‘నాట్యకళాయోగి’ పామర్తి సుబ్బారావు

నేడే నాట్యకళాయోగి పామర్తి వర్ధంతి…!! ఆ మహనీయునకిదే నా ప్రణతి..!!

రంగస్థల కళాకారులకు పుట్టినిల్లు అయిన గుడివాడ పట్టణం (ప్రాంతం) నుంచి, నాటి నాటక రంగంలో, అక్కినేని నాగేశ్వరరావు, ఎన్.టి. రామారావు, కైకాల లాంటి ఎందరో కళాకారులు నటనలో ఉజ్వలస్థాయికి చేరి నటనా పరంగా కీర్తిశిఖరాలను అందుకున్నారు. ఆ కోవలో ప్రముఖ రంగస్థల కళాకారుడు దివంగత పామర్తి సుబ్బారావు గారిని కూడా ప్రముఖంగా పేర్కొనాలి, బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీల్లో మద్రాసు రాష్ట్రం నుంచి గోల్డ్ రింగ్ సాధించిన అగ్ర క్రీడాకారులు…పామర్తి…

రంగస్థల నటులు, దర్శకులు, క్రీడాజారులు పామర్తి సుబ్బారావుగారు 1922, సెప్టెంబర్ 8న శ్రీరాములు, మాణిక్యాంబ దంపతులకు గుడివాడలో జన్మించారు. చిన్నప్పటి నుంచి నాటక ప్రదర్శనల పట్ల ఆసక్తివున్న సుబ్బారావు, తన సహచరులైన సూరపనేని ప్రభాకరరావు, హెచ్.వి. చలపతిరావు, దాసరి తిలకం, పువ్వుల అనసూయ మొదలైన వారితో కలిసి నాటకాలు వేయడం ప్రారంభించారు. సాంఘిక,జానపద నాటకాలలో అద్వితీయ నటనను ఆయన ప్రదర్శించారు. హాస్య, కరుణ రసాలను అత్యద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకుల మనస్సుల్లో చిరంజీవిగా తన బృందంతో ‘తెలుగుతల్లి’ నాటకాన్ని విస్తృతంగా ప్రదర్శించారు. 1939లో తెలుగుతల్లి నాటకాన్ని విజయవాడలో ప్రదర్శించినప్పడు తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి ముగ్ధులై పామర్తికి ‘హాస్యరత్న’ బిరుదు ప్రదానం చేసి ఆశీర్వదించారు. ‘పల్లెపడుచు’లో గంగులు పాత్ర ‘సుల్తానీ’లో పరమానందం, ‘ఎవరు దొంగ’లో దొంగ వంటి పాత్రలే పోషించారు. గుడివాడలోనే పుట్టిన ఆయన మున్సిపల్ కార్యాలయంలో బిల్ కలక్టరుగా పని చేస్తూ నటనను తపస్సుగా భావించారు. రాష్ర సరిహద్దుల్ని దాటి విజయబావుటా ఎగురవేశారు.

పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డాక్టరు అక్కినేని నాగేశ్వరరావు సైతం పామర్తి సుబ్బారావుతో కలిసి తెలుగుతల్లి నాటకంలో స్త్రీ పాత్ర ధరించారు.
బొబ్బిలియుద్ధం, సత్యహరిశ్చంద్రీయం, మహాకవి కాళిదాసు, చంద్రగుప్త, రంగూన్ రౌడీ మొదలైన పద్య నాటకాలను ప్రదర్శించారు. తన నాటకారంగ సహచరుని మరణానంతరం ఆ మిత్రుని పేరిట “శ్రీ ప్రభాకర నాట్యమండలి” సంస్థ పేర అనేక ప్రదర్శనలు ఇచ్చారు. పినిశెట్టి శ్రీరామమూర్తి రచించిన ‘పల్లెపడుచు’ నాటకంలో గంగులు పాత్ర అద్భుతంగా పోషించేవారు 1951 లో తెనాలిలో జరిగిన పోటీలలో ఆత్రేయ రచించిన ఎవరు దొంగ నాటికను ప్రదర్శించి ఉత్తమ ప్రదర్శనకు, నటనకు బహుమతులందుకున్నారు. ప్రముఖ కళాకారులైన కైకాల సత్యనారాయణ, పుష్పకుమారి, రేడియో ఏకాంబరం, జాలాది రాజారావు, జి.వి. ప్రసాదరావు, నిర్మలమ్మ, హేమలత, అమ్ముల పార్వతి మొదలైనవారు పామర్తి శిక్షణలో నటనను నేర్చుకున్నారు. పామర్తి దర్శకత్వం వహించిన ఆరు స్త్రీ పాత్రలున్న ‘చావకూడదు’ నాటిక ఆంధ్ర నాటక కళాపరిషత్తు నాటక పోటీలో ఉత్తమ నటి, ద్వితీయ ఉత్తమ ప్రదర్శన బహుమతులను అందుకుంది.వేలూరి శివరామ శాస్త్రి రచించిన రేడియో నాటికను ప్రదర్శనకు అనుగుణంగా రాసి, అందులో పరమానందం పాత్రలో నటించారు. 1961లో నాటక కళాపరిషత్తులో ‘సుల్తానీ’ నాటికను మనోజ్ఞంగా ప్రదర్శించడం, దానికి ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకత్వం బహుమతులు గెలుచుకోవడం జరిగింది. సుల్తానీ పామర్తి నట జీవితంలో ఒక మైలురాయిగా నిలిచింది.

సినీనటుడు కైకాల సత్యనారాయణ పామర్తి శిష్యరికంలోనే నటనకు మెరుగులు దిద్దుకున్నారు. రంగస్థలం పైనా,ఆకాశవాణి (రేడియో) లోనూ పామర్తి చక్కని నటనను అందించారు. ఏ పాత్ర అయినా దానిని అర్థం చేసు కుని చక్కని హావ భావాలతో రక్తిక ట్టించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.
పామర్తి పేరు వినగానే సుల్తానీ, తెలు గుతల్లి, కళ్లు, రంగూన్ రౌడి, పల్లె పడుచు, వంటి ప్రముఖ నాటకాలు వాటిలో వివిధ పాత్రలలో ఆయన చేసిన అద్వితీయ నటన నాటకాభిమానులకు గుర్తుకొస్తాయి.
అజరామరమైన ఆయన కీర్తిబావుటాకు నిదర్శనంగా నిలుస్తాయి. నట ప్రభాకరుడిగా ఆబాలగోపాలాన్ని అలరించిన పామర్తి 2004 జనవరి 28న నటరాజులో ఐక్యమయ్యారు. ఆ కళాకారుడి నటనా సేవలకు గుర్తుగా ఆయన నివసించిన వీధికి ‘పామర్తి సుబ్బారావు వీధి’ అని పేరు పెట్టడం, తన శిష్యుడైన కైకాల సత్యనారాయణ పేరిట ఏర్పడిన కళామందిరంలో పామర్తి కాంస్యవిగ్రహాన్ని ఆవిష్కరించడం గుడివాడ కళాకారులు చేసుకున్న అదృష్టం. గుడివాడ నాటక చరిత్రలో సుబ్బారావుది మరువ లేని అధ్యాయం.

సన్మానాలు – పురస్కారాలు
1991లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంల ‘గౌరవ పురస్కారం’
1993లో అక్కినేని కళాపీఠం పురస్కారం
1994లో ఆంధ్ర నాటక కళా పరిషత్తు పురస్కారం
1997లో అంబేద్కర్ జీవన సాఫల్య పురస్కారం
1997లో కళాజగతి రంగస్థల పురస్కారం
1999లో శ్రీకళానికేతన్ (హైదరాబాద్) జూలూరి వీరేశలింగం కల్చరల్ అవార్డు

నేడు నట కళాయోగి శ్రీ పామర్తి సుబ్బారావు శతజయంతి ని వారి మనుమలు..మట్టా రాజా, యుగంధర్ లు, స్థానిక కళాకారులు, నటులు, పామర్తి శిష్యబృందం, సాహితీవేత్తలు, స్థానిక కైకాల సత్యనారాయణ కళామందిర ప్రాంగణము వైభవంగా జరిపారు.. నేడు పామర్తి వారి 22 వ వర్ధంతి నిర్వహిస్తున్నారు.
గుడివాడ కళారంగానికే దిగ్గజం..అలనాటి క్రీడా రంగంలో గుడివాడ కీర్తిని ఎగరేసిన ధ్వజం… కీ:శే: శ్రీ పామర్తి సుబ్బారావు గారికి నా కళాంజలులు ఆర్పుస్తూ నివాళుల ఆర్పిస్తున్నాను.

నూలు సాంబశివరావు

Share via
Copy link
Powered by Social Snap