వేణువై వచ్చి నింగికెగసిన పర్వీన్ బాబి

ఆమె పేరు సినీ పరిశ్రమకు తెలియకముందే అద్భుతమైన మోడల్ గాళ్ గా సౌందర్యారాధకులకు చిరపరిచితమే. అది ప్రచార ప్రపంచానికి బాగా అవసరమైన పేరు. సినిమా ప్రపంచమంటే ఆమె పెద్దగా పట్టించుకోలేదు. కానీ మోడల్ రంగంలో ఆమె నిష్ణాతురాలు. అయితే విధి ఆమెను బాలీవుడ్ చిత్రరంగానికి చేరువచేసింది. సినిమాలో నటించమని దర్శకనిర్మాత బి.ఆర్. ఇషారా ఆహ్వానం పలికితే కాస్త విస్తుపోయింది. నాగి ఎంటర్ ప్రైజెస్ సమర్పణలో బి.ఆర్.ఐ ఆర్ట్స్ పతాకం మీద ఇషారా నిర్మించిన ‘చరిత్ర’ (1973) సినిమాలో ఆమెను హీరోయిన్ గా ప్రవేశపెడతానంటే కాదనలేకపోయింది. ఆ సినిమా టైటిల్ క్రెడిట్స్ లోనే ఆమె పేరు కింద ‘హాటెస్ట్ డిస్కవరీ’ అని పేర్కొనడాన్ని బట్టి ఆమె మోడల్ రంగంలో ఎంతటి విలువగల తారో ఊహించవచ్చు. సినిమాలో విధి వంచితురాలయ్యే ఆమె పాత్ర కూడా భవిష్యత్తులో ఆమె అనుభవించబోయే భావి జీవితానికి అద్దంపట్టేలా వుంటుంది. ‘దీవార్’, ‘అమర్ అక్బర్ ఆంథోనీ’, ‘నమక్ హలాల్’, ‘సుహాగ్’ వంటి చిత్రాలద్వారా హిందీ చిత్రసీమలో సౌందర్యదేవతగా ఒక వెలుగు వెలిగిన ఆమె తెరవెనక జీవితం అంధకార బంధురం. దారీతెన్నూ లేని ఆ జీవితం వెనుక ఎన్నో అగాధాలు, ఆక్రోశనలు. ఒంటరిగా పోరాడిన ఆమె జీవితాన్ని ఒక కథగా మలిస్తే మంచి సినిమా అవుతుంది. దశాబ్దకాలంపాటు బాలీవుడ్ పరిశ్రమ ఆమె వెంట పరుగులు పెట్టింది. ఆమె నటించిన ప్రతి చిత్రం అద్భుత విజయాలను అందించింది. జీనత్ అమన్ తో నంబర్ వన్ స్థానానికి గట్టి పోటీ ఇచ్చింది. 1976లో ‘టైమ్’ అంతర్జాతీయ పత్రిక కవర్ పేజీ మీద ముద్రణకు నోచుకున్న తొలి భారతీయ ఫోటో ఆమెది కావడం, పర్వీన్ బాబి ఎంతటి విలువగల తారో బేరీజు వేయవచ్చు. అటువంటి పర్వీన్ బాబి కోసం అర్రులు చాచిన పరిశ్రమే ఆమెను దూరంగా విసిరేసింది. ఆమె అందంతో ఎంతోమంది లాయర్లు, ప్రతినిధులు, నిర్మాతలు సొమ్ముచేసుకున్నారు. ఆ సౌందర్య దేవతే పర్వీన్ బాబి. 55 ఏళ్ళకే తనువు చాలించిన ఆ అందాలరాశి వర్ధంతి జనవరి 20న జరుగుతున్న సందర్భంగా ఆమె జీవనరేఖలు పరిశీలిద్దాం….

బాలీవుడ్ కి రాకముందు…

పర్వీన్ బాబీబ్ గుజరాత్ లోని జూనాగడ్ లో ఒక ముస్లిం కుటుంబంలో 4 ఏప్రిల్ 1949 న జన్మించింది. తండ్రి వలీ మహమ్మద్ ఖాన్ బాబి జూనాగడ్ నవాబు వద్ద కార్యనిర్వాకుడుగా వుండేవారు. తల్లి జమాల్ బక్తే బాబి గృహిణి. పర్వీన్ వారి తల్లిదండ్రులకు ఏకైక సంతానం. పైగా వారికి పెళ్ళయిన పద్నాలుగేళ్ళ తరవాత జన్మించిన అపురూప సంతతి. పర్వీన్ కు పదేళ్ళ వయసున్నప్పుడే తండ్రి మరణించాడు. అహమ్మదాబాద్ లోని మౌంట్ కార్మెల్ హైస్కూలులో విద్యనభ్యసించి, సెయింట్ జేవియర్ కళాశాల ద్వారా ఇంగ్లీష్ సాహిత్యంలో బ్యాచెలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పుచ్చుకుంది పర్వీన్. 1972 లో పర్వీన్ బాబి మోడలింగ్ వృత్తిలోకి దిగింది. మోడలింగ్ వృత్తిలో ఉజ్వలంగా ప్రకాశిస్తూ వుండగా బాలీవుడ్ నుంచి ఆమెకు తెరవేలుపుగా వెలిగే పిలుపొచ్చింది.

అందానికి బంధం బాలీవుడ్…
1973లో దర్శకనిర్మాత బి.ఆర్. ఇషారా సొంత బ్యానర్ మీద ‘చరిత్ర’ అనే చిత్రాన్ని నిర్మించాలని కొత్తవాళ్ళను హీరో, హీరోయిన్ గా ఎంపిక చేశాడు. ఆరోజుల్లో మంచి క్రికెటర్ గా క్రేజ్ సంపాదించిన సలీం దురానీ ని హీరోగా, మోడలింగ్ రంగంలో కొత్తపుంతలు తొక్కుతున్న సెక్స్ సింబల్ పర్వీన్ బాబీని హీరోయిగా ఎంపిక చేశారు. గతంలో ఇషారా నిర్మించిన ‘చేతనా’ చిత్రానికి ఇది పొడిగింపు వంటిది. అయితే పర్వీన్ బాబి అహమ్మదాబాద్ లో అప్పుడు బి.ఎ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ముందు సినిమాల్లో నటించడం ఇష్టం లేకున్నా పర్వీన్ బాబి ఆ సినిమాలో నటించక తప్పలేదు. సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కానీ, పర్వీన్ బాబి విప్పారిన కళ్ళతో సెక్స్ సింబల్ గా పేరుతెచ్చుకుంది. అప్పుడే దర్శక నిర్మాత కిషోర్ సాహు పర్వీన్ ని ‘దుయే కి లకీర్’ (1974) అనే సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. రమేష్ అరోరా పర్వీన్ సరసన హీరోగా నటించిన ఈ సినిమా కూడా ఫ్లాప్ చిత్రాల జాబితాలో చేరింది. అందులో వాణి జయరాం, నితిన్ ముఖేష్ ఆలపించిన “తేరే ఘాయిల్ సి ఘేహరీ ఆంఖో మే” అనే పాట బాగా పాపులర్ అయింది. తను నటించిన రెండు సినిమాలు ఫ్లాపులైనా ఈ పాలబుగ్గల సుందరి వెంటవెంటనే తొమ్మిది సినిమాల్లో బుక్కయింది. వాటిలో రాజ్ తిలక్ దర్శకత్వంలో నిర్మించిన ’36 ఘంటే’ లో హీరో రాజకుమార్ కు చెల్లెలి పాత్రలో నటించింది. ఆ సినిమా ఫ్లాప్ అయింది. అయితే 1975లో అమితాబ్ బచన్ హీరోగా నటించిన రవి టాండన్ త్రిల్లర్ చిత్రం ‘మజబూర్’ (తెలుగులో ‘రాజా’) లో పర్వీన్ బాబి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో లక్ష్మీకాంత్-ప్యారేలాల్ స్వరపరచిన “ఆద్మీ జో కెహతా హై, ఆద్మీ జో సున్తా హై”, “దేఖ్ సకతా హూ మై కుచ్ భీ హోతే హుయే” పాటలు సూపర్ హిట్లు గా మారుమోగాయి. 1975లో మరొక సూపర్ హిట్ చిత్రం ‘దీవార్’ (తెలుగులో మగాడు) అమితాబ్ బచ్చన్ కే కాకుండా హీరోయిన్ గా పర్వీన్ బాబి కి మంచిపేరు తెచ్చిపెట్టింది. యష్ చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రెండవ జంటగా శశికపూర్-నీతుసింగ్ నటించారు. సలీం-జావేద్ రచన చేసిన ఈ సినిమాకు దిలీప్ కుమార్ ‘గంగా జమునా’, మెహబూబ్ ఖాన్ ‘మదర్ ఇండియా’ సినిమాలు స్పూర్తిగా నిలిచాయి. ఈ సినిమాకు ఆరు ఫిలింఫేర్ బహుమతులు వచ్చాయి. తరవాత రవికాంత్ నగాయిచ్ దర్శకత్వంలో వచ్చిన ‘కాలా సోనా’ (1976)లో ఫిరోజ్ ఖాన్ కు పర్వీన్ జంటగా నటించింది. ఆపై ఎస్. రామనాథన్ దర్శకత్వంలో నిర్మించిన ‘రంగీలా రతన్’ లో రిషికపూర్ సరసన, నరేష్ కుమార్ చిత్రం ‘మజ్దూర్ జిందాబాద్’, ‘భన్వర్’, ‘మామా భాంజా’ సినిమాల్లో రణధీర్ కపూర్ సరసన పర్వీన్ నటించినా అవి అంతగా విజయవంతం కాలేదు. అదే సమయంలో ఆమె నవకేతన్ సంస్థ కోసం విజయానంద్ దర్శకత్వం వహించిన ‘బుల్లెట్’ (1976) చిత్రంలో దేవానంద్ సరసన హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా కూడా ‘మిస్ ఫైర్’ అయింది. 1977లో మన్మోహన్ దేశాయ్ దర్శక నిర్మాతగా తొలిప్రయత్నంగా సమర్పించిన ‘అమర్ అక్బర్ అంథోని’ (తెలుగులో రామ్ రాబర్ట్ రహీం)సినిమాలో అమితాబ్ కు జంటగా పర్వీన్ బాబి నటించింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో పర్వీన్ బాబి సూపర్ స్టార్ స్థాయికి ఒక్కసారిగా ఎగబ్రాకింది. ఇందులో ముఖేష్, రఫీ, కిశోర్ కుమార్ , లతామంగేష్కర్ అందరూ కలిసి పాడిన “ఓ హమ్ కో తుమ్సే హో గయా హై ప్యార్” సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఈ పాటలో ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు కలిసి నటించడం విశేషం. “మై నేమ్ యీజ్ ఆంథోని గోన్సాల్విస్” పాటను పర్వీన్ బాబి, అమితాబ్ మీద చిత్రీకరించారు. పర్వీన్ బాబి ఒక గ్లామర్ కలిగిన సెక్స్ సింబల్ నటిగానే బాలీవుడ్ వుపయోగించుకుంది కానీ ఆమెలో వున్న నటనకు అవకాశం ఇవ్వలేదు. అమితాబ్ బచన్ తో పర్వీన్ ఎనిమిది సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఈ ఎనిమిది సినిమాలు సూపర్ హిట్లు కావడం విశేషం. వాటిలో ‘సుహాగ్’ (1979), ‘కాలా పత్తర్’ (1979), ‘నమక్ హలాల్’ (1982) చిత్రాలను ముఖ్యంగా చెప్పుకోవాలి. సంజయ్ ఖాన్ సరసన నటించిన ‘చాంది సోనా’ (1977), ధర్మేంద్ర సరసన ‘జాని దోస్త్’ (1983) చిత్రాలు బాగా ఆడినవే. పర్వీన్ బాబి హేమామాలిని, రేఖా, జీనత్ అమన్ లకు పోటీగా నిలిచి విజయవనతమైన హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. పర్వీన్ నటించిన చివరి చిత్రం శతృఘ్న సిన్హా తో నటించిన ‘ఇరాదా’ (1991).

Parveen babi

సెక్స్ సింబల్ గా పేరు తెచ్చుకొని…

జీనత్ అమన్ కు పర్వీన్ బాబీకి కాస్త పోలికలు ఉండడమే కాకుండా ఇద్దరూ సెక్స్ సింబల్స్ గానే బాలీవుడ్ సినిమాల్లో పోటీ పడ్డారు. ‘క్రాంతి’ (1981) సినిమాలో హీరోయిన్ హేమామాలిని. అయినా పర్వీన్ బాబి పాత్రకు మంచి పేరొచ్చింది. అలాగే ‘షాన్’ చిత్రంలో సునీత పాత్రలో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. తరవాత 1983 లో పర్వీన్ బాబి ఆశ్చర్యకరంగా తెరమరుగైంది. ఆమె ఎక్కడున్నదో అనే వివరాలు కూడా తెలియనీయకుండా జాగ్రత్తపడింది. అండర్ వరల్డ్ డాన్ల వద్ద బందీ అయిందేమోననే వార్తలు కూడా బయటకు పొక్కాయి. పర్వీన్ పోషించిన పాత్రలన్నీ ఇంచుమించు పాశ్చాత్య నాగరికతా ప్రభావమున్నవే కావడం విశేషం. ఆమె ఎప్పుడూ చీర ధరించి కనపడలేదు. ‘మేరా దేశ్’ చిత్రం తో తనకీ జీనత్ అమన్ కి పోటీ పెరగడంతో వెస్ట్రన్ డ్రస్సుల్లోనే ఎక్కువగా కనపడేది. ఆమె సెక్స్ సింబల్ గా పేరు తెచ్చుకునేందుకు ఇది ఒక కారణంగా చెప్పవచ్చు. పర్వీన్ బాబి పది సంవత్సరాలపాటు బాలీవుడ్ లో చలాకీ పాత్రలు ధరిస్తూ సుమారు యాభైకి పైగా సినిమాల్లో నటించింది. ‘నమక్ హలాల్’ చిత్రంలో పర్వీన్ బాబి మీద చిత్రీకరించిన “జవాని జానేమన్”, “రాత్ బాఖి బాత్ బాఖీ”; ‘షాన్’ చిత్రంలో చిత్రీకరించిన “ప్యార్ కరనే వాలే”; ‘క్రాంతి’ లో చిత్రీకరించిన “మారా తుమ్ కా” వంటి మోడరన్ పాటలు యువ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. పర్వీన్ బాబి ‘టైమ్’ అంతర్జాతీయ మాగజైన్ మాత్రమే కాకుండా ఫిలింఫేర్, స్టార్ డస్ట్, ఫెమినా, స్క్రీన్ వంటి పత్రికల్లో ముఖపత్ర సుందరిగా అనేకసార్లు కనిపించి తన ఐడెంటిటీ ని నిలుపుకుంది. జూలై 30, 1983 న పర్వీన్ బాబి భారత దేశం వదలి తన స్నేహితురాలు వాలేన్టిన్ తో కలిసి ఆధ్యాత్మిక గురువు జిడ్డు కృష్ణమూర్తి తో అనేక దేశాలు పర్యటించింది. తరవాత కాలిఫోర్నియాలో ఎక్కువకాలం గడిపింది. 1984 ఏప్రిల్ 7 న కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సరైన వ్యక్తిగత ఋజువులు చూపనందుకు, అనుమానాస్పదంగా వ్యవహరించినందుకు ఆమెను బేడీలు వేసి ముప్పై రోజులు మానసిక చికిత్సాలయంలో ఉంచారు. భారతీయ దౌత్య కార్యాలయ అధికారుల ప్రమేయంతో ఆమెను వదలిపెట్టారు. తరవాత పర్వీన్ బాబి 1989లో భారత్ కు వచ్చింది. ఆమె బొంబాయి విమానాశ్రయంలో దిగినప్పుడు ఎవరూ గుర్తుపట్టలేదు. అందుకు కారణం ఆమె విపరీతమైన బరువు పెరిగిపోవడమే! ఆమెను మానసిక వ్యాధి ఆవరించిందని పత్రికలు రాయడంతో తనపై కిట్టనివాళ్ళు అపనిందలు వేసి అసత్యాలు వ్యాప్తి చేస్తున్నారని, తనను పిచ్చిదానిగా చిత్రీకరించి ఆస్తిపాస్తులు కాజేయాలని చూస్తున్నారని బహిరంగ ప్రకటన చేసింది. దాంతో ఆమెకు సన్నిహితమైన స్నేహితులే కాదు, బంధువులు కూడా దూరం జరిగారు.

వ్యక్తిగతం…

పర్వీన్ బాబి చాలా చిక్కుల్లో చిక్కుకుంది. ముఖ్యంగా అమెరికన్ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ప్రిన్స్ చార్లెస్, రాబర్ట్ రెడ్ ఫోర్డ్, ఆల్ గోరె వంటి అత్యున్నత పదవిలో వున్నవారు తనను శారీరికంగా వాడుకొని వదిలేశారని నిందలు వేసింది. మిగతా వారిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ కు చెందిన దౌత్యవేత్తలు, సెంట్రల్ ఇంటలిజెన్స్ కె.జి.బి. లకు చెందిన ఉన్నతాధికారులు తనని వాడుకొని వదిలేసినట్లు ప్రచారం చేసింది. కోర్టులో వీరందిరిమీద కేసులు బనాయించింది. వాటితో ఆమె లాయర్లు బాగుపడ్డారుకానీ, కేసులన్నీ వీగిపోయాయి. కేవలం మానసిక రుగ్మతకు గురై ఈ విధంగా మాట్లాడుతోందని బాలీవుడ్ వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. పర్వీన్ బాబి అవివాహితురాలు. 55 ఏళ్ళ వయసులోనే మధుమేహ వ్యాధి ముదిరి బ్రహ్మచారిణిగానే ఆమె మరణించింది. ఆమెకు దర్శక నిర్మాత మహేష్ భట్ తో వివాహేతర సంబంధాలు వున్నాయని పత్రికలు రాశాయి. అంతే కాకుండా నటులు డానీ డెన్ జోంగ్పా, కబీర్ బేడి, అమితాబ్ బచన్ లతో శారీరక సంబంధాలు వున్నట్లు వదంతులు ఉండేవి. పైగా ఎనిమిది సినిమాల్లో ఆమె పక్కన హీరోగా నటించిన అమితాబ్ బచన్ ‘సూపర్ ఇంటర్నేషనల్ గ్యాంగ్ స్టర్’ అని, అతని అనుచరులు తనని కిడ్ న్యాప్ చేసి ఒక ద్వీపానికి తీసుకెళ్ళి తన చెవి వెనక ఒక ట్రాన్స్ మిటర్ చిప్ పెట్టి ఆపరేషన్ చేయించారని, తరవాత ఆమెను చంపించేందుకు పథకం రచించాడని, దాంతో భయాందోళనలకు గురైనానని అమితాబ్ మీద పర్వీన్ అభియోగం మోపింది. అందుకు రుజువుగా తన చెవి కింద వున్న కత్తిగాటును కూడా చూపింది. అలాగే రాజేష్ ఖన్నా తో కూడా తనకు సంబంధాలను అంటగట్టారని ఒకసారి వాపోయింది. 1987లో మహేష్ భట్ నిర్మించిన ‘అర్థ్’ చిత్ర కథా నేపథ్యం పర్వీన్ బాబి స్వీయకథ అని, ఆమెతో తనకుగల వివాహేతర సంబంధాలు అందులో ప్రధాన కథాంశంగా తీసుకున్నారని చెబుతుంటారు. అందులో స్మితాపాటిల్ పర్వీన్ పాత్రను పోషించగా, కులభూషణ్ ఖర్బందా మహేష్ భట్ పాత్రలో నటించాడు. తరవాత పర్వీన్ మరణాంతరం 2006 లో మహేష్ భట్ ‘వో లమ్హే’ (ఆ క్షణాలు) అనే చిత్రాన్ని నిర్మించాడు. కష్టకాలంలో తనను అన్నివిధాలా ఆదుకున్న ఒకవ్యక్తితో కుదిరిన వివాహేతర సంబంధం వలన మానసిక రుగ్మత, అస్వాభావిక ప్రవర్తన, అసాధారణ భాషణం వంటి వింత వ్యాధితో బాధపడుతూ వుండే పాత్రను అందులో హీరోయిన్ కి ఆపాదించే నేపథ్యంతో నిర్మితమైన సినిమా ‘అర్థ్’. తనతో కాలం గడిపిన ఒక మహిళకు ఇచ్చిన నివాళి ‘అర్థ్’ సినిమా అని మహేష్ భట్ ప్రకటించడం పర్వీన్ తో తనకుగల సబంధాలకు బలమిచ్చినట్లయింది. మొహిత్ సూరి దర్శకత్వం వహించిన ఆ సినిమా కు కథా రచన మహేష్ భట్ చేయడం విశేషం. అందులో పర్వీన్ బాబి పాత్రను కంగనా రనౌత్ పోషించింది. మహేష్ భట్ పాత్రను షైనీ అహుజా పోషించారు. 30 మంది విశేష వ్యక్తులమీద తనను చంపేందుకు పథకం పన్నారని లాయర్ల ద్వారా కేసులు వేసి పర్వీన్ డబ్బు ఖర్చు చేసింది. సాక్ష్యాధారాలు లేని ఆ కేసులన్నీ వీగిపోయాయి. ఎప్పుడైనా పాత్రికేయులు ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు వస్తే తనవద్ద వున్న ఆహారాన్ని తినమని, పానీయాలు తాగమని నిర్బంధించేది. అందులో విషంవంటి పదార్ధాలు కలపలేదని నిర్ధారించుకున్న తరవాతే పుచ్చుకొనే స్థితికి ఆమె భయాంధోళనలు చేరుకున్నాయి. అంతటి మానసిక రుగ్మతకు దిగజారింది. పాత్రికేయులను ‘అమితాబ్ ఏజంట్లు’ అని సంబోధించేది. తనతో ఎవరు మాట్లాడినా వాటిని రికార్డు చేసే బలహీనతకు దిగజారింది. 2002 లో నటుడు సంజయ్ దత్ మీద ప్రత్యేక కోర్టులో అతనికి 1993 బొంబాయి పేలుళ్ళ కేసులో ప్రమేయమున్నట్లు ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. 1990 తరవాత ముస్లిం మతాన్ని వదలి క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. సినిమా సాంగత్యం త్యజించాక సంగీతం, పెయింటింగ్, సాహిత్యం, ఫోటోగ్రఫీ, పియానో నేర్చుకోవడం వంటి పనులమీద ధ్యాస పెంచుకుంది. పత్రికలకు కొన్ని వ్యాసాలు రాసింది.

అనాధగా మరణం…

22 జనవరి 2005 న పర్వీన్ బాబీ తన అపార్టుమెంటులో మరణించింది. వరసగా మూడు రోజులపాటు పాలు, న్యూస్ పేపరు తీసుకోకపోవడంతో అపార్టుమెంటు యాజమాన్యం పోలీసులకు తెలియపరచింది. పోలీసులు వచ్చి ఆమె మూడురోజుల క్రితమే చనిపోయిందని నిర్ధారించారు. ఆమె తీవ్ర మధుమేహ వ్యాధితో బాధపడుతూ వుండేది. ఆమె పడక ప్రక్కన ఒక వీల్ చెయిర్ కూడా పోలీసులు కనుగొని ఆమె కాలికి ‘గాంగ్రెన్’ వున్నట్లు నిర్ధారించారు. మూడురోజులుగా తిండి తినక మద్యం పుచ్చుకొని వున్నట్లు పోస్టుమార్టం రిపోర్టు తెలిపింది. చివరికి ఆమెది సహజ మరణమేనని పోలీసులు ధృవపరిచారు. క్రైస్తవ సంప్రదాయాన్ని కాదని పర్వీన్ బాబి బందువులు ఆమెకు ముస్లిం సంప్రదాయాల ప్రకారం కర్మక్రతువులు నిర్వహించారు. పర్వీన్ బాబి రాసిన విల్లు ప్రకారం 70 శాతం ఆస్తులతో ఒక ట్రస్టు ను నెలకొల్పి తద్వారా పేద పిల్లలకు విద్యాదానం చేసేందుకు చర్యలు చేపట్టారు. తన ఆస్తిలో కొంతభాగం క్రైస్తవ మిషనరీకి పర్వీన్ బాబి విరాళంగా అందజేసింది.
ఆచారం షణ్ముఖాచారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap