఖర్చు పెడుతూ, వారి బంగరు భవితవ్యానికి పాటు పడుతున్న రాజ్యలక్ష్మి గారి దంపతులు ఎందరికో ఆదర్శనీయులు. రాజ్యలక్ష్మి గారి సహచరులు ఖాసిం గారు అడుగడుగునా ఆమెకు సహకరిస్తూ ‘బొమ్మరిల్లు’ నిర్వహణలోనూ పాలు పంచుకొంటున్నారు. ‘పలకరింపు’కోసం… వారి జీవిత విశేషాలు తెలుసుకోవడానికి వారి ఇంటికి వెళదాం పదండి…!

1) నాలుగు రూపాయలు ఉంటే సొంతానికి వినియోగించు కోవాలని చాలా మంది అనుకుంటారు. అనాధ బాలలకు బొమ్మరిల్లు నడపాలని మీకెందుకు అనిపించింది.

జ. నా దగ్గర డబ్బులు ఉండి మొదలు పెట్టలేదు. నేను ఎంప్లాయిస్ సంఘంలో ఇరవై ఏళ్లు కింది స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో నాయకత్వం చేశాను. అప్పుడు సమాజముతో బాగా కనెక్టు అయ్యాను. ఆ అనుభవాల సారంతో పిల్లలకు ఏదైనా చేయాలని అనిపించేది. సమాజానికి పట్టని వాళ్ళు లేదా సమాజం తయారు చేసిన అభాగ్యులకు మంచి జీవితం ఇవ్వాలని అనుకున్నాను. ఆ ఆలోచనా క్రమమే ‘బొమ్మరిల్లు’ రూపు దిద్దుకోవటనికి పునాదులు పడ్డాయి.

2) బొమ్మరిల్లు మొదలు పెట్టి ఎంత కాలం అయ్యింది? ఎలాంటి పిల్లలు ఉంటారు.

జ. పది వసంతాలు పూర్తి చేసుకుంది. తల్లితండ్రులు లేనివాళ్ళు, నిరాదరణకు గురి అయినవారు, వీధి బాలలు, బాల కార్మికులు ఈ విధముగా అవసరమైన పిల్లలు (రక్షణ, తిండి, చదువు అవసరమైన వారు) ఎవరైనా ఇక్కడ ఉంటారు.

3) మీరిద్దరూ బాధ్యతగల ఉద్యోగులు కదా మీ సమయాన్ని బొమ్మరిల్లుకు ఎలా కేటాయించారు?

జ. నేను ఉద్యోగం నుండి రిటైర్ అయిన తరువాత ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండకూడదు అనుకున్నాను. అందుకని పదేళ్ల ముందే బొమ్మరిల్లు ప్రారంభించాను.అయితే పది మంది చాలు అనుకున్నాను. అలా 2014 లో ఒక్కరితో మొదలు పెట్టాను. కానీ ఉండేకొద్ది ఒకరి తరువాత ఒకరు రావటం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకుంది బొమ్మరిల్లు.
ఒక్కరితో మొదలు పెట్టాను. ఇద్దరు పని వాళ్ళను పెట్టుకొని కొంచెం సరుకులతో మొదటి అడుగు మొదలయ్యింది. ఉదయం అయిదు గంటలకు లేచి మేము ఇద్దరం పిల్లల దగ్గరకు వెళతాము. వాళ్ళను నిద్రలేపి అన్ని దగ్గర ఉండి చేసేవాళ్ళము. అందరు ఎనిమిది గంటలకు ఎక్కడి వాళ్ళు అక్కడ స్కూళ్లకు వెళ్ళిపోతారు. ఆ తరువాత మేము ఇంటికి వచ్చి రెడీ అయ్యి ఆఫీసుకు వెళతాము. మాకు ఆఫీసు పదిన్నరకు సాయంత్రం అయిదు తరువాత పిల్లలు కూడా స్కూళ్లనుండి వస్తారు కదా అప్పుడు మేము వాళ్ళ దగ్గరకు వెళతాము. వాళ్ళు నిద్ర పోయిన దాకా వాళ్ళతో ఉంటాము. అలా మా బొమ్మరిల్లు జర్నీ మొదలయింది.

4) చాలా మంది మీ ‘బొమ్మరిల్లు’లో ఉన్నారు. ఇక్కడ పిల్లలు ఎలా ఉంటారు?

జ. రక రకాల పిల్లలు. భిన్న నేపథ్యం, విభిన్న మనస్తత్వం ఉన్నవాళ్లు ఉంటారు. ఏ ఒక్కరూ ఒక రకముగా ఉండరు. వచ్చిన వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితులలో వస్తారు. వాళ్ళు ఇక్కడ ఒక స్టక్చర్ లో ఇమడటానికి చాలా సమయం పడుతుంది. కొంత మంది పారిపోతారు. కొంతమంది నాలుగు రోజులు గడిచిన తరువాత తప్పు అయింది అని తిరిగి వస్తారు. చెప్పిన మాట వినరు. చదువు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా చెప్పాలి అంటే పద్ధతిగా తినటం. టాయిలెట్స్ వాడటం కూడా రాదు. స్నానం చేయటం కూడా తెలియదు. ఎన్నాళ్ళు అయినా వేసుకున్న బట్టలు కూడా మార్చటం కూడా ఇష్టం ఉండదు. అలాంటి పిల్లలను మామూలుగా మార్చటం మామూలు విషయం కాదు. మేమూ చాలా సార్లు రిస్కుల్లో కూడా పడతాము. పారిపోయిన పిల్లల్తో చాలా సమస్యలు ఉన్నాయి. బయటకు వెళ్లిన తరువాత వారికి ఏదైనా జరిగితే మేము చేసిన పని అంతా వృధా. సమాజం అప్పుడు మా వెంట పడుతుంది. ఒక్కొక్క సారి ఎందుకు ఈ పని చేస్తున్నామా అని విరక్తి కూడా వస్తుంది.

  1. ఎవరికైనా పుట్టిన ఊరు మీద మమకారం, కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. మీకు ఉన్నాయా? అలాగే మీ చదువులు గురించి చెప్పండి ?

జ. భలే అడిగారు. నాకు పుట్టిన ఊరు సొంత ఊరు లేదు. అయినా ఏ ఊరు అని చెప్పేది. నేను పుట్టింది నర్సరావుపేట. అంటే మా అమ్మ పుట్టింట్లో. కాకపోతే బామ్మ (నాన్న అమ్మ) వాళ్ళు కూడా అక్కడే ఉండేవాళ్ళు. నేను పుట్టినప్పుడు నాన్న సంతమాగులూరు అనే చిన్న పల్లెటూరులో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. మూడో నెలలో అమ్మ నాన్న దగ్గరకు వచ్చింది. అప్పటినుండి సెలవులకు నరసరావుపేట వెళ్లేదాన్ని. అయిదవ తరగతికి రాగానే నాన్నకు గన్నవరం బదిలీ అయ్యింది. అక్కడ అరు నెలలు మాత్రమే ఉన్నాము. అక్కడ నుండి విస్సన్నపేట కు బదిలీ అయ్యింది. అక్కడ ఎనిమిదవ తరగతి వరకు ఉన్నాను. ఆ తరువాత తిరువూరు బదిలీ అయ్యింది. అక్కడ పదవ తరగతి వరకు ఉన్నాను. ఆ ఊరిలో ఇంటర్ లేదని అమ్మమ్మ వాళ్ళ దగ్గర అనగా నరసరావుపేట లో చదివాను. నాన్నకు ఒంగోలు కు బదిలీ అయ్యారు. డిగ్రీ అక్కడ చదివాను. పి.జి. చదవటానికి తిరుపతి వెళ్ళాను. చదువు అయిన తరువాత వెంటనే ఉదోగం వచ్చింది.
ఎక్కడ నేను మూడు ఏండ్లు ఉండలేదు. అందుకే నాకు సొంత ఊరు, చిన్న నాటి స్నేహితులు, చుట్టాలు రాకపోకలు వారితో అనుబంధం, ఇలాంటి ఏవి లేవు. ఒక ఊరినుండి బదిలీ అయినప్పుడు మాత్రం కొన్ని రోజులు ఆ జ్ఞాపకాలు బాగా భాధ అనిపించేవి. కొన్ని రోజులకు కొత్త ఊరిలో అలవాటు పడేటప్పటికి పాతవి మరుగున పడిపోయేవి.

6) మీ బాల్యంలో జరిగిన మరపురాని సంఘటన చెప్పండి?
జ. మరపు రాని సంఘటన అంటూ లేదు. నాన్న గారు చెప్పే చాలా విలువైన మాటలు నన్ను ఈ రోజుకు వెంటాడుతూ ఉంటాయి.

7) మీరు చదివిన మొదటి పుస్తకం ఏది?
జ. మా ఇంట్లో మా అమ్మమ్మ మంచి చదువరి. ఆమె రెగ్యులర్ గా వచ్చే మేగజైన్లు నవలలు చదివేది. అలాగే అమ్మ కూడా మధ్యాహ్నం భోజనం చేసి చాప వేసుకొని చదవటం ఒక అలవాటు. అప్పుడు పక్కన నేను కూడా పడుకొని వాళ్ళతో కలిసి చదివే దాన్ని. అయితే పిల్లలు చదవ కూడనివి ఉంటే పుస్తకం పక్కకు పెట్టి లేదా నాకు కనడకుండ చదివేవాళ్ళు. అలా నేను చివరకు మిగిలేది ఏది అనే సీరియల్ వాళ్ళ పక్కన పడుకొని దొంగతనంగా చదివాను.

8) అచ్చయిన మీ మొదటి రచన గురించి మీ అనుభూతి.

జ. నా మొదటి కథ “తొలి అడుగు”. ఓల్గా గారు నిర్వహిస్తున్న “అస్మిత” నిర్వహణలో ఉత్తమ కథల పోటీ ప్రకటన చూసి రాసి పోటీకి పంపాను. ఆరు కథలను ఎంపక చేశారు. దానిలో నా కథ కూడా ఉంది. అప్పటి వరకు నేను రాయగలను అని అనుకోలేదు. ఎందుకో ప్రకటన చూసి స్పందించాను. రాయాలని అనిపించింది. పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయంలో బహుమతి ప్రదానం చేసారు. ఆరు నెలల తరువాత మృణాళిని గారు ఒంగోలు వచ్చారు. ఆమెను నేను ట్రైన్ ఎక్కించటానికి రావలసి వచ్చింది. ఆమె పక్కనే ఉన్నాను కానీ మాట్లాడే ధైర్యం లేదు. ట్రైన్ లేటు అవటాన మాట మాట కలిసింది. మీరు కథలు రాశారా? అని మేడం అడిగారు. ఇక అవకాశం వచ్చింది కదా అని “అస్మిత” బహుమతి వచ్చింది అని అనగానే అవునా నీ కథ పేరు ఏమిటి ? అని అడిగారు.

“తొలి అడుగు” అని చెప్పాను. నేనే ఆ కథలకు జడ్జిని. కథ చాలా బాగుంది కానీ నీ చేతి రాత కొంచెం బాగాలేదు అందుకని ఒకటికి నాలుగు సార్లు చదవ వలసి వచ్చింది. కొంచెం రైటింగ్ బాగా రాయి. బాగా రాయగలవు అని భుజం తట్టారు. అంతకంటే నాకు పెద్ద బహుమతి అవసరం లేదు అనిపించింది.

9) ఫేస్బుక్ లో మీ ఆత్మకథ చాలా ఆసక్తికరంగా కొనసాగింది. మంచి ప్రశంసలు అందుకుంది. కానీ ఇంతవరకు పుస్తకము రాలేదు. ఎప్పుడు తెస్తున్నారు?

జ. నేను ఫేస్బుక్ లో యాక్టివ్ ఉంటాను. కానీ నేను పోస్టులు పెట్టను. అందరివీ చూసి రెస్పాండ్ అవుతాను. అనుకోకుండా ఒకసారి మా మొదటి ప్రేమ ఘట్టం గురించి రాశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ హుషారు లో రెండవ ఘట్టం రాశాను. చాలా మంది మిత్రులు రాయమని ప్రోత్సహించారు. అలా ముప్పై ఐదు ఎపిసోడ్స్ రాశాను. పుస్తకముగా రాలేదు. నాకు పుస్తకము తీసుకొని రావటం దాన్ని సర్కులేట్ చేసుకోవటం చేత కాదు. అప్పటికే చాలా మంది చదివి ఉన్నారు. అందుకని తీసుకొని రాలేకపోయాను. నేను సెలబ్రిటీని కాదు పుస్తకం కొని ఆసక్తిగా చదవటానికి. నావి ముప్పై కథలు వివిధ పత్రికలలో అచ్చు అయినప్పటికి వాటిని కూడా పుస్తకము చేయలేదు. ఎందుకో తెలియదు. మీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు నాకు నెత్తిమీద మొట్టికాయలు వేస్తారు పుస్తకము తీసుకొని రావాలని. కానీ ఎక్కడో లోపం తెలియదు. ఎందుకు తీసుకొనిరాలేదో ?

10) N.G.O లీడర్ గా చాలా కాలం పనిచేశారు. సున్నితమయిన స్త్రీల సమస్యలను ఎలా పరిష్కరించారు?

జ. నేను N.G.O. లీడర్ గా దాదాపు ఇరవై ఎండ్లు చేశాను. నేను 1997 లో సంఘంలోకి వచ్చాను. అప్పటి రోజుల్లో అంతటా పురుషులే. ఉమెన్ కనబడే వాళ్ళు కాదు. నాకు ఆఫీసులో వచ్చిన చిన్న సమస్య చిలికి చిలికి గాలి వాన అయ్యి ప్రెస్టీజియస్ గా అయి కూర్చుంది. అప్పుడు ఒక పెద్దాయన సలహా మీద యూనియన్ దగ్గరకు వెళ్ళవలసి వచ్చింది. వాళ్ళు నా కోసం చాలా ఫైట్ చేశారు. అయినా సమస్య తీరలేదు. అప్పుడు నేను కోర్టు మెట్లు ఎక్కి చాలా ఫైట్ చేసి విజయం సాధించాను. ఆ క్రమములో నాకు అప్పుడు యూనియన్ ఉంటే ఏమి చేయగలము అని తెలిసింది. నా ఫైట్ చూసి యూనియన్ వాళ్ళు “ఈ అమ్మాయి మన యూనియన్ కు బాగా పనికి వస్తుంది.” అని ఎన్నికలలో నిలబడాలి అని అడిగారు. అప్పటికి నాకు ఎదురు అయిన అనుభవాలతో యూనియన్లో ఒక మహిళ ఉండాలని అనిపించింది. ఎన్నికలలో పోటీ చేస్తే అందరికన్నా బంపర్ మెజారిటీతో గెలిచాను.

ఇక మహిళగా అంత మంది మగవాళ్ళలో కూర్చొని పని చెయ్యటమే పెద్ద సాహసం. మనము బయటకు గొప్పలు చెప్పుకోవడమే కానీ అక్కడ కూడా సమస్యలు ఉన్నాయి. గతంలో మహిళలు సమస్యలు యూనియన్ దృష్టికి తీసుకుని రావటానికి వెనకడుగు వేసే వారు. నేను రావటం వాళ్లకు ధైర్యం వచ్చింది. ఎక్కువగా మహిళ శిశు సంక్షేమ శాఖ, మెడికల్, రెవిన్యూ, డిపార్ట్మెంట్ లలో ఎక్కువగా సమస్యలు వచ్చేవి. నాలుగు పి.ఆర్.సి. లకు ఇప్పించటములో భాగస్వామిని అయ్యాను. మహిళా సమస్యలు అయితే మెటర్నిటీ లీవ్ మూడు నెలల నుండి ఆరు నెలలకు, పెటర్నిటీ లీవ్, స్టడీ లీవ్, ప్రతి యూనియన్ బాడీలో మహిళలకు ఒక పోస్టు రిజర్వ్ చేయటం, ఇలా చాలా పనులు చేయగలిగాను.

11) మీది మతాంతర వివాహం కదా. మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి?
జ. మాకు పెళ్లి అయ్యి నలభై ఏళ్లు అయినా ఇప్పటికీ సమస్యలు ఉన్నాయి. కులమే పెద్ద ప్రధాన సమస్య అయినప్పుడు. మతం ఇంకా చాలా పెద్ద సమస్య. తను ముస్లిం. విరుద్ధ భావజాలం. మా వాళ్ళు ససేమిరా అన్నారు. చాలా ఏండ్లు మమ్మల్ని కలవలేదు. కుటుంబ బహిష్కరణ. అతని వైపు నుండి మతం మారాలి అని వాటిని జయించాము. ఉండటానికి ఇల్లు దొరకటం చాలా కష్టం అయింది. మేము ఇద్దరమే ఒకరికి ఒకరంగా నిలబడి నిలదొక్కుకున్నాము. ఎవరు మాకు అండగా నిలబడలేదు. ఆ కష్టాలు గుర్తుకు తెచ్చుకుంటే చాలా బాధ వేస్తుంది. పస్తులు కూడా ఉండి నిలబడి ఈ రోజు చాలా మందికి జీవితం ఇస్తున్నాము.

12) మీ సహచరుడు ఖాశిం గారు మీకు ఇంటి పనులలోను, ‘బొమ్మరిల్లు’ లోనూ సహకారం ఇస్తారా?
జ. పెళ్లి అయిన కొత్తలో ఇంటి పనుల్లో సహాయం చేసే వారు. పాతబడిన తరువాత ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు సహాయ పడేవారు. మరీ పాత బడిన తరువాత మగ మహారాజుని అని ఆయనకు తెలిసింది.
‘బొమ్మరిల్లు’ పెట్టటం తనకి అంతగా ఇష్టం లేదు. కానీ తరువాత తరువాత ఆయనే భాగస్వామి అయ్యి అన్ని పనులు తలకు ఎత్తుకున్నారు. మా ఇద్దరికీ చాలా విషయాలలో ఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ఏది ఏమైనా చివరకు ఇద్దరం ఒక తాటి మీదకు వస్తాము. ఒకోసారి అదే మా బలం అనిపిస్తుంది.

13) కలలు కనండి, వాటిని సఫలం చేసుకోండి అని అబ్దుల్ కలాం అన్నారు. మీ కలలు ఏమిటి వాటిని సఫలం చేసుకున్నారా?
జ. నాకు కలలు ఏమి లేవు. పెద్దగా లక్ష్యాలు ఏమి పెట్టుకోలేదు.

14) మీరు కథలు రాశారు. ఎందుకు రాయాలని అనిపించింది. నేపథ్యం ఏమిటి?

జ. నేను యూనియన్ లో ఉన్నప్పుడు N.G.O. హోమ్ నిర్వహణ బాధ్యత నా మీద ఉండేది. సాహితీ కార్యక్రమాలకు డబ్బులు తీసుకోకుండా ఇచ్చేదాన్ని. అలాగే ఆ కార్యక్రమాలలో నేను కూడా పాల్గొనేది. అప్పుడు చాలా మంది ప్రముఖులు పరిచయం కావటం వారి మాటలు విన్న తరువాత నాకు రాయాలని అనిపించింది. ఘర్షణలో నుండి ఏదైనా సంభవించవచ్చు. అలానే నా జీవితం సమాజంతో నా పోరాటం ఇవే నన్ను రాసే వైపుకు నడిపించాయి.

15) కథా సంపుటి ఎప్పుడు తెస్తున్నారు?
జ. అనుకుంటాను గానీ వాయిదాలు పడుతుంటాయి. అదే పని మీద కూర్చోవాలి. అదే పనిలో ఉంటాను. త్వరలో మీ ముందుకు వస్తాను.

16) రచనలు, ‘బొమ్మరిల్లు’, ప్రకృతి వ్యవసాయం అన్నిటిని ఎలా సమర్ధ వంతముగా చేయ గలుగుతున్నారు?
జ. ఇష్టమైనవి కష్టం అనిపించవు కదా. కాకపోతే ఒక షెడ్యూల్ ప్రకారం ప్లాన్ చేసుకోగలితే చేయొచ్చు. అలాగే కొంత వ్యక్తి గత జీవితాన్ని త్యాగం చేయవలసి ఉంటుంది.

– ఇంటర్వ్యూమందరపు హైమావతి (9441062732)

2 thoughts on “‘బొమ్మరిల్లు’ రాజ్యలక్ష్మి

  1. వందవరపు హైమావతి గారు బొమ్మరిల్లు రాజ్యలక్ష్మి గారితో ఇంటర్వ్యూ అంతా చదివిన వారికి రాజ్యలక్ష్మి గారు చెప్పిన సమాధానాలు ఎంత ముక్కుసూటిగా ఉన్నవో చూస్తే ఆ బావవ్యక్తీకరణ, లోతైన ఘర్షణల నుండి ఎలా ఆచరణ సాధ్యమైందో, అది ఈ సమాజం మీద ఎంతగా బలమైన ముద్ర వేస్తుందో వ్యక్తమవుతున్నా వ్యక్తిగా ఆవిడ చేస్తున్న సేవను సమాజ సేవ అంటే ఒప్పుకోకుండానే ఆవిడ పెద్ద లక్ష్యాలను సమాజ బాధ్యతగా నిర్వర్తించడంలో నిస్వార్ధంగా ముందుండి తన సహచరుని సైతం బాగస్వామిని చేసి అనాధ బాలలకు అండగా నిలిచే ఓ దిక్చూసిగా సహజరీతిలో వారి జీవినపయనం అభినందించదగింది.

  2. ఇంటర్వూ చాలా బాగుంది హైమావతీ, రాజ్యలక్ష్మి జీవితంలో చాలా విషయాలు నేను విన్నవీ, చూసినవివీ.ఎంతో నిరాడంబరమైన వ్యక్తి ఇతరులకు సహాయం చేయడం ఆమె ప్రవృత్తి మనసారా నవ్వుతూ అతిథులకు స్వాగతం పలుకుతుంది మనసు నిండా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap