చందమామ…..ఈ పేరు వినగానే ఎవరికైనా ఎంతో చల్లగా హాయిగా అనిపిస్తుంది. ఒకప్పటి మన బాల్యం గుర్తుకొచ్చి….ఆపైన ‘చందమామ’ కథల పుస్తకం గుర్తొచ్చి….మనసునల్లరల్లరి చేస్తుంది. అందులో రంగురంగుల బొమ్మలు మైమరపిస్తూ ఊహాలోకాల్లో విహరింప చేస్తుంది…
చందమామ పత్రిక ద్వారా ఆబాలగోపాలాన్ని అలరించిన చిత్రకారులు శంకర్ గారు (29-9-20)న కన్నుమూశారు. నేడు శంకర్ వర్థంతి. వారి వయసు 97 ఏళ్లు. చెన్నైలోని పోరూరు సమీపంలో ఉన్న మదనంతపుర ప్రాంతంలో తన కుమార్తె ఇంట్లో ఆయన ఇన్నాళ్లుగా గడిపారు. ఆయన జీవన సహచరి షణ్ముకవల్లి (87) కుమార్తె, కుమారుడు ఉన్నారు. 97 ఏళ్ల వయసులోనూ చందమామ గురించి, దాంట్లో తాను వేసిన చిత్రాల గురించే ఆలోచిస్తూ మానసికంగా బాగా బలహీనులయ్యారని వారి కుమార్తె చెప్పారు. గత 20 రోజులుగా సైక్రియాటిస్టు ఆయనకు వైద్య సేవలందించారు. 20 రోజులుగా మంచినీళ్లు తప్ప మరేమీ తీసుకోలేదట. శంకర్ గారి కన్నుమూతతో చందమామ చిత్రకారుల్లో చివరిశకం కూడా ముగిసినట్లే…శంకర్ గారికి మరణానంతరం భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ ప్రకటించింది. ఇది శంకర్ గారి అభిమానులందరికి శుభవార్త.
శంకర్ అసలు పేరు కరతొలువు చంద్రశేఖరన్ శివశంకరన్. 1924 జులై 19న తమిళనాడులోని ఈరోడ్‌లో ఆయన జన్మించారు. 1946 నుంచి చిత్రాలు వేయడం ప్రారంభించారు. తన చివరి శ్వాస వరకు బొమ్మలే జీవితంగా గడిపారు. చందమామ పత్రిక దేశంలోని అన్ని ప్రముఖ భారతీయ భాషల్లో వెలువడేది. తద్వారా ఆయన దేశ ప్రజలందరికీ పరిచయమ్యారు. చందమామ మూతబడ్డ తర్వాత రామకృష్ణ పత్రికకు చిత్రాలు వేశారు.
బేతాళకథల బొమ్మలతో పాటు చందమామ మ్యాగజీన్‌లో ఎన్నో చిత్రాలను గీశారు. మ్యాగజీన్ చిత్రకారుల బృందానికి నేతృత్వం వహించారు. వందలాది సీరియళ్లు, వేల కథలకు ఆయన బొమ్మలు సింగారించారు. భారతీయ మూలాలతో ఆయన గీసే చిత్రాలు పిల్లలను, పెద్దలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
బాల్యం నుంచే చిత్రాలపై ఆసక్తి చూపిన శంకరన్ 1941లో మద్రాస్ గవర్నమెంట్ ఫైనార్ట్స్ కాలేజీలో చేరి శిక్షణ పొందారు. నాగిరెడ్డి, చక్రపాణి ప్రారంభించిన చందమామ ఆయన కెరీర్‌కు బాటలు వేసింది. అనతి కాలంలోనే తెలుగు ఫ్యాంటసీ పాత్రల చిత్రకారులుగా ఆయన గుర్తింపు పొందారు.
చందమామ బాలల మాసపత్రికలో కథలు ఎంత బాగుండేవో, బొమ్మలు కూడా అంతే బాగుండేవి. ఆ బొమ్మలను చూసే కథల్లోకి వెళ్లే వాళ్లంటే అతిశయోక్తి కాదు. 700 పైగా బేతాళకథలకు దాదాపుగా ఈయనే చిత్రాలు గీశారు. చందమామలో వచ్చిన రామాయణం, మహాభారతం సీరియల్స్ కి వేసిన బొమ్మలతో పౌరాణికి పాత్రలకు దివ్యత్వం కలిగించిన గొప్ప ఆర్టిస్టు శంకర్ గారని అప్పట్లోనే కొడవటిగంటి కుటుంబరావు గారు చెప్పారు. రాజకుమార్తెల నిసర్గ సౌందర్యాన్ని నభూతో నభవిష్యత్ అనేలా చిత్రించిన శంకర్ గారు రాక్షస పాత్రలను కూాడ అంతే సుందరంగా చిత్రించారు. ఉదాహరణకు రామాయణంలో కుంభకర్ణుడు, ఇంద్రజిత్, రావణుడు పాత్రలు మచ్చుకు మాత్రమే. చందమామలో 1951 లో చేరింది మొదలుకుని 2012 చివరి వరకు దాదాపు 60 ఏళ్లు పాటు చిత్రాలు గీస్తూనే వచ్చిన చిత్రకారుడు శంకర్ గారు.
_____0_______0_______0_______0______0_______0_______0_______0_______0________
చందమామ శంకరన్ గారితో నా చిన్న పరిచయం : 2010 వ సంవత్సరం, అంబునగర్ చెన్నై, నేను చెన్నై ఆర్ట్ మ్యూజియం చూడాలని, కొన్ని ఆర్ట్ పుస్తకాలు కూడా కొనడానికి వెళ్ళాను, అక్కడ నాకు శ్రీనివాస్ అని ఫ్రెండ్ తెలుసు వాడిది అంబునగర్ లో చిన్న రూమ్ చెన్నై లో చిన్న జాబ్, వాడికి ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ కొన్ని పెన్ డ్రాయింగ్స్ వేస్తువుంటాడు, మేము ఒకరోజు ఆ అంబునగర్లో ఏమైనా ఆర్ట్స్ గాని ఆర్ట్ స్టూడియోస్ గాని వుంటాయేమో అని వెళ్ళాం, మావాడికి ఇదివరకే పరిచయం వున్నా ఒక రెండు ఆర్ట్స్ లు తెలుసు, వెళ్తు చూస్తూవుంటాడు. ఒక ఆర్ట్స్ చుస్తే బయట మంచి జయలలిత పెయింటింగ్ చేసివుంది, సరే లోపలికి వెళ్దాం రారా అంటే మావాడు ఎందుకు వద్దులే అన్నాడు, లోపల ఒక ముగ్గురు బాగా వయసు మీద పడిన వృద్ధులు, తెల్లటి పంచ, నుదిటి మీద గంగానది అంత విభూతి ధరించి తమిళం లో మాట్లాడు కుంటున్నారు, మమ్మల్ని చూసారు, అంతటి వారితో ఎం మాట్లాడతాం మా వయసు ఏమో 22, అందులో ఒక పెద్దాయన ఏమప్పా అని అన్నారు, నాకు తమిళ్ రాదు మా వాడికి బాగానే వచ్చు, మావాడు వెంటనే చెప్పాడు, మేము ఇలా చూడాలని వచ్చాము మేము చిత్రకారులమే అని అన్నాడు, మమ్మల్ని లోపలకు తీసుకెళ్లి వాళ్ళ దగ్గరే కూర్చోమని , టీ తెప్పించి, మాట్లాడుతున్నారు వారిలో ఇద్దరకు తెలుగు వచ్చు, ఏమప్పా మీరు బొమ్మలు వేస్తారా అని ఒక పెద్దాయన అడిగారు, మాకు ఇంట్రెస్ట్ ఎదో ఆలా వెస్తూవుంటాం అని అన్న, చివరకు ఒకరు అన్నారు మీరు చందమామ పుస్తకం చదువుతవ అని నా చిన్నతనంలో చదివే వాడిని అని అన్న అందులో బొమ్మలు ఇతనే అమ్మ వేసింది అని చెప్పాడు, ఆ పుస్తకాలలో చూసావ్ గా మళ్ళీ ఇక్కడకు వచ్చి చూడాలా అంటూ నవ్వుకుంటున్నారు ఎదురుగ “చందమామ శంకరన్ “గారు నవ్వుతు తక్కువుగా మాట్లాడుతూ ఒరుకోరా అని తమిళ్ లో వాళ్ళ ఫ్రెండ్ ని అంటున్నాడు, వారిది అంబు నగర్ పక్కనే వున్నా విఱుగంబాక్కం అనే ఏరియా అలా ఆయనను నా కళ్ళతో చూడగలిగి నందుకు నా జన్మ ధన్యం. అప్పుడు వారి విలువ నాకు తెలీదు, ఇప్పుడు వారు లేరు, ఎంతో తేజోమయమైన రూపం ఇక ఈ చిత్రసీమలో లేనందుకు చింతిస్తూ, వారి ఆత్మకు శాంతి చేరాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటు వారికి ఇవే నా నివాళులు…
సిహెచ్. నరేంద్ర, గుంటూరు
మరికొంత సమాచారం కోసం వీడియో చూడండి….
https://www.youtube.com/watch?v=FzhveEQxG5I
Thank you sir , thank you very much sir
మంచి విషయాలు చాలా తెలిశాయి. మాధవి సనారా గారి పేరు చాలా కాలం తర్వాత చూశాను. తొలి సారిగా ఫొటో చూశాను. మీకు అభినందనలు
చాలా బావుంది కళాసాగర్ గారూ.. ఎవరం కూడా శంకర్ గారిని తమిళియన్ అని అనుకోలేదు. వారి బొమ్మలు మన సంస్కృతి లో ఒక భాగం.
చందమామ పత్రికను చందమామ శంకర్ గారిని ఇలాతలచుకోవడం ఎంతో ఆనందకరం గా ఉంటుంది. చందమామపత్రిక,శంకర్, చిత్ర, వపా గార్లు శాశ్వతం గా మనకు తీపిగుర్తులు. 🙏🙏🙏🙏Bomman Artist & Cartoonist, విజయవాడ.