కవిత్వానికి కొత్త అర్థం చెప్పిన ‘కవి’…!

“శతృవు – అతనూ పురుషుడే. ఇనా పూజిస్తాను ధూళి నెత్తిన భరిస్తావు.
అందునా లోపలికి బురద తుడుచుకోకుండానే వచ్చేస్తాడు. చీకటి విడిపోయిన గుంబన కక్ష్యలు ఒక దానిపై ఒకటి ఎక్కుతాయి. పాకుడు రాళ్ళకు తెలియని కాదనలేని అసహాయత…
నిద్రలో జార్చిన రక్తమూ.. నవ్వు గడ్డకట్టిన, దేహచిత్రాలు. అందత ఇప్పుడిది పురుషుడే మిగిలిన దేహనగరం’.

ఇది కవిత కాదు కాదు – ప్రముఖకవి శ్రీ బి.ఎస్.ఎం. కుమార్ గారు… కమలా దాస్ గురించి రాసిన వ్యాసం లోని వాక్యాలు.. చాలా మంది కవుల్లో కవిత్వం ఉండదు, కానీ చలం, బుచ్చిబాబు రచనల్లో కవిత్వం తొణికిసలాడుతుంది. అలాగే కుమార్ గారి వచనం రాసినా కవిత్వకాంతిని విరజిమ్ముతుంటుంది. వీరు అనేక కవితా సంపుటాలు, కథలు, నవలలు, వ్యాసాలు రాసారు.

ఇటీవల వీరు ఇంగ్లీష్ లో మూడు నవలలు, తెలుగు లో” సమయకాన్పు “అనే నవల రాసారు. చాలా వేగంగా రాయడం ఆయన ప్రత్యేకత. రొట్టగొట్టుడు వాక్యాలూ, మూసపోసిన పదాలు ఆయన రచనల్లో ఉండవు. ఒక అద్భుతమైన, అపురూపమైన సృజనలోకంలోకి తీసుకువెళ్ళే ఊయలలు ఆయన రచనలు. సాహిత్యం వ్యాపార మైన నేటి కాలంలో ప్రచారంమంటే ఏమాత్రం గిట్టని వ్యక్తి. రచనలోనూ, జీవితంలోనూ నిజాయితీ, నిర్భయత్వం వారి స్వభావం. ఈ ప్రపంచంలో నానాటికీ మరుగుపడిపోతున్న మానవత్వాన్ని గురించి, అంతటా అలముకుంటున్న హింసను గురించి పరితపించే మానవతావాది. గొప్ప ప్రతిభాశాలి, సంతకం అక్కరలేని కవి శ్రీ బి.ఎస్.ఎం. కుమార్ గారిని కలవడానికి హైదరాబాద్ లోని‌ వారి ఇంటికి వెళదాం‌ పదండి…

1. మీ బాల్యం… మీ సాహిత్య నేపధ్యం… రచన ఎలా మొదలైంది?

బాల్యం నుంచి యవ్వనం వరకు నాకొక ఆశీర్వచన ఛాయని ఈ సృష్టి నాకు ఇచ్చింది. బహుశా అదే నన్ను కళాకారుడిని చేసింది.. ఎంతో సహజంగా తమ పాత్ర నిర్వహిస్తూనే అసాధారణత ని చూపించే అనేక మంది స్త్రీల మధ్య ఉభయ గోదావరి జిల్లాలకి ఓ పడవతో కలిపిన వారధినై అపురూపంగా పెరిగాను.
ఉత్సవాలు… సినిమాలు.. నది… నదిపై ప్రయాణాలు.. పంట చేలల్లో నిద్రలు… వేసవిలో తాతయ్య గారి ఇల్లు… తూఫాన్ టైం లో ఇంకా అనేక తీవ్ర పరిస్థితుల్లో ఆలస్యంగా నడిచే రైళ్లలో అనే భాషల మధ్య అనామకంగా రోజల రోజులు తిరుగుతూ పోవడం.. ఇండియా లోని అనేక నైసర్గిక స్థితులని ఒక్క జీవితంలోనే అనుభవించడం. నెలలు నడిచే పాతరోజులపెళ్లి ఏర్పాట్లు… స్థలాల తగువులు… ఆర్ధికంగా చిదిగి పోయినప్పుడు (నాన్న అతి మంచితనంవల్ల వ్యాపారం లో మోసపోయి)… చుట్టూ ఉన్న మనుషులే మారిపోవడాలు… సందు దొరకని ప్రేమలు… కెరీర్ల తాపత్రయాలు… పెళ్లి తర్వాత ఏమీలేని స్థాయి నుంచి ఎదగడం.. అన్నీ చూసాను.

రాత్రిళ్ళు ఇంటి నుంచి నడిచి చేరుకునే అంతర్వేది తీర్ధం.. ఊరి అమ్మవారి గుడి సంబరాలికి చూసిన పద్య నాటకాలు.. తెర కట్టి ఆరుబయట వేసిన సినిమాలు.. నిప్పుల గున్నాలు… తోలుబొమ్మలాటలు.. వీర ముష్టి ఆశీర్వచనాలు… మర్రి చెట్లు… మామిడి తోపులు… కాలువ గట్లు.. టూరింగ్ టాకీసులు… లైబ్రరీ…. College Hostel days….
మొదటిసారిగా పదహారవ ఏడు లో పరిచయమైనా మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి దగ్గర బంధువు వినిపించిన చలం గొంతు… (బాలాంత్రపు రజినీకాంత రావు ఇంటర్వ్యూ TAPE RECORDER LO)… ఆ తర్వాత ఆయన చెప్పిన రచయితలలిస్ట్… చలం…Tagore , శరత్.. వడ్డెర చండీదాస్, బుచ్చి బాబు, ప్రేమచంద్ Tolstoy. Gorkhey, Kamaladas, Savitri etc.

  1. ఎందుకు సాహిత్యమంటే మీరేం చెబుతారు?

ఎందుకు అనే దాన్నించి ఎన్నో ఎత్తుల పైకి చేరి నిలబడగలిగితే అదే సాహిత్యం. మన చుట్టూ ప్రతి విషయానికి వెదుకుతున్న reasonings అద్భుతాల్ని చూడడం మాయం చేస్తున్నాయి. మనకంటూ ఉన్న ఒక ప్రత్యేక మైన ఉనికిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. జీవితాన్ని మనం అర్ధం చేసుకొనే విశాలత్వం లోంచే సాహిత్య ప్రయోజనం అనుభవానికి వస్తుంది.
నిజానికి ప్రయోజనం అనే పదం కేవలం అర్ధం చేసుకోవడానికి తప్ప మరోలా నేనిక్కడ చెప్పడం లేదు. మనం ఏదీ ఎవరికీ వినిపించడం లేదు. మనలో మనం ఓ రాగ ప్రవాహాన్ని వింటూ… ఆ కోటానుకోట్ల స్వర రచనలోంచి ఏదొ ఓ చిన్న చిన్న సంగతులని… పాలు పొంగినప్పుడు పైకి వచ్చినట్లుగా మనము బయటకి చూపించే ప్రత్నం చేస్తున్నాం. అందుకే ఇదెప్పటకీ నిరంతరం.

3. పాపులారిటీ ఆశించక పోవడం వల్లా మీ రచనల ఉనికి నిలబడదని భయం లేదా?
నేనిలా ఉండిపోవడంలో కారణాన్ని ఖచ్చితంగా ఇదేనని చెప్పలేను. తనని తాను పాపులర్ చేసుకోవాలనే దుగ్ధ… ఈనాడు చాలా పక్క దార్లు పట్టేసింది. ఈ ప్రచారాలు… గుర్తింపులు..అవార్డుల చుట్టూ చెప్పుకునే ప్రతిభ స్థాయిలు నాకేం తృప్తి నివ్వవు. ఇంకా మరిన్ని సాహిత్య ప్రయోగాలకి అడ్డంకులని భయపడతాను. నన్ను వెదుక్కుని వచ్చిన వారు.. నా లోపల ఆగి.. నాతో కలిసి వస్తున్నావారు నాకున్నారు.
ఓ వేళా లేకపోయినా… నా లోపల నాకున్న సమస్త విశ్వమూ… దానితో నా ఆత్మ భాషణ ఇప్పటిలో పూర్తి అయ్యేది కాదు. వాటికి ఇంకా ఎన్నో శత సంవత్త్సరాలు కావాలి.

అందుకే ఈ ఏకాంతం నాకు ఆనందమే.

4. స్త్రీ చుట్టూ ప్రధానంగా మీ సాహిత్యం ఉండడానికి కారణం?
బహుశా బాల్యం నుంచి నన్ను బలంగా influence చేసింది వాళ్ళే… ఐనా నా రచనల్లో కేవలం స్త్రీ అన్నట్లుగా ఏదీ ఉండదు. మొత్తంగా life ని ఇచ్చే ప్రయత్నమే చేస్తాను.
స్త్రీ సెంట్రిక్ కానీ సృష్టి రచన అసాధ్యం. ఎన్ని అసాధారణ సైన్స్ ప్రయోగాలు జరిగిన… స్త్రీ ప్రేమలో ఉండే ఓ magical sense ని ఆమె కచ్చితంగా అనుభవించగలదు… పురుషుడికి పంచనూ గలదు. కానీ ఈ అర్హతని స్త్రీ కూడా సాధన క్రమంతోనే అందుకోగలదు. ఇక్కడేది “టేక్ ఇట్ గ్రాంటెడ్'(granted) కాదు.
ఈ సృష్టి కాన్సెప్ట్ చాలా చిత్రమైన కక్ష్యలలో తిరుగుతూ ఉంటుంది. వాటి చుట్టూ ఉండే అనేకమైన ఆకర్షణ.. వికర్షణ శక్తుల క్రమం లోంచి మన ఆలోచన మొదలవుతుంది. అందుకే ఇది ఓ వృత్తాకార చలనంగా… పునరపి చిత్ర రచనగా ఉంటుంది… మనం ఓ పాతదైనా కొత్తని చెబుతున్నట్లు గా ఉంటుంది.

  1. సాహిత్యంలో ప్రయోగం ఏ మేరకు అవసరం?
    పూర్తిగా అవసరమనే నేను భావిస్తాను. ఏ రచయిత అయినా సరే.. తన ముందు రచన నుంచి మరో రచనని రిలీజ్ చేస్తున్నప్పుడు.. ఓ ప్రధానమైన వైవిధ్యత లేకుండా ఉండడం లో ప్రయోజనం లేదు. మనం రోజు నుంచి రోజుకి… వ్యాక్యం నుంచి వ్యాక్యానికి ఎదుగుతూ వెళ్ళాలి… దానికి ప్రయోగం అనివార్యం.

కళాకారుడికి ఉండాల్సిన మొదటి లక్షణం ప్రవాహశీలత… అందరికి అర్ధం కావాలనే బలహీనతని జయించడం. మొదటినుంచి మొత్తం ప్రపంచానికే దిశా నిర్దేశం చేస్తూ వస్తున్న మన సాహిత్య రీతులని గమనించడం. మరింత కొత్తని చేర్చుతూ వెళ్లడం.

  1. మీ సాహిత్యం ఎందుకు చదవాలని అనుకుంటారు… అర్ధం కాక పోయిన?
    ముందు సాహిత్యం ఈ అర్ధం కావడం అనే దశ నుంచి ఎదగాలి. ముందు పాఠకుడి లో జరగాల్సింది ప్లావత… రస దీర్ఘంలో పడి ఓలలాడాలి… కొట్టుకు పోవాలి… రచన చదవడం పూర్తయ్యేసరికి తనకి తాను కొత్తగా కనబడాలి. అదొక మరపురాని అనుభవంగా ఉండాలి… సృష్టి నిండా మనకి అర్ధం కానివి అనేకం ఉన్నాయని నమ్మాలి.
    ఒక రచనకి తన సర్వస్వశం ఇచ్చేయగల ఓ నిర్ణాయక తత్వం… రచయితకి… దానిని గ్రహించే శక్తి దిశగా పాఠకుడు ఎదగాలి. అప్పుడే మరింత ఉత్తమ సాహిత్యం మనుగడ సాధ్యమౌతుంది.

సృష్టి లో ప్రతి క్షణం కోటానుకోట్ల రసాయన విద్వాంసాలూ.. ఎన్నో రెట్లు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. వీటి వెనక ఉండే అంతః సూత్రాన్ని మనం పట్టుకునే ప్రయత్నం చెయ్యాలి. లేదా చేస్తున్న వల్లనైనా కొంచెం ఆగి పరిశీలించడానికి సిద్ధమవ్వాలి.
ఇది నమ్మిన వారికి నా సాహిత్యంతో ఏ పేచీ ఉండదు.

  1. ఇంగ్లీష్ లో రాయాలనుకోవడం ఎందుకు?
    ఇంగ్లీష్ లో రాయాలనుకొన్నది మరో కొత్త flavor ని పట్టుకోగలనా అనేది ఒక ఉద్దేశ్యం ఐతే… మరొకటి.. నాకున్న non-telugu friends కోసం… అసలు నువ్వేం రాస్తుంటావని అదే పనిగా అడగడం.. నాకేదో ఇంగ్లీష్ మీద గొప్ప కమాండ్ ఉందని నేననుకోవడం లేదు. తెలుగులో నేనెప్పుడూ రాయని musings స్టైల్ ని కొంత మేరకు పట్టుకొనే ప్రయత్నం చేసాను.
    మనకి అలవాటైన భాష నుంచి వేరుపడి మరో కొత్త భాషని నేర్చుకోవడం.. సంభాషించడం… పరవశించడంలో అనంతమైన తృప్తి ఉంటుంది.
    ఈ సందర్బంగా నలుగురుకి నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వాళ్ళు శైలజ మిత్ర… శ్రీ రామకవచం సాగర్, సౌమ్య దేచమ్మ, మాకినీడి సూర్య భాస్కర్ గార్లకి….
  2. ప్రత్రికల పట్ల మీకు నిరసన ఏదైనా ఉందా?
    అస్సలు లేదు. కానీ నేను పోటీలకు… ఇన్ని లైన్లో రాయాలి అనే వాటికి చాలా దూరం. ఇంతటి కమర్షియల్ challenges ఊపేస్తున్నా ఈ రోజుల్లో ఇంకా సాహిత్యాన్ని పత్రికల రూపంలో నడపడం చాలా గొప్ప విషయం.
    అనేకానేక మాయ రూపాల మధ్య మనమొక సంతులన జ్ఞాన స్పృహని పొందినట్లుగా అనిపించే కొన్ని క్షణాల నిద్రాణ స్థితిని అందుకోగలగడమే కళ. ఇది నిజానికి ఒక నిర్వచనం కాదు… అనేక నిర్వచనాల మధ్య ఇరుక్కొన్న ఓ ప్రకాశ స్థితి అంతే. అదొక నిర్వికార ఉనికి… పునరపి ఘింకారం. యుగ పర్వాల నిద్రలోని కల.
    ఇటువంటి అనేక ఆలోచనల మధ్య నడిచే నా సాహిత్యం… ముక్కలు చేసి పత్రికలకి ఎట్లా కుదించి పంపాలో నాకు చేతకాదు.
  3. సాహిత్యం లో మీరు గొప్పగా భావించే వ్యక్తులు?
    చలం నా మొదటి ఊపిరి… ఆ తర్వాత అందరూ.. ఆధునికుల్లో… మో… కాశీభట్ల… శ్రీ రామ కవచం సాగర్, రమణజీవి..Lenin, Tripura… రాచకొండ విశ్వనాథ శాస్త్రి… ఓ magical వ్యక్తిత్వం ద్వారా దశాబ్దాల స్నేహం అద్దేపల్లిగారితో… ఈ లిస్ట్ చాలా పెద్దది.
    ఇంకా Silvia Plath కొన్ని రచనలు, Gorkhey… Tolstoy ని చేసిన ఇంటర్వ్యూ, సంజీవ్దేవ్ (Sanjeev Dev) కొన్ని రచనలు, జిడ్డు కృష్ణ మూర్తి, ఓషో, UG, కమలాదాస్ My story, సంగీతం, పెయింటింగ్స్. అనేక భాషల సినిమాలు… వాటి గురించిన రచనలు.

ఇంకా నా ప్రయాణంలో సహాయ పడ్డ, కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన వాళ్ళ లో కొంత మంది ని నేను.. నా బుక్ ‘నిర్మయ మిళీనలు… తెర్చి తెరవని గుమ్మాలు’ లో ప్రస్తావించాను.

  1. మీ సాహిత్యానికి ఏదైనా మూల తత్వ విచారణ ఉందా?
    నన్ను నేను కాపాడుకోగలుగు తున్నానా … లేదా అన్న ఆందోళనే నా సాహిత్యం. ఇది ఎవరిని ఉద్దరించడానికి కాదు. సమాజ గమనానికి అంతకన్నా కాదు.. స్పష్టత లేని అయోమయం మనలని తరుముతున్నప్పుడు… ఇది ఇలాగేనా ? ఇంకేదైనా రహస్య దారిని నేను పట్టుకోలేక పోయానా? అనే ఆందోళన తొలుస్తూ ఉంటుంది.
    చుట్టూ మారుతున్నపరిస్థితులకి… ఘర్షణలకు… విభేదాలకు… అసందర్భ సమీకరణలకు… కారణం లేని ద్వేషాలకు.. మోసాలకు.. చిన్న చిన్న ప్రయాజనాలకే తమ ఆత్మలని అమ్మేసుకొంటుంన్నా కళా కారులకు… వెనక కనిపించకుండా తిరిగే ఆంతరంగిక కారణాలని మనం ఎంత మేరకు పట్టుకోగలుగుతున్నామనే స్పృహ అంత్యంత అవసరం.
    మనలని మనం… లోపలినుంచి పుటం పెట్టుకోవడం.. పరిశీలించుకొంటూ తన్మయులం అవ్వడానికో…. కూలి రాలి పోవడానికో… తిరిగి తిరిగి పుట్టడానికో … మన సృజన మనకి ఉపయోగపడాలి… లేదా ఇంతేనా ఇప్పటి వరకు చేసిందనే బెంగ మనలని ముంచేయడమో జరగాలి.
  2. అస్థిర సంచారం లాగానో.. అసమంజస దుఃఖం లానో .. అర్ధం పాతుకుపోయిన చీకటిలానో మీ వ్యాక్యం ఉందంటే మీరేమంటారు?
    ఇదేదో కాస్త దగ్గరగానే ఉంది. నన్ను పట్టించుకున్న వాళ్ళే అతి తక్కువ మంది. ఏదోకటి.. కనీసం నా రచన చదవడానికి ప్రయత్నించారని ఆనందపడతాను. పట్టించుకొన్న వాళ్ళు … వాళ్ళ ఊపిరిలో భాగం చేసుకున్నంత దగ్గరగా నన్ను చేరదీశారు. నన్ను వ్యతిరేకించిన వారు అంత తీవ్రంగానూ నాతో తలపడ్డారు. దీనిని గనక మనమొక స్వర భాషలో కన్వెర్ట్ చేస్తే వచ్చే గ్రాఫ్ (Graph) నిజంగా మరో చిత్రమైన రచన క్రమాన్ని ఇస్తుందనుకొంటా.. ఏది ఏమైనా నేను నమ్మింది.. నా అనుభవాన్ని కుదిపిన దానిని మాత్రమే నేను ఎప్పుడు రాయడానికి ప్రయత్నిస్తాను. ఇందులో నేను ఏదో దశని చేరుకొన్నాని గాని… ఇంకెవరికో చెప్పడానికి బయలుదేరాలనిగాని నేననుకోను.

    పొరపాటున ఎవరు ఏ కొంచెం రాసిన… దానిని మళ్లీ మళ్లీ చదివి… లోపలికంటా పరిశీలించుకుని.. నన్ను గమినించుకోవడానికి ఆ విమర్శని తీసుకొంటాను. కానీ నా తర్వాత రచనకి దానిలోంచి సలహాలని స్వీకరిస్తానని కాదు.ఆ ప్రేరణ శక్తి తో ఇంకేం కొత్తగా చెయ్యగలననేదే చూసుకొంటాను.

12. ఇప్పుడు కళాకారుల్ని ప్రధానంగా బాధిస్తున్న ఫిలోఫికల్ లేదా భయావహ లేదా సంక్షోభ స్థితులు ఏంటి?
అనేకం… advertisement… పాపులారిటీ… కాస్ట్ అఫ్ లివింగ్.. average ప్రతిభ సరిపోకపోవడం… అన్ని తరుముకు రావడం.. పట్టించుకోకపోవడం…. వేరియేషన్స్… అంచనా వెయ్యలేక పోవడం.. చాల తొందరగా తనకొక గుర్తింపునిచ్చే దారులని వెదకడానికి ఎక్కువ సమయం ఖర్చు పెట్టేయడం. ప్రాంతీయతలు ( Prantheeyathalu)… సమూహాలుగా విడిపోయిన కళాకారుల గుంపులు … ఒక యూనివెర్సల్ థీమ్స్ ని, థాట్ సెన్సుయాలిటీ ని.. ఎక్స్పెరిమెంటల్ ఎబిలిటీని చంపేస్తుంది. ప్రతీ కళాకారుడు తనదైన యూనిక్యూ ఐడెంటిటీ ని తన రచనలలోంచి చేరుకోవడాన్ని నేను చూడాలనుకొంటాను.

ఆర్తి… సత్యం.. ధర్మం.. స్నేహం.. నిజాయితీ… ఇవన్నీ ఇప్పుడు వెర్రిబాగుల తనాన్ని సంతరించుకోవడం. చేతకానివాడిగా చూడడం .
ఒకే రకమైన కార్బన్ కాపీ లాంటి high raise అపార్ట్మెంట్ lifes… భయపెడుతున్న ఈక్వేషన్స్.. మోసపూరితమైన నటన… unsecured economy graphs.. Global effects… restlessness, competitions… మోడరన్ లైఫ్ స్టైల్ అనే updations తో పెరిగే కాంప్లికేషన్స్… వీటి అన్నింటి మధ్యలోంచి లిటరేచర్ ని కాపాడుకొంటూ రావడం దాదాపు అసాధ్యం … అందుకే fast food లాంటి కవిత్వం అంతటా పర్చుకొంది.

  1. ఒక కళాకారుడు సాహిత్యం ద్వారా ఏం సాధించాలనే మీరనుకొంటారు?
    ముందు ఈ భ్రమే పోవాలి.. అప్పుడు మాత్రమే తన నుంచి తన దూరం జరిగిన స్వేచ్ఛాప్రియత్వంతో కూడిన సాహిత్యం వస్తుంది. అనేకానేక ప్రశ్నల మధ్య ఊపిరాడని తనంతో ఒక అన్వేషణ మొదలు పెట్టాలనే కాంక్ష మొదలౌతుంది.
    జీవితం ఒక తెలియని ఒడ్డు నుంచి మరొక తెలియని ఒడ్డుకి చేరుకొనే ఓ ప్రయాణమే తప్ప… దీనికేమి Specific GPS అంటూ లేదు… ఈ వెళ్లాల్సిన దూరాన్ని మనం ఎంత అనుభవించి నడుస్తూన్నామనేదే ముఖ్యం.

జీవితం కేవలం సాధనాల సూత్రం మీద నడిచే యంత్రం కాదు. సాధనాల అంత్య మహత్యం ఆత్మానుగత ఆంతరంగిక సంభాషణ గా ఉంటూ మృతువు ని మించిన ఐహిక సత్యాన్ని పాఠకుడి ముందు నిలపగలగాలి. ఇది ఓ చేరుకొనే క్రమం కాదు… మన లోపల శ్వాస.. నిశ్వాసాలలా ఓ నిరంతరాయ నిరంతరం.

  1. అసలు మీ సాహిత్యానికి ప్రధానమైన వస్తు-రూపాలు, సాంస్కృతిక నేపధ్యం… తాత్విక ధార ఏదైనా ఉందా?
    ఉంది.. స్త్రీ.. ప్రకృతి.. ప్రయోగం.. సూటిగా ఉండడం.. అత్యాధునికత లో కనిపించని కనికరం.సహానుభూతి.. కలుపుగోలుతనం..
    స్పష్ట నిద్రాణలు… మొండి వ్యాక్యాలు.. కనీ కనిపించని ఎదురుదాడులు… నిర్లక్ష్యాలు… పక్కకి జరిపేయడాలు.. అయోమయం.. ఒరిపిడి… విచ్చుకొని చంపేస్తున్న ప్రశ్న వలయాలు.. దండన కీర్తి… అపఖ్యాతి… ఒత్తిడి కొసలకి చుట్టుకొన్న చీకట్లో మీమాంసలు…
    దీప నిర్జునిడిగా ఉండిపోయిన ఇల్లు.. ఏకైక ఐక్యం… సరీ సరిపడని గొంతుక..నిష్ఠ జాగ్రత్తల కడనొప్పి తీవ్రతలు… పోటు… స్తన్య ఏకనీలంలో పడి తోసుకొస్తున్న కాపలాలు… నిరూప కథలు… దూర కలలూ.. నిష్పుర ఐక్య సమీక్షలు… అంత అలానే ఉండిపోయిన నిద్ర దోషాలు.
    నా లోపలి మనిషి రోజు… రోజుకి… పతనం అవుతున్నాడా? అనే భయం.

15. సాహిత్య త్వత్యం… మీ వ్యక్తిగత జీవితం పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది.?
నా జీవితమే… నా సాహిత్యం… నాకు రెండూ వేర్వేరు కాదు. నా జీవితాన్నంతా చిత్రిస్తూ వెళుతున్న… దాన్నంతటినీ నేను బుక్స్ రూపంలో తీసుకు రాలేకపోతున్న. రాసే రాత… బ్రతికే విధానం రెండూ ఒకటే నాకు.

చాల తొందరగా తనకొక గుర్తింపునిచ్చే దారులని వెదకడానికి ఎక్కువ సమయం ఖర్చు పెట్టేయడం. అనేకానేక ప్రశ్నల మధ్య ఊపిరాడని తనంతో ఒక అన్వేషణ మొదలు పెట్టాలనే కాంక్ష మొదలౌతుంది. శాశ్వత సత్యలంటూ ఉండవు.. ధర్మం కొంత మేరకి స్థిర రూపంలోనే తిరుగుతున్న… దానిని నిలబెట్టుకునే క్రమం మనలని తునాతునకలు చేస్తుంది .ఐనా నిలబడటంలోనే కళాకారుడి అసలైన గుణాత్మక వెలుగు పాఠకుడికి చేరుతుంది.
నాకు రోజూ రాయడమే ప్రధానం… ఒకరికి చెప్పుకోవడం.. లేదా రాసిందల్లా పబ్లిష్ అయిపోవాలను కోవడం తక్కువ… అది మరొక కొత్త థాట్ ప్రాసెస్ (process) లోకి దాని నుంచి ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకుపోవడానికి నా రచన ఉపయోగపడుతుందని అనుకున్నప్పుడే నేను ఆ బుక్ ని పబ్లిష్ చేయాలనీ అనుకొంటాను. కానీ ఈ భూమి మీద నా ఉనికి ఉండటమంటే రాస్తూ ఉండటమే… అదే జరగని రోజున ఊరికినే రోజుని గడపడం నేను ఉహించలేను.

  1. ఎందుకు ఆ ప్రత్యేకమైన బాషా… అర్ధం లేని పదాలు…వ్యాక్యానికి… వ్యాక్యానికి సంధి కుదరని కవిత్వం.. అరాచకం కాదా?
    ఒక కొత్త డిక్షన్ నాకు అవసరమైంది… ఒక థాట్ ప్రాసెస్ (process) ని అలాగే అందుకునే… సాహిత్యంగా మారే క్రమంలో నేను ఏం చేయడానికైనా సిద్దమే… ఇక్కడ అర్ధాన్ని దాటి వెళ్లే అనేక విషయాలని.. ఘర్షణల్ని… వాటిలోనుంచి రాలుతున్న అనంత అర్ధాలని… లాలసలని… నిస్సహాయతలని ఓన్ చేసుకోగలిగేతే జరగాల్సిన రససిద్ధి పైనే నా ప్రధానమైన ఫోకస్ ఉంటుంది.

మన లౌకిక అవసరాల్ని దాటి మరింత విశాలంగా ఈ సృష్టిని అర్ధం చేసుకోవాలనుకొన్నప్పుడు మాత్రమే మనం ఒక కొత్త దశని … నిర్మాణాన్ని చేరుకోగలం. లేదంటే అన్ని జీవితాలు ఒకే ఒక stagnation లో పడిన వాసన తప్ప…. ఎన్నో కొత్తగా చెప్పాల్సిన అనుభవాల్ని , ఆనంద విషాదాల ఆటని… ఆ వర్ణ లౌల్యం లోని అనంత మదనాన్ని చెప్పడంలోంచి మనం దూరం జరిగిపోతాం. సాహిత్యంలో మరేం మిగలదు.

  1. ఈ ప్రశ్నలనుంచి మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకొన్నానని మీరనుకొంటున్నారా ?
    లేదు. తనని తాను ఆవిష్కరించుకోవడమనేది మృత్యువు వరకు సాగే ఓ నిరంతర చర్య… దుఃఖ బంధన.. విస్మయ బ్రాంతి (branthi) లోంచి ఒక్కొక్కసారి మనమే ఊహించని కల… రాత… కొంచెం ప్రాధమిక అవగాహన వరకు ఇది.
    ఈ ఆలోచన కూడా అనవసరమే… ఏది దేనిని చేరదు. అనుసంధానించి బడదు. శబ్దించదు… మనలోకి మనలని చేరనివ్వదు. ఐనా ప్రయత్నమే సాహిత్యం. ఎవరూ ఒకరి అరుగు మీద ఏ సాయంత్రమో చేరుకొనే ఓ జోలె తో కూర్చుంటే… వాళ్ళు రాత్రికి వడ్డించిన భిక్షని తీసుకొని.. మర్నాటి వెలుగుకి ముందే తెలియని మరో చోటుని.. వేడుకొంటూ వెళ్లే విధానమే నాది. ఈ నిన్న నాది కాదు.. ఓ రేపు నేనై ఉంటానని నేనెవరికీ చెప్పుకోనూ లేదు… ఐనా ఓ చావు వేడుకకి వడ్డించి… స్మశానంలోకి నన్ను పిలుస్తూనే ఉన్నారు.

ఎప్పటికైనా ఈ సాహిత్య సమూహాలు పట్టించుకొంటాయని ముందు నమ్మేవాడిని… ఇప్పుడు పూర్తిగా అలాంటి ఆలోచనల మీద నమ్మకం పోయింది. నాతో పర్సనల్ గా సంభాషించిన అనేక మంది ప్రముఖులు… నా రచనల గురించి ఏ పత్రికల లో నైనా రాసిన సందర్భాలు చాలా… చాలా… తక్కువ..

నన్ను ఎవరైనా ఇంటర్వ్యూ చెయ్యాలనుకొంటారని నేనెప్పుడూ అనుకోలేదు. అయినా హైమావతి గారు మీరు నన్ను పట్టించుకున్నందుకు… ఇన్ని నెలలు ఎదురు చూసినందుకు మీకు నా కృతజ్ఞతలు.

ఇంటర్వ్యూ: మందరపు హైమావతి (9441062732)

2 thoughts on “కవిత్వానికి కొత్త అర్థం చెప్పిన ‘కవి’…!

  1. మీ ముఖాముఖి చర్చ మిమ్మల్ని పట్టి ఇచ్చింది.హైమవతి గారికి ధన్యవాదాలు.
    ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రశ్నలు,సమాధానాలు వినలేదు.పదేపదే చదువుకోవాల్సిన వాక్యాలు ఉన్నాయి.

  2. ఇంటర్వ్యూ బావుంది. మనసు విప్పి మాట్లాడారు. కదిలించే బాల్యానుభవాలు. ఈ లోకం ఎప్పుడైనా ఆయన రచనల రహస్యం విప్పుతుందని ఎదురుచూస్తాను. సృష్టి ప్రసాదించిన గొప్ప ఆశీర్వచన ఛాయ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap