బహుముఖ ప్రజ్ఞాశాలి డా. పట్టాభి రామ్

సాహితీ కృషీవలుడు. ఆంగ్ల భాషను ఆపోశన పట్టిన విద్యాధికుడు డా. పట్టాభి రామ్ తుర్లపాటి గారి జన్మదినం సెప్టెంబర్ 13, సందర్భంగా ప్రత్యేక వ్యాసం…!
ఆంగ్ల, తెలుగు భాషాకోవిదుడు… మంచి అభిరుచిగల రచయిత డా. తుర్లపాటి పట్టాభి రామ్. ఆంగ్ల తెలుగు భాషలలో వందలాది కథానికలు, కవితలు, వ్యాసాలూ పట్టాభి రామ్ కలం నుండి జాలువారాయి. ఆంగ్ల సాహిత్యలో 10 సంవత్సరాలలో 600 లకు పైగా గ్రంధాలను రచించి ప్రపంచంలో ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించి ప్రపంచ రికార్డు సాధించన సాహితీ దీక్షాపరుడు. వీరి అక్షర సేద్యం అనితర సాధ్యం.

బాల్య విశేషాలు.. ఊరి ప్రత్యేకతలు.. అమ్మానాన్నల విశేషాలు…

తండ్రి గారి ఊరు తోట్లవల్లూరు. తల్లిగారి ఊరు గుడ్లవల్లేరు. గుడివాడ దగ్గర గుడ్లవల్లేరు గ్రామంలో శ్రీ తుర్లపాటి వెంకట సీత రామ ప్రసాద్, శకుంతల దేవి దంపతులకు జన్మించిన వీరికి మొదటినుండి విద్యపట్ల ఆసక్తి ఎక్కువ. గుడ్లవల్లేరు ఓ అందమైన కుగ్రామం. అగ్రహారం… చెరువు గట్టున తాత గారి ఇల్లు ఉండేది. ప్రతి శుక్రవారం జరిగే సంత గొప్పగా ఉండేది. విశేష మేమిటంటే వీరి చదువు పూర్తి అయినా తరువాత మొదటి ఉద్యోగం గుడ్లవల్లేరులోనే. విజయవాడలో నాన్నగారు ఆర్.ఎం.ఎస్. లో పని చేసేవారు. వీరికి ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు. వీరి తొలి అడుగులకు తల్లితండ్రుల ప్రోత్సాహం మెండుగా లభించింది. ప్రాధమిక విద్య, ప్రభుత్వ పాఠశాల ఏ.కే.టి.పి.ఎం.హెచ్. స్కూల్లో జరిగింది. ఉన్నత విద్య శాతవాహన కళాశాల, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగింది. ఆంగ్ల భాషలో మక్కువ ఎక్కువ. ఆంగ్ల భాషలో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్న తరువాత కూడా వీరికి విద్యపై మక్కువ తగ్గలేదు. సోషియాలజీ లో పోస్టుగ్రాడ్యుయేషన్, సైకాలజీ లో పోస్టుగ్రాడ్యుయేషన్, జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్ లో పోస్టుగ్రాడ్యుయేషన్, ఆ తదుపరి ఆంగ్ల సాహిత్యలో పరిశోధనకు వీరికి డాక్టరేట్ లభించింది.

తొలిరోజుల్లో సాహితీ ప్రస్తానం…

వీరికి మొదటినుండి రచనలంటే ఎంతో ఇష్టం. పద్దెనిమిదేళ్ల వయసులో వ్యాసాలు, కవితలు రాసేవారు. పత్రికలో అచ్చయిన మొదటి రచన కూడా వ్యాసమే. ఈనాడు, ప్రజాశక్తి దినపత్రికలు వీరు తండ్రి గారు తెప్పించుకునేవారు. ప్రజాశక్తిలో “వర్ధమాన రచయితలకు” స్వాగతం అనే ప్రకటన చూసి వ్యాసంగాని, కధానిక రాయాలని అనిపించింది. ఇతివృత్తం ఏమిటి? ఆలోచించి “చక్రబంధలో స్త్రీ” అని పెళ్ళైన మహిళలలు పడుతున్న ఇబ్బందులపై రాసి పంపటం జరిగింది. ఒకరోజు ఆ పత్రిక సహా సంపాదకులు శ్రీమతి ఉదయలక్ష్మి గారు ఫోన్ చేసి, “మీ మొదటి రచన చాలా బాగుంది. మేము ప్రచురిస్తున్నాము. దీనికి పారితోషికంగా మీకు వంద రూపాయలు పంపుతున్నాము.” అని అన్నారు. ఆ తరువాత వీరు రాసిన కవిత ‘తరంగిణి” వారపత్రిక లో ప్రచురితమైనది. ఆ తరువాత వీరు రాసినవి ఎన్నో పత్రికలలో అచ్చయ్యాయి. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంద్ర జ్యోతి, వార్త, ఈనాడు, మొదలగు పత్రికలలో వీరి రచనలు అచ్చువేసారు. సరళమైన భాషను ఉపయోగిస్తూ పదునైన మాటలతో వీరి రచనాశైలి ఉంటుంది. కొన్ని మీకోసం “ఆలోచనలు”- కొన్ని నడుస్తాయి. కొన్ని నడిపిస్తాయి. వీరు రాసిన “మాట్లాడటం కూడా ఒక కళే” అనే వ్యాసం సమాజం లో వ్యక్తులు అవసరం కోసం ఎలా పొగడ్తలను ఉపయోగిస్తారో మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తుంది.

ఆ తరువాత ఆంగ్ల సాహిత్యం తో మక్కువ పెంచుకుని ఆంగ్లంలో రచనలు కొనసాగించారు. ఇండియన్ ఎక్సప్రెస్, డెక్కన్ క్రానికల్, ది హిందూ లో వీరు రాసిన రచనలు తరుచుగా ప్రచురితమైనాయి.


బోధనా రంగంలో…
విద్యారంగంలో బోధనా రంగంలో వీరి అడుగులు చాలా ప్రస్ఫుటంగా గోచరిస్తాయి.
ఉపాధ్యాయుడిగా వీరి వినూత్న పద్ధతులు ఈ రోజుకీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఉపాధ్యాయుడిగా, ప్రిన్సిపాల్, అకాడమిక్ డైరెక్టర్గా వారణాసి, అలాహాబాద్, నైనిటాల్, ఢిల్లీ, పలు రాష్ట్రాలలో వీరు పనిచేశారు. వీరి కృషికి పలు జాతీయ పురస్కారాలను అందుకున్నారు. ఇంగ్లీష్ భాషా బోధనలో మొదటి సారిగా దేశంలోనే “ఇంగ్లీష్ లాబ్స్” ప్రవేశపెట్టి బాషా బోధనలో కొత్త ప్రమాణాలకు శ్రీకారం చుట్టారు.

పలు సంస్థల సారధిగా…
స్కోర్ మోర్ ఫౌండేషన్ వ్యస్థాపకుడిగా, భారతీయ కళావేదిక డైరెక్టర్ గా, ఛాంపియన్స్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ వ్యవస్థాపకునిగా, స్కోర్ మోర్ న్యూస్ మీడియా ప్రధాన సంపాదకుడిగా, ఐ స్టార్ లండన్ లిమిటెడ్ డైరెక్టర్ గా పలు భాధ్యతలను వీరు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. వీరి కృషి తో స్కోర్ మోర్ ఫౌండేషన్ ఎన్నో దేశాలలో విశేష ప్రాచుర్యాన్ని పొందినది.

పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు
బహుముఖ ప్రజ్ఞా వంతుడైన వీరికి అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. బాల సాహిత్యంలో ముఖ్యంగా ఆంగ్ల సాహిత్యంలో కృషి చేసినందుకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీరికి “ప్రతిభా” పురస్కారాన్ని అందచేసి ఘనంగా సత్కరించింది. విజయవాడలోని కళాదర్శిని వీరికి “ఉత్తమ ఆంగ్ల రచయత” గా గుర్తించి సత్కరించింది. ప్రముఖ సినీ కధా రచయత శ్రీ. విజయేంద్ర ప్రసాద్ గారు (దర్శకులు రాజమౌళి గారి తండ్రి గారు) వీరికి ఈ పురస్కారాన్ని అందచేశారు. ఎన్నో ప్రముఖ సంస్థలు హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ, ముంబై, మలేషియా, థాయిలాండ్ దేశాలలో సైతం వీరు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు.

డా. దార్ల నాగేశ్వరరావు

Share via
Copy link
Powered by Social Snap