తెలుగు భాషా చైతన్య మహోత్సవంగా శ్రీ పి.వి. శతజయంతి
ప్రపంచ తెలుగు రచయితల సంఘం ప్రకటన తెలుగు వైభవం కోసం పరితపించి, భాషా స్పూర్తిని కలిగించిన భారత మాజీ ప్రధాని, అపర చాణక్యుడిగా కీర్తినందిన రాజనీతిజ్ఞుడు, సాహితీవేత్త, బహుభాషావేత్త శ్రీ పి వి నరసింహారావు శతజయంతి సందర్భంగా ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఘన నివాళులర్పిస్తోంది.
జూన్ 28న వారి శతజయంతి కాగా, ఈ ఏడాది పొడవునా ప్రజలలో భాషా చైతన్యం ప్రోది చేస్తూ, శ్రీ పీవీ శతజయంతి ఉత్సవాలను ‘తెలుగు భాషా చైతన్య మహోత్సవాలు’గా నిర్వహించాలని ప్రపంచ తెలుగు రచయితల సంఘం సంకల్పిస్తోంది..
1967లో అధికార భాషగా తెలుగు అమలుకు చట్టబద్ధతను సాధించటమే కాకుండా, ప్రామాణిక కీబోర్డులు, తెలుగు టైపు రైటర్లు తయారు చేయించి, పాలనాభాషగా తెలుగు అమలు, తెలుగులో బోధనల కోసం కృషి చేశారాయన. అధికార భాషా సంఘం, తెలుగు అకాడెమీ, అంతర్జాతీయ తెలుగు సంస్థల వ్యవస్థాపనకు కారకుడు శ్రీ పీవీయే! భాషా చైతన్యం ప్రజల్లో కలిగించేందుకు తెలుగు భాషోద్యమం రూపు దిద్దుకోవాలని ఆయన స్పూర్తి కలిగించారు . యావద్భారత దేశంలోనూ మాతృభాషల అభివృద్ధి గురించి ఆయన పరితపించారు. మాతృభాషను కాపాడుకునేలా తెలుగు ప్రజలను సమాయత్తం చేయటానికి శ్రీ పి. వి. శతజయంతి ఒక ప్రేరణ కావాలని భావిస్తున్నట్టు అధ్యక్షులు డా. గుత్తికొండ సుబ్బారావు. కార్యదర్శి డా. టి. వి. పూర్ణచందు నేడొక ప్రకటనలో తెలిపారు.
సాహితీవేత్తగా, సామాజిక వేత్తగా, రాజనితిజ్ఞుడిగా బహుముఖీనమైన పాత్ర నిర్వహించిన శ్రీ పి.వి తెలుగు ప్రజలకు చేసిన సేవల గురించి ప్రముఖుల వ్యాసాలతో డా. మండలి బుద్ధప్రసాద్ ప్రధాన సంపాదకులుగా ఒక పరిశోధనా వ్యాస సంపుటి తీసుకు రానున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
‘వేయిపడగలు’ నవలకు ‘సహస్రఫణి’ హిందీ అనువాదమే కాకుండా తెలుగు భాషకు తొలి జ్ఞానపీఠం విశ్వనాథకు దక్కేందుకు కారకులు, ‘పన్ లక్షత్ కోన్ ఘతో’ మరాఠీ రచనకు ‘అబల జీవితం’ తెలుగు అనువాదం.
జయప్రభగారి కవిత్వానికి ఆంగ్లానువాదం, ఇన్ సైడర్ పేరుతో ఆత్మకథాత్మక స్వతంత్ర నవల, “గొల్ల రామవ్వకథ” “విస్మృత కథ” మరెన్నో వ్యాసాలు శ్రీ పి.వి. సాహితీ వ్యక్తిత్వాన్ని మహోన్నతం చేశాయి. తెలుగు ప్రజలంతా శ్రీ పి.వి.ని తెలుగుదనానికి ప్రతీకగా భావిస్తారన్నారు.
సమావేశాలకు అనుకూలత లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్సవాల ప్రారంభ సూచనగా “పీవీ శతజయంతి” అనే వాట్సాప్ గ్రూపును ప్రారంభిస్తున్నాం. శ్రీ పి.వి.కి సంబంధించిన సమాచారం, వారితో గల అనుబంధం, వారి గురించి చేసిన పరిశోధనలు, వారి గురించిన సమాచారాన్ని ఈ గ్రూపులో పంచుకోవచ్చు. గ్రూపులో చేరదలచినవారు డా. జి. వి. పూర్ణచందు 9440172642కు తెలుపవచ్చు.