తెలుగునాట నక్షత్రకుడిన్ని హీరో చేసిన గొప్ప రంగస్థల కళాకారుడు పద్మశ్రీ యడ్ల గోపాలరావు. ఐదువేల పద్య నాటక ప్రదర్శనలు, యాభై సంవత్సరాల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు గురించి పల్లి నల్లనయ్య అందిస్తున్న వ్యాసం..
“మా చిన్నాన్నలు పల్లి లక్ష్మీనారాయణ, పల్లి నరసింహులు, పల్లి రామ్మూర్తి అందరూ పౌరాణిక నటులే. వారు మా ఊరిలో శ్రీ రామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం, బాలనాగమ్మ, మున్నగు నాటకాలు వేయడం, అలా నాకు పద్యనాటకం పై చిన్ననాటి నుంచే ముక్కువ ఏర్పడటం జరిగింది. నా పదవ ఏట మా చిన్నాన్న శ్రీ రామమూర్తి తదితరులతో కలిసి మా ఊరి సమీపంలో గల సైరిగాం గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సత్యహరిశ్చంద్ర నాటకంలో నక్షత్రకుని పాత్రలో మొట్టమొదటిసారిగా శ్రీ గోపాలరావుని చూడడం జరిగింది. అప్పటికి వారు మంచి యుక్త వయసులో ఉండటం, హార్మోనిస్టు కూడా కావడం వల్ల ఏ రాగన్నైనా
పై స్థాయిలో అమోఘంగా పలికి ప్రేక్షకుల విజయ హారతులు అందుకునేవారు. తన నట గానమాధుర్యంలో ప్రేక్షకులను ఆనంద డోలికల్లో విహరింప చేసి వారి హృదయాల్ని దోచుకునేవారు.
మన తెలుగునేలపై పౌరాణిక పద్య నాటక వైభవాన్ని పెంచిన మహానుభావులలో పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు ఒకరిని సగర్వంగా చెప్పుకోవచ్చు. నాకున్న పరిజ్ఞానం మేరకు,నాకు తెలిసినంత వరకు, తొలుత కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో పద్యాల్ని ఆలపించిన దైతా గోపాలం, కపిలవాయి రామనాథ శాస్త్రి, ఫలానా పద్యాన్ని ఫలానా రాగంలోనే పాడాలని పద్యాలకు రాగ నిర్దేశం చేసిన అబ్బూరి వరప్రసాదరావు, తర్వాత ఆ ప్రక్రియను కొనసాగించిన బేతా వెంకట్రావు, హిందుస్తానీ సంగీతంలో పద్యాల్ని ఆలపించిన ఈలపాట రఘురామయ్య, కర్ణాటక, హిందుస్థానీ సంగీతాలను మేళవించి అత్యద్భుతంగా పద్యాల్ని పాడిన రంగస్థల రారాజు షణ్ముఖి ఆంజనేయరాజు, పద్య గద్యాల్ని భావ రాగ యుక్తంగా ఆలపించిన పీసపాటి నరసింహమూర్తి, అమరపు సత్యనారాయణ, గళాన్ని, నాసికాన్ని సంయుక్త పరిచి వీనుల విందుగా పద్యాన్ని పాడి ప్రేక్షకులను మెప్పించిన ఏ.వి. సుబ్బారావు, తన మధుర స్వరంతో గద్య పద్యాలను సుస్పష్టంగా సామాన్యులకు సైతం అర్థమయ్యేలా మహోన్నత రీతిలో గానం చేసి పద్యనాటక అభిమానుల్ని తనవైపు తిప్పుకున్న ఎం.వై. నాయుడు, పద్యాలు శ్రావ్యంగా ఆలపించి తనదైన బాణీనీ ఏర్పరచుకొని ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న డి.వి. సుబ్బారావు, చీమకుర్తి నాగేశ్వరరావు, ఎటువంటి సంగీత పరిజ్ఞానం లేకున్ననూ హిందుస్తానీ, కర్ణాటక సంగీత బాణీలలో అన్ని స్థాయిలలో పాడగల పి.లక్ష్మణరావులే కాకుండా, కర్ణాటక సంగీతంలో ఆరోహణ, అవరోహణ క్రమాలను క్రమబద్ధీకరిస్తూ, పద్య భావాన్ని పరిరక్షిస్తూ, వచన స్వభావాన్ని సంరక్షిస్తూ, జంట స్వరాలతో మనోరంజకంగా పద్యాన్ని ఆలపిస్తున్న ఎడ్ల గోపాలరావు కూడా తెలుగు పౌరాణిక పద్య నాటక రంగాన్ని సంపన్నం చేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. అనేక అనేక బిరుదులు, పలు సత్కారాలు ఘన సన్మానాలు అందుకున్న పద్య నాటక ఘనాపాటి, కళామతల్లి ముద్దుబిడ్డ పద్మశ్రీ గోపాల రావు. గద్య పద్య పఠనంలోను, నటనలోనూ వారు కనబరుస్తున్న ప్రతిభ అనన్య సామాన్యం. స్వయంకృషితో, అకుంఠిత దీక్షతో, ఎనలేని ఆత్మవిశ్వాసంతో, పౌరాణిక పద్య నాటకంలోని మెళకువలను ఆకళింపు చేసుకుని ఆంధ్రరాష్ట్రంలో అగ్రశ్రేణి కళాకారునిగా ఎదిగిన తీరు అందరికీ అనుసరణీయం.
రంగస్థలంపై శ్రీ గోపాలరావు తప్ప, వేరే నక్షత్రకున్ని మనం చూడలేము. నక్షత్రకుడంటే ఎవరికైనా ముందు గోపాలరావు గారే గుర్తొస్తారు. సత్య హరిచంద్ర నాటకంలో అప్పటి వరకు ఒక సహాయక పాత్రగా, ఒక హాస్య పాత్రగా ఉండే నక్షత్రక పాత్రకు ఓ నాయక హోదా (హీరో ఇమేజ్)ని, ఓ గుర్తింపు (ఐడెంటిటీ)ని తెచ్చి పెట్టిన ఘనత గోపాలరావుకే దక్కుతుందనడం అతిశయోక్తి కాజాలదు. ఇప్పటికీ ఎంతో మంది నటులు నక్షక పాత్రలో అతనినే అనుకరించడం, వారి బాణిలో కాకుండా వేరే బాణీలో పాడితే ప్రేక్షకులు దానిని ఏ మాత్రం అంగీకరించక పోవడం మనం చూస్తున్నాం. మంచి పేరు ప్రఖ్యాతులు గడించిన మేటి నటుల సరసన సత్య హరిశ్చంద్ర నాటకంలో ఒక నక్షత్రకునిగా చాలా మంది నటించి, దానిని ఆడియో సీ.డి. రూపంలోకి తెచ్చినా, అది జనామోదం పొందనందున, నక్షత్రకునిగా ఆయా నటుడు పాడిన పాటను తొలగించి, నక్షత్రకుని పాత్రలో గోపాలరావు పాడిన పాటను సీ.డి.లో ఎక్కించి, కొత్తగా మరో ఆడియో సీడీ నీ రూపొందించి, మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భాలే అందుకు నిదర్శనం. ఎటువంటి భేషజాలకు పోకుండా, శ్రీ గోపాలరావు, ఔత్సాహిక, వర్ధమాన నటుల సరసన సైతం నటించి వారిని ప్రోత్సహించడం; తాను ఉన్నతశ్రేణి నటుడైనప్పటికీ, మంచి ప్రతిభా పాటవాలు కనబరుస్తున్న యువనటీనటులను ‘బాగా పాడతారని’ అందరి ముందు ప్రశంసించడం, దాదాపు పౌరాణిక పద్యనాటక కళాకారులందరితో కూడా మంచి సంబంధ బాంధవ్యాల కలిగి ఉండటం, వారిలో నాకు నచ్చిన మేటి సుగుణాలు. నటుడిగా ఎంత ఎదిగినా ఒదిగి వుంటూ, గర్వాన్ని ఏ మాత్రం దరిజేరనీయక అందరి మన్ననలందుకుంటున్న వ్యక్తి గోపాలరావు, నేటి తరం నటులకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారనడంలో ఎటువంటి సందేహం లేదు.
డి.వి. సుబ్బారావు హరిశ్చంద్రునిగా, గూడూరు సావిత్రి చంద్రమతిగా, గోపాలరావు నక్షత్రకునిగా నటించిన సన్నివేశాలను మద్రాసు హెచ్.ఎం.వీ. కంపెనీ వారు గ్రామఫోను రూపంలో రికార్డు చేయగా, అది ఆంధ్రరాష్ట్రంలో ప్రతీ పల్లెలోను చాలా సంవత్సరాల పాటు రాజ్యమేలింది. ఇప్పటికి కూడా అది సి.డి. రూపంలో అందరినీ ఉర్రూతలూగిస్తూనే ఉంది. గోపాలరావు, శ్రీరామాంజనేయ యుద్ధంలో రామునిగా, గయోపాఖ్యానంలో శ్రీకృష్ణునిగా, శ్రీకృష్ణతులాభారంలో నారదునిగా నటించిన ముఖ్య సన్నివేశాల్ని విశాఖపట్నంలోని శ్రీ మాతా రికార్డింగ్ కంపెనీ వారు సీ.డీ. రూపంలో రికార్డు చేయడం వల్ల, వాటిని పద్య నాటకాభిమానులందరికీ రోజు విని ఆనందించే భాగ్యం దక్కింది. అలవోకగా ఐదు లేదా ఐదున్నర శ్రుతిలో ఎత్తుకొని తన సహజ జంట స్వరాలతో పద్యాన్ని గానం చేసి, సంభాషణలను అందరికీ మయ్యేలా స్పష్టంగా పలికి, ప్రేక్షకుల్ని సమ్మోహనపరచిన నేటి మేటి నట స్వర సవ్యసాని శ్రీ గోపాలరావు,
తెలుగు పద్య నాటక రంగ చరిత్రలో, రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలలో ఇప్పటివరకు మొత్తం వేల ప్రదర్శనలిచ్చి. 50 సంవత్సరాల నట జీవితం పూర్తి చేసుకున్న ఏకైక నటుడు గోపాలరావు గారేనని అనుకొంటాను. అలాంటి అద్భుత నట గాయకుడు మా శ్రీకాకుళం జిల్లాలో పుట్టడం మాకెంతో గర్వకారణం.”
- పల్లి నల్లనయ్య