పాడుతా తీయగా మళ్ళీ… త్వరలో…

తెలుగు సినీ సంగీతానికి సంబంధించిన టీవీ కార్యక్రమాల్లో పాడుతా తీయగాను మించిన ప్రోగ్రాం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. 1996లో ఈటీవీలో ‘పాడుతా తీయగా’ కార్యక్రమంతో బుల్లితెరకు వచ్చారు బాలు. కొత్తతరం గాయనీగాయకులను ఈ కార్యక్రమం ద్వారా ఆయన వెలికితీసి పరిచయం చేశారు. సంగీత జ్ఞానాన్ని తిరుగులేని సాధనతో పుష్కలంగా పెంచుకున్న బాలు నవతరం గాయనీగాయకులకు ఎన్నెన్నో సూచలనందించిన కార్యక్రమం ఇది. దేశంలోనే అత్యుత్తమ సంగీత టీ.వీ. కార్యక్రమంగా గుర్తింపుపొందింది. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హోస్టు గా ఈటీవీ అందించిన ఈ అద్భుత కార్యక్రమం రెండున్నర దశాబ్దాల పాటు సంగీత ప్రియులను అలరించింది. ఆ కార్యక్రమం ద్వారా ఎంతోమంది గాయనీ గాయకులు వెలుగులోకి వచ్చారు. మంచి స్థాయిని అందుకున్నారు. ఇందులోని పాటల మాధుర్యానికి తోడు హోస్ట్గా బాలు చెప్పే కబుర్లు హుందాతనంతో కూడిన ఆయన జడ్జిమెంట్ దానికి వన్నె తెచ్చాయి.

తెలుగువారి మనసులపై చెరగని ముద్ర వేసిన ఆ కార్యక్రమం బాలు మరణంతో చరిత్రలో కలిసిపోయిందనే అనుకున్నారంతా. బాలును రీప్లేస్ చేయడం ఎవరి వల్లా కాదు కాబట్టి ఈ ప్రోగ్రాంను చూడలేమనే భావించారు. ఆయన స్థానంలో వేరొకరిని ఊహించుకోవడం కూడా ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు కూడా. ఐతే ప్రేక్షకుల మనసు నొప్పించకుండా ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభించడానికి ఈటీవీ ప్రణాళికలు రచించినట్లు తాజా సమాచారం. బాలు తనయుడు ఎస్పీ చరణ్ ఆధ్వర్యంలో పాడుతా తీయగా కార్యక్రమాన్ని పున ప్రారంభించాడానికి ఏర్పాట్లుచేస్తుంది ఈటీవీ.

బాలు కొడుకు అంటే ప్రేక్షకుల్లో ఒక సానుకూల భావం ఉంటుందని.. స్థాయి పరంగా తండ్రికి తగకపోయినా.. ఆయన వారసుడైతే బాలు జ్ఞాపకాలు ఇతర విశేషాలు చెబుతూ ఈ షోను నడిపించగలడని రామోజీ రావు భావించారట. చరణ్ కు చంద్రబోస్, సునీతలను కూడా జత చేసి ఈ ముగ్గురూ బాలు లెగసీని కొనసాగించేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారని.. త్వరలోనే ఈ ప్రోగ్రాం గురించి అధికారిక ప్రకటన వస్తుందని.. కొవిడ్ పరిస్థితుల నుంచి తేరుకున్నాక ఈ కార్యక్రమం మొదలయ్యే అవకాశముందని అంటున్నారు. తొలుత కీరవాణి తో ఈ కార్యక్రమం కొనసాగించాలని భావించినప్పటికీ చివరికి చరణ్ వెంటే వెళ్ళారు. చూడాలి మరి పాడుతా ‘తీయగా‘ వుంటుందో లేదో….

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link