పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ – పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో 15 సినిమాలు..
యంగ్ టాలెంట్ ని ఇండస్ట్రీకి పరిచయం చేయడం కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ – పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా 15 సినిమాలను నిర్మిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో 6 పరిమిత చిన్న తరహా చిత్రాలు – 6 మధ్యతరహా చిత్రాలు – 3 భారీ చిత్రాలు ఉండబోతున్నాయి. హరీష్ పాయ్ వీటికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. కథా రచయితలు దర్శకుల ప్రతిభకు అనువైన వాతావరణాన్ని కల్పించేలా ఈ భాగస్వామ్యం ఉంటుందని.. యువ ప్రతిభావంతుల స్వచ్చమైన ఆలోచనలు కార్యరూపం దాల్చే వేదిక అవుతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపోతే నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ పీపుల్మీ డియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రస్తుతం పదికి పైగా చిత్రాలు నిర్మిస్తున్నారు. వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు పవన్ కళ్యాణ్ తో కూడా ఓ సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ – పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలయికలో ప్రకటించిన 3 భారీ చిత్రాల్లో పవన్ సినిమా ఉంటుందో లేదో చూడాలి మరి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిర్మాతగా ‘పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ పై పలు సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే. నవతరం ఆలోచనలు కలిగిన రచయితలను దర్శకులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో
పవన్ ఈ ప్రొడక్షన్ హౌస్ ని పెట్టారు.