
పెనుగొండ లక్ష్మీనారాయణకు 2024 సంవత్సరం సాహితీ స్వర్ణోత్సవం. ఏభై యేళ్ళు నిండిన సమయంలో “రేపటిలోకి” కవితా సంపుటి, అలాగే “అనేక” సాహిత్య వ్యాస సంపుటిని, అలాగే షష్ట్యబ్ది సందర్భంగా “విదిత” అనే వ్యాస సంపుటిని వెలువరించిన విషయం పాఠకులకు తెలిసిందే! ఈనాడు సాహితీ స్వర్ణోత్సవం సందర్భంగా “విశేష” అనే అభ్యుదయ వ్యాసాల సంపుటిని వెలువరించారు. గతంలో వెలువరించిన “దీపిక” వ్యాస సంపుటిని ఇటీవలే కేంద్ర సాహిత్య అకాడెమీ వరించింది. 1972లో ‘సమిధ’ అనే కవితతో తన ప్రస్థానం ప్రారంభించిన పెనుగొండ లక్ష్మీనారాయణ, అదే ఏడాది అభ్యుదయ రచయితల సంఘం కార్యకర్తగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అభ్యుదయ రచయితల సంఘంలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు బాధ్యతలను ఎంతో నిబద్ధతతో నిర్వహించి, 2023లో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ రకంగా ఈ పదవిని అలంకరించిన తొలి తెలుగు సాహితీవేత్తగా పెనుగొండ గుర్తింపు పొందారు.
ఈ ‘విశేష’ లో పెనుగొండ ఏమేమి విశేషాలు విశేషంగా చెప్పారో చూద్దాం. విశేష అనే పదానికి ఏమాత్రం శేషము లేనిది, సంపూర్ణమైనది అనే అర్ధాలున్నై. ఈ గ్రంథంలో మొత్తం 36 వ్యాసాలున్నై, ఈ వ్యాసాలను పాఠకుల పఠన సౌలభ్యం కోసం ఏడు తరగతులుగా వర్గీకరించారు. మొదటగా “ప్రాతః స్మరణీయం” అని చేసిన విభాగంలో వందే వేమన, తొలి మహిళా శతక కర్త దార్ల సుందరమ్మల వ్యాసాలున్నై, వేమన వ్యాసంలో అధిక భాగం ఆయన జన్మస్థల విచారణ చేసి, గుంటూరు సాహిత్య చరిత్రలో భాగమవుతున్నారని తీర్మానించారు. అయితే వేమన జన్మస్థలం గురించి ఆంధ్రకవుల చరిత్రలో కందుకూరి చెప్పిందే సరైన నిర్ణయమని తోస్తున్నది. “ఊరు కొండవీడు ఉనికి పశ్చిమ వీధి” అన్న పద్యంలో “మొదటి యిల్లు” అంటే ఆ ఊరిలో మొదటగా ఉన్న యిల్లు అని అర్ధంలో కాకుండా ఆయన మొదట మూగచింతపల్లె (ప్రాంతంతో నిమిత్తం లేకుండా) అనే ఊరిలో బాల్యంలో ఉండి తర్వాతి కాలంలో కొండవీదును చేరుకున్నాడన్న అర్ధంలో తీసుకోవాలని అనిపిస్తున్నది. వేమన రచించిన పలు అభ్యుదయభావాలున్న పద్యాలను పెనుగొండ ఉటంకించడమే కాక, గతంలో వేమన్న కృషిని అభినందిస్తూ జరిగిన వివిధ సభలను జ్ఞాపకం చేసుకున్నారు. తరువాత తొలి మహిళా శతక కర్త దార్ల సుదరీమణి “పాపభయ విభంగ భావలింగ” అనే మకుటంతో 123 పద్యాల ఆటవెలది పద్యాల భావలింగ శతకంలో కొన్ని పద్యాలని ఉదాహరించారు. వాటిని బట్టి ఆమె రచనాకాలం 1833 అని తెలుస్తున్నది. వేమన లాగా ఈమె కూడా. వ్యర్ధపదాలు లేకుండా అందరికీ అర్ధమయ్యే సామాన్య పదాలతో మహార్థాన్నిచ్చేటట్లు పద్యాలను రాసిన విదుషీమణి కాబట్టి వేమన సరసన చేర్చదగ్గ వ్యాసం,
“విశ్లేషణ, విమర్శ” అనే విభాగంలో “భారత జాతీయోద్యమం – తెలుగులో సంస్కరణవాద సాహిత్యం” అన్న వ్యాసంలో “భరత ఖండమ్ము చక్కని పాడియావు” పద్యం చిలకమర్తిది అన్నారు. ఆ పద్యం పై పరిశోధన చేసిన చీరాలకు చెందిన వ్యక్తి ఆ పద్యం చెన్నాప్రగడ భానుమూర్తి” పద్యం అని ససాక్ష్యాలతో నిరూపించడం వల్ల ఆ పద్యం కర్తృత్వం ఇంకా వివాదాస్పదంగానే ఉంది. గరిమెళ్ళ లాంటి వారు రాసిన గీతాలనే కాక, ఆకాలంలో వచ్చిన నవలలు, కథలను పేర్కొన్నారు. అలాగే ఉన్నవ లక్ష్మీనారాయణ “మాలపల్లి’ నవలపై, పెరుగు నాసరయ్య రాసిన మాదిగపల్లె నవల గురించి విశ్లేషణ చేశారు. “సాహిత్య చరిత్ర” పేరుతో అభ్యుదయ సాహిత్యం – కమ్యూనిజం, అరుణ తార అరసం, తెనాలి ఒక కళా సముద్రం అన్న వ్యాసాల్లో ఆంధ్ర దేశంలో అభ్యుదయ రచయితల సంఘం ఎలా రూపుదిద్దుకున్నది. ఎలా వేళ్ళూనుకొన్నదీ సవిస్తరంగా 3 వ్యాసాల్లో వివరించారు.
“శతజయంతి నివాళి” అన్న విభాగంలో ఈనాటి తరానికి పరిచయం చేయాల్సిన అక్షరయోధుడు పరకాల పట్టాభిరామారావు, అల్లూరి సీతారామరాజు నాటకం రాసి అశేష ఖ్యాతిపొందిన పదాల రామారావు, నయాగరా కవి బెల్లంకొండ రామదాసు, జాతీయోద్యమ నాయకుడు ఏటుకూరి కృష్ణమూర్తి, పిన్న వయసులో అమరుడైన అవసరాల సూర్యారావు, సాహిత్య విశారద” శారద, ప్రముఖ కవి దాశరథి గురించిన విలువైన వ్యాసాలు ఈ తరం వారు చదివి స్ఫూర్తి పొందదగ్గవి. “సంపాదకీయాలు” విభాగంలో ఆనాటి శారద లేఖల రచయిత్రి కనువర్తి పరలక్షమ్మ రచనల ప్రస్థానం, అరసం అధ్యక్ష వర్గ సభ్యుడు శశిశ్రీ కథా ప్రస్థానం, మట్టిమనిషి నవలతో అఖండ ఖ్యాతి. గాంచిన వాసిరెడ్డి సీతాదేవి కథల గురించి, వారి వారి అభ్యుదయ భావాల గురించిన విశ్లేషణలు స్ఫూర్తినిచ్చేవి. “సమీక్షలు” విభాగంలో వాసిరెడ్డి భాస్కరరావు నాటక రచన మాభూమి గురించి మరోసారి అనే వ్యాసం, ఆరు సంకలనాలుగా వచ్చిన నూరు నాటకాల క్లుప్తసమీక్ష ఉండగా, “మంచి మాటలు-ఆగ్రహ ప్రకటనలు” పేరుతో అరసం పునర్నిర్మాణంలో కృషి చేసిన రాంభట్ల కృష్ణమూర్తి రచనా వైవిధ్యం, ప్రజా కళాపత్రం అంటూ నాలుగు దశాబ్దాల ఆం.ప్ర. ప్రజానాట్యమండలి విశేషాల్ని వివరించిన నల్లూరి వెంకటేశ్వర్లు ను ‘కళారవి అని సంభావిస్తూ రాసిన వ్యాసం, అరసం ప.గో జిల్లా వారు తెచ్చిన హలంతో కలం కవితా సంపుటి, ఉక్కు కవనం, వేల్పుల నారాయణ రచించిన అభ్యుదయోద్యమ పాట, అరసం రాష్ట్ర కార్యదర్శి కొమ్మాలపాటి శరశ్చంద్ర రాసిన ప్రతిజ్ఞ, మణిపూర్ మంటలు కవితా సంకలనం, చండీఘర్లో జరిగిన అరసం మహా సభల అధ్యక్షోపన్యాసం, అశోక్ కుమార్ రాసిన శ్రీ శ్రీ ఓ శ్రీశ్రీ గ్రంథ సమీక్షలు క్లుప్తం ఉన్నా తృప్తినిచ్చేవి.
ఈ గ్రంథాన్ని విభాగాల వారీగా విభజన చెయ్యడం వల్ల, అంశాలవారీగా పాఠకులు చదువుకునే వీలు కలిగింది. ముగింపుగా ఒక చిన్న మాట ఈ వ్యాసం సంపుటి ద్వారా కొన్ని పరిశోధనా గ్రంధాలను విశ్వవిద్యాలయాలు తమ పరిశోధక విద్యార్థుల ద్వారా వెలువరించేంత విలువైన కీలక సమాచారం అందించారు. పెనుగొండ లక్ష్మీ నారాయణ మరోసారి తన సునికిత పరిశోధనా పటిమను నిరూపించుకున్నారు.
-డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య
9490400858
Courtesy: “సృజన క్రాంతి” పత్రిక