నా స్వరం దేవుడిచ్చిన వరం-గాయని పి. సుశీల

నా స్వరం, మీ అందరి అభిమానం దేవుడిచ్చిన వర ప్రసాదం అని పద్మభూషణ్ పి. సుశీల ఎంతో వినమ్రంగా తెలిపారు. ఘంటసాల, బాలుతో కలసి పాడిన పాటలను నేటి యువగాయకులు కూడా వేదికలపై పాడుతుంటే తనకు రెట్టింపు ఉత్సాహం కలిగిస్తున్నదని సంతోషం వ్యక్తం చేశారు. శృతిలయ ఆర్ట్ థియేటర్స్, సీల్ వెల్ కార్పొరేషన్ బండారు సుబ్బారావుగారి ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్, రవీంద్రభారతిలో గానకోకిల పి. సుశీలను “మెలోడి క్వీన్ ఆఫ్ మ్యూజిక్” పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఇలాంటి అవార్డుల కన్నా ఇంతమంది నా పాటలు పాడుతుంటే జన్మ ధన్యంగా భావిస్తున్నానని పి. సుశీల తెలిపారు. ఎప్పటి వరకు భూమాత తనను మోస్తుందో తెలియదని, మీ అందరి అభిమానానికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని ఉద్వేగభరితురాలయ్యారు. రెండు నెలల క్రితం ఇంట్లో పడితే తలకు ఏడు కుట్లు పడ్డాయని, ఇక కోలుకోలేనేమో అనుకున్న, మీరు పాడే పాటలు మళ్ళీ రవీంద్రభారతికి రప్పించాయని ఆమె అన్నారు. విజయనగరంలో ఘంటసాల మా ఇంట్లో భోజనం చేశారని, ఆ చిన్న కృతజ్ఞతతో సినిమాల్లో పాడే అవకాశం ఇచ్చి తనను ఈ స్థాయికి చేర్చారంటూ ఆనందంగా గుర్తు చేసుకున్నారు.

వివిధ భాషల్లో అరలక్షకు పైగా పాటలు పాడిన తెలుగు పాటల తల్లి పి. సుశీలకు భారతరత్న సముచితమని, తనవంతు ప్రయత్నంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సుశీల స్వరం మధురంగా ఉంటుందని, ప్రతిరోజూ ఇంట్లో, కారులో సుశీలమ్మ పాటలు వింటుంటానని ఆయన తన అభిమానాన్ని చాటుకున్నారు. డా. మహ్మద్ రఫీ మాట్లాడుతూ ఉత్తరాది గానకోకిల లత మంగేష్కర్ అని, దక్షిణ భారత గానకోకిల సుశీలమ్మ అని అభివర్ణించారు. 89 ఏళ్ల సుశీలమ్మతో మాట్లాడిన ప్రతిసారి తొమ్మిదేళ్ల పాప తో మాట్లాడిన అనుభూతి కలుగుతుందని వివరించారు. ఎంతో అమాయకంగా వుండే సుశీల తెలుగు చిత్ర సంగీత రంగంలో సువర్ణ అధ్యాయం సృష్టించారని, ఆమె ‘భారతరత్న’ అని అభివర్ణించారు.

ఈ వేడుకలో కొలేటి దామోదర్ గుప్తా, దైవజ్ఞ శర్మ, డా. కుసుమ భోగరాజు, శోభన్ బాబు సేవా సమితి చైర్మన్ రామకృష్ణ, ఎల్ఐసి పీఆర్వో సుబ్రహ్మణ్యం, కొండూరు హరినారాయణ రెడ్డి తదితరులు పాల్గొని అభినందించారు. ప్రముఖ గాయని ఆమని ఆధ్వర్యంలో సీల్ వెల్ సినీ సుస్వరాలు 50వ విభావరిలో చంద్రతేజ, సుభాష్, శ్రీనివాస్, స్వర కళ్యాణి, ఫాల్గుణ తదితరులు చక్కని పాటలతో అలరించారు. అబ్బరాజు తులసిరామ్ వ్యాఖ్యానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

డా. మహ్మద్ రఫీ
ఫోటోలు : కంచె శ్రీనివాస్

SA:

View Comments (1)