మాటల్లో స్త్రీ పురుషులు సమానమేనని ఎన్ని చెప్పినా స్త్రీ అంటే నాలుగు గోడల పంజరాలకే పరిమితంకావాలని, ఉద్యోగాలు కూడా అలాంటి చోటే చెయ్యాలనిపితృస్వామ్య సమాజం నిర్దేశించింది. అలాంటి కాలంలో ఆ నలుచదరపు సమాధులనుఇ బద్దలుకొట్టి విశాలమైన వీధుల్లో ఇంజనీరుగా ఉద్యోగం చేసి గెలుపు కవితను రచించారు పద్మజవాణి గారు.
వీరు ఇటీవలే పల్లెపాలెం మధునాపంతుల ఫౌండేషన్ వారి ప్రభా గౌరవ పురష్కారం పొందారు. వీరు సామాజిక సేవా కార్యకర్త, కవయిత్రి, రచయిత్రి “ఆకుపచ్చని సంతకం” కవితా సంపుటి ప్రచురించారు. విజయవాడ, విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రాలలో వీరి రచనలు ప్రసార మయ్యాయి. పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
రోటరీ, లయన్స్ వంటి అంతర్జాతీయ స్వచ్చంద సంస్థలచే విశిష్ట సేవా పురష్కారం అందుకున్నారు. నిగర్వి, చిరుమంద హాసిని, మధుర భాషిణి ఐన పద్మజవాణి గారితో సంభాషించడానికి కాకినాడలో వారింటికివెళదాం పదండి…
ప్రశ్న: ఇప్పుడంటే ఆడపిల్లలు ఇంజనీరింగ్ చదువులు చదువుకోవడం మామూలే గానీ… ఒకప్పుడు మూడు, నాలుగు దశాబ్దాల క్రితం ఇంజనీర్ చదవడం గొప్పే. మీకు ఇంజనీరింగ్ చదవాలని ఎందుకు అనిపించింది?
జవాబు: అందరికీ నమస్కారం. నా పేరు పద్మజవాణి.
ఆ రోజుల్లో అంటే రెండు మూడు దశాబ్దాల క్రితం ఆడపిల్లల్ని చదువుకోనిచ్చినా డిగ్రీ అయితే చాలు అనుకునేవారు గానీ ఇంజనీర్ గానో, డాక్టరుగానో చూడాలనుకునే తల్లిదండ్రులు అరుదు. ఎందుకంటే ఆడపిల్ల ఎక్కువ చదువుకుంటే అంతకన్నా ఎక్కువ చదివిన వరుడిని తేలేం అనుకునేవారు.
1963లో మా నాన్న ఉద్యోగ రీత్యా కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ క్వార్టర్స్ లోకి వచ్చాం. మా ఇంట ఎదురుగా ఇంజనీరింగ్ చదువుకునే లేడీస్ హాస్టలు వుండేది. సాయంత్రమయితే చాలు మా ఇంటికి హాస్టల్ కి మధ్య వుండే చిన్న రోడ్డు దాటి వాళ్ళ దగ్గరకి వెళ్ళేవాళ్ళం. క్యాంపస్ లో వున్న ఆడపిల్లల్ని చేరదీసి పాటలు పాడించుకుని వాళ్ళింట్లో చెల్లెళ్ళని మాలో చూసుకుని వాళ్ళు మురిసిపోయేవాళ్ళు. అప్పుడే నేను కూడా అర్జంట్ గా ఇంజనీరవ్వాలని గట్టిగా అనుకున్నాను. అప్పటికి మెట్రిక్యులేషన్ పాసయ్ వున్నాను. పాలిటెక్నిక్ లో చేరి ఆర్కిటెక్చర్ కోర్సులో చేరాను.
ప్రశ్న: మిమ్మల్ని ఇలా ఈ చదువుకు ప్రోత్సహించిన మీ తల్లిదండ్రుల గురించి చెప్పండి.
జవాబు: మా తల్లిదండ్రులు పసుమర్తి సూర్యనారాయణమూర్తి, శ్రీమతి సీతామహలక్ష్మి. చాలా అభ్యుదయ భావాలున్నవారు. ఇద్దరూ సేవామూర్తులు. ఎవరైనా ఆపదలో వున్నారని తెలిస్తే వెంటనే తమకి తోచిన సాయం కాదు – ఒక్కోసారి శక్తికి మించి మరీ సాయపడేవారు. మేం అయిదుగురు ఆడపిల్లలం. ఇద్దరు మగపిల్లలు. ఇంతమంది పిల్లల్ని సాకుతూనే అంతగా ప్రపంచంలో వున్న కష్టాల బారి నించి అందర్నీ కాపాడుకోవాలని తాపత్రయపడే దంపతులు నాకింకెక్కడా కనిపించలేదు. మా తల్లిదండ్రులు పిల్లల అభీష్టాన్ని ఎప్పుడూ గౌరవించేవారు.
ప్రశ్న: మీరెక్కడ పుట్టారు? మీ బాల్య విశేషాలు వివరిస్తారా ?
జవాబు: నేను క్రిష్ణా జిల్లా వుయ్యూరులో 1950 అక్టోబరు 15న పుట్టాను. వుయ్యూరు ఆరోజుల్లో మరీ కమ్యూనిస్టులకి కంచుకోట. స్వాతంత్రేచ్ఛ, అభ్యుదయ భావాలు, సమాజం పట్ల నిబద్ధత ముప్పేటగా అల్లుకున్న ఆ వూరు, ఆ గాలి సహజంగానే నామీద ప్రభావం చూపించాయి.
ప్రశ్న: మీ విద్య గురించిన వివరాలు చెప్పండి?
జవాబు: ప్రాథమిక విద్య వుయ్యూరు, తదుపరి ఇంకో నాలుగేళ్ళు మా తాతగారి వూరు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో.. మూడేళ్ళ ఆర్కిటెక్చర్ కోర్సు గరల్స్ పాలిటెక్నిక్, కాకినాడ నాకు ఇంజనీర్ అయ్యే అర్హత ఇచ్చింది.
ప్రశ్న : మీ ఉద్యోగ వివరాలు చెప్పండి. ఆడపిల్లలు అంటే నీడ పట్టున నియమిత సమయానికి లోబడి పని చేయాలనుకొంటారు, కానీ మీరు ఎక్కువసేపు వీధుల్లోనే వుండి చేయాల్సిన ఉద్యోగం చేసారు. అప్పటి మీ అనుభవాలు చెప్తారా?
జవాబు: రహదారులు-భవనాలు శాఖలో టెక్నికల్ వర్క్సు ఇన్స్పెక్టర్ గా ఉద్యోగంలో చేరాను. అసిస్టెంట్ ఇంజనీర్ గా, నేషనల్ హైవేస్ రోడ్ ఇంజనీర్ గా రిటైరయ్యాను. నాకు మొదటినించీ సైట్ వర్కు చాలా ఇష్టంగా వుండేది. నా తర్వాత డిపార్టుమెంట్ లో జాయిన్ అయిన ఆడపిల్లలు సైట్ కి వెళ్ళాలి అనంగానే గబగబా కన్నీళ్ళ ట్యాప్ విప్పేసేవారు. నా సీనియర్లు ‘‘నువ్వెందుకు సైట్ కి వెళతావు, నిన్ను చూపించి ఆఫీసర్లు మమ్మల్ని తప్పు పడుతున్నారు. నువ్వు వెళ్ళకు’‘ అనేవారు. ఏమైనా అననీ.. నా దృష్టి ఎప్పుడూ సైట్ వర్కు మీదే వుండేది. క్షేత్రస్థాయిలో పని చెయ్యటం ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది అనిపిస్తుంది. అదే నన్ను ఒక కవిగా, రచయితగా శ్రమైక జీవన సౌందర్యాన్ని నా రచనల్లో ప్రతిఫలించేలా చెయ్యగలిగే అపురూప కవన శక్తిని ప్రసాదించిందని వినయంగా చెప్పుకుంటున్నాను.
All most అప్పటికి మా డిపార్టుమెంట్ లో క్షేత్రస్థాయిలో పనిచేసిన మొదటి lady నేనే.. అని అందరూ అనేవారు.
నిజానికి సైట్ వర్కు చాలా ఇష్టం. అదంతా male dominated world. అందులో నెగ్గుకురావడం అంటే మాటలు కాదు. కఠోర శ్రమని నా గెలుపు రహదారిగా మార్చుకున్నాను. దీనికి నా కుటుంబం అంటే నా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు.. ముఖ్యంగా నా చిన్న తమ్ముడు శ్రీనివాస్ కొండంత అండగా నిలబడ్డాడు.
ఇంక ఉద్యోగ అనుభవాలు అనంగానే.. ముప్పిరిగొన్నవి ఎన్నెన్నో…! రహదారులు – భవనాల శాఖలో భవనాలు కట్టడం, మెయింటెనెన్సు, స్పెషల్ రిపేర్లు అనేవి ముఖ్యంగా వుంటాయి. నా సెక్షన్ లో కాకినాడ పోలీస్ డిపార్టుమెంటు, టెక్నికల్, నాన్ టెక్నికల్ విద్యాశాఖ వుండేవి. పోలీస్ శాఖలో జిల్లా ఎస్పీ ఆఫీసు, బంగ్లా, జిల్లాలోని పోలీసు స్టేషన్లు, వందలాదిగా పోలీసు క్వార్టర్సు ఇలా చాలా వుండేవి. రిటైరయ్యి ఇన్ని సంవత్సరాలు గడిచినా వారు గుర్తు పడుతుంటారు. అమ్మా మీరు సిన్సియర్ ఆఫీసర్ అని కితాబు ఇస్తుంటారు. చాలా రీసెంట్ గా అంటే జూన్ 8, 2024.. ‘మహాసముద్ర ఉత్సవం’ కాకినాడ బీచ్ లో నిర్వహించాం. అక్కడికి పోలీస్ శిక్షణ నిమిత్తం కాడెట్స్ ని తీసుకువచ్చిన రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఒకరు నాగురించి వాళ్ళకి చాలా గొప్పగా చెప్పారు. నా డ్యూటీ నేను చేశాను. అదీ ఒకింత నిజాయితీ, నిబద్ధతతో అయ్యుండచ్చు. అది దాదాపుగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నా వెంట వుందా అన్పించింది. రహదారులు సెక్షన్ కి కౌన్సిలింగ్ లో మొదటే నేషనల్ హైవేస్ రోడ్స్ కి జాయిన్ అయినప్పుడు.. మండు వేసవి, తారు వేడి, వాతావరణం అంతా దుమ్మూ, ధూళీ పేరుకుపోయి చుట్టూ మగవాళ్ళు అదీ లారీ డ్రైవర్లు లాంటి జగమొండివాళ్ళు, రోజూ సైట్ కి వెళ్ళిరావాల్సిన దూరం 100 కి.మీ. బస్ దిగి లారీలు పట్టుకుని సైట్ దగ్గర దిగి మళ్ళీ ఇంటికి వచ్చే వరకూ కాలకృత్యాలకి గానీ, నెలనెలా అవసరాలకి గానీ ఏమాత్రం సౌకర్యం లేని మారుమూలలకి వెళ్ళి పని చెయ్యటం అసాధ్యమే గానీ ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు ఇష్టంగానే వుంటాయి.
‘‘ఆడవాళ్ళు రోడ్ల మీద ఏ పని చెయ్యగలరని ఈ సెక్షన్లో వేయించుకున్నావ’’ని అడిగిన మంత్రివర్యులు తర్వాత నా పనితీరుకి మెచ్చి మిగిలిన డిపార్టుమెంటు ఇంజనీర్ల దగ్గర నన్ను పొగిడేవారుట. వాళ్ళు గోలపెట్టేవారు. 2001 నుంచి జిల్లా కలెక్టర్ గారు ఆయన ఎం.టెక్., ఐ.ఎ.ఎస్. ఇంజనీర్లనే కాదు జిల్లాలో గవర్నమెంటు డిపార్టుమెంట్ లని హడలెత్తించిన ఆయన ఒకసారి నేను వేస్తోన్న రోడ్ పక్కనించి వెళుతూ ఆగారు. రోడ్ చెక్ చేయమని అడిగాను. వచ్చి చూసి వెడుతూ ‘‘మీరున్న చోట మేం చెక్ చేయాల్సిన అవసరం వుండదమ్మా’’ అనటం, ఈ మేడమ్ ని చూసి నేర్చుకోండి, అందరూ ఇలా వుంటే దేశం బాగుపడుతుంది అని ప్రశంసించడం ఇప్పటికీ నా చెవుల్లో విన్పిస్తున్నట్లే వుంటుంది. అలా బెస్ట్ ఇంజనీర్ గా నాలుగు అవార్డులు అందుకున్నాను.
కాకినాడ నించి కత్తిపూడి వరకూ రోడ్డు విస్తరణ, బలోపేతం పనుల్లో ప్లాంట్ ఇంజనీరుగా పనిచేశాను. అప్పడున్న సిఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ రోడ్ అని చెప్పారు. పదేళ్ళపాటు చెక్కు చెదరలేదు. ప్లాంట్ ఇంజనీర్ గా తారు మెటలు వేసి పంపించే ముఖ్యమైన పని అది.
రోడ్డు విస్తరణ అనంగానే ఒక ఊరు గుర్తొస్తుంది. రాజకీయంగా చాలా చాలా బలమైన వూరు. ఆక్రమణలతో నిత్యం సంఘర్షణలతో స్కూలు, కాలేజీలకి దారి కూడా మూసివేసే ఆక్రమణలు తీసేందుకు రాలేమని పోలీసులు సాకులు చెప్పినా, జె.సి.బి. తీసుకెళ్ళి కబ్జాలన్నీ కూల్చేసి రోడ్డు వేసుకున్నాను. ఈ ఘనత సాధించేందుకు ఆ గ్రామ ప్రజలకి నామీదున్న గౌరవం తోడ్పడింది.
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఇంజరీరింగ్ పనులు మా డిపార్టుమెంట్ పరిధిలో వుండేది. ఆ సెక్షన్ ఆఫీసర్ గా దాదాపుగా నాలుగురోజుల కొకసారి వెళ్ళి పనులు పర్యవేక్షించవలసి వచ్చేది. మొదట లేడీ ఇంజనీర్ ని జైలు అధికారులు ఒప్పుకోలేదు. జీవితకాలం శిక్ష పడిన ఖైదీలు ఆడవారిని చూస్తే ఎలా రియాక్ట్ అవుతారో అని భయపడ్డారు. కానీ అలా ఏం జరగలేదు. చాలా మంచిగా ప్రవర్తించేవారు. నక్సలైట్ నాయకుల సెల్లో కూడా రిపేర్లు చేయించినప్పుడు వాళ్ళని చూశాను కూడా.
ప్రశ్న: మీ ఉద్యోగ ధర్మంగా వీధులను వెడల్పు చేసేటప్పుడు తప్పనిసరిగా చెట్లను నరికేయాల్సి వస్తుంది.మొదలంటా చెట్లు కూలిపోతుంటే అజంతా రాసిన చెట్లు కూలిపోతుందని దృశ్యం కవిత గుర్తుకొస్తుంది. అప్పటి మీ అనుభూతులేమిటి?
జవాబు: రహదారులు వెడల్పు చేసేటప్పుడు దాదాపుగా వందేళ్ళ ఏళ్ళ వయస్సున్న చెట్లు కూలుస్తున్నప్పుడు ఒక కవిగా నా మనసు విలవిలలాడింది. అజంతా గారి ‘చెట్లు కూలుతున్న దృశ్యం’ కవిత గుర్తొచ్చింది కూడా. వందలాదిగా తెగిపడిన చెట్లు యుద్ధభూమిలో పోరాడి ఒరిగిన భీష్ముడినీ, ద్రోణుడినీ, కర్ణుడినీ, అభిమన్యుడినీ, ఇంకా యోధానుయోధుల్నీ చూస్తున్నట్టనిపించింది. అర్జునుడు యుద్ధరంగంలో విలపించడం కన్పించింది. కానీ నా కర్తవ్యం నన్ను ధృఢంగా నిలబెట్టింది. రోడ్డు వెడల్పు చేయించాక మొట్టమొదట చేసిన పని ఫారెస్ట్ డిపార్టుమెంట్ వాళ్ళని కలిసి చెట్లు నాటించడం, పెంచటం.
ఆ పని అక్కడితో ఆగలేదు. కూకటివేళ్ళతో పెళ్ళగించటం కష్టమైన పెద్ద పెద్ద మొదలు నరికిన మ్రానులు దారికడ్డంగానూ ట్రాఫిక్ కి ఆటంకమై రాత్రివేళల వాహనాలు నడిపేవాళ్ళు గుద్దుకుని చనిపోకుండా బకెట్లతో వైట్ సిమెంట్ కలుపుకుని స్వయంగా నేను కూడా మ్రానుల మీద పోసి, ఎవరూ యాక్సిడెంట్ బారిన పడకుండా కాపాడాను.
ప్రశ్న: ఒక్కొక్కచోట నరికిన చెట్లను వేరొక చోట నాటించేవారట. అప్పుడు చెట్లు కొట్టించేస్తున్నారే అని బాధ ఉండదు. మీరు అలా చేసారా?
జవాబు: ఒకచోట నరికిన చెట్లని తరలించి వేరొకచోట నాటడం అనే ప్రక్రియ చాలా ఖర్చుతోనూ, పెంచే మనుష్యుల చిత్తశుద్ధితోనూ ముడిపడి వుంది. కొత్త చెట్లను నాటడమే నేను చేశాను.
ప్రశ్న: మీరు “ఆకుపచ్చని సంతకం” అన్న కవితా సంపుటి ప్రచురించారు. ఇంకా ఏయే ప్రక్రియల్లో మీరు రచనలు చేశారు?
జవాబు: ‘‘ఆకుపచ్చని సంతకం’’ నా కవిత్వం సంపుటి. 2012న కాకినాడలోనే ఆవిష్కరించబడింది. ఉపన్యాసకులుగా ప్రముఖ కవి శ్రీ డా. అద్దేపల్లి రామమోహన్రావు గారు, ప్రముఖ కవయిత్రి డా. చిరంజీవినీ కుమారి గారు, ప్రముఖ రచయిత్రి డా. ఆలూరి విజయలక్ష్మి గారు, ప్రముఖ కథా రచయిత్రి డా. వాడ్రేవు వీరలక్ష్మి గారు, ప్రముఖ కవయిత్రి, స్త్రీవాద రచయిత్రి శ్రీమతి మందరపు హైమవతి గారు ఆ సభని ప్రకాశింపచేశారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక కథాసంకలనం, సమీక్షా సంపుటి తేవాలని ఈ సం.లో ఆవిష్కరించుకోవాలని ఆశపడుతున్నాను.
ప్రశ్న: చాలా మంది కవులు సమసమాజం రావాలని, కుల మత భేదాలు పోవాలని తమ రచనలలో రాస్తారు. కానీ మీలాంటి సమాజసేవకులు ఏదో విధంగా సమాజానికి సేవ చేస్తారు. ఆ వివరాలు చెప్తారా?
జవాబు: మీరు వేసిన అయిదవ ప్రశ్నలోనే చెప్పాను. నేను ‘‘ప్రార్థించే పెదవుల కన్నా, పనిచేసే చేతులు మిన్న’’ అనే కాన్సెప్ట్ నమ్ముతాను. ఇంట్లోంచే అమ్మా, నాన్నల నించి ఉగ్గుపాలతో వచ్చిన సంఘసేవ… నన్ను సాహిత్యానికి దూరం పెట్టినా ఎప్పటికప్పుడు ముందడుగు వేస్తూనే వున్నాను.
కాకినాడ సాహిత్యానికీ, స్వాతంత్ర్య పోరాటాలకీ, సమాజసేవా తత్పరతకీ, ఆధ్యాత్మిక వారసత్వానికీ పురిటిగడ్డ. గోదావరి నీటిలో కవిత్వం అలలై సాగుతుంది. ఒక్క రాజమహేంద్రి దేశంలోనే అత్యధికంగా 12 మంది మహిళా స్వాతంత్ర్య పోరాటయోధుల్ని దేశానికి సమర్పించింది అనే సంగతి చాలామందికి తెలీదు కూడా. బహుశా ఆడవాళ్ళవటం కారణం ఏమో.
ఇంక సేవ అనే మాటకి వస్తే మా నాన్నగారు ఈ పదం ఇష్టపడేవారు కాదు.. అలాగే సేవ చేస్తే పుణ్యం వస్తుంది… లాంటి మాటలు నచ్చేవి కావు. ఇది ఒక బాధ్యత. సమాజం నించి మనం ఎంతో తీసుకున్నాం. అది తిరిగి ఇవ్వాలి అనేవారు. అమ్మానాన్నల మంచితనం మా ఇంటినిండా బంధుమిత్రుల్ని నింపేది.
మీరన్నట్లు సేవ అనుకున్నా గానీ…ముఖ్యంగా రిటైర్ అయ్యాక లయన్స్ క్లబ్ లో చేరాను తర్వాత డా. ఆలూరి విజయలక్ష్మిగారు స్థాపించిన సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ విమెన్ సంస్థకి సెక్రటరీగా ఇప్పటికీ వున్నాను… పోలీస్ శాఖ వారు నన్ను వెతికి పట్టుకుని ఫామిలీ కౌన్సిలింగ్ మెంబరుగా వేసుకున్నారు. విడిపోబోయే జంటల్ని కొన్ని కలిపానన్న సంతోషం వుంది. ఇండియన్ రెడ్ క్రాస్ వారికి లైఫ్ మెంబరుగా దివ్యాంగ బాలుర ఆశ్రమ పాఠశాల సబ్ కమిటీ మెంబరుగా వున్నాను. మహర్షి సాంబమూర్తి దివ్యాంగ బాలికల ఆశ్రమ పాఠశాల కమిటీ మెంబరుగా వున్నాను. 96 ఏళ్ళ ఆలిండియా విమెన్స్ కాన్ఫరెన్స్, కాకినాడ శాఖ కోశాధికారిగా దివ్యాంగ బాలికలకి శానిటరీ నాప్కిన్స్ తయారీ విధానం మిషిన్స్ పైన నేర్పించి వారికి జీతాలిచ్చి ఉపాధి చూపించాం. కరోనా సమయంలో అది ఆగింది. కాకినాడ బీచ్ క్లీనింగ్ ప్రాజెక్టుని గత నాలుగేళ్ళుగా చేస్తున్నాం. మత్స్యకార మహిళలు అయిదుగురికి ఉపాధి కల్పించి రోజూ అయిదు గంటలు పని చేయిస్తున్నాం. ఇంకా చాలా పనులు… మునిసిపల్, జిల్లా పరిషత్ స్కూల్స్ కి వెళ్ళి ఆడపిల్లలకి రుతుసంబంధిత విజ్ఞానంతోపాటు సమాజంలో దుష్టత్వం తీరుతెన్నులు మేం చెప్పటమే కాకుండా, లేడీ డాక్టర్లు, సైబర్ క్రయిమ్ పోలీసు వారితో కూడా అవగాహన సదస్సులు పెట్టిస్తుంటాం. కాకినాడ మున్సిపల్ కమిషనర్ గారికి రిప్రజెంట్ చేసి మా ఇంటి వెనుక సిమెంట్ రోడ్లు డ్రయిన్లు అయ్యేలా చూశాను. ఎండోమెంట్స్ వారిదే అయినా కూలిపోతోన్న బిల్డింగు స్థలంలో రూ.50 లక్షలతో వృద్ధాశ్రమం, అదే ఆవరణ ఎవరూ ఆక్రమించకుండా రామాలయ నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకున్నాను.
సాహితీ స్రవంతి కాకినాడ శాఖ కోశాధికారిణిగా పలు సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. డా. ఆలూరి విజయలక్ష్మిగారి మానస పుత్రిక, ఆవిడ ఆధ్వర్యంలో నిర్మించిన రెండు అంతస్తుల రోటరీ ఆశ్రయ.. స్త్రీల వృద్ధాశ్రమం ఆనరరీ మెంబరుగా సేవలు అందిస్తున్నాను.
ప్రశ్న: మీ అభిరుచులు ఏమిటి?
జవాబు: నా అభిరుచులు కథలు, కవిత్వం, పెయింటింగ్సు, లలిత సంగీతం, రకరకాల వస్తువులతో బొమ్మలు చెయ్యటం.. గార్డెనింగ్ నిర్వహించటం.
ప్రశ్న: విశ్రాంతి జీవితాన్ని ఏవిధంగా గడుపుతున్నారు ?
జవాబు: విశ్రాంతిగా కూర్చోవటం అస్సలు నచ్చదు.
ప్రశ్న: మీరు ఒంటరి మహిళగా జీవిస్తున్నారు. అయినా మీ చెల్లెళ్ళ, తమ్ముళ్ల కుటుంబాలతో కలిసి ఉంటున్నారు. అది ఎలా సాధ్యం?
జవాబు: ఒంటరి మహిళగా చెప్పారు మీరు. కానీ నన్ను నేను ఒక నక్షత్రం అనుకుంటాను. నక్షత్రం ఒంటరిదయినా చుట్టూ ఒక కాంతివలయం వుంటుంది. ఆ కాంతి తను వుండే ఆకాశానికే కాకుండా క్రింది నించి చూసే మనుష్యులకి కూడా ఆహ్లాదం కలిగిస్తుంది. అంధకారం చేతనైనంత మేర పటాపంచలు చేస్తుంది కదా.. అందుకనే అందరితో స్నేహమాధుర్యం పంచుకుంటాను. మీకు తెలుసా నా స్నేహితుల్లో ఐ.ఎ.ఎస్. వాళ్ళ దగ్గర్నించి, ఆటోవాళ్ళ దాకా అందరూ నాకు ఆప్తులే. ఇక కుటుంబసభ్యుల విషయం చెప్పేదేముంది! మనం ప్రేమ పంచినప్పుడు మనకు అదే కదా వెనక్కి వస్తుంది.
ప్రశ్న: అశోకుడు చెట్లు నాటించెను అని పాఠాలు చదువుకొన్నాము. ఇప్పుడు చెట్లు లేని నగరాల్లో ఉంటున్నాం. దీనికి పరిష్కారం ఏమిటంటారు?
జవాబు: ప్రతి నగరాన్నీ, గ్రామాన్నీ ఎప్పుడో ప్రపంచీకరణ భూతం మింగేసింది. ప్రతి మనిషి తన ఇంటిముందర కాస్త చోటు వుంటేచాలు అదొక షాప్ గా కన్వర్టు చేసుకుని ఆదాయ మార్గం ఏర్పరుచుకుంటుంటే చెట్లు ఎలా బతుకుతాయి.
ప్రశ్న: మీ భవిష్యత్తు ప్రణాళిక లేమిటి?
జవాబు: భవిష్యత్తు అంటే ఎంతకాలం వుంటామో – వూపిరి పీలుస్తున్నంత కాలం నలుగురికీ సాయపడగలిగే అదృష్టాన్నీ – అలాగే ఎవరిచేత చాకిరీ చేయించుకోకుండా హాయిగా నవ్వుతూ వెళ్ళగలిగే అదృష్టాన్నీ కోరుకుంటాను. కథల సంపుటి ఇంకొకటి, కవితా సంకలనం ఇంకొక్కటైనా తేవాలనే కోరిక.. సాహిత్యపరంగా.
ఇప్పుడు నేను ఆలిండియా విమెన్స్ కాన్ఫరెన్స్ (A.I.W.C.-N.G.O. New Delhi) కోశాధికారిణిగా వున్నాను. ఆ సంస్థ తరపున ముఖ్యంగా అసక్తులు, అసహాయులైన పేద మహిళలకి, వికలాంగ పిల్లలకి సాయశక్తులా తోడ్పడుతున్నాము. పేరులో వున్నట్లే భారతదేశమంతటా అన్ని రాష్ట్రాలలోనూ ఆడవారికి సేవలందిస్తోన్న ఈ సంస్థలో సభ్యురాలినైనందుకు గర్వపడుతున్నాను. మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని భవిష్యత్తు ప్రణాళిక.
– ఇంటర్వ్యూ: మందరపు హైమావతి (9441062732)
గాఢత, ఆర్ద్రత ఉన్న కవిత్వం, అర్ధవంతమైన కథల రచయిత్రి, సేవ మనిషికి సహజాతం కావాలని మనసా, వాచా నమ్మి అంకితభావంతో ఆచరిస్తున్న ‘మనిషి’ పద్మజావాణికి అభినందనలు🌹