నా పేరు జీ. సీ. పద్మదాస్. నా వయసు 66 సంవత్సరాలు. మా స్వగ్రామం క్రృష్ణా జిల్లా మేడూరు. అయితే చిన్నప్పటినుంచి దాదాపు ఇప్పటివరకు విజయవాడ లోనే ఉన్నాను. AMIETE చదివి BSNL లో DE గా చేసి రిటైర్ అయ్యాను. భార్య అరుణ కుమారి ( లేటు). తన పేరున కార్టూన్ పోటీలు నిర్వహించి, 2019 జనవరి 26 న ప్రముఖ సినీ నటుడు శ్రీ జయప్రకాష్ రెడ్డి గారి చేతులమీదుగా విజేతలకు బహుమతీ ప్రధానం చెయ్యటం జరిగింది.
నాకు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరికీ వివాహం ఐపోయింది. స్పందన అమెరికా లో స్థిరపడింది. తనకు ఒక బాబు. సునీల హైదరాబాద్ లో స్థిరపడింది.
నాకు చిన్నప్పటి నుంచీ చిత్రలేఖనమంటే ఆసక్తి. అందుకే ఎప్పుడూ ఏదో ఒక బొమ్మ గీస్తూ ఉండేవాడిని. అలా నేను గీసి ఇచ్చిన నా మిత్రుల పిల్లల చిత్రాలు 3 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ భద్రంగా దాచుకోవడం నాకు ఆనందం కలిగించింది. అలాగే కార్టూన్స్ కూడా గీస్తుండేవాడిని. ఇప్పటి వరకు దాదాపు వెయ్యి కార్టూన్స్ పైగా వేశాను. నవ్య, హాస్యానందం, నవమల్లెతీగ, రేపటికోసం మొదలైన పత్రికల్లో ప్రచురించారు. అలాగే తెలుగు వెన్నెల, గోతెలుగు, అక్షర, కౌముది వంటి వెబ్ మాస పత్రిక ల్లో కూడా ప్రచురితమయ్యాయి.
కార్టూన్స్ తో పాటు ఒక టీవీ సీరియల్, ఒక వీడియో సాంగ్ మరియు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ నిర్మాణంలో పాల్గొని, కొన్నిటిలో నటించాను. అలాగే కొన్ని నాటికలు, కామెడీ స్కిట్స్ లాంటి స్టేజి ప్రదర్శనలు కూడా ఇవ్వడం జరిగింది.
2018 జనవరి లో హైదరాబాద్ లో బుక్ ఫెయిర్ లో నా మొట్టమొదటి కార్టూన్ సంకలనం నవ్య ఎడిటర్ శ్రీ జగన్నాథ శర్మ గారి చేతులమీదుగా ఆవిష్కరించడం జరిగింది. అదే సంవత్సరం డిసెంబర్ లో హైదరాబాద్ బుక్ ఫెయిర్ లోనే హాస్యానందం ఎడిటర్ శ్రీ రాము గారి చేతులమీదుగా నా రెండవ కార్టూన్ సంకలనం మరియు నేను, నా కార్టూనిస్ట్స్ మిత్రబృందం శ్రీ రామకృష్ణ గారు, శ్రీ సరసి గారు, శ్రీ బాచి గారు, శ్రీ లేపాక్షి గారు, శ్రీ కామేష్ గారు ఆరుగురు కార్టూన్స్ కలిపి పబ్లిష్ చేసిన కార్టూన్ సంకలనం ఆవిష్కరించడం జరిగింది. అలాగే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో ” ఓన్లీ కార్టూన్స్” పేరున ఒక బుక్ స్టాల్ ను కూడా మా కార్టూనిస్ట్స్ బ్రృందం చే నిర్వహించడం జరిగింది. ఒకసారి విజయవాడ లోనూ నిర్వహించాము. అన్ని సార్లూ అవి విజయవంతం కావడం మమ్మల్ని ఎంతో ఆనందపరచింది.
ఇవీ క్లుప్తంగా నా పరిచయం వాక్యాలు. 64 కళలు. కాం కు నన్ను నేను పరిచయం చేసుకునే అవకాశం కల్పించిన కళాసాగర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
– పద్మదాస్
Funny toons.
Congrats Padmadas garu.