“ఎవరి పాట అయితే విని నైటింగేల్ ఆఫ్ ఆంధ్ర” అని విశ్వకవి రవీంద్ర నాధ్ ప్రస్తుతించారో….
ఎవరి నటనైతే చూచి సాక్షాత్ రఘు రాముడివే నీవని కాశీనాధుని నాగేశ్వరరావు గారు పాత్ర పేరు పెట్టి మెచ్చుకున్నారో….
ఎవరి ఈలపాట అయితే విని ఆయన వేళ్ళ మధ్య పరికరం ఏమన్నా ఉందా..!!?? అని ప్రధాని జవహర్ లాల్ నెహ్రు ఆశ్చర్యం తో ఆడిగారో….
ఆ ఈలపాట రఘురామయ్య గారే మా తెలుగు నాటక రంగ వైభవంన ఈనాటి చిరస్మరణీయులు…
సినిమారంగం బాగా ప్రచారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలుగు నాట పౌరాణిక నాటకాలకు ఆదరణ ఏ మాత్రం తగ్గకుండా నిలిచింది అంటే అందుకు కారణం నాటక ప్రముఖులు ఈలపాట రఘురామయ్య వంటివారు.
శ్రీకృష్ణుడి పాత్రలో రఘురామయ్య నటిస్తున్నారు అని ప్రకటిస్తే అనేక గ్రామాలనుండి బండ్లు కట్టుకుని నాటకశాల దగ్గరికి వచ్చేవారు. అంతగా తన శ్రీకృష్ణ వేషంతో ప్రభావితం చేశాడు. అంతేకాదు, అదనంగా శ్రీకృష్ణుడి వేణునాదాన్ని చేతివేలితో వినిపించగలిగిన నేర్పు రఘురామయ్యలో వుంది. ఆ గుంటూరుజిల్లాలోని సుద్దపల్లిలో 1901లో మార్చి 5 న పుట్టిన రఘురామయ్యకి సంగీతం పుట్టుకతో వచ్చింది. పశువులు కాస్తూ, ఆవులను తన గానంతో నిలిపి వేయగలిగేవాడు. ఆయన ప్రతిభ ఒక ఈలపాట నాటక ప్రముఖుడి దృష్టిలో పడటంతో రఘురామయ్య మకాం గుంటూరుకు మారింది.
నిజానికి తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకట సుబ్బయ్య. కాని ఆయనలోని నటననుచూసిన కాశీ నాధుని నాగేశ్వరరావు ఆయనకు రఘురామయ్యగా నామకరణం చేశారు. అసలు పేరు ఆయనపాటిస్తే ప్రేక్షకులు ఆయన ఇంటి పేరు ‘కళ్యాణం’ తీసేసి ఈలపాట’గా స్థిరపరిచారు.
గుంటూరు చుట్టుపక్కల మొదలయిన రఘు రామయ్య నాటకాలు అనతికాలంలోనే ఆంధ్ర దేశ మంతా ప్రదర్శనకు నోచుకున్నాయి. బహుశా నాటి నైజాం ప్రాంతంతో సహా ఈల పాట రఘురామయ్య నటననుచూసి మెచ్చుకోని తెలుగువారు లేరంటే ఆశ్చర్యంలేదు. చెన్నపట్నంలోనూ నాటకాలు వేశాడు. శ్రీకృష్ణుడు అంటే ఇలా వుంటాడు’ అని రఘురామయ్యని చూసి తొలి రోజుల్లో తెలుగువారు తెలుసుకున్నారు. ఆ తర్వాతే సినిమాల ద్వారా శ్రీకృష్ణ పాత్రను ఎన్టీఆర్ తెలుగువారికి దగ్గర చేశాడు. పదవ ఏటనుండి డెబ్బై ఏళ్ళు వచ్చేవరకు అలు పెరుగని నాటకయానం రఘురామయ్యది. మధ్యలో కొన్ని సినిమాల్లో పాత్రలు వేసినా, పాటలు పాడినా ఆయన మనసు మాత్రం నాటకరంగంమీదే. అలా వరుసగా అన్ని దశాబ్దాలపాటు నాటకాల్లో మునిగి తేలినవారు బహుతక్కువ. ఏడు దశాబ్దాల వయసు అంటే ఎవరి శరీరమైనా విశ్రాంతి కోరుకుంటుంది. తాము చేపట్టిన వృత్తిమీద ఎంతో మమకారం, ప్రేమ వుంటే తప్పించి ఆ వయసులో కూడా శ్రమపడాలనుకోరు. సినీరంగం వేరు. ముక్కముక్కలుగా చిత్రీకరించే కళ అది. నటుడి మూడ్ నిబట్టి ఏ సన్నివేశమైనా ఎప్పు డైనా షూట్ చేసుకోగలిగినది.
కాని రఘురామయ్య ఎంచుకున్నది నాటకరంగం. అది మొత్తం ఒక వరసలో ప్రదర్శన జరగాల్సినది, ఎదురుగా వున్న ప్రేక్షకులను అప్పటికప్పుడు మెప్పిం చాల్సినది. ఎక్కడా ఫెయిల్ అవటానికి వీలులేదు. కట్ చెప్పి మరో షాట్ కి అవకాశం వుండదు. ఉంటే వన్స్ మోర్ వుంటాయి అంతే. అందుకే నాటకానికి ఎంతో శ్రమ వుంటుంది. ఆ శ్రమను తట్టుకుని 70 వ ఏట నాటకాలను ఎంతో హుషారుగా వెయ్యటమే రఘురామయ్య జీవిత విశేషం. ఆ వయస్సులో రఘురామయ్య భారత సాంస్కృతిక బృందంలో సభ్యుడిగా జపాన్తోపాటుగా ఇతర తూర్పు ఆసియా ఖండ దేశాలకు వెళ్ళాడు.
అక్కడ ఆయన కృష్ణుడిగా మేకప్ వేసుకుని బయటకు వచ్చేసరికి జపాన్ లోని రామకృష్ణ మిషన్ సభ్యులందరు లేచి నిలబడి నమస్కారం చేశారు. అంత గొప్పగా వుండేది ఆయన కృష్ణుడి వేషం.
ఆయనచేత కృష్ణుడి వేషం వేయించాలని సినీరంగంలో కొందరు అరవైల్లోనే ప్రయత్నించారు.
ఆ సంవత్సరంలోనే రఘురామయ్య జీవితంలో వరసగా మరువలేని సంఘటనలు జరిగాయి. కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు అందింది. ఆ అవార్డ్ ని నాటి రాష్ట్రపతి తెలుగు ప్రముఖుడు వి.వి. గిరి చేతులమీదుగా అందుకున్నారు.
ఆ సమయంలో రఘురామయ్య ఈలపాట గురించి విన్న ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ తన అధికార నివాసానికి పిలిపించుకుని ఆయన ఈలపాట విన్నారు. ఆయన గతంలో ఆమె తండ్రి జవ హర్ లాల్ నెహ్రూకి వినిపించిన విషయం చెప్పగానే శ్రీమతి ఇందిరాగాంధీ మరింత పొంగిపోయారట.
నాటకాలు ఆడటం మాత్రం ఆపలేదు. 70 ల వయసు ఏమంత ఎక్కువ కాదన్నది రఘురామయ్య మాట. ప్రతిరోజు వేకువనే లేవటం, శారీరకవ్యాయామం చెయ్యటం, శరీరాన్ని నియంత్రణలో వుంచుకోవటం రఘురామయ్య దినచర్యలో భాగంగా వుండేది. కృష్ణ పాత్రమీద ఆయనకు ఎంతో గౌరవం. ఆ ఆహార్యానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. అందుకే ఆయన్ని కృష్ణుని వేషంలో చూడాలని ఎందరో ప్రముఖులు ఎదురుచూసేవారు.
తన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణ తులాభారం ప్రదర్శించమని సత్యసాయిబాబా ఆహ్వానం అందుకుని ప్రదర్శించటమేకాక సాయి బాబా మన్ననలు పొందారు. అప్పటికి ఆయన వయస్సు డెబ్బెమూడు సంవత్సరాలు.
మరుసటి సంవత్సరం జనవరి నెల రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించిన పౌరపురస్కారాల్లో రఘురామయ్య పేరున్నది. ఆయనకు పద్మశ్రీ ప్రకటించారు. ఆ బిరుదు ప్రకటన తర్వాత హైదరాబాద్ నగరంలో వరుసగా సన్మానాలు జరిగాయి. అందరూ ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తారు. మచిలీపట్నం వారు రఘురామయ్యకి కనకాభిషేకం తల పెట్టారు.
ఆయనచేత శ్రీకృష్ణుడి పాత్రతో నాటక ప్రదర్శన, అమోఘసన్మానం.ఆ ప్రదర్శనకు వెళ్ళాలన్నది రఘురామయ్య కోరిక. కానీ ఆరోగ్యం అంత బాగో లేదు. ఇంట్లో వాళ్ళు వెళ్ళొద్దన్నారు. అభిమానులు నిరు త్సాహపడరా! “వైద్యులు అలానే చెపుతారు. నే వెళతా… నేను 80 ఏళ్ళవరకు బ్రతుకుతాను, ఏమీ డోకా లేదు..” అని ఇంట్లో వాళ్ళకు చెప్పి తనకుతానుగా ఎనిమా తీసుకుని వేడినీళ్ళు పెట్టుకున్నారు. కాని ఇంతలో ఒళ్ళు చల్లబడింది. హడావుడిగా ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్ళారు. గుండెపోటు వచ్చింది అని చికిత్స చేశారు. ఆ గుండెపోటు తట్టు కున్నారు అని వైద్యులు అనుకుంటుండగానే రెండవ సారి మళ్ళీ వచ్చింది. అంతే ఆ రెండవ గుండెపోటును తట్టుకోలేకపోయాడు రఘురామయ్య.
బందరులో జరిగే కనకాభిషేకం అందుకోలేక పోయారు. ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీని అందుకో లేకపోయారు. 1975 ఫిబ్రవరి 24 న హైదరాబాద్ లో కన్నుమూసారు.
-కళాసాగర్