డిజిటల్ హంగులతో ‘పద్య’ నాటకాలు

(జి.జి.కె. ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో మూడు రోజులపాటు పద్య నాటకాలు)

నిజంగా పద్య నాటకాలకు పునః వైభవమే! యువతను పద్య నాటకం వైపు రప్పించాలనే తపన తో ఖర్చు కాస్త ఎక్కువైనా నేటి ట్రెండ్ కు తగ్గట్లుగా ఆధునిక హంగులు అద్ది ఆకట్టుకునేలా పద్య నాటకోత్సవాలు నిర్వహించారు. మూడు రోజులు రవీంద్రభారతి కిక్కిరిసిపోయింది. రొటీన్ రొడ్డ కొట్టుడు కర్టెన్లు లేకుండా డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసి సన్నివేశానికి తగ్గట్లు బ్యాక్ డ్రాప్ మారుస్తూ నాటకాన్ని వేరే లెవెల్ కు తీసుకెళ్లారు. వేలాడే మైక్ లు, స్టాండ్ మైక్ లు కాకుండా, మారిన టెక్నాలజీ కీ అనుగుణంగా ఇయర్ మైక్స్ ఉపయోగించారు. ఆహార్యంలో, రంగోద్దీపనం లో అఖరకు ఆయా పాత్రధారులు ధరించే చెప్పుల్లోను ఎక్కడా రాజీ పడకుండా ఆయా నాటకాలకు తగ్గట్లు రాజ వైభవం తో నాటకాలు ప్రదర్శించారు. కేవలం పద్య రాగాలకే ప్రాధాన్యత ఇవ్వకుండా నటన లోనూ దృష్టి నిలిపి ఆయా పాత్రల్లో జీవించి రక్తి కట్టించారు. మున్నెన్నడు ప్రదర్శించని సన్నివేశాలను జోడించి మైమరపించారు. ఇంత అద్భుతం చేసే సాహసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఉంది? ఒకే ఒక్కడికి మాత్రమే సాధ్యం. అతడే రంగస్థల మెగాస్టార్ కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ.

పేద కళాకారులను ఆదుకోవడం కోసం, పద్య నాటక పునరుజ్జీవనం కోసం గుమ్మడి గోపాలకృష్ణ ప్రత్యేకంగా తన పేరిట జి జి కె ఫౌండేషన్ ప్రారంభించి కరోనా సమయం లో ఎందరికో ఆర్ధిక చేయూత అందించిన విషయం విదితమే. ఆ ఫౌండేషన్ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 17 నుంచి మూడు రోజులు హైదరాబాద్ రవీంద్రభారతి లో అద్భుతమైన మూడు పద్య నాటకాలు ప్రదర్శించారు. తొలి రోజు సత్యహరిశ్చఒద్ర, రెండవ రోజు శ్రీనాధుడు, మూడవ రోజు యోగి వేమన. మూడు అద్భుతాలు. చరిత్ర సృష్టించిన నాటకాలు. మూడు నాటకాలకు దర్శకుడు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారే. మూడు టైటిల్ పాత్రలు ఆయనే పోషించారు. అందుకే నాటక ప్రియులతో రవీంద్రభారతి మూడు రోజులు కిక్కిరిసిపోయింది. రోజూ రాత్రి 11 గంటల వరకు ప్రేక్షకులు పండగ చేసుకున్నారు. డిజిటల్ టెక్నాలజీ నాటకాలకు బ్రహ్మరథం పట్టారు. ఈటీవీ, విన్ ఓటీటి వారు మూడు రోజులు రికార్డు చేశారు.


వేమన ఫౌండేషన్ చైర్మన్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సి. ఆంజనేయ రెడ్డి, పూర్వ డీజీపి శ్రీ హెచ్ జె దొర, ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఎల్. వి. సుబ్రహ్మణ్యం, పూర్వ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, పూర్వ ఎమ్మెల్యే బొద్దులూరి రామారావు, తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ శ్రీమతి దీపికా రెడ్డి, ముంబై ఆంధ్ర అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు మూల సిద్ధారెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, డాక్టర్ వంశీ రామరాజు లాంటి ప్రముఖులు ప్రేక్షకుల్లో కూర్చుని ఆద్యంతం నాటకాలు తిలకించి కళాకారులను అభినందించి వెళ్లడం విశేషం. తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కె. వి. రమణాచారి, సాంస్కృతిక మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ విచ్చేసి ఈ పద్య నాటకోత్సవాలను ప్రారంభించారు.

Gummadi Gopala Krishna as a Vemana

ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముగ్గురు కళాకారులకు జిజికె ఫౌండేషన్ ఒక్కొక్కరికి పది వేల వంతున ఇచ్చి సత్కరించింది. ఇక పద్యాలు రసరమ్యంగా ఆలపించిన కళాకారులకు ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున చదివింపులు రావడం విశేషం. చంద్రమతి పాత్రధారి శ్రీమతి రత్నశ్రీ కి ప్రేక్షకుల నుంచి పది వేల రూపాయల పైచిలుకు లభించడం మరో విశేషం. కాస్త శ్రద్ధతో పాటు సరైన వేదిక, ఆహార్యం, రంగోద్దీపనం, సంగీతం, సౌండ్ అన్నీ సక్రమంగా కుదిరితే కళాకారులు అద్భుతాలు సృష్టిస్తారని చెప్పుకోవడానికి ఈ పద్య నాటకోత్సవాలే నిదర్శనం. అన్నీ తానై పర్యవేక్షించి ప్రధాన పాత్రలు పోషించి అన్నీ చూసుకోవాల్సి రావడంతో గుమ్మడి గోపాలకృష్ణ గారి స్వరం కాస్త ఇబ్బంది పెడుతున్నప్పటికి, అది గుర్తించి తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ లోటు కనిపించనీకుండా తనదైన శైలిలో కొత్తదనం చూపించి నాటకాలను రక్తి కట్టించిన గుమ్మడి గోపాలకృష్ణ కు అందరూ జేజేలు పలికి ప్రశంశించారు. ప్రతిరోజూ కళాకారులను శాలువాలతో సన్మానించారు. ఫౌండేషన్ గౌరవ సలహాదారుడిగా నన్ను కూడా సన్మానించారు. పద్య నాటకోకోత్సవాలను దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వి. సతీష్, జె. రాధాకృష్ణ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. మహబూబ్ నగర్, మెదక్, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల నుంచి కూడా నాటకాభిమానులు తరలి వచ్చి నాటకోత్సవాలను తిలకించడం విశేషం.

డాక్టర్ మహ్మద్ రఫీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap