(నవంబర్ 14న అంట్యాకుల పైడిరాజుగారి జన్మదిన సందర్భంగా…)
జానపద చిత్రలేఖనం ద్వారా జగత్ప్రసిద్ధి పొందిన చిత్రకారుడు దివంగత అంట్యాకుల పైడిరాజు, ఆయన చిత్రకారుడుగానే కాకుండా శిల్పిగా, కవిగా, రచయితగా కూడా పేరు పొందారు. అయన వేల చిత్రాల్ని, వందల చిత్రకారుల్ని తయారుచేశారు. 1991 వనంబర్ 14న బొబ్బిలిలో జన్మించిన ఆయన విజయనగరంలో విద్యనభ్యంచారు. తరువాత మద్రాసు ప్రభుత్వ లలితకళాశాలలో చేరి తనలోని కళకు మెరుగులు దిద్దుకున్నారు. ప్రముఖ శిల్పి, చిత్రకారుడు దేవీప్రసాద్ రాయ్ చౌదరి వద్ద ప్రత్యేకంగా శిల్ప, చిత్రకళలో శిక్షణ పొందారు. 3.శ్రీనివాసులు, పిలకా లక్ష్మీనరసింహమూర్తి, వేలూరి రాధకృష్ణ తదితరులు పైడిరాజుకు సమకాలికులే కాదు సరిసమానులు కూడా. 1944లో డిప్లొమా పొందాక ఆంధ్రరాష్ట్రాన్ని పట్టి పీడించిన కరువు రక్కసి అమానుష దృశ్యాల్ని రేఖా చిత్రాలుగా ఆయన చిత్రించిన వైనం అనితర సాధ్యం. 1947లో లండన్లో జరిగిన చిత్రకళా ప్రదర్శనతో పైడిరాజు పేరు దశదిశలా మారుమ్రోగింది. అప్పట్లో ఆయన గీచిన ‘గృహన్ముఖులు’ చిత్రానికి నగదు బహుమతి లభించింది. 1952లో ఆయన చిత్రించిన బజారుకు’ అనే చిత్రం రష్యా ప్రభుత్వం సేకరించింది. కాలక్రమంలో అక్కడ గీచిన చిత్రాలకు విశేష గుర్తింపు లభించింది. ఢిల్లీ, హైద్రాబాద్ మ్యూజియాల్లో, వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాధినేతల నివాసగృహాల్లో పైడిరాజు చిత్రాలు సముచిత స్థానం పొందాయి.
ఆయన సృజించిన పలు శిల్పాలు, చిత్రాలు కళారంగంలో శాశ్వతత్వాన్ని సంతరించుకొన్నాయి. విశాఖపట్నం ఆర్టీసీ ప్రధాన కాంప్లెక్స్ కూడలిలో నున్న గురజాడ విగ్రహం ఆయన శిల్ప కళాకౌశలానికి నిలువెత్తు నిదర్శనంగా నిల్చింది.
రాష్ట్ర లలితకళా అకాడమీలో ఫెలోగా శాశ్వత సభ్యత్వం పొందిన పైడిరాజు అదే అకాడమీకి కొన్నేళ్లపాటు ఉపాధ్యక్షునిగా వున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయాల అకాడమీకి కౌన్సిల్ సభ్యునిగా వుండి, ఎ.యు.లో ఫైన్ ఆర్డ్సు విభాగం ఏర్పాటుకు కృషి చేశారు. తర్వాత అనేక విభాగంలో లెక్చరర్‌గా కూడా పనిచేశారు. 1965లో విశాఖలో చిత్రకళాపరిషత్ అనే చిత్రకళా సంస్థను స్థాపించి, చిత్రకళారంగంలో ఆసక్తి కల్గినవారినెందరినో ప్రోత్సహించారు. పైడిరాజును సంగీత, సాహిత్యరంగాల్లో కూడా అభినివేశం వుంది. 1987లో ఆయన కవితలు ‘అక్షరశిల్పాలు’గా ప్రచురింపబడ్డాయి. రాష్ట్ర లలితకళా అకాడమీ ఆయనపై ఒక పుస్తకాన్ని ప్రచురించింది. ప్రముఖ చిత్రకారులు ద్వివేదుల సోమనాధ శాస్త్రి పైడిరాజుపై ఒక పుస్తకం రచించి ప్రచురించారు. 1987లో ఆంధ్ర విశ్వ విద్యాలయం ఆయన్ని ‘కళా ప్రపూర్ణ ” బిరుదుతో సత్కరించింది. ప్రముఖ చిత్రకారుడు అంట్వాకుల రాజేశ్వరరావు వీరి కుమారులే. చిత్రకళా రంగంలో ఆయన జీవితం, కృషి కళాభిమానులకు ఓ పంచరంగుల జ్ఞాపకం. తెలుగుతనాన్ని సప్తవర్ణాల్లో చూపించిన ఆ మహాకళాకారుని చిత్రాల్ని భద్రపర్చడానికి ప్రభుత్వం చర్య తీసుకోవాలి.
-సుంకర చలపతిరావు