తొలిగా పాట హిందీలో-పి.బి. శ్రీనివాస్

సంగీతంలో ఈ కుర్రాడికి ఎటువంటి భవిష్యత్తూ లేదు’ అంటూ జ్యోతిష్కుడు స్పష్టంచేసిన తర్వాత, ఆ జ్యోతిష్యం తప్పని నిరూపించేందుకే సినీ యత్నాలు మొదలుపెట్టాడు పి.బి.శ్రీనివాస్. ఒక భాష అని కాదు, దాదాపుగా 12 భాషలలో పట్టు ఉంది, ఆంగ్లం, ఉర్దూవంటి పరాయి భాషలతో సహా.

సినీరంగం ముద్దుగా పిలుచుకున్న పి.బి.ఎస్. శ్రీనివాస్ గారిది ఫిలసాఫికల్ ఆలోచన. తన గాత్రంలో ఉన్న పరిమితులు తనకు తెలుసని పి.బి. శ్రీనివాస్ ఎప్పుడూ అంటూ ఉండేవారు. పైగా తనకు రాసి పెట్టిందే జరుగుతుంది, నేను పాడే పాటే నా దగ్గరికి వస్తుంది అనే ఫిలాసఫీ మీద జీవించాడాయన.
మనం తినే ప్రతి గింజమీదా మన పేరు భగవంతుడు రాస్తేనే అది మన నోటిలోకి చేరుతుంది లేకుంటే ఆ గింజ నోటిదాకా వచ్చినా పక్కన పడిపోతుంది అని పి.బి. శ్రీనివాస్ పలు సందర్భాలలో అన్నారు.

ఆ రోజుల్లో ముందుగా పి.బి.శ్రీనివాస్ చేత పాడించి, రికార్డింగ్ చేసిన పాటలు తిరిగి ఘంటసాల చేత పాడించిన సందర్భాలున్నాయి. తను పాడిన పాట సినిమాలో లేకపోవటం చివరిలో గమనించి లోలోపల నొచ్చుకున్నాడేమో కాని బయటకు ఏనాడూ ఎవరినీ నిందించలేదు.
గొంతులో రేంజ్ తక్కువని, నాటి హీరోలకు సరిపోదని ఎవరు ఎటువంటి మాటలు అన్నా పట్టించు కోకుండా అలా సినీరంగంలో కొనసాగటం పి.బి. శ్రీనివాస్ కి చెందింది. తక్కువ పాటలే అయినా ఆనాటి అగ్ర హీరోలందరికీ పి.బి.శ్రీనివాస్ పాడాడు.
కాంతారావు, జగ్గయ్యలకు ఆయన గొంతే తెలుగులో భాయం చేశారు. తమిళంలో జెమినీ గణేశనికి, కన్నడంలో రాజకుమారికి పి.బి.శ్రీనివాస్. గొంతు తప్పించి మరొకరి గొంతు ఊహించుకోలేమన్నారు ప్రేక్షకులు. అలా అర్ధశతాబ్దంపాటు దక్షిణాది సినిమాలన్నింటిలో పాడిన పి.బి.శ్రీనివాస్ ని, ఆయా భాషలవారు మావాడే ఆయన అనేవారు.

అంతగా ఆయా భాషలమీద పట్టు సాధించటం ఆయనకే చెల్లింది. పి.బి.ఎస్.సొంత ఊరు కాకినాడ. ఆయన పూర్తి పేరు ప్రతివాద భయంకర శ్రీనివాస్. శ్రీ వైష్ణవ సాంప్రదాయ కుటుంబీకులు, అగ్రహారీ కులు. తల్లినుండి సంగీతం అబ్బింది.
సంగీతంలో ఈ కుర్రాడికి ఎటువంటి భవిష్యత్తూ లేదు అంటూ జ్యోతిష్కుడు స్పష్టంచేసిన తర్వాత, ఆ జ్యోతిష్యం తప్పని నిరూపించేందుకే సినీయత్నాలు మొదలుపెట్టాడు పి.బి.శ్రీనివాస్. ఆయన తొలిగా పాట పాడింది హిందీలో. ఆ తర్వాతే ఇతర భాషలలో గాయకుడు అయ్యాడు పి.బి.శ్రీనివాస్.సినీ రంగంలో ఎంతగా ఎదిగినా, ఎన్ని రకాల అవార్డులు అందుకున్నా వ్యక్తిగా అదే స్థిరత్వం. పర్సనాలిటీలో మార్పులేదు. ఒకప్పుడు తలమీద కుచ్చుటోపీ ఉండేది. ఆ తర్వాత కర్ణాటక రాష్ట్ర తలపాగా వచ్చింది పి.బి.శ్రీనివాస్ గారికి. అదే తేడా..
జేబులో ఎప్పుడూ పలురంగుల పెన్నులు. చేతిలో పలుపుస్తకాలు. ఎక్కడ ఏమి గుర్తుకువస్తే అది రాయటమే.పి.బి.శ్రీనివాస్ గారికి ఒక భాష అని కాదు, దాదాపుగా పన్నెండు భాషలలో పట్టు ఉంది, ఆంగ్లం, ఉర్దూవంటి పరాయి భాషలతో సహా. తొలిసారిగా చంద్రుడిమీద కాలుమోపిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కి తాను రాసి, బాణీ కట్టి, పాడిన ఇంగ్లీషు పాటను పంపించాడు పి.బి.శ్రీనివాస్. కన్నడం, మలయాళం, తెలుగులో పాటలు రాసేవారు.
సినిమా సంగీత దర్శకత్వం వహించాలనే కోరిక ‘మహాసాధ్యి’ అనే సినిమాతో తీరాల్సింది. కాని దుర దృష్టవశాత్తు ఆయన బాణీలు వినే అదృష్టం ప్రేక్షకులకు లేకుండా పోయింది. ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు.

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రంగప్రవే శంతో పి.బి.శ్రీనివాస్ వెనకపడ్డాడు.
సినిమా పాటల అవకాశాలు పరిమితమయ్యాయి. 1980 నాటికే తెలుగు సినిమా ఆయన్ని వదిలేసింది. ఆ తర్వాత అడపాదడపా ఒకటి పాడేవారు. 2010 తర్వాత ఇక నేపథ్యగానం ఆగిపోయింది. వయసు 70కి వచ్చింది. గొంతులో కొంత మార్పు సంగీత దర్శకులు పసిగట్టి ఉంటారు.పి.బి. శ్రీనివాస్ దినచర్య మాత్రం మారలేదు. ఆ గది నిండుగా పుస్తకాలు. చివరికి మంచం మీద కూడా. ఒక పక్కగా తాను పడుకునే మేర తప్పించి అన్నీ పుస్తకాలు, కాగితాలు. ఏ కొంచెం అటూ ఇటూ కదలటానికి వీలులేదు. కదిలించే సాహసం కుటుంబంలో ఎవరూ చేయలేదు. ఆ గదిలోనుండి బయటకు వస్తే తాళంవేసుకునేవారు.
సాయంత్రం మూడు అయిందంటే పి.బి. అడుగులు న్యూవుడ్ లాండ్ హోటల్ కి వెళ్ళాల్సిందే. అంత రంచగా వచ్చి అక్కడి టేబుల్ మీద కూర్చుని ఏవో రాసుకునే ఆయన్ని చూసి కొందరు ఆ హోటల్ ఓనర్ అనుకునేవారట. కాని నిజానికి అది ఆయన కాలక్షేపం. దాదాపు 45 సంవత్సరాలు అలా ఆ హోటల్
లో అనుబంధం. ఆయన రాగానే కాఫీ అందించేవారు. ఒకే సర్వర్ 30 ఏళ్ళపాటు కాపీ అందించాడు ఆయనకు. నన్ను ఆయన సర్వగా చూడలేదు.

ఆయన్ని మేము కస్టమర్‌గా భావించలేదు అన్నది హోటల్ సిబ్బంది మాట. అదే స్నేహం అందరిలో పి.బి.శ్రీనివాస్ ది. జానకి, సుశీలలతో సోదరబంధం. తాను రాసిన కవిత్వం వారికి పంపేవారు. సందర్భం వస్తే తప్పక వెళ్ళి పలకరించేవారు.
వారం ముందు కూడా పి.సుశీలను కలిశారు. ఆమెకు ఒక కవిత అందించారు. చివరి కొద్ది రోజులు ఆరోగ్యం కొంచెం మందగించినా తన దినచర్యలో మార్పు రాలేదు. సాయంత్రం హోటల్ కి వెళ్ళటం ఆపలేదు. షేవింగ్ చేసుకోవటం కష్టమై దాన్ని అలా వదిలేశారు. మరణానికి ముందురోజు ఓ కన్నడ నిర్మాత ఒకరు పాటకావాలని అడిగితే దానిని హోటల్ లోనే మొదలు పెట్టారు పి.బి.శ్రీనివాస్.
ఆ రోజు ఉదయం లేచినప్పటినుండి ఏదో అసౌకర్య భావన. గడ్డం చికాకుగావుందంటే కొడుకు షేవింగ్ సేవ చేశాడు. స్నానం ముగించి, తాను నిత్యం పెట్టుకునే నామం పెట్టుకునేందుకు తీసుకురమ్మన్నారు. అది వచ్చేలోగానే అలా కుర్చీలో కూలబడ్డారు. గుండెపోటు ఆయన ప్రాణాన్ని తీసుకెళ్ళింది.

సాంప్రదాయానికి విలువనిచ్చేవారి కుటుంబం విద్యుత్ పరమైన దహనం కాక, శాస్త్రికంగా కట్టెలు పేర్చి దహనక్రియ నిర్వహించి ఆయన కోరుకున్న విధంగా పైలోకానికి పంపగలిగారు. చివరి రోజువరకు పాటల్లో బతకటం గాయకులందరికీ దక్కే అదృష్టం కాదు. దైవాన్ని నమ్మిన పి.బి. శ్రీనివాస్ కి ఆ అదృష్టం అందించాడు ఆ నారాయణుడు.
-స్వాతి

SA:

View Comments (1)

  • GOOD SINGER. HIS VOICE SUITS MAINLY FOR HARINATH (HERO) IN THOSE DAYS. AFTER THE ENTRY OF SPB, SO MANY SINGERS LOST CHANCES IN FILM INDUSTRY. SPB MONOPOLIZED IN SUCH A WAY.