నాట్య కళాయోగి పామర్తి సుబ్బారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా పామర్తి జీవిత సాఫల్య పురస్కారం నాటకరంగంలో విశిష్టమైన సేవ చేసిన కె.యస్.టి. శాయిగారు ఈ నెల 8వ తేదీ గుడివాడలో అందుకోనున్నారు. గత డబ్సై సంవత్సరాలుగా, నాటక రంగంతో వారికి ఉన్న అనుబంధానికి, చేసిన సేవకు లభించిన గొప్ప గౌరవం ఇది.
1936వ సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన, బాపట్ల సమీపంలోని కంకటపాలెంలో శాయి జన్మించారు. వారి తల్లితండ్రులు శ్రీమతి కాశీ అన్నపూర్ణ, ఆదినారాయణలు. చిన్నతనం నుండే ఆయనలో కళాభిరుచి వెలుగుచూసింది. బాపట్లలోని భావనారాయణ స్వామి కోవెలకు దగ్గరగా, వారి ఇల్లు ఉండేది. ప్రతిరోజూ ఆ దేవాలయంలో జరిగే హరికథల్ని దీక్షతో విని, తానూ అలా హరికథను చెప్పేవాడు.
పిల్లలందరూ ఆ కథల్ని విని ఎంతో ఆనందించేవారు. ఆ రోజుల్లోనే అన్నవరపు శివయ్య అనే నటుడు, శాయిలోని ఆసక్తిని చూసి, ప్రోత్సహించి, రామదాసు నాటకంలో రఘరాముడి వేషం వేయించాడు. ఆ చిన్ననాడే ఆయన మిత్రద్రోహి అనే పేరుతో ఓ నాటిక వ్రాసి, పిల్లందరితో కలిసి ప్రదర్శించాడు. చదువుకునే రోజుల్లో, బాపట్లలోని పూర్వవిద్యార్థి సంఘ వార్షికోత్సవంలో “ఈ ఉత్తరంనాది” అనే నాటిక రచించి ప్రదర్శించారు. ఆ నాటిక చూసిన మాచిరాజు బాలగంగాధర శర్మ అనే గొప్ప దర్శకుడు, శాయిని తన బృందంలోకి తీసుకుని ఎంతగానో ప్రోత్సహించారు. ఇండియన్ నేషనల్ థియేటర్ అనే సంస్థలో శాయి ఎన్నో నాటికలు వ్రాయడం, ప్రదర్శించడం జరిగింది.
1962లో మనదేశంపై చైనా దురాక్రమణ చేసింది. ఆ దురాక్రమణని ఖండిస్తూ, “జననీ జన్మభూమిశ్చ” అనే నాటకం వ్రాసి, ఎన్నో చోట్ల ప్రదర్శించి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసిన దేశభక్తుడు ఆయన. ఆ నాటకంలో ఆయన వేసిన సిపాయి వేషం, ఆయనకెంతో పేరు తెచ్చింది.
కళాకారుడు ఓ సాంస్కృతిక సైనికుడనీ, ఒక ఒక ఆయుధమనీ, దానితో ప్రజాసమస్యల్ని పరిష్కరించవచ్చనీ నమ్మిన కళాకారుడు శాయి. అందుకే ఆయన ప్రజానాట్యమండలిలో రచ్చబండ వంటి నాటిక రచించి, ఎన్నో ప్రదర్శనలు చేసారు.
1955-56 సంవత్సరాలలో, ఆంధ్ర విశ్వకళా పరిషత్ తరపున ఒక కళాబృందంతో ఢిల్లీ వెళ్లి, అఖిలభారత స్థాయి సాంస్కృతికోత్సవాలలో పాల్గొన్నారు. అప్పుడే ఆనాటి భారత రాష్ట్రపతి డా. బాబూ రాజేంద్రప్రసాద్, ఉపరాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆనాటి మన ప్రధాని నెహ్రూ, ఇందిరాగాంధీల వంటి మహామహులు వీరి ప్రదర్శనను చూసి, ఎంతగానో ప్రశంసించారు.
తెలుగు నాటకరంగంతో ఏకమైపోయిన జీవితం ఆయనది. నటుడిగా ఆయనెంతో కీర్తి పొందారు. గురజాడ అప్పారావుగారి కన్యాశుల్కం నాటకంలో “గిరీశం” వేశాన్ని, వందప్రదర్శనలు చేశారు. పాటిబండ్ల ఆనందరావు రచించిన, పడమటిగాలిలో, కోడిపెంట అంజయ్య పాత్రలో ఎనభై ప్రదర్శనలు, శిల్పం నాటకంలో ధర్మయ్యగా నూటయాభై ప్రదర్శనలు… ఇలా ఎన్నో వందలాది ప్రదర్శనలు చేశారు. రచయితగా ఎన్నో నాటికలు, నాటకాలు వ్రాశారు. “కోపం, ఉత్తరం, దొంగపెళ్లి, టులెట్, సుమతి, అసమర్థుని డైరీ, కలిపురుషుడు, పునర్జీవం, భోగిమంటలు, పులీమేకా ఇలా ఎన్నో నాటికలు, నాటకాలు ఆయనలోని రచనా సామర్థ్యానికి ప్రతిబింబాలు.
సాంఘిక నాటకాలతో బాటుగా ఎన్నో చారిత్రక పౌరాణిక నాటకాలలోనూ నటించారు. కె.ఎస్.టి. శాయి. ఎన్నో నాటక పరిషత్తులకు న్యాయనిర్ణేతగా సేవలందించారు కూడా!
అభినయ సమ్రాట్ అనీ, నాటకరంగ కృషీవలుడనీ, రంగవిరించి అనీ, ఎందరో ఎన్నో బిరుదులిచ్చి శాయిని గౌరవించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం, హంస అవార్డ్ తో వారిని గౌరవించింది. వారి జీవితంలో అన్నిటి కన్నా గొప్ప విషయం, వారెంతో మంది రచయితల్ని, దర్శకుల్ని, సాంకేతికుల్ని, నటీనటుల్ని ప్రోత్సహించారు. తన కళాప్రతిభను, ఎందరికో పంచిపెట్టి, వారిని గొప్పవాళ్లుగా తీర్చిదిద్దారు. నేటికీ దిద్దుతున్నారు.
నాయుడు గోపి, భారతుల రామకృష్ణ వంటి ఎందరో శిష్యులు ఈనాడు నాటకరంగంలో గురువుకి తగ్గ శిష్యులయ్యారు. ఇంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది?
-వాడ్రేవు సుందర్రావు
పామర్తి జీవిత సాఫల్య పురస్కార గ్రహీత
శ్రీ కె ఎస్ టి సాయి కి
*కళాభివందనములు*
పామర్తి సుబ్బారావు కళారంగ ధన్యజీవి