పల్లె ఒడే సంగీత బడిగా సాగుతున్న సాటిలేని విద్వాంసుడు. తెలంగాణా మట్టినే మనసుగా చేసుకున్న పాటగాడు. అలనాటి వీర గాథలకు తన గొంతుకను అంకితమిచ్చిన నిస్వార్థ కళాకారుడు. తను నమ్ముకున్న కిన్నెర రాగాలే తనకిప్పుడు వరాలై హోరెత్తుతున్నై. ఒకే ఒక్క పాటతో కొట్లాది మందికి చేరువయ్యాడు… అతడే పాలమూరు జిల్లా అవుసలకుంట కు చెందిన మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య.
పవన్ కళ్యాణ్ ఎంతో మందికి ఆర్థిక సాయం అందజేస్తూ ఉంటారు. అందులో రచయితలు, గాయకులూ కూడా వుంటారు. ఆయన ప్రతి సందర్బంలో కూడా ఆర్థిక అవసరాల్లో ఉన్న వారికి తనవంతు సాయం చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఆర్థికంగా సాయం చేసే పవన్ కళ్యాణ్ చాలా సందర్బాల్లో కనీసం బయటకు తెలియనివ్వడు అనేది ఆయన సన్నిహితుల మాట. ఆయన చేసే సాయాల్లో కొన్ని మాత్రమే బయటకు వస్తూ ఉంటాయి. తాజాగా పవన్ కళ్యాణ్ కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య కు రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయంను ప్రకటించిన విషయం తెల్సిందే. ఆర్థిక సాయం ప్రకటించిన తర్వాత రోజే హైదరాబాద్ జనసేన పార్టీ కార్యలయంలో మొగులయ్యను సత్కరించి ఆ రెండు లక్షల చెక్కును అందజేయడం జరిగింది.
మొగులయ్యతో పాటు జానపద కళలపై పరిశోదన చేసిన డా. దాసరి రంగా గారికి కూడా రూ.50 వేల రూపాయల ఆర్థిక ప్రోత్సాహంను ఇచ్చి సత్కరించడం జరిగింది. పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్ ట్రస్ట్ నుండి ఈ ఆర్థిక సాయంను మొగులయ్య మరియు రంగా గార్లకు అందించడం జరిగిందని జనసేన పార్టీ అధికారిక మీడియా బృందం పేర్కొన్నారు. ఈ సాయం మొగులయ్య వంటి ఎంతో మంది కళాకారులకు ప్రోత్సాహకంగా నిలుస్తుందని జనసేన పార్టీ కార్యకర్తలు మరియు పవన్ అభిమానులు పేర్కొన్నారు. పవన్ మంచి మనసుకు ఇది నిదర్శణం అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ ను మొగులయ్యతో థమన్ పాడించిన విషయం తెల్సిందే. చాలా ప్రత్యేకంగా నిలిచిన ఈ పాటకు మంచి ఆదరణ లభిస్తుంది.. ప్రయోగాత్మకంగా సాగిన ఈ పాటలో తనదైన గొంతుతో అలరించిన మొగులయ్యకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ పాటకు ఇంతటి ప్రాచుర్యం దక్కేలా చేసినందుకు గాను మొగులయ్య పేరు మారు మ్రోగిపోతుంది. అందుకే భీమ్లా నాయక్ హీరో పవన్ కళ్యాణ్ ఆయన్ను సత్కరించి రెండు లక్షల రూపాయల ఆర్థిక భరోసాను ఇచ్చారు అనేది టాక్. పవన్ కళ్యాణ్ ఇలా సాయాలు చేయడం చాలా కామన్ విషయం. అయితే మొగులయ్య వంటి సీనియర్ కళాకారులకు సాయం చేయడం మంచి విషయం అంటూ కళాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
-కళాసాగర్