“శంకర్ ” పెన్సిల్ కు విశ్రాంతి …

బాపు గారి సోదరులుగానే కాక, పెన్సిల్ పొర్ట్రైట్స్ చిత్రకారునిగా విఖ్యాతి చెందిన శంకర్ (సత్తిరాజు శంకర నారాయణ) గారు నుమోనియాతో వ్యాధితో ఈ రోజు (09-07-2020) కన్నుమూసారు. వారు ప్రచురించబోయే కొత్త పుస్తకానికి సంబంధించిన సమాచారం కోసం గత మే నెల 26 తేదీన నాతో చివరి సారిగా మాట్లాడారు. ఎవ్వరినీ నొప్పించక, చిరుదరహాసంతో కూడిన పలకరింపు ఇక వుండదని తెలిసి ఆయన హితులు సన్నిహితులు కన్నీటి పర్యంతమయ్యారు.

వారి జీవిత రేఖా చిత్రం మీ కోసం…
తక్కువ అక్షరాల్లో ఎక్కువ భావాన్ని పలికించడం మంచి రచయిత లక్షణం అని పెద్దలంటారు. అట్టహాసంగా కాన్వాసులూ, రంగుల ట్యూబులూ, ఎక్రిలిక్కులూ, ఆయిల్ పెయింటింగ్స్ కి కావాలి. అవి వేయటానికి చాకులు, తాపీలు- అనేక రకాల షేప్ ల బ్రష్ లూ ఉండాలి. ఇంకా వాటర్ కలర్స్ కొస్తే- ఆ రంగులు వేయటానికి స్పెషల్ బ్రష్ లూ, నిబ్బులూ ఎన్నో రకాల ఫీట్లు..
ఇవేవీ లేకుండా… ఒక A4 సైజు పేపర్- ఒక పెన్సిల్ ఉంటే చాలు.. సత్తిరాజు శంకర్ నారాయణ లో వినూత్న కళాశక్తి రూపొందుతుంది. మరీ ముఖ్యంగా “ముఖ చిత్రాలు” చిత్రించడంలో ఆయన సంచలనం సృష్టించారు. శంకర నారాయణ గారి తండ్రి గారు సత్తిరాజు వేణుగోపాల రావు గారు – చక్కటి కళాభిరుచి గల చిత్రకారులు. చిత్రకళారంగంలో అనితర సాధ్యమైన ప్రతిభను చూపించి, సంచలనాత్మక చిత్రకారుడైన బాపు గారికి స్వయానా తమ్ముడు. శంకర గారు తన పెన్సిల్ కళతో ఎందరో ప్రముఖుల పోర్గెట్స్ వేసి- వారిని పరవశింప చేసారు.

“హాసరేఖలు” (సినీ హాస్య సంగీత కళాకారుల రేఖా చిత్రాలు)

“హాసరేఖలు” (సినీ హాస్య సంగీత కళాకారుల రేఖా చిత్రాలు)

“నాద రేఖలు” (శాస్త్రీయ సంగీత విద్వాంసుల రేఖా చిత్రాలు)

“MAESTROS OF CARNATIC MUSIC” (కర్నాటక సంగీత విద్వాంసుల రూప చిత్రాలు)

“గీతార్చన” (ఆధ్యాత్మిక వేత్తల రేఖ చిత్రాలు)

“కలం రేఖలు” (కవుల, రచయితల రేఖా చిత్రాలు)

“రూపు రేఖలు” (కార్టూనిస్టుల పోరైట్స్ సంకలనం)..

ఇవీ- శంకర్ గారి చిత్రాలతో వచ్చిన సంకలనాలు.

భారతీయ నృత్య కళాకారుల చిత్ర సంకలనం కూడా తీసుకురావాలన్నది వీరి తీరని కోరిక. ఈ సంకలనాలలో పేర్కొన బడిన వ్యక్తులందరూ వారి వారి రంగాల్లో ప్రముఖులు.. నిష్ణాతులు. అలాటి ప్రముఖ వ్యక్తులను బొమ్మలలో నేటి యువతరానికి పరిచయం చేయటం శంకర్ గారి ముఖ్య ఉద్దేశం..

వారి వారి వ్యక్తిత్వాలని ప్రతిఫలించే ఈ వ్యక్తుల చిత్రాలను ప్రముఖంగా చూపిస్తూ, వారిని గురించిన వివరాలను సంగ్రహంగా తెలుపుతూ- ఇలాటి సంకలనాలు వెలువడడం చాలా ప్రశంసించదగిన ప్రయత్నం. ఈయన చిత్రకళ నిరంతర వాహిని గా కొనసాగుతోంది. 84 ఏళ్ళ వయసులో కూడా ఈయన రోజుకు ఒకటో, రెండో బొమ్మలు వేయనిదే వేయనిదే విశ్రమించేవారు కాదట.
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో 1936లో జన్మించిన వీరు  Economics లో Masters degree పొందారు. మద్రాసు ఆకాశవాణి లో 32 సంవత్సరాలు పని చేసి, 1995 లో డైరెక్టర్ గా పదవీ విరమణ చేసినప్పటి నుండి బొమ్మలేయడం లో అవిశ్రాంత సాధన చేసారు. తొలుత శంకర్ పేరుతో కార్టూన్లు గీసినప్పటికీ, ఆలిండియా రేడియోలో ఉద్యోగం రావడంతో కార్టూన్ కళ కు పుల్ స్టాప్ పెట్టారు.  ఇప్పటికి దాకా సుమారు 3వేల పై చిలుకు బొమ్మలు వేసి website లో పెట్టారు.

2019 డిసెంబర్ 15 న హైదరాబాద్ లో బాపు రమణ అకాడెమి వారు ‘బాపు అవార్డ్’ ను సత్తిరాజు శంకర్ నారాయణ గారు  అందుకున్నారు. ఆయనకెన్నో సన్మానాలు, సత్కారాలు జరిగాయి. కుటుంబ సభ్యుల ప్రోద్బలం.. బాపూ రమణల ఆశీర్వాదం – స్వర్గస్థురాలైన వారి శ్రీమతి శాంత ప్రేరణ- ఆయన చిత్రకళా విన్యాసానికి నిరంతర ప్రోత్సాహం ఇస్తున్నాయని ఆయన వినయంగా చెప్పేవారు.

”రాజు మరణించే నొక తార రాలిపోయే
కళాకారుడు మరణించే నొక తార గగన మెక్కె…
అశృ నివాళి తో…

-కళాసాగర్

4 thoughts on ““శంకర్ ” పెన్సిల్ కు విశ్రాంతి …

  1. “కళ అనంతమైనది”
    కళా తపస్వి , నిర్విరామ చిత్రకారుడు,
    అపర బ్రహ్మ అయిన ప్రముఖ చిత్ర కారుడు
    “బాపు” సోదరులు, ముఖ చిత్రాల చిత్రకారులు ” శంకర్” గారు ఈ లోకం నుండి నిష్క్రమించారు అనేది ఎంతో బాధను కలిగిస్తు న్నది.
    చిత్రకారుడు మరణించినా వారి కళా నైపుణ్యం ద్వారా ఈ విశ్వం వున్నంత వరకు
    వారు జీవించే వుంటారు.
    శంకర్ గారు ఒక ధ్రువతారగా కలకాలం ప్రకాశిస్తూ వుంటారు.
    పరమపదము నొందిన కీ.శే.శంకర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుతూ…….
    *****కళ అజరామరమైన ది*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap