సుప్రసిద్ద చిత్రకారులు చిత్రకళా ఆచార్యులు డాక్టర్ బి.ఏ. రెడ్డి గారి పేరు చెప్పగానే ఎవ్వరికైనా సీతాకోకచిలుకల్లాంటి రంగురంగుల సుందరమైన అందమైన చిత్రాలు మనకు గుర్తుకొస్తాయి. కాని ఇటీవల వారు వెలువరించిన మరో చిత్రకళా గ్రంధం “పెయిన్ ఇన్ బ్లాక్”లో వారు వేసిన చిత్రాలను మనం గమనించినట్లయితే వీటికి పూర్తి భిన్నమైన కోణంలో చిత్రకారుడిలోని మరో పార్శ్వం మనకు కనిపిస్తుంది. పైన్ ఇన్ బ్లాక్ అన్న పేరుకు తగినట్టుగానే ఈ గ్రంధంలో వారు వేసిన చిత్రాలన్నీ వర్ణ సహితమైనవి గాకుండా వర్ణరహితమైన నలుపు తెలుపు చిత్రాలే. అంతే గాకా ఇందులో వారు వేసిన చిత్రాలన్నీ కూడా గతంలో వారు వెలువరించిన గోల్డెన్ పేలట్ గ్రంధం నందలి చిత్రాల్లా మనసుకు హాయిగొలిపే వర్ణ చిత్రాలు కావు. ఒకవిధమైన భాధను వేదనని తెలిపే వర్ణ రహితమైన చిత్రాలు. అందుచేతనే వీరు రంగుల జోలికి పోకుండా ఈ చిత్రాలన్నింటికీ కేవలం నలుపుతెలుపు వర్నాలను ఎంచుకోవడం జరిగిందని చెప్పవచ్చు. బ్లాక్ అనేది ఒకవిధమైన ఆశుభానికి, వేదనకి చిహ్నంగా వాడడం మనకు ఆనవాయితి. తెలుపు అనేది ఒకవిధమైన ప్రశాంతతకి చిహ్నంగా కూడా భావిస్తాం. అలాంటి ప్రశాంతతని సూచించే తెలుపు స్థానంలో ఒక పొందికలేని చిందర వందరతో కూడిన నలుపు వర్ణం చేరితే మనసులో ఒకవిధమైన అలజడి అశాంతి చేరిన భావం మనకు ఏర్పడుతుంది. అందులో చాల తీవ్రత కనిపిస్తుంది. మరి సంఘంలో పలురకాలుగా జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు సంఘవిద్రోహ చర్యలను ఎత్తి చూపాలంటే ఆ భావ వ్యక్తీకరణకు ఊతమిచ్చే వర్నాలనే ఎంచుకోవాలి. లేకుంటే ఎంతో ప్రభావ శీలమైన చిత్రమైనప్పటికీ అది దాని భావాన్ని వ్యక్తీకరించలేదు. అందుకే రెడ్డి గారు ఈ సిరీస్ లో వేసిన చిత్రాలలో వర్నాలజోలికి పోకుండా పూర్తిగా నలుపు తెలుపు రంగులనే వాడుకున్నారు.
దృశ్య కళా రూపాలలో చిత్రకళ అనేది ప్రదానమైనదైతే ఆ కళలో భావ వ్యక్తీకరణకు తోడ్పడే ప్రధాన సాధనం రేఖ,మరియు రంగు. చిత్రకారుడు తాను చిత్రంలో చెప్పదలచుకున్న భావవ్యక్తీకరణకు అనుగుణంగానే అతని కుంచె గీసే రేఖగాని రంగులు గాని కాన్వాస్ పై వ్యక్తం అవుతాయి. చిత్రంలో కనిపించే ఆ రేఖ రంగుల తీరును బట్టే చిత్రకారుడు తాను దానిలో చెప్పదలచుకున్న భావాన్ని వీక్షకుడు సైతం అవగతం చేసుకుంటాడు. సరళీకృతమైన రేఖలు లలిత లలితమైన సుకుమార స్వభావాలను వ్యక్తం చేస్తే, అపసవ్యరేఖలు అందుకు విరుద్దమైన భావాలను వ్యక్తం చేస్తాయి. మనిషి జీవితం కూడా ఇట్లాగే సాగుతుంది. సౌభాగ్యవంతమైన జీవితంలో వక్రగతితో కూడిన అపసవ్యరేఖలు కనబడవు. అన్నీ సాఫీగా సాగిపోయే సౌందర్యభరితమైన సరళీకృత రేఖలే కనిపిస్తాయి. కానీ నిశీధి రాత్రుల్లాంటి జీవితం గడిపే నిర్భాగ్యుల జీవితాల్లో అలాంటి అందమైన సుకుమారం కనబడదు. రెడ్డి గారు ఈ గ్రంధంలో చూపించిన చిత్రాలన్నీఈ రెండో వర్గానికి చెందిన జీవితాలకు ప్రతిబింబాలు. వీటిల్లో కూలీలు, కసాయి పనివాళ్ళు, భిన్న, విభిన్న వృత్తుల్లో మమేకమైన కార్మికులు, కర్షకులు, శ్రామికులు. పశువులపై ఆధారపడిన జీవులు, వారి జీవనం, మూగ జీవాలతో వారి సాంగత్యం, రోడ్డుప్రక్క జీవించే బిక్షగాళ్ళు, దిక్కులేని అభాగ్యులు, స్త్రీ పురుషుల మధ్య సహజంగా సాగే సంభందాలే గాకా వారి బలహీనతలు, సందిగ్ద సంశయాల మధ్య జరిగిపోయే మనిషి పతనానికి చెందిన ఘటనలు, బలాడ్యుల ఆక్రమణలు, అణిచివేతలుతో పాటు బలహీనుల ఆక్రందనలు, ఆకలికేకలు, మనుగడకై మనిషి సాగించే జీవనపోరాటాలు ఇలా సగటు మనిషి జీవితంలో నిత్యం ఎదురయ్యే సంఘటనలకు ప్రతిరూపాలుగా నిలిచే చిత్రాలు ప్రస్తుత గ్రంధంలో అడుగడుగునా మనకు కనిపిస్తాయి.
ఏ కళకైనా పుట్టినిల్లు ప్రకృతి లేదా సమాజం అని చెప్పవచ్చు. మారి ఆ కళను సృష్టించే కళాకారుడు కూడా ప్రత్యేకంగా వేరే లోకంనుండి ఉద్భవించడు. తోటి సమాజం నుండే పుట్టుకొస్తాడు. తానుండే ప్రకృతినుండి లేదా సమాజం నుండే అతడు కళాకారుడుగా తయారవుతాడు. చిత్రకారుడు కూడా అందుకు మినహాయింపు కాదు. తాను కూడా తోటి సమాజంలో ఒక సభ్యుడు కనుక సమాజంలోని తీరుతెన్నులు భాద్యతలనుండి అతడు తప్పించుకోలేడు. అందుకే భాద్యతాయుతమైన చిత్రకారుడిగా రెడ్డి గారు ఒక ప్రక్క మన సంస్కృతిని ప్రతిభింబించే రీతిలో విస్తృతమైన చిత్రరచనను చేస్తూనే సామాజిక పరిణామాలను కూడా అలక్ష్యం చేయకుండా మరో పార్శ్వంలో సమాజంలో జరుగుతున్న పరిణామాలను సామాన్యుల జీవితాలలోని ఇక్కట్లను ఈతిభాధాలను అన్నింటిని తన కుంచెతో కాన్వాస్ పై తనదైన రీతిలో చక్కగా ఆవిష్కరించడం జరిగింది. 1980 వ దశకంలో దేశంలో తలెత్తిన మత కల్లోలాల సందర్భంగా రేకెత్తిన అల్లర్లను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం నాడు విదించిన కర్ఫ్యూ కాలంలో హైదరాబాదు నందు తాను ఉద్యోగిగా వుంటూ అలనాటి చేదు అనుభవాలను స్వయంగా చవిచూసిన వ్యక్తి వీరు. అందుచేతనే నాటి అనుభావాలన్నింటిని ఒక సిరీస్ గా వేసిన కర్ఫ్యూ చిత్రాలు అలనాటి చేదుఘటనలకు దర్పణాలుగా నిలుస్తాయి.
అలాగే బంగ్లాదేశ్ యుద్దము సందర్భంగా వేసిన చిత్రాల్లో గాని రాష్ట్ర కర్ఫ్యూ ద్రుశ్యాలుగాని చిత్రకారుని యొక్క సామాజిక స్పృహను భాద్యతను తెలియజేస్తాయి. బుచర్ అనే చిత్రంలో కసాయి వాడి దైన్యం కనబడితే, సామాన్యుడి బతుకు కు దర్పణంగా ది పోర్టర్, రోడ్ సైడ్, అభాగ్యులు, బ్రతుకు భారం, ఫ్రూట్ సెల్లర్ లాంటి చిత్రాలు నిలుస్థాయి.అలాగే CRY AND RESPONCE, EXPLOITATION, DEFFRESSED- అణచబడ్డవాళ్ళు, SUPPRESSION, ROADSIDE-, VICTIM-, THE AFFECTED, PITY THEM, OUTRAGE-,THREE VS TWO ఆక్రమణ, పీడితులు లాంటి చిత్రాల్లో బలవంతుల దోపిడీకి బలైపోతున్న బలహీనుల బ్రతుకులు కనిపిస్తాయి, ఇక FAMINE,THE DEPPRESSED, ROAD SIDE-, EXPLOITATION, ALL THE SAME, DESTINY లాంటి చిత్రాల్లో విది వంచితుల దారిద్ర్యం దీన స్థితులు మనకు కనిపిస్థాయి. స్వాతంత్ర్యం వచ్చి ఏడు పదులు దాటినప్పటికీ నేటికి అంటరానితనం లాంటి జాడ్యాలు కొన్ని చోట్ల కొన్ని వర్గాల పట్ల ఇంకా ప్రత్యక్షమౌతునే వుంది అలాంటి దురాగతాలకు దర్పణంగా నిలుస్తాయి ది అబాన్దేడ్ లాంటి చిత్రాలు. శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తాయి శ్రామికులు, మిత్రులు, ది మైడ్ లాంటి మరికొన్ని చిత్రాలు. సామాన్యుడి యొక్క జీవన సంగీతాన్ని వినిపిస్తాయి SONG OF LIFE, FROM THE FIELDS, FARMER, CARETAKER, MAN WITH FISH, JEEVANA GEETHAM, CONCERN, FARMER AT REST, COUPLE, MOTHER, FAMILY, MELODY AND RESPONSE లాంటి చిత్రాలు .
సృష్టిలో సౌందర్యం ప్రధానంగా రెండురకాలుగా వుంటుంది ఒకటి రూప సౌందర్యం, రెండవది భావ సౌందర్యం, రూపం బాహిర్గతమైనదైతే భావం అంతర్గతంమైనది. బహిర్గతమైన రూపం త్వరగా అందరిని ఆకట్టుకుంటుంది, అంతర్గతమైన భావం అంత తొందరగా ఆకట్టుకోలేకపోవచ్చు. అందుకే సాధారణ ప్రేక్షకులు ఎక్కువగా తక్షణం ఆకట్టుకునే బాహ్యమైన సౌందర్యాన్ని ఇష్టపడతారు. తక్కువ మంది మాత్రం రూప ప్రాముఖ్యత లేకున్నా అంతర్గతంగా కనిపించే భావ సౌందర్యాన్ని ఇష్టపడతారు. కారణం రూపం నశిస్తుంది అచిరకాలంలోనే, కాని భావం నిలుస్తుంది చిరకాలం. రూపం అశాశ్వతం భావం శాశ్వతం.అందుకే ప్రకృతికి అనుసరణతో కూడిన రూపం కంటే అనుకరణ లేని ఆలోచనతో కూడిన భావ సౌందర్యం గొప్పది. అది మనసుని ఆలోచింపజేస్తుంది కాని రూపం అన్నది కేవలం తాత్కాలిక ఆకర్షణకే పరిమితమౌతుంది. రెడ్డి గారు ఈ గ్రంధంలో రచించిన చిత్రాలన్నింటా కూడా సౌందర్యం వుంది కాని అందులో రూప సౌందర్యం కంటే భావ సౌందర్యమే ప్రధానంగా కనిపిస్తుంది.
ఏదైనా ఒక చిత్రంలో సమతల దర్పణంలో చేసిన వర్ణ లేపనం కంటే ఎగుడుదిగుడుగా పూసే వర్ణ లేపనం ద్వారా ఏర్పడిన ఒక విదమైన గరుకుతనం చిత్రాన్ని కంటికి ఇంపుగా వుండేలా చేస్తుంది. అందులో ఒకవిధమైన దృశ్య మాధురి మనకు కనిపిస్తుంది. భావ వ్యక్తీకరణకు బాగుగా తోడ్పడే ఈ సంవిధానమునే చిత్రకారుడు ఇందలి చిత్రాల రచనకు ప్రధానంగా వినియోగించినట్లు మనం గమనిస్తాము. అందుచేతనే ఇక్కడ పేర్కొన్న చిత్రాలలో నున్నగా కనిపించే అందమైన రూపాలుండవు, అంతటా వికారమైన విక్రుతరూపాలే మనకు దర్శనమిస్థాయి. అందులో భాద, ఆక్రోశం, ఆవేదన బలహీనత, సందిగ్దతతో సతమతమయ్యే మనుషులే మనకు కనబడతారు ఇలాంటి స్తితి లో వుండే మనుషుల్లో అందమైన రూపాలను ఆశించడం అసహజం అవుతుంది. అందుకే రూపాల్లో అంతటా వారి యొక్క భావాలకు ప్రతీకలైన కాస్త విరూపాలే కనిపిస్తాయి గాని సరూపాలు కనబడవు. అందుకే పై పై రూపాలను చూసి ఆనందించే వారి కంటే భావ యుక్తమైన అంతర్గత సౌందర్యాన్ని ఆస్వాదించే వారికి ఎంతో ఆలోచనను ఆత్మ సంతృప్తిని కలిగించే చిత్రాల సమాహారం ఈ గ్రంధం అని చెప్పవచ్చు.
చివరగా ఏ కళా సృష్టి జరగాలన్నాదానికి ఒక ప్రేరణ కావాలి. ఆ ప్రేరణకు ఒక మూలం కావాలి ఆ మూలానికి ఒక భావం కావాలి, ఆపై దానికి రూపం ఇవ్వాలనే తపన కావాలి ఆ తపన కార్యరూపం దాల్చాలి అలా జరిగినప్పుడే ఆలోచన ఆకారంగా మారుతుంది. సృజన కళా సృష్టిగా రూపొందుతుంది. రూపుదాల్చిన భావం మరల మనిషిలోమరో స్పందన కలిగిస్తుంది. ఆ స్పందించే గుణమే మరలా మరో కళాసృష్టికి దారి తీస్తుంది. చిత్రకారుడి మదిలో జరిగిన అలాంటి ఎన్నో స్పందన ప్రతిస్పందనల నుండి జనించిన దృశ్య సంవేదనే ఈ ‘పెయిన్ ఇన్ బ్లాక్’ .
చిత్రకారులు చిత్రకలాభిలాషులు కొని దాచుకోదగిన ఈ గ్రంధాన్ని ‘యంగ్ ఎన్ వాయిస్’ వారు 102 పేజీలలో ప్రత్యేకమైన సైజ్ తో పాటు అత్యంత క్వాలిటి ఆర్ట్ పేపర్ పై ముద్రించడం జరిగింది. విలువైన ఈ గ్రంధం వెల 300/-రూపాయలు. కావాల్సిన వారు 8008463073 మరియు 9490422145 నంబర్ లకి ఫోన్ లో సంప్రదించి బుక్ ని సొంతం చేసుకోవచ్చు.
–వెంటపల్లి సత్యనారాయణ
(చిత్రకారుడు, కార్టూనిస్ట్, చిత్రకళా రచయిత)
9491378313