ఆశావాదిగా ప్రసిద్ధుడైన ఆశావాది ప్రకాశరావు సామాన్యుడి గా పుట్టి అసామాన్యుడుగా ఎదిగారు. ఈ ఎదుగుదల ఆకాశంలోంచి ఊడిపడలేదు. నిరంతర సాహిత్య కృషి ద్వారానే సాధ్యమైంది.
కరువుకు మారుపేరైన అనంతమరం జిల్లాలోని కొరివిపల్లి అనే కుగ్రామంలో పుట్టిన దళిత బిడ్డ ఇవ్వాళ పద్మశ్రీ గౌరవానికి అర్హుడైనారు. భారత ప్రభుత్వం నిన్న ప్రకటించిన పద్మశ్రీలలో ఆశావాది ఒకరు. డా. ఆశావాది ప్రాథమికంగా అవధాని. అవధానంలో సీవీ సుబ్బన్న శిష్యుడు. విద్యార్థిగా నండూరి రామకృష్ణమాచార్య శిష్యుడు. చిన్నప్పటి నుండి ప్రభుత్వ విద్యా సంస్థలలో, సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటూ పెరిగిన ఆశావాది పాఠశాల అధ్యాపకుడిగా మొదలు పెట్టి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ గా ఉద్యోగ విరమణ చేశారు. తన సంతానాన్ని బాగా చదివించారు. ఆయనది విద్యావంతుల కుటుంబం. అధ్యాపకుల కుటుంబం.
భావజాల పరంగా డా. ఆశావాది సంప్రదాయ వాది. పీడిత సమాజంలో పుట్టారు గనుక సంస్కరణ భావాలను తిరస్కరించలేదు. అవధానం స్వల్ప సంఖ్యాకులకు చెందినది అనుకుంటున్న సమయంలో అవధానం అందరిదీ అని రుజువు చేశారు ఆశావాది. తనకన్నా ముందు శ్రామికవర్గం నుండి సీవీ సుబ్బన్న అవధానిగా ప్రసిద్ధులయ్యారు. తర్వాత ఆశావాది, నరాల రామారెడ్డి, మేడసాని మోహన్, ఇటీవల ఆముదాల మురళి వంటివాళ్లు ఆ తానులో పోగులయ్యారు. ఇది తెలుగు సాహితీరంగంలో ఒక పరివర్తన. ప్రాచీన కాలంలో కవయిత్రి మొల్ల, శ్రీకృష్ణదేవరాయలు, రామరాజభూషణుడు, చేమకూర వేంకటకవి, వేమన, పోతులూరి వీరబ్రహ్మం వంటి వాళ్లు పద్యం ఎవరి సొత్తూ కాదని రుజువు చేశారు. ఆధునిక కాలంలో కట్టమంచి, దువ్వూరి, త్రిపుర నేని, గుర్రం జాషువ, బోయి భీమన్న, జ్ఞానానంద వంటి వాళ్లు ఆ పనే చేశారు.
ఆశావాది 1963లో అవధానం ప్రారంభించి మూడున్నర దశాబ్దాలలో 171 అవధానాలు చేసి 1993లో ఆ ప్రక్రియను ఆపేశారు. ఆశావాది సాహిత్య జీవితంలో మూడు పార్శ్వాలున్నాయి. 1. సాహితీ రచన. 2. సాహిత్య ప్రచారం . 3. సాహిత్య ప్రోత్సాహం. కవిగా ఆశావాది పుష్పాంజలి (196) నుండి వివేకపునీత నివేదిత (2019) దాకా పద కొండు పద్య కావ్యాలు రాశారు. తాను చేసిన అవధానాలను, అవధాన దీపిక, అవధాన కౌముది, అవధాన వసంతం వంటి అయిదు సంపుటాలుగా ప్రచురించారు. వ్యాఖ్యాతగా భాగవతం మూడవ స్కంధానికి, ఆముక్తమాల్యదలో దాసరి కథలో, ఇంకా
కొన్ని కావ్యాలలో, సులభ శైలిలో వ్యాఖ్యలు రాశారు. తాళ్లపాక అన్నమయ్య రాసిన యక్షగానం, చెళ్లపిళ్ల రాయచరిత్రము ఆయన పరిష్కరించిన గ్రంథాలలో కొన్ని. అంతరంగ తరంగాలు అనే వచన కవిత్వ సంపుటి చాలా ప్రాచుర్యం పొందింది. వేలకొలది సభలలో సాహిత్య ప్రసంగాలు చేశారు.
భారతీయాత్మ అరుంధతి అనే ఆయన గ్రంథం పాఠకులకు కొత్త లోకం చూపిస్తుంది. పద్యకవితా సదస్సులో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆశావాది. ఆధునిక కాలంలో పద / విద్యా సంరక్షకుడయ్యారు. అనేకమంది విద్యార్థులకు, యువకులకు సాహిత్య పఠనంవైపు, రచన వైపు ప్రోత్సహించారు, ప్రేరేపించారు. ఆశావాది పేద విద్యార్థులకు ఆర్థిక హార్దిక సహాయ సహకారాలు అందించారు.
తన అవధాన సామర్థ్యంతో, దక్షిణ భారతమంతా సంచరించారు. మాటలో స్నేహం ఉట్టిపడే ఆయన అన్ని రకాల మనుషులతోనూ ఇమిడిపోగలి గారు. వర్తమాన సామాజిక వాస్తవికతను ‘అవకాశ వాదం ఆరుబయలున ఉపన్యాసం దంచుతున్నది’ అని వ్యాఖ్యానించారు. అవధాన కాలంలో పురాణ పరమైన పదాలతో సాంఘిక భావాలు చెప్పడం, వెగటు కలిగించే పదాలను విరిచి నూతనార్థం కల్పించడంలో సిద్ధహస్తులు ఆశావాది. సాహిత్యం తప్ప ఇంకొకటి తెలియని ఆశావాది పద్మశ్రీ కావడం ఆనందం. అందం.
- రాచపాళెం చంద్రశేఖర రెడ్డి