విశాఖపట్నంలో ముగిసిన మూడు రోజుల “పీల్ టు పేపర్” అరటి ఫైబర్ వర్క్‌షాప్
స్టూడియో ఆర్ట్ హౌజ్, విశాఖపట్నం లో నిర్వహించిన మూడు రోజుల “పీల్ టు పేపర్” వర్క్‌షాప్ 2026 మార్చి 7న విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అరటి చెట్టు కాండం వంటి వ్యవసాయ వ్యర్థాన్ని అధిక నాణ్యత గల, దీర్ఘకాలం నిల్వ ఉండగల చేతిపని కాగితంగా తయారు చేసే స్థిరమైన విధానాన్ని ప్రయోగాత్మకంగా నేర్పించారు. మార్చి 5 నుండి 7 వరకు స్టూడియో ఆర్ట్ హౌజ్ లో నిర్వహించిన ఈ శిక్షణ ప్రతిరోజూ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 వరకు మూడు రోజులపాటు జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రా యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ విభాగానికి చెందిన బోధనా సాంకేతిక సహాయకుడు డా. వనమ ప్రసాంత్ మార్గనిర్దేశం చేశారు.
పాల్గొనేవారు ఈ ప్రక్రియ యొక్క పూర్తి దశలను అనుభవించారు. మొదటి రోజు అరటి కాండాలను చిన్న ముక్కలుగా కట్ చేసి మరిగించడం, ఆ తరువాత వాటి ఫైబర్‌ను మెత్తటి పేస్ట్‌గా మార్చడం, దీర్ఘకాలికంగా నిలిచే కాగితం తయారికి అవసరమైన ఆమ్లత సమతుల్యత కోసం పల్ప్‌ను శుభ్రపరచడం జరిగింది. రెండో రోజు ఔత్సాహికుల కార్యకలాపాలతో కళకళలాడింది. సంప్రదాయ కలప మెష్ ఫ్రేమ్‌ల సహాయంతో పల్ప్‌ను ఎత్తి, కాటన్ వస్త్రాలపై ఒత్తి సహజంగా ఎండబెట్టడం ద్వారా ప్రత్యేకమైన ఆకృతులు పొందారు. చివరి రోజు అరటి కాగితంపై డ్రాయింగ్, మడతలు వేయడం, కొలాజ్ వంటి సృజనాత్మక ప్రక్రియలతో తమ కళాత్మకతను వ్యక్తపరిచారు.
2025లో ప్రముఖ శిల్పి డి. హరి ప్రసాద్ మరియు కీర్తి దురుగ్గడ స్థాపించిన స్టూడియో ఆర్ట్ హౌజ్, ఫైన్ ఆర్ట్ గ్యాలరీల ప్రపంచాన్ని ప్రయోగాత్మక కళా ప్రయోగశాలలతో అనుసంధానించే వేదికగా నిలుస్తోంది. ఇక్కడ కళ కేవలం చూడటానికి మాత్రమే కాకుండా అనుభవించడానికి ఉద్దేశించబడింది. ఈ వర్క్‌షాప్ ద్వారా పర్యావరణ చైతన్యం గల సృజనకర్తలు అరటి ఫైబర్‌లోని కళాత్మక అవకాశాలను అన్వేషిస్తూ సంప్రదాయం, స్థిరత్వం, సృజనాత్మకతల సమ్మేళనాన్ని అనుభవించారు.
శ్రీ కావ్య పెద్దింటి, (గ్యాలరీ & ప్రోగ్రామ్ డైరెక్టర్)
