‘పాతాళభైరవి’ (విడుదల తేదీ 15-03-1951) 75 వసంతాల వజ్రోత్సవం సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి సమగ్ర వ్యాసం….
ఎప్పుడో 75 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఒక తెలుగు సినిమా నాటికీ, నేటికీ అందరినోళ్లలో నానుతూ, క్రమం తప్పకుండా అటు వెండితెర మీద ఇటు బుల్లితెర మీద కూడా ప్రదర్శించబడుతూ ప్రశంసలు అందుకున్న సినిమా విజయా బ్యానర్ లో నిర్మించబడిన పాతాళభైరవి. ప్రేక్షకులను రంజింపజేసే సినిమాలను నిర్మించి తన ప్రత్యేకతను నిలబెట్టుకున్న విజయా సంస్థ నిర్మించిన తొలి చిత్రం ‘షావుకారు’ (1949) ఓ మైలురాయి కాగా పాతాళ భైరవి సినిమా తరవాత వచ్చిన విజయావారి మహత్తర చిత్రరాజం. 75 సంవత్సరాలక్రితం మార్చి 15 న విడుదలై చిత్ర విచిత్ర మాయాజాలంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసి తెలుగు చలనచిత్ర పరిశ్రమను స్వర్ణయుగంలోకి మళ్లించింది. 1950 ఫిబ్రవరి 5 న ‘పాతాళ భైరవి’ సినిమా తొలి చిత్రీకరణ జరుపుకుంది. ఈ చిత్రనిర్మాణానికి సరిగ్గా సంవత్సరం పట్టింది. చిత్రనిర్మాణం పూర్తిచేసుకొని విజయ దుందుభి మ్రోగించింది. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోని 28 కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకొని చరిత్ర సృష్టించింది. 1952లో మనదేశంలో తొలిసారి గోవా లో అంతర్జాతీయ ఫిల్మోత్సవం జరిగినప్పుడు భారత్ తరఫున ఎంపిక కాబడిన నాలుగు సినిమాలలో ‘పాతాళభైరవి’ సినిమా ఒకటి కావడం విశేషం. ఎన్.టి. రామారావు రెండేళ్లకు నాలుగు సినిమాలలో (షావుకారు, పాతాళభైరవి, పెళ్లి చేసి చూడు, చంద్రహారం) నటించే ప్రాతిపదికన నెలకు రూ.250 పారితోషికానికి అగ్రిమెంటు రాసి విజయా సంస్థకు పనిచేయడం విశేషం. ఆ సమయంలో రామారావు మరే ఇతర సినిమాలలోనటించలేదు.

పాతాళ భైరవి చిత్రానికి అంకురార్పణ జరిగినప్పుడు అక్కినేని నాగేశ్వరరావును హీరోగా పెట్టి నేపాళ మాంత్రికుడుగా గోవిందరాజుల సుబ్బారావుతో ఈ సినిమా నిర్మించాలని విజయావారు తొలుత భావించారు. అయితే ఆ అదృష్టం రామారావు, ఎస్.వి. రంగారావులకు దక్కింది. దీనికీ ఒక నేపథ్యముంది. ఈ సినిమాకు ముందు ‘సంసారం’ సినిమా వాహినిలో షూటింగు జరుపుకుంటూ వుంది. ఓ సాయంత్రం తీరికవేళ అక్కినేని, ఎన్టీఆర్ కలిసి వాహినీ ఆవరణలో టెన్నిస్ ఆట ఆడుతున్నారు. వరసగా నాలుగు బంతులు ఎన్టీఆర్ కు మిస్సయ్యాయి. దాంతో కసి పెరిగి రెండు చేతులతో ర్యాకెట్ ను పట్టుకొని బంతిని బలంగా బాదటంతో ఆ బంతి స్టూడియో బయటకుపోయి దొరకలేదు. మేడమీది ఆఫీసు కిటికీలో నుంచి ఈ దృశ్యాన్ని చూసిన దర్శకుడు కె.వి. రెడ్డి కి ఫ్లాష్ వెలిగింది. జానపద కథానాయకుడికి కావలసిన లక్షణాలు రామారావుకు వున్నాయని గ్రహించి తోట రాముడు పాత్రను ఎన్టీఆర్ కు ఇచ్చారు. (సినిమాలో రామారావు బొడ్డుదేవర విగ్రహాన్ని రాతిగదతో రెండుచేతులు పట్టుకొని పగులగొట్టే సన్నివేశం మీరు గమనించే వుంటారు. ఆ సన్నివేశానికి ఈ టెన్నిస్ ఆట ప్రేరణ). ప్రతిరోజూ ఉదయం ఎన్టీఆర్, బాలకృష్ణ (అంజిగాడు పాత్ర) వాహినీ స్టూడియోలో కర్రసాము అభ్యాసం చేసేవారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తోటలోని చెట్టుమీద నుంచి దూకే సన్నివేశ సమయంలో రామారావు కుడిచేయి విరిగింది. అంతకు ముందే ‘పల్లెటూరి పిల్ల’ సినిమా షూటింగులో కూడా ఎద్దుతో పోరాడుతూ అదే చేతిని విరగొట్టుకున్నాడు రామారావు. పుత్తూరు రాజుల వైద్యం చేయడంతో విరిగిన చెయ్యి కట్టుకుంది. ఇవన్నీ బాలారిష్టాలు. తొలి తెలుగు టాకీ ‘భక్తప్రహ్లాద’ సినిమాలో హీరోయిన్ గా నటించిన సురభి కమలాబాయి ఇందులో ఎన్టీఆర్ తల్లిగా నటించింది. హీరోయిన్ ఇందుమతి గా అంతకుముందు ‘భక్తపోతన’ సినిమాలో శ్రీనాథుడు కుమార్తెగా నటించిన మాలతిని ఎంపిక చేశారు. హీరోయిన్ గా మాలతికి ఇదే చివరి చిత్రం కావటం కూడా ఓ విశేషం. షావుకారు చిత్రంలో సున్నం రంగడు పాత్రలో జీవించిన ఎస్.వి. రంగారావును నేపాళ మాంత్రికుడుగా, ఉజ్జయినీ మహారాజు గా సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, మహారాణిగా హేమలతమ్మారావు, ఆమె సహోదరుడు వీర ధీర సూరసేనుడుగా రేలంగి, సదాజపుడుగా పద్మనాభం ముఖ్య తారాగణంగా ఎంపికయ్యారు. ఇందులో తన పాటలను రేలంగే స్వయంగా పాడుకోవడం కూడా విశేషమే. సావిత్రి ఈ సినిమాలో వచ్చే అంతర్నాటకంలో ‘నే రానంటే రానే రాను’ అనే పాటకు పసుమర్తితో కలిసి నృత్యం చేస్తూ కనిపించడం కూడా మరొక వింత. సదాజపుడు పద్మనాభం తన గురువు నేపాళ మాంత్రికుణ్ణి ‘ఏం గురూ’, ‘మోసం గురూ’ అంటూ సంబోధిస్తూ వుంటాడు. తరవాతిరోజుల్లో ఈ ‘గురూ’ అనే పదం బాగా ప్రాచుర్యానికి వచ్చింది. రంగారావు పలికే ‘ఏ ఢింబకా’, ‘ఏ బుల్ బుల్’, ‘ఏ డింగరీ’ అనే పలుకులు, రేలంగి పలికే ‘తప్పు తప్పు’, ‘నేను రాణిగారి తమ్ముణ్ణి’ అనే పలుకులు కూడా ప్రేక్షకుల నోళ్లలో నానేవి. పాతాళభైరవిగా కాసేపే కనిపించే గిరిజ ‘నరుడా ఏమి నీకోరిక’ అనే మాటలు కూడా అలరించాయి. తరవాతి కాలంలో ఈ పేరుతో సినిమా కూడా వచ్చింది. ఇందులో నేపాళ మాంత్రికుడు పాతాళ భైరవిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని మంత్రాలు జపిస్తాడు. నిజానికి మంత్రపుష్పంలోని వేదమంత్రాలను పింగళి తిరగరాసి వాటిని రంగారావు చేత పఠింపజేశారు. ఘంటసాల సమకూర్చిన సంగీతానికి ఆర్కెస్ట్రా సహకారాన్ని ప్రముఖ సంగీతదర్శకుడు మాస్టర్ వేణు అందించడం కూడా గొప్ప విశేషమే. ఈ సినిమా రీ-రికార్డింగ్ అత్యంత ఉన్నత ప్రమాణాలతో వుంటుంది.
కాశీమజిలీ కథే… ఈ సినిమా
రాజుగారి ఉద్యానవనంలో పూల మాలలు కట్టి రాణివాసంలో అందజేసే శాంతమ్మ కుమారుడు తోటరాముడు. విహారానికి ఉద్యానవనంలోకి వచ్చిన రాకుమారిని చూసి ఆమె ప్రేమలో పడతాడు. తోటరాముడు ప్రేమిస్తాడు. తోటరాముడు ఒకరోజు అర్ధరాత్రి కోట గోడ దాటి రాజభవనంలోకి ప్రవేశించి రాకుమారిని కలుస్తాడు. అది పసికట్టిన రాజుగారి బావమరది తోటరాముని పట్టించి జైలుపాల్జేస్తాడు. సిరిసంపదలు సంపాదించి వస్తే రాకుమారిని పెళ్ళాడవచ్చు అని మహారాజు చెప్పడంతో తోటరాముడు నేపాళ మాంత్రికుని కలుస్తాడు. సినిమా మలుపులు తిరుగుతుంది. మాంత్రికుడు రాకుమారిని తన గుహలో బంధిస్తాడు. తోటరాముడు సాహసించి మాంత్రికుణ్ణి చంపి రాకుమారిని వరిస్తాడు. టూకీగా ఇదీ సినిమా కథ. రాబిన్ హుడ్, అల్లావుద్దీన్ అద్భుతదీపం వంటి జానపద కథలు మధించి పింగళి నాగేంద్రరావు ఈ సినిమాకు కథ సమకూర్చారు.
సన్నివేశ పరమైన సందర్భోచిత పింగళి పాటలు:
పాతాళ భైరవి చిత్రంలో పాటలకు ఒక ప్రత్యేకత ఉన్నది. పింగళి నాగేంద్రరావు రచించిన పాటలు అటు సాహిత్య పరమైనవే కాకుండా సన్నివేశపరంగా కూడా అర్థవంతమైనవి కావటం… అందుకు ఘంటసాల స్వరపరిచిన బాణీలు వేటికవే గొప్పవి కావడం ఆ విశిష్టతలు. ఆ పాటల పర్వాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే….
“తీయని ఊహల హాయిని గొలిపే వసంత గానమె హాయి” అంటూ తొలి పాట మొదలవుతుంది. తోటరాముడు నివసించే ఉద్యానవనంలోకి రాకుమారి ఇందుమతి తన ఇష్ట సఖులతో వచ్చి తోట అందాన్ని ఆస్వాదించే పాటగా దీనిని చిత్రీకరించారు. తోటరాముడు తన మిత్రుడు అంజితో కలిసి ఒక చెట్టు కొమ్మమీద నుంచి రాకుమారిని గమనిస్తూ ఈ పాటకు పరవశం చెందటం నేపథ్యం. రాకుమారిని చూసిన తోటరాముడు అంజితో “ప్రాణం పోతే ఏమిరా ఒక్కసారి రాకుమారి పక్కన నిలబడితే చాలు” అంటాడు. అలా రాజకుమారిపై తోటరామునికి ప్రేమ చిగురించటానికి ఈ పాట నాంది. మోహన, యమన్ రాగ స్వరాల మేళవింపుతో పి. లీల ఆలపించిన ఈ బృందగానం నిజంగానే మన మనసులకు హాయిని గొలుపుతుంది.
ఈ పాట తరవాత ఉజ్జయిని పురవీధుల్లో ఒక కూడలి వద్ద అలనాటి సాహస వీరుల గాధలను వివరిస్తూ టి. జి. కమలాదేవి బృందం ఆలపించే “ఇతిహాసం విన్నారా.. ఆ అతిసాహసులే ఉన్నారా” అనే పాట వస్తుంది. ఈ పాట ఎత్తుగడను ఒక హెచ్చరికతో ప్రారంభించటం ఒక విశేషం అయితే అందులో తోటరాముడి లో నిగూఢంగా ఉన్న ధైర్య సాహసాలకు బీజం వేసే నేపథ్యంతో బుర్రకథ ప్రక్రియతో వచ్చేలా ఈ పాటను రూపొందించటం కె.వి.రెడ్డి దర్శక ప్రతిభకు నిదర్శనం.
మూడో పాటగా వినిపించే “కలవరమాయె మదిలో నా మదిలో ” అనే పాటలో రాకుమారి సౌందర్యానికి మనసు పారేసుకున్న తోటరాముడికి ఓ ప్రేమ దేవత కనిపిస్తే, రాకుమారికి అతనిలో ఉన్న సాహస వీరుడు గోచరించటం ; అది కాస్త కలవరానికి కారణం కావడం ఈ పాట నేపథ్యం. భీమ్ పలాస్ రాగంలో ఘంటసాల మధురంగా స్వరపరిచిన ఈ పాటకు పి.లీల గళం కలపటం లో ఒక రసశిల్పాన్ని ప్రేక్షకుడు ఆస్వాదిస్తాడు.
నాలుగో పాట “ఎంత ఘాటు ప్రేమయో.. ఎంత తీవ్ర వీక్షణమో ” కూడా ప్రేమికుల మదిని దోచేస్తుంది. ఈ పాట ఎత్తుగడే పింగళి అద్భుతంగా మలచిన ఒక అక్షర కుసుమాల తోరణం. పద ప్రయోగం ఘాటుగా ఉన్నా పాట మాత్రం లలితంగా ఉండటం ఓ విశేషం. అందులో “కన్నుకాటు తిన్నదిగా” వంటి ప్రయోగంతో రాకుమారి తనపై తోట రాముని తీవ్రమైన చూపుల కిరణాలు పడటం ఫలితంగా ప్రేమ పుష్పం వికసించింది అనే భావంతో ఈ పాటను ఆలపించటం అసలైన విశేషం. రాజేశ్వరి రాగ ఛాయల్లో స్వరపరిచిన ఈ గీతం ఓ అపురూపం.
ఐదో పాటగా వినిపించే “వినవే బాలా…నా ప్రేమగోల” పాట హాస్యం పంచుతూనే ఆకట్టుకుంటుంది. రాణి గారి తమ్ముడు ఇందుమతిని వెంటాడుతూ ఆమెను చికాకు పరిచే నేపథ్యంలో రేలంగి స్వీయగళం లో జాలువారే పాట ఇది. ఈ సన్నివేశంలో ఓ త్రాచుపాము రాకుమారి చేరువకు రాబోవటం, ఈ దృశ్యాన్ని చెట్టు కొమ్మమీద కూర్చుని ఉన్న తోటరాముడు గమనించి ఒడుపుగా ఆ పామును పట్టుకొని విసిరి వేయడం… దాంతో రాకుమారికి తోటరాముని మీద ప్రేమ ద్విగుణీకృతం కావడం విశేషం.
తరవాత వినవచ్చే “వగలోయ్ వగలు… తళుకు బెళుకు వగలు..” పాట రసపిపాసులను మత్తెక్కిస్తుంది. ఉజ్జయిని నగర వీధుల్లో నేపాళ మాంత్రికుడు తన ఇంద్రజాల విద్యల్ని ప్రదర్శిస్తూ అందులో భాగంగా ఒక భామను సృష్టించి “మహా జనానికి మరదలు పిల్లా ఆడవే” అనగానే ఈ పాట మొదలవుతుంది. ఈ పాటకు నాట్యం చేసింది లక్ష్మీకాంత. జిక్కి బృందం ఆలపించిన ఈ పాటకు “ది లవ్స్ ఆఫ్ కార్మెన్” అనే ఆంగ్ల చిత్రంలో రీటా హేవర్త్ పాడిన పాట ఆధారం. ఇక్కడే రాజుగారి బామ్మర్దిని మాంత్రికుడు ఆడదానిగా మార్చేసినప్పుడు వినిపించే “తాళలేనే నే తాళలేనే” బిట్ సాంగ్ సైతం కితకితలు పెడుతుంది.
ఇక ఎనిమిదవ పాటగా వినిపించే నేపథ్య గీతం “ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు” అప్పట్లోనే కాదు, ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. ఇందులోనూ పింగళివారు అలతి పదాలతోనే అలరించారు. ప్రాసనియమం చెడకుండా సందర్భశుద్ధిగా ఓ జానపద చిత్రంలో ఇంతటి నేపథ్య గీతాన్ని ప్రవేశపెట్టడం గొప్ప విషయంగా చెప్పుకోవాలి . సింధు భైరవి రాగానికి దగ్గరగా స్వరపరిచిన ఈ పాటను వి.జె.వర్మ ఆలపించగా ఘంటసాల హమ్మింగ్ చేయడం విశేషం. పాట తొలి చరణంలో కన్నతల్లి కడుపు తీపి; మలి చరణంలో రాకుమారి హృదయ వేదన; మూడో చరణంలో ప్రేమ విఫలమైతే తోటరాముడు ప్రాణత్యాగానికి సంసిద్ధమయ్యే భావం ఇందులో వ్యక్తమౌతుంది.
తరవాత నాయికానాయకులపై చిత్రీకరించిన యుగళగీతం… “ప్రణయజీవులకు దేవి వరాలే…కానుకలివియే ప్రియురాలా” అంటూ మొదలై, “హాయిగా మనకింకా స్వేచ్ఛగా” అనే పల్లవితో సాగుతుంది. నిజంగానే చూసే ప్రేక్షకులకు, వినే శ్రోతలకు ఈ పాట హాయిని ప్రసాదిస్తుంది.
పదవ పాటగా రూపొందిన “రానంటే రానే రాను…”అనేది బిట్ సాంగ్. ఇందులో సావిత్రి నృత్య దర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తి నటించారు. ఈ పాట వెనుకే “విజయ తోరణము నీవే..” అంటూ నాలుగు పంక్తుల పాట వస్తుంది. అదికూడా ప్రేక్షకులను అలరిస్తుంది.
ఇక చివరగా కథానాయకుడు ప్రియురాలి కోసం గాలిస్తూ వ్యధతో గానం చేసే “కనుగొనగలనో లేనో” పాట ఉంటుంది. ఈ పాటలో కూడా పింగళివారు ప్రాసవీడకుండానే పదబంధాలతో పరవశింప చేసిన తీరును సాహితీ ప్రియులు ఈ నాటికీ మననం చేసుకుంటూనే ఉన్నారు.
పాతాళ భైరవి రూపకల్పన విశేషాలు
ఇప్పటికి డెబ్భై ఐదేళ్ళు గడచినా ఈ సినిమా చిత్రీకరణలో వన్నె తగ్గకపోవడం ఛాయాగ్రాహకుడు మార్కస్ బార్ట్ లే పనితనానికి మచ్చుతునక. మాధవపెద్ది గోఖలే, కళాధర్ లు నిర్మించిన అందమైన భారీ సెట్టింగులు ఈ సినిమాకు రిచ్ నెస్ కట్టబెయ్యాయి. దర్శకుడు కె.వి. రెడ్డికి సహాయదర్శకుడుగా బాలగంగాధర తిలక్ వ్యవహరించగా, చిత్రానువాదం విషయంలో కమలాకర కామేశ్వరరావు దర్శకునికి సహకారం అందించారు. ఈ సినిమాను మార్చ్ 15, 1951 న ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 13 ప్రింట్లతో విడుదల చేశారు. అలా 10 కేంద్రాల్లో ఈ సినిమా వందరోజులు ఆడింది. అయితే కర్నూలు, భీమవరం, విశాఖపట్నంలో ఈ సినిమాను 90 రోజులకే ఎత్తివేయడం జరిగింది. లేకుంటే ఆ మూడు కేంద్రాలలో కూడా వందరోజులు ఆడి చరిత్ర సృష్టించేదే. ఈ సినిమా అనూహ్య విజయం సాధించడంతో సినిమా 11 వ వారం ఆడుతుండగా మరో 60 ప్రింట్లు అదనంగా ముద్రించి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాలలో విడుదల చేశారు. ఈ సినిమాకోసం రెండు డూప్లికేట్ నెగటివ్ లు సిద్ధం చేయడం కూడా ఆరోజుల్లో వింతగా చెప్పుకున్నారు. 5 కేంద్రాలలో ఈ చిత్రం 25 వారాలు ఆడింది. వాటిలో బళ్ళారి, బెంగుళూరు, నెల్లూరు, విజయవాడ, గుడివాడ వుండడం గొప్ప విషయం. మద్రాసులో ఈ సినిమా శతదినోత్సవం జరిపినప్పుడు అందులో పనిచేసినవారికి మూడు నెలల బోనస్ అందజేశారు. ఈ సినిమా సంపాదించిపెట్టిన లాభాలతో వాహినీ స్టూడియోను విస్తృతపరచి అదనంగా మరొక ఫ్లోర్ నిర్మించారు. ఆ ఫ్లోర్ కు ‘పాతాళభైరవి ఫ్లోర్’ అని నామకరణం కూడా చేశారు. పాతాళభైరవి సినిమా విజయా సంస్థకు చిరస్మరణీయమైన గుర్తింపును తెచ్చిపెట్టింది.
గోల్డ్ స్టోన్ టెక్నాలజీస్ వారు విజయ వాహిని సంస్థలు నిర్మించిన 14 సినిమాల నెగటివ్ హక్కులను సంపాదించి తొలి ప్రయత్నం గా 2010లో ‘మాయాబజార్’ చిత్రాన్ని డిజిటల్ టెక్నాలజీ ద్వారా రంగుల్లోకి మార్చారు. తదనంతరం 75 సంవత్సరాల అద్భుత చరిత్ర కలిగిన ఈ ‘పాతాళభైరవి’ చిత్రాన్ని కూడా కలర్ లోకి మార్చాలని ప్రతిపాదనలు ఖరారు చేసినా, కొన్ని టెలివిజన్ సంస్థల వద్ద కూడా ఈ సినిమా నెగటివ్ హక్కులు ఉండటంతో పాతాళభైరవి చిత్రాన్ని డిజిటైజ్ చేసే ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
పాతాళ భైరవి చిత్రం లోని నేపాళ మాంత్రికుడి గుహలు, మాయా మహల్, కోటలు అన్నీ సెట్స్ అంటే నమ్మబుద్ధి కాదు. కృత్రిమ మేధ, కంప్యూటర్ వ్యవస్థ లేని ఆ రోజుల్లో సెట్టింగులు ద్వారా నిజమైన ఆకృతులను భమింప చేయడం కళాదర్శకులు మాధవపెద్ది గోఖలే, కళాధర్ ల గొప్పతనం.
1951 లోనే పాతాళ భైరవి చిత్రం కోటి రూపాయల వసూళ్లను సాధించటం ఒక పెద్ద రికార్డు. ఇక తమిళ వర్షన్ వసూళ్లు కూడా కలుపుకుంటే కోటిన్నర రూపాయల రికార్డును దాటింది. అందులో నిర్మాతల వాటా రూ.60 లక్షలకు పైగానే అని చెప్పుకునే వారు.
ఈ చిత్రంలో పింగళి నాగేంద్రరావు చూపిన గొప్ప మలుపు అంజి గాడు గా నటించిన బాలకృష్ణ సదా జపుడిగా నటించిన పద్మనాభాన్ని తోటరాముడి వివాహానికి ఆహ్వానించటం. చిత్రంలో ఈ సన్నివేశమే లేకుంటే అసలు కథ లేదనుకోవాలి. అలా పింగళి రచనా వైదుష్యం ఈ చిత్రంలో అడుగడుగునా కనిపిస్తుంది.
ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ సౌండ్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేశారు. అలాగే మరో ప్రముఖ దర్శకులు కె ఎస్ ప్రకాశరావు ఈ చిత్రానికి సహాయ దర్శకుడుగా పని చేస్తూనే ఒక రాక్షసుని పాత్రలో కనిపిస్తారు.
పసందైన పదాలు:
ఇక ఈ సినిమాలో దర్శకుడు కె.వి. రెడ్డి, తన అసోసియేట్ కె.కామేశ్వరరావుతో కలసి స్క్రీన్ ప్లే రాశారు. వారు కథను నడిపించిన తీరు ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంది. అదలా ఉంచితే ఇందులోని ప్రధాన పాత్రలకు ఏదో ఒక ఊతపదం పెట్టడం కూడా అలరించే అంశం. దీనిని తరువాతి తరం దర్శకులు, కథకులు భలేగా అనుసరించారు. కథానాయకుడైన తోటరాముడు “నిజం చెప్పమన్నారా…అబద్ధం చెప్పమన్నారా…” అంటూ ఉంటాడు. ఇక రాజుగారి బామ్మర్ది ప్రతి మాటకు “తప్పు తప్పు…” అనడంతో వినోదం పండిస్తాడు. అలాగే “మహా సాహసవంతుడు… సన్మార్గుడు…” కావాలని మాంత్రికుడు కోరుకోగా, అతని శిష్యుడు సదాజపుడు “మహాసాహసవంతుడే… వాడి జోలి మనకొద్దు గురో…” అనడం ప్రేక్షకుడికి కథానాయకుని బలంపై మరింత గురి కుదిరేలా చేస్తాయి.
ఇక తోటరాముడు అర్ధరాత్రి అంతఃపురంలో రాకుమారి మందిరంలో ప్రవేశించి, ఆ ప్రేమకై తాను తపించిన తీరును గురించి చెప్పిన మొత్తం సన్నివేశం యువతీయువకులను తరతరాలుగా అలరిస్తూనే ఉంది. ముఖ్యంగా రాకుమారితో “నీ ప్రేమలేని ప్రాణమెందుకు రాజకుమారి…” అన్న వాక్యం ఈ నాటికీ ఆ నాటి ప్రేమికుల మదిలో మారుమోగుతూనే ఉంది. ఇక అదే సన్నివేశంలో రాకుమారి మందిరంలో ప్రవేశించిన తోట రాముని పట్టుకోవాలని లోపలకువచ్చిన రాజు బామ్మర్ది పలికే, “అంతేలే… అంతేలే…” , తరువాత “అంతేగా…అంతేగా…” అనే మాటలు తరువాతి రోజుల్లో పలువరు రచయితలు అనుసరించి జనాన్ని ఆనందింప చేశారు. ఈ సన్నివేశంలో రాకుమారి విసుగ్గా “అంతకాకపోతే ఇంత… ఏమిటి మామయ్యా ఇదంతా…” అనడంలోనూ శబ్ద సౌందర్యం చూసి సామాన్య ప్రేక్షకుడు సైతం సంబరపడ్డాడు. ఇక తన విగ్రహాన్ని నొసటతాకి, తలచుకున్నవారికి దేవి ప్రత్యక్షమై, “నరుడా ఏమి నీ కోరిక” అనడం, మాంత్రికుడు, తోటరాముని “సాహసం సేయరా డింభకా” అనడం కూడా జనాల్లో భలేగా నానిపోయాయి. తరువాతి రోజులలో ఈ పదాలు కొన్ని సినిమాలకు మకుటాలుగానూ మారాయి.
మరచిపోలేని.. మార్కస్ సినిమాటోగ్రఫి!
‘పాతాళభైరవి’ చిత్రానికి కథ, మాటలు, పాటలు ఎలా ఓ ప్రధాన ఆకర్షణగా నిలిచాయో, చిత్రీకరణ కూడా అంతగానే ఆకట్టుకుంది. మార్కస్ బార్ ట్లే సినిమాటోగ్రఫి ఈ చిత్రాన్ని జనానికి కనువిందుగా అందించింది. ప్రతి పాటలోనూ, ప్రధాన సన్నివేశాల్లోనూ బార్ ట్లే సినిమాటోగ్రఫీ గ్రామర్ ను అనుసరించిన తీరు ఇప్పటి మేధావులను సైతం మురిపిస్తోంది. కోటలో రాకుమారి, తోటలో రాముడు మధ్య “కలవరమాయె మదిలో…”, “ఎంత ఘాటు ప్రేమయో…” రెండు యుగళగీతాలను చిత్రీకరించిన వైనాన్ని ఎవరు మాత్రం మరువగలరు. తరువాతి రోజుల్లో ఇదే పంథాను పలువురు దర్శకులు, సినిమాటోగ్రాఫర్స్ తమ చిత్రాలలో ఉపయోగించుకున్నారు. ఇక ఔట్ డోర్ లో చిత్రీకరించిన “ప్రేమకోసమై వలలో పడెనే…” పాటలోనూ, “కనుగొనగలనో లేనో…” పాటలోనూ హీరో మనస్తత్వాన్ని తెరపై ఆవిష్కరిస్తూనే అందుకు తగ్గ సినిమాటోగ్రఫీ గ్రామర్ ను అనుసరించారు.
“ప్రేమ కోసమై వలలో పడెనే…” పాటలో హీరో ఏదో సాధించాలన్న ఉత్సాహంతో ఆనందంతో సాగుతూ ఉంటాడు. ఈ పాట ప్రారంభాన్ని గమనిస్తే – ఇది ఫ్రేమ్ లో ఎడమ వైపు నుండి తోటరాముడు, అతని ముందు నేపాళ మాంత్రికుడు కనిపిస్తూ మొదలవుతుంది. మనుషుల్లో అత్యధికులు ఎడమవైపు నుండి కుడివైపుకు చూస్తారు. అలా చూడటంలో కంటికి అంతగా శ్రమ ఉండదు. అదే కుడి నుండి ఎడమకు చూసినప్పుడు కళ్ళు కాసింత శ్రమకు గురవుతాయి. దీనిని అనుసరించే సినిమాటోగ్రఫీ సూత్రకారులు సంతోషం కలిగించే సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో సబ్జెక్ట్ ను ఎడమ వైపు నుండి కుడివైపు సాగేలా చూడాలని, బాధ కలిగించే సీన్స్ తీసేటప్పుడు అందుకు భిన్నంగా కుడి నుండి ఎడమకు సబ్జెక్ట్ వచ్చేలా చూడాలనీ సెలవిచ్చారు.
ఆ సూత్రాన్ని తు.చ. తప్పకుండా మార్కస్ బార్ ట్లే ఇందులో అనుసించారు. పైగా ఈ రెండు పాటల చిత్రీకరణలో కెమెరా యాంగిల్స్ ను గమనిస్తూ పోతే నవతరం సినిమా అభిమానులు అధ్యయనం చేసే గ్రామర్ తప్పకుండా కనిపిస్తుంది. ఈ రెండు పాటల్లోనూ ఉపయోగించిన వైప్స్, ఇంటర్ కట్స్ ను తీసిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. ఆ రోజుల్లో ఆసియా ఖండ దర్శకుల్లో జపాన్ దర్శకుడు అకిరా కురసోవా ఉపయోగించే వైప్స్ ను హాలీవుడ్ జనం సైతం చూసి ఆనందించి, అభినందించారు. ఇప్పటిలాగా మన సినిమాలకు అప్పట్లోనే విదేశీ మార్కెట్ లో ప్రవేశం ఉండి ఉంటే, ‘పాతాళబైరవి’ చిత్రంలోని దర్శకుని ప్రతిభ, సినిమాటోగ్రాఫర్ నైపుణ్యం అంతర్జాతీయ చలనచిత్ర అధ్యయన పుస్తకాల్లో చోటు సంపాదించేవని చెప్పక తప్పదు.
ఆకట్టుకొనే వేషధారణ!
‘పాతాళభైరవి’ చిత్రంలో తోటరాముని గెటప్ చూస్తే ఆంగ్ల నటుడు డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్ సీనియర్ కొన్ని జానపదాల్లో ధరించిన దుస్తులు గుర్తుకు రాకమానవు. ఇక నేపాళ మాంత్రికుని తీరు చూస్తే ‘ఇవాన్ ద టెర్రిబుల్’లోని నికొలాయ్ గెటప్ తలపుకు వచ్చి తీరుతుంది. తోటరాముని స్నేహితుడు అంజి పాత్రకు జపాన్ చిత్రాల్లోని హాస్య పాత్రలను అనుసరించినట్టు తెలుస్తుంది. అలాగే మాయామహల్ వెలసిన తరువాత అందులో రాజుగారి కుటుంబానికి తోటరాముడు చూపించే వినోదాల విందులో “విజయ తోరణం నీవే…” బిట్ సాంగ్ కు ముందు నర్తకీమణులను ఆడిస్తూ ఓ భారీ ఆకారం (దీనిని మహంకాళి వెంకయ్య ధరించారు) కనిపిస్తుంది. ఆ గెటప్ కూడా జపాన్ జానపద నాటకాల్లో తరచూ కనిపించే పాత్రల్లాగే ఉంటుంది.
సదాజపుని గెటప్ ఫెయిర్ బ్యాంక్స్ నటించిన అరేబియన్ నైట్స్ కథల్లోని కమెడియన్ లాగే కనిపిస్తుంది. అయితే తోటలో ముసలిదాని కొడుక్కి అలాంటి దుస్తులు ఎక్కడ నుండి వచ్చాయి అన్న ప్రశ్న తలెత్తక మానదు. అందులో భాగంగానే తోటరాముడు, అతని మిత్రుడు రోజూ వినోదం కోసం సత్రం లోకి వెళతారని చూపించారు. అక్కడకు దేశవిదేశాల్లోని వారు కూడా వస్తారన్నట్టు ఓ పాత్ర చేత “పారశీకం…” నుండి వచ్చానని చెప్పిస్తారు.
పాతాళభైరవి చిత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందుకే ఆ సినిమా పదికాలాలపాటు గుర్తుపెట్టుకునేలా ఇప్పటికే 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా గొప్ప విషయం.
చిత్ర తారాగణం:
ఎన్.టి. రామారావు, ఎస్.వి. రంగారావు, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, రేలంగి, బాలకృష్ణ, పద్మనాభం, మాలతి, హేమలతమ్మారావు, టి.జి. కమల, లక్ష్మీకాంత, గిరిజ, సురభి కమలాబాయి, చిట్టి, సావిత్రి (నాట్య కారిణిగా)
సాంకేతికవర్గం:
కథ, మాటలు, పాటలు: పింగళి నాగేంద్రరావు- సంగీతం: ఘంటసాల- ఆర్కెస్ట్రా సహకారం: మాస్టర్ వేణు- ఛాయాగ్రహణం: మార్కస్ బార్ట్ లే- కళ: మాధవపెద్ది గోఖలే, కళాధర్- శబ్దగ్రహణం: ఏ. కృష్ణన్- నాట్యం: పసుమర్తి కృష్ణమూర్తి- రికార్డింగ్: వల్లభజోశ్యుల శివరాం- మేకప్: హరిపాదచంద్ర (హరిబాబు) & పీతాంబరం- కూర్పు: సి.పి. జంబులింగం & మణి- నేపథ్యగానం: ఘంటసాల, రేలంగి, పిఠాపురం, వి.జె. వర్మ, పి.లీల, జిక్కి, టి.జి. కమల, ఏ.పి. కోమల- సహాయ దర్శకుడు: దేవరకొండ బాలగంగాధర తిలక్- దర్శకత్వం: కె.వి. రెడ్డి- స్టూడియో: వాహిని
