ప‌ద్యనాట‌క ప‌ద్మశ్రీ యడ్ల గోపాలరావు

తెలుగునాట విస్తృత ప్రాచుర్యం పొందిన నాటక ప్రక్రియలో పద్యనాటకాలది ఒక ప్రత్యేకమైన అధ్యాయం. నిరక్షరాస్యుల నోట కూడా పద్యాలను అలవోకగా వల్లెవేయించి, ఆలాపించగలిగే సామర్ధ్యానికి పునాది వేసినవి పద్యనాటకాలే. సాంస్క ృతిక రంగం ఎన్ని మార్పులకు లోనవుతున్నా పద్యనాటకాలకు ఆదరణ ఉంది. ఒకప్పుడు పాత సినిమాల్లోనూ నాటకాల్లోని పద్యాలను ఆయా సన్నివేశాల్లో ఆలాపిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సందర్భాలెన్నో. తెలుగు పద్యనాటక రంగంలో విఖ్యాతి పొందిన నటుడు, గాయకుడు, నాటకరంగ కళాకారుడు యడ్ల గోపాలరావు. ఆయన కళారంగ సేవను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గుర్తించడం తెలుగు పద్యనాటకానికి దక్కిన అరుదైన గౌరవం.

ప్రముఖ రంగస్థల కళాకారుడు యడ్ల గోపాలరావు సుదీర్ఘ కాలంగా నాటక రంగంలో అందిస్తున్న సేవలకు పద్మశ్రీ గౌరవం దక్కింది. రంగస్థలంపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో యడ్ల గోపాలరావు మెప్పించారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తన నటనని, వైదుష్యాన్ని ఆవిష్కరించారు. ఆయన పుట్టిపెరిగిన శ్రీకాకుళం జిల్లాలోని నాటకరంగ అభిమానులు, రంగస్థల కళాకారులు మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయన నటనాభిమానులంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
మందరాడలో పుట్టి …
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలంలోని మందరాడ యడ్ల గోపాలరావు స్వస్థలం. ఆయన సాధారణ వ్యవసాయ కుటుంబంలో 1950 మే 4న జన్మించారు. శ్రీకాకుళం ప్రభుత్వ పాఠశాలలో పీయూసీ వరకూ చదువుకున్నారు. అతని తండ్రి రామమూర్తి కూడా నాటకరంగ కళాకారునిగా గుర్తింపు పొందారు. ఎనిమిదేళ్ల వయసులో వీధిభాగవతాల్లో తొలిసారిగా కృష్ణుడి వేషం వేసిన గోపాలరావుకు. చిన్నప్పటి నుంచి నాటకాలంటే మక్కువ. తన చిన్నాన్న యడ్ల సత్యం సంగీత కళలు, నాటకాల వైపు గోపాలరావుని ఎంతగానో ప్రోత్సహించారు.
పద్నాలుగేళ్ల వయసులో…
యడ్ల గోపాలరావు నటనాజీవితం పద్నాలుగేళ్ల వయసు నుంచే మొదలైంది. ఆయన 1964లో ‘దేశం కోసం’ అనే సాంఘిక నాటకం ద్వారా రంగస్థలంపై అడుగుపెట్టారు. అనంతరం గ్రామంలోని యూత్‌ కమిటీ ఆధ్వర్యంలో వేసిన ‘పాదుకా పట్టాభిషేకం’ పౌరాణిక నాటకంలో నారదుని పాత్ర వేశారు. అంతకుముందు భజనల్లో పాల్గొని, రాగయుక్తంగా పాటలు పాడేవారు. యడ్ల సత్యంనాయుడు దగ్గరే హార్మోనియం ద్వారా తెలుగు పౌరాణిక పద్యాలను నేర్చుకున్నారు. ఆయనకు రాముని పాత్ర అంటే చాలా ఇష్టం కానీ సత్యహరిశ్చంద్ర నాటకంలో నక్షత్రకుని పాత్రే ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకొచ్చింది.
5000కు పైనే పౌరాణిక నాటకాల్లో …
ఐదున్నర దశాబ్దాలకు పైగా కళామతల్లి సేవలో ఉన్న యడ్ల గోపాలరావు ఇప్పటివరకూ 5,600కి పైగా పౌరాణిక నాటకాల్లో నటించి, ప్రేక్షకుల్ని రంజింపజేశారు. ఇన్ని ప్రదర్శనల్లో 3,600కి పైగా ప్రదర్శనల్లో యడ్ల గోపాలరావు ఒకే పాత్రని ధరించి, మెప్పించారు. అదే నక్షత్రకుని పాత్ర. మిగిలిన నాటకాల్లో రామునిగా, కృష్ణునిగా, అర్జునుడిగా, హరిశ్చంద్రునిగా, నారదునిగా, భవానీగానూ నటించారు. పౌరాణిక నాటకాల్లోనే కాకుండా తన నటనాజీవితం ప్రారంభంలో గణేష్‌పాత్రో రాసిన ‘పావలా, ఆగండి.. కొంచెం ఆలోచించండి’ వంటి నాటికలు ఆయన నటనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ‘ప్రెసిడెంట్‌ పట్టయ్య, పూలరంగడు, చిల్లరకొట్టు చిట్టెమ్మ, పల్లెపడుచు’ వంటి నాటకాల్లో తన అభినయంతో ఆకట్టుకున్నారు. 1964-1969 మధ్య పలు సాంఘిక నాటకాల్లో కథానాయిక పాత్రలతో కూడా యడ్ల గోపాలరావు ప్రశంసలు పొందారు.
మూడు తరాల నటులతో పోటీపడి…
నాటకరంగంలో మూడు తరాల నటులతో పోటీపడి నటించడం యడ్ల గోపాలరావు ప్రత్యేకత. సీనియర్‌ నటుడు డీవీ సుబ్బారావుతోనూ, ఆయన కుమారుడితోనూ, మనుమడితోనూ కలిసి గోపాలరావు నాటక ప్రదర్శనలు ఇచ్చిన సందర్భాలున్నాయి.
విభిన్న పాత్రల్లో …
యడ్ల గోపాలరావు రంగస్థల కళాకారుడిగా తన నటనలో అంతర్జాతీయ గుర్తింపును సాధించారు. అన్నిరకాల పాత్రల్లో ఒదిగిపోయారు. ఎక్కువగా నక్షత్రకుని పాత్రలో నటించినా, అంతే స్థాయిలో మిగిలిన పాత్రల్లోనూ నటించి, మెప్పించారు. పౌరాణిక పద్యనాటకాలు శ్రీరామాంజనేయ యుద్ధంలో రాముడిగాను, కురుక్షేత్రం, గయోపాఖ్యానంలో కృష్ణుడిగాను, ‘శ్రీకృష్ణ తులాభారం, నారద గర్వభంగం’ నాటకాల్లో నారదుడిగా తన నటనా కౌశల్యంతో కళాభిమానులను అలరించారు. వెండితెర నటుల స్థాయిలో ప్రత్యేక గుర్తింపుని పొందారు.
ఎన్నో పురస్కారాలు
యడ్ల గోపాలరావుకు ఇప్పుడైతే పద్మశ్రీ పురస్కారం వచ్చింది, కానీ అంతకు ముందే ఎన్నో కళా, సాంస్కృతిక సంస్థలు ఆయనకు విశిష్ట పురస్కారాలను ఇచ్చి, గౌరవించాయి. ఎన్నో బిరుదులు ఇచ్చి సత్కరించాయి. వాటిలో.. 1989లో గానకళాప్రపూర్ణ, 1989లో అమృతరామ, 1999లో సువర్ణ ఘంటాకంకణం, అభినయ శ్రీకృష్ణ, 1999లో బంగారు కంకణం, సంగీత నటచక్రవర్తి, 2000లో కలియుగ నక్షత్రక, 2006లో నటవిశిష్ట, 2010లో చట్టి పూర్ణయ్య పురస్కారం, 2013లో వెండి కిరీటం.. నటగాయక సవ్యసాచి బిరుదు, 2013లో పౌరాణిక బ్రహ్మ, 2014లో సువర్ణ పుష్పాభిషేకం, 2015లో బళ్లారి రాఘవ, 2015లో ఉత్తమ న్యాయనిర్ణేత, 2016లో కందుకూరి విశిష్ట పురస్కారం, 2017లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు వంటివి గోపాలరావు అందుకున్నారు.

కళాసేవల్లో నిమగమై …
యడ్ల గోపాలరావు నాటకాల్లో నటించడానికి మాత్రమే పరిమితం కాలేదు. కళారంగ సేవలో నిమగమయ్యారు. బాలభారతి నాటక కళాసమితిని స్థాపించి, అనేకసార్లు కళాపరిషత్తులు నిర్వహించారు. వర్థమాన, ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇస్తూ పలు కమిటీల వారిని నాటక రంగంలో ప్రవేశం కల్పించారు. నెలనెలా పేద, వృద్ధ కళాకారులకు ఐదు వేల రూపాయల వంతున శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య ద్వారా అందజేస్తున్నారు. స్వగ్రామం మందరాడలో సొంత నిధులతో రంగస్థల వేదికను నిర్మించారు. శ్రీకాకుళం, రాజాం ప్రాంతాల్లోని కళారంగ సంస్థలకు తన వంతుగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఆయన నక్షత్రకుడు, రాముడు, కృష్ణుడు, నారదుడు తదితర పాత్రలలో ఆలపించిన పౌరాణిక పద్యాలు, గ్రామఫోన్‌ రికార్డులు, క్యాసెట్లు, సీడీల రూపంలో ఏవీఎం, సంకీర్తన ఆడియో కంపెనీలు విడుదల చేశాయి. ఇవి బహుళ ప్రజాదరణ పొందాయి. ఇప్పటికీ గ్రామ సీమల్లో ఈ పద్యాలను ఆసక్తిగా వింటుంటారు.
పద్య నాటక మాధుర్యాన్ని నేటి తరానికి అందించడానికి యడ్ల గోపాలరావు ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారు. అందులో భాగంగా 2010లో సత్యహరిశ్చంద్ర నాటకాన్ని రంగస్థల కళాకారులతో 4.30 గంటల నిడివిగల ఆడియోను, వీడియో ఆల్బమ్‌ను రూపొందించారు. 2013లో రంగస్థల కళాకారులతో 2.26 గంటల నిడివిగల ‘హరిశ్చంద్రీయం’ అనే సంపూర్ణ పద్య చలనచిత్రాన్ని నిర్మించారు.

కుటుంబం వెన్నుదన్నుగా
తన కళారంగ జీవితానికి కుటుంబమే వెన్నుదన్నుగా నిలిచిందని యడ్ల గోపాలరావు చెబుతారు. తన సతీమణి జయలక్ష్మి, పిల్లలు అన్నివిధాలుగా సహకారం అందించారని అంటారు. వీరికి మొత్తం ఐదుగురు కుమార్తెలు. వారి బాగోగులన్నీ అతని భార్యే చూసుకునేవారు. ఆమెతో పాటు కుటుంబసభ్యులు, బంధు మిత్రుల ఆదరాభిమానాలు లేకుంటే కళారంగంలో తన కృషి సాధ్యం కాకపోయేదని నిగర్వంగా యడ్ల గోపాలరావు చెబుతారు. తెలుగు పద్యనాటకానికి జాతీయ గుర్తింపుని తీసుకొచ్చిన యడ్ల గోపాలరావుని అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
– బెందాళం క్రిష్ణారావు

______________________________________________________________

మరింత బాధ్యతని పెంచింది
– యడ్ల గోపాలరావు, పద్మశ్రీ పురస్కార గ్రహీత
పద్మశ్రీ పురస్కారం నాపై మరింత బాధ్యతను పెంచింది. ఇది తెలుగు పద్యనాటక రంగానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. కళలను కాపాడుకునేందుకు నేటితరం కొంత సమయాన్ని కేటాయించాలి. సత్యహరిచంద్ర ఘట్టంతో పాటు మరికొన్ని పౌరాణిక ఘట్టాలను స్వల్ప నిడివితో తయారుచేసి, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించే పనిలో నిమగమై ఉన్నాను.
______________________________________________________________

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap