సమకాలీన పద్య నాటక వినీలాకాశంలో ఒక ధ్రువతార రాలిపోయింది. కానీ ఆ ధ్రువతార పల్లెటి లక్ష్మీ కులశేఖర్ సృష్టించిన పద్య నాటక రచనా కాంతులు పద్య నాటక రంగాన్ని ఎప్పటికీ దేదీప్యమానం చేస్తూనే ఉంటాయి. కడప జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించి, సాధారణ పాఠశాల చదువులు పెద్దగా చదువు కోకపోయినా, తెలుగు పద్య నాటక రచనలో మెలకువలు అధ్యయనం చేసి, పద్య నాటక రచనలో తనదైన ప్రత్యేక ముద్రతో తెలుగు పద్య నాటక రంగంలో ఒక ప్రత్యేక స్థానం సాధించిన కళామతల్లి ముద్దుబిడ్డ పల్లేటి…
కులశేఖర్ గారు జమ్మలమడుగు కు చెందిన తెలుగు ఉపాధ్యాయులు, ప్రముఖ కవి మరియు పాత్రికేయులై నటువంటి దివంగత కమల్ సాహెబ్ గారి శిష్యరికంలో, ఆయన పురాణ కథలపై పట్టు పెంచుకొని, ఆయన సలహాలు తీసుకుని నాటక రచనలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం జరిగింది.
నాటక రచన ప్రవృత్తిగా మొదలుపెట్టి అదే తన వృత్తిగా మలచుకుని నాటక రంగానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు. పద్య నాటక నేటితరం గుర్రం జాషువా పల్లేటి లక్ష్మీ కులశేఖర్ తను అనుసరించే మతం క్రైస్తవం.. కానీ హిందూ పురాణాలు, కావ్యాలు విస్తృతంగా అధ్యయనం చేసి, రామాయణ, భారత ఇతివృత్తాలతో, మరుగున దాగిపోయిన పాత్రలను ఎంచుకొని అద్భుతంగా మలచి తెలుగు పద్య నాటక రంగంలో ఒక ప్రత్యేక వరవడి సృష్టించిన రచయిత పల్లేటి.
కడప సవేరా ఆర్ట్స్ వెంకటయ్య గారి ప్రోత్సాహంతో రామాయణ కథను పంచవటి పేరుతో ఐదు పద్య నాటకాలు రాయడంతో మొదలుపెట్టి అనేక పద్య నాటకాలను రచించి, ఆ నాటకాలకు శతాధిక నందులు సాధించి తెలుగు నాటక రంగ చరిత్రలో చిరస్థాయిగా ఒక ప్రత్యేక స్థానం తనకంటూ ఏర్పరచుకున్న కళారంగ ఆత్మ బంధువు పల్లేటి లక్ష్మీ కులశేఖర్.
అర్ధాంగిపై గౌరవం, ప్రేమతో ఆమె పేరు లక్ష్మీని తన పేరులో చేర్చుకున్న వ్యక్తి. గత సంవత్సరం ఆమె మరణం ఆయనను ఎంతగానో కృంగదీసింది. నాటక రచననే వృత్తిగా ఎంచుకోవడం వలన… దైనందిక జీవిత అవసరాలకు ఇబ్బంది కలగకపోయినా, కుటుంబంలో ఆరోగ్య రీత్యా ప్రత్యేక అవసరాలు ఏర్పడినప్పుడు, పిల్లల వివాహాల సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ… నాటక రచనే నమ్ముకున్న వ్యక్తి.
ఆరోగ్యపరంగా కళారాదన అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ రవి కృష్ణ కొన్ని సందర్భాలలో సహకారం అందివ్వడం, తాము చేయగలిగిన శస్త్ర చికిత్సలు నంద్యాల మధుమణి ఆసుపత్రిలో చేయగలగడం మాకు కలిగిన భాగ్యంగా భావిస్తున్నాం.
ఈ సందర్భంలో కర్నూలు టీజీవి కళాక్షేత్రం తరపున శ్రీపత్తి ఓబులయ్య గారు కర్నూలు రాజ్యసభ సభ్యులు టీ.జీ. వెంకటేష్ గారు వివిధ సందర్భాలలో కులశేఖర్ గారికి అందించిన ఆర్థిక సహకారం గుర్తుచేస్తూ వారి సహృదయతకు వందనాలు తెలుపుతున్నాము.
పల్లేటి లక్ష్మీ కులశేఖర్ రచించిన రావణ ధాన్యమాలి, మృత సంజీవని (కచ దేవయాని కథ) నాటకాలను కళారాధన నంద్యాల సాంస్కృతిక సంస్థ తరఫున రూపొందించి వివిధ ప్రదేశాలలో ప్రదర్శించగలగడం, వారితో కలిసి పని చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం.
సాంఘిక నాటకంలో కూడా అందెవేసిన చేయి. తపస్సు నాటిక సంచలనం సృష్టించింది. ఆనాటికే తర్వాత తిరుపతికి చెందిన నాటక, సినీ కళాకారుడు, రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, వైద్యులు డాక్టర్ శివప్రసాద్ ప్రేమ తపస్సు సినిమాగా తీసి అందులో శ్రీమతి రోజాకు మొదటిసారిగా అవకాశం కల్పించిన విషయం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా ధృతరాష్ట్ర కౌగిలి విశేష ప్రాచుర్యం పొందిన పల్లెటి వారి సాంఘిక నాటిక… ఇంకా అనేక సాంఘిక నాటికలు వారి కలం నుండి జాలువారాయి.
అసంఖ్యాక పురస్కారాలు ఆయన కీర్తి కిరీటంలో కలికి తురాయిలుగా నిలిచి ఆ పురస్కారాలకి వన్నెతెచ్చాయని చెప్పడం అతిశయోక్తి కాదు. హంస, కందుకూరి, ఎన్టీఆర్,నంది, గరుడ, తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారాలు వారు అందుకున్నారు.
పల్లేటి లక్ష్మీ కులశేఖర్ భౌతికంగా ఈనాడు తెలుగు నాటక రంగాన్ని విడిచి పరలోకానికి తరలి వెళ్లినా… ఆయన రచించిన నాటకాలు చరిత్రలో అజరామరంగా నిలిచిపోతాయి.
ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోనఁగఱగిఁపోయె !
జాషువా గారి హరిశ్చంద్ర పద్యం గుర్తుకొస్తున్నది… వారితో కలిసి పని చేసిన సందర్భాలు, పాల్గొన్న కార్యక్రమాలు కళ్ళముందు కదలాడుతూ ఉంటే.. జ్ఞాపకాల దొంతరలను కదిలిస్తూ… అనుబంధం గుర్తుచేస్తూ… కళ్ళు చెమరింప చేస్తున్నాయి.
కళారాధన, నంద్యాల సాంస్కృతిక సంస్థ తరఫున వారికి కన్నీటి నివాళి అర్పిస్తూ… వారి ఆత్మకు శాంతి కలగాలని, ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ.
డాక్టర్ మధుసూదనరావు
డాక్టర్ జి. రవి కృష్ణ.
అధ్యక్ష, కార్యదర్శులు… కళారాదన నంద్యాల.