సహనమే ఆయుధం

అసహనాన్ని ప్రకటించడానికి అరక్షణం చాలు.. సహనంతో నిరీక్షించడానికి ఎన్నో క్షణాలు కావాలి.. సమాజంలో ప్రతిరోజు అసహనానికి గురి చేసే క్షణాలు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని సహనంతో ఎదుర్కొంటూ ముందుకు పోగలిగినప్పుడే ప్రశాంతమైన విశ్రాంతి ఆ రోజుకు దొరుకుతుంది.. అరిషడ్వర్గాలను జయించగలిగిననాడు ఉత్తమ జీవనం పొందినట్లేనని పురాణాలు చెబుతున్నాయి.. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలలో ప్రధానమైనది క్రోధం (కోపం ).. దీనివలన మనుషులు సహనాన్ని కోల్పోయి విచక్షణారహితంగా ప్రవర్తించి వ్యక్తిత్వాన్ని నాశనం చేసుకుంటారు.. ఇలాంటి వ్యక్తుల వలన కుటుంబ వినాశనమే కాదు సామాజిక వినాశనం కూడా జరుగుతుంది.. మనిషిలో అసహనం మొదలైతే మానసిక, శారీరక రుగ్మతలకు బీజం పడినట్టే!

హిరణ్యకశిపుడు, రావణాసురుడు వంటి అసురులతోపాటు కురువంశ యోధుడు దుర్యోధనుడు సైతం అసహనం, అహంకారంతో సర్వస్వాన్ని కోల్పోయి చేజేతులా వినాశనాన్ని కోరి తెచ్చుకున్నారు.. పురాణాలు అసహనాన్ని నిరసిస్తూ సహనాన్ని (ఓర్పు) ఉత్తమ గుణంగా చెప్పాయి.. రాముడు, ప్రహ్లాదుడు, ధర్మరాజు వంటి వారు అత్యంత క్లిష్ట పరిస్థితులలో కూడా సహనాన్ని పాటించి విజయాన్ని సాధించారు.. సహనపరులు ధర్మరక్షకులుగా ఉంటారన్నది చరిత్ర చెబుతున్న సత్యం

తన కుమారుడు ప్రహ్లాదుడు నారాయణుడిని అనుక్షణం స్మరించడం నచ్చని హిరణ్యకశిపుడు అసహనంతో అహంకారంతో సొంత కుమారుడిని చంపుకోవడానికి ప్రయత్నించి నరసింహుని చేతిలో ప్రాణాలు కోల్పోయాడు.. ఈ ఉదంతం సహనానికి అసహనానికి మధ్యగల తీవ్రతను సమాజానికి సందేశంగా తెలియజేసింది.. సీతాదేవిని అపహరించిన రావణాసురుడు రామునిపై గల అసహనంతో లంకకు చేటు తెచ్చుకున్నాడు.. పాండవుల ఎదుగుదలను చూసి ఓర్వలేక వారి పట్ల అసూయ, అసహనంతో కురువంశ వినాశనానికి మూలమయ్యాడు దుర్యోధనుడు.. వీరిలో ఒకరు సామ్రాజ్య వినాశనానికి కారకులైతే మరొకరు వంశ వినాశనానికి సూత్రధారయ్యారు

సహనంతో ప్రవర్తించగలిగితే అనుకున్న ఫలితాలు ఆలస్యమైనప్పటికి చేరువవుతాయనే సందేశాన్ని అందించే ఎన్నో కథలు పురాణాలలో కనిపిస్తాయి.. “లోకా సమస్తా సుఖినోభవంతు” అనడంలో ప్రధానోద్దేశ్యం సహనమే! లోకశాంతి కోసం ఎందరో మహర్షులు తమ జీవితాలను ధారపోసారు.. విద్య, వైద్య, పారిశ్రామిక మరియు రాజకీయ రంగం ఏదైనా అసహనం వినాశనాన్ని తీసుకువస్తుంది.. సహనం ఉన్నత పీఠంపై కూర్చోబెడుతుంది.. అలాంటి వ్యక్తుల వలన ధర్మ పరిరక్షణ జరగడంతో పాటు ధర్మసంస్థాపన కూడా జరుగుతుంది

ఎన్.బి.యస్. శ్రీనివాస్ పోలిశెట్టి
(9989646639)

Share via
Copy link
Powered by Social Snap