విజయవాడలో శోభానాయడు ‘నృత్య రూపకం ‘

విజయవాడ సిద్ధార్థ కళాపీఠంలో (25-01-20, శనివారం) పద్మశ్రీ డా. శోభానాయడు శిష్యబృందంతో విప్రనారాయణ కూచిపూడి నృత్య రూపకం.

పద్మశ్రీ, డా. శోభానాయడు కూచిపూడి నాట్యకళాకారుల్లో విలక్షణస్థానాన్ని పొందిన నర్తకి, ఆమె తండ్రి వెంకన్న నాయడు పి.డబ్ల్యు.డి.లో ఎగ్జిక్యూటివ్ ఇన్జనీరు. తల్లి సరోజినీదేవి గృహిణి.
శోభానాయడు మొదట రాజమహేంద్రవరంలో నాట్య శిక్షణ పొంది, తరువాత 1968లో మాతృమూర్తితోపాటు మద్రాసు వెళ్లి పన్నెండేళ్లు డా. వెంపటి చిన్న సత్యంగారి దగ్గర కూచిపూడి నాట్యం నేర్చుకొని ఆ నగరంలో అనేక ప్రదర్శనల్లో పాల్గొన్నది. ఈ దశలో ఆమె చదువు సాగలేదు. 1980లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన తరువాత బి.ఏ. డిగ్రీ (ఆంగ్లభాష) సంపాదించారు. మద్రాసులో ఉండగా బి.ఎన్.రెడ్డి వంటి మహాదర్శకుడు అడిగినప్పటికీ ఆమె చలనచిత్రాల్లో నటించటానికి అంగీకరింపలేదు. ప్రసిద్ధ దక్షిణ భారత చలనచిత్ర దర్శకులు కోరినప్పటికి ఆమె తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు.

1980లో హైదరాబాదులో కూచిపూడి ఆర్ట్ అకాడెమీ స్థాపించి దానికి ప్రిన్సిపల్ గా, డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఆమెవద్ద వేయిమందికి పైగా విద్యార్థినులు కూచిపూడి నాట్యాన్ని అభ్యసించారు. వీరిలో రష్యా నుండి వచ్చిన బాలికలు ఉన్నారు. వారు స్వదేశానికి వెళ్లి అక్కడ కూచిపూడి నాట్యసంస్థలు, నెలకొల్పి రష్యాయువతులకు శిక్షణ ఇస్తున్నారు. శ్రీమతి శోభానాయడు తూర్పు ఆసియా దేశాలు, పశ్చిమ ఆసియా దేశాలు, రష్యా, ఉత్తర అమెరికా, బ్రిటన్, వెస్ట్ ఇండీస్, మెక్సికో, వెనిజులా మొదలైన దేశాల్లో పర్యటించి కూచిపూడి నాట్యానికి ప్రశస్తి చేకూర్చారు.
శ్రీమతి శోభానాయడు అనేక నృత్యరూపకాల్లో విభిన్న నాయికానాయక పాత్రలు పోషించి, తన నాట్య వైదుష్యాన్ని చాటుకొన్నారు. భామాకలాపం, శ్రీకృష్ణ పారిజాతం (సత్యభామ), చండాలిక (చండాలిక), విప్రనారాయణ (దేవదేవి), మేనకా విశ్వామిత్ర (మేనక), కళ్యాణ శ్రీనివాసం (పద్మావతి), శ్రీకృష్ణశరణం మమ (శ్రీకృష్ణుడు), విజయోస్తుతే నారి (దుర్గామాత), క్షీరసాగర మథనం (బలిచక్రవర్తి, మోహిని), సర్వంసాయిమయం (సాయిబాబా), జగదానందకారక (శ్రీరాముడు), స్వామి వివేకానంద (వివేకానందుడు) మొదలైన నృత్యరూపకాలు ఆమె నాట్యచాతుర్యానికి ఒరపిడిరాళ్లు అయినాయి. పై నృత్యరూపకాల్లో ఎనిమిదింటికి ఆమెయే నృత్యదర్శకురాలు.

పురస్కారాలు:
ఇంతగా కూచిపూడి నాట్యానికి జీవితాన్ని అంకితం చేసిన శ్రీమతి శోభానాయడు సత్కారాలు, పురస్కారాలూ, బిరుదులు పొందటం ఆశ్చర్యం కలిగింపదు. “నృత్య చూడామణి” బిరుదుతో పాటు సుర్ శృంగార సన్నద్ (ముంబాయి) వారి “నృత్యవిహార్” (1991), నుంగంబాకం కల్చరల్ అసోషియేషన్ (చెన్నై) వారి “నాట్య కళాశిరోమణి” (1996), తిరుపతి త్యాగరాజసంగీతసభవారి” సప్తగిరి సంగీత విద్వన్మణి(2002) మున్నగునవి ఆమె పొందిన బిరుదులలో కొన్ని మాత్రమే. 1991లో కేంద్ర సంగీత నాటక అకాడెమీ వారి అవార్డు, ఎన్.టి.ఆర్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి “హంస” అవార్డు ఆమె స్వీకరించారు. తెలుగు విశ్వవిద్యాలయం విశిష్టపురస్కారాన్ని, డాక్టరేట్ పట్టాన్ని పొందారు. భారత ప్రభుత్వం కూచిపూడి నృత్యానికి ఆమె చేస్తున్న సేవలను గుర్తించి ” పద్మశ్రీ” బిరుదుతో సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap