నవ్య సాహితీ కళా వీచికలు ఈ “పేరా”డీలు

“పేరడీ” అన్న మాట వినగానే ఎవ్వరికైనా వెంటనే జన భాహుళ్యంలో బాగా ప్రాచుర్యం పొందిన ఏదైనా పాటకు పూర్తి వ్యతిరేఖ సాహిత్యంగా రాసిన వ్యంగ్యాత్మక రచన గుర్తుకొస్తుంది. దానిలో వినోదం ప్రధానమై ఉంటుంది. కానీ గంటా వరప్రసాద్ గారు రాసినవి అందరూ ఊహించే అలాంటి పేరడీలు కాదు. ఇవి “పేరా”డీలు..పేరడీలు వ్యంగ్యాత్మక రచనలైతే ఈ “పేరా” డీలు జనాత్మక రచనలు. పేరడీలలోని సాహితీ పదాలు మనసుకు గిలిగింతలు, చక్కిలిగింతలు పెట్టించేవైతే ఈ “పేరా”డీలలోని సాహితీపదాలు మనసులోని భావాలను స్వేచ్చగా విహరింపజేసే ఆలోచనా జ్ఞాన తరంగాలుగా ఉంటాయి. అందుకే జనభాహుల్యంలో వాడుకలో గల పేరడీలకు పూర్తి వైరుధ్యమైన సాహితీ ప్రక్రియ ఈ నూతనమైన “పేరా”డీలు.
ఒక నూతన పంథాలో సాగిన ఈ రచనలోరచయిత ప్రస్తావించిన పేరాలు మొత్తం నాలుగు అవి 1) రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో 2) మనిషన్నాక కాస్త కళాపోషనుండాల 3) అప్పిచ్చువాడు వైద్యుడు 4) కాలం ఎంతో విలువైనది. ఈ నాలుగు పేరాలను విస్తరిస్తూ సాగిన రచనయే ఈ “పేరా”డీలు.

సౌందర్యం వస్తుగతమైనది అందుకే Beauty is an Objectified Joy అంటాడు ఒక పాశ్చాత్య కళావేత్త. తాజ్ మహల్ అన్న ఒక ఆబ్జెక్ట్ ఒకరికి అందంగా కనిపిస్తే పాన సాల మరొకరికి అందంగా కనిపించవచ్చు.”మేన్ ఈస్ యే సోషల్ యేనిమల్” అన్న అరిస్టాటిల్ వాఖ్యానికి “మనిషి సర్వత్రా సంకెళ్ళలో భందింపబడి ఉన్నాడు” అని చెప్పిన రూసో వాఖ్యలకు “రవివర్మకే అందని ఒకే ఒక అందానివో” అంటూ రావణుడే రాముడైతే అనే అక్కినేని నాగేశ్వరరావు సినిమాలోని పాటకూ సంభందమేమిటి…?

షేక్స్పియర్ సానేట్స్ గురించో, శాంతినికేతన్ నందలి రంగుల ప్రపంచం లేదా కూల్డ్రే, దామెర్ల, భగీరధి, బాపిరాజు, నందలాల్ బోస్ ల యొక్క వర్ణ చిత్రాలతో లేదా మనిషి యొక్క అందమైన అనుభూతుల జ్ఞాపకాలను ఊయల లూగించే ఏ గజల్స్ లోనో సౌందర్య ప్రస్తావన ఉటంకిస్తే బాగుంటుంది గాని క్రీస్తు పూర్వం నాటి గ్రీసు దేశంలో జరిగిన ట్రాయ్ నగర విద్వంశానికి, క్రీస్తు పూర్వం 261 లో మనదేశ చక్రవర్తి అశోకుడు కళింగలో చేసిన భీకర యుద్ధానికి సంభందమేముంటుంది? దాదాపు 1400 గ్రాముల బరువున్న మెదడులో పన్నెండు వందల కోట్ల నాడీమనుల సేరీబ్రం అన్నచోట జరిగిన వొత్తిడికి పుట్టిన చైతన్యమే అనుభూతి అనుకోవచ్చు అంటూ పైన చెప్పిన భిన్న వైరుధ్య అంశాలను చమత్కారంగా సమర్ధవంతంగా కలగలిపి మనిషి ఆలోచనలను మరో భావనా లోకానికి కొనిపోయే మొదటి పేరా యే రవివర్మకే అందని ఒకే ఒక అందానివో.

చైనాలో ప్రసిద్ది గాంచిన ఒక సామెత “నీ దగ్గర రెండు రొట్టేలుంటే ఒకదానిని అమ్మి తామర పువ్వు కొనుక్కో” ఏమిటీ దీని అర్ధం ?మనిషి బ్రతికేందుకు ఆహారం కావాలి, అలాగని కేవలం ఆహారంతోనే మనిషి జీవించలేడు. ఆనందమైన జీవితానికి రొట్టెతో పాటు తామరపువ్వు కూడా కావాల్సిందే. అందుకే ప్రఖ్యాత కళావిమర్శుడు సంజీవ్ దేవ్ ఒకచోట అంటాడు ఇలా Nodout metal is stronger than petal, but sometimes petal is more stronger than metal.But metal and petal makes the man Vital “అందుకే మనిషన్నాక కాసింత కళా పోషనుండాల అన్నారు పెద్దలు అయితే…

పిచ్చుక యొక్క వాడి ముక్కుకి ఈజిప్ట్ పిరమిడ్స్ కి, ఫ్రాన్స్ నందలి ఈఫిల్ టవర్ కి హిట్లర్ సృష్టించిన నరమేధానికి ప్రతీకగా నిలిచిన అన్నఫ్రాంక్ రచన “ధ డైరీస్ ఆఫ్ అన్నా ఫ్రాంక్”కి లేదా పికాసో గేర్నికా చిత్రానికి–ప్రాచీన చిత్ర లిపులకు మన భారతీయ ప్రాచీనలిపులైన ఖరోష్టి, బ్రాహ్మి లిపులలో అశోకుడు వేయించిన శాసనాలను చదివి తెలియజేసిన బ్రిటీష ఉద్యోగి జేమ్స్ ప్రిన్సెస్ కు క్రీస్తు పూర్వం నాటి రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ రాసిన “గాలిక్ వాల్స్ “మరియు సివిల్ వార్ లాంటి రచనలకు, సూక్ష్మంలో మోక్షాలను చూపించే మన సాంప్రదాయ సామెతలకు కళాపోషణ అన్న భావానికి గల సంభందం ఏమిటీ ? అని ఆలోచిస్తే అంతా నిజంగా విచిత్రం అనిపిస్తుంది కాని అన్నింటిని ఎంతో చక్కగా సమన్వయ పరిచి మనల్ని ఒకవిదమైన భావనాలోకానికి గొనిపోయె రెండవ పేరాయే “మనిషన్నాక కాస్త కళా పోష నుండాల”.

“అప్పిచ్చువాడు వైద్యుడు “అన్న బద్దెన పద్యపాదం మామూలుగా చదివితే చాలా వింతగానే కాదు అసలు ఏమాత్రం పొంతన లేని విషయంగా కూడా కనిపిస్తుంది.అప్పుకీ వైధ్యుడికి సంభందమేమిటి..? అప్పిచ్చువాడు …వైద్యుడు అన్న రెండు మాటలను కలగలిపి చదివితే అలా గందరగోళం అయోమయంగానే వుంటుంది మరి,అందుకే ఒక వాఖ్యాన్ని యే విదంగా చదవాలో ఆ విదంగా చదివినప్పుడే దాని భావం గోచరిస్తుంది. సరే..ఇక మూడవ పేరాలో రచయిత ఉటంకించిన ఈ వాఖ్య విస్తృతిలో బాగంగా డబ్బుకులోకం దాసోహం, ధనమేరా అన్నిటికీమూలం అంటూ మన తెలుగు సినీ కవుల పాటల్లో వర్ణించిన వాఖ్యలతో పాటు ప్రాచీనకాలపు ప్రోటాఘరన్ ,రూసో ల నుండి కారల్ మార్క్స్ ,ప్రేడరిక్ ఏంగిల్స్ లాంటి వారి విశ్లేషణలతో పాటు నేడు ప్రపంచాన్ని శాసిస్తున్న డాలర్ పరిణామం, రూపాయి అన్న పేరు మన భారత కరెన్సీ కి వచ్చినతీరు లాంటివే గాక మన ప్రణాళికా నిర్మాణంతో మొదలు పెట్టి ఖలీల్ జీబ్రాన్, పెన్నా శివరామ కృష్ణ ల రచనల వరకూ అలాగే ప్రపంచంలో తొలి వైద్యునిగా గుర్తింపు పొందిన గ్రీకు దేశపు వైద్యుడు హిపోక్రాట్స్ (క్రీ.పూ 460-377) నుండి మన చరకుడు దాకా, ఇంకా వైద్య పరిశోధనల్లో విశేషంగా కృషి చేసిన వేసేలియస్,విలియం హార్వే, ఎడ్వర్డ్ జెన్నర్, రాంట్ జెన్, లూయీ పాశ్చర్,కెప్లర్ ఆల్బర్ట్, వరకూ సాగిన పరిశోదనలు, ఇంకా గాలి, నీరు, నిప్పు, ఆకాశం, నేల పంచభూతాలు సక్రమంగా పనిచేస్తేనే మనిషి ఆరోగ్యంగా వుంటాడు అంటూ ఈ ఐదు ధాతువుల సమ్మేళనం పై కనుగొనబడిన ఆయుర్వేదం గురించి, ఇంకా రోగికి అతి తక్కువ సాంద్రతతో వైద్యం చేసే లక్ష్యంతో కనిపెట్టిన హోమియో వరకూ ఎన్నో విషయాల సమాహారంఈ మూడవ పేరా “అప్పిచ్చువాడు వైద్యుడు”.

మనిషి జీవితంలో మరల వెనక్కి తిరిగి తేలేని అంశం ఏదైనా వుందీ అంటే అది గడిచిన కాలం మాత్రమే .అందుకే కాలం ఎంతో విలువైనది. అది ఎవ్వరికోసమూ ఆగదు, ఎవ్వరినీ లెక్కచేయదు కూడా, దానికి ఆదీ, అంతం,నియంత్రణ చేసేదీ అన్ని కూడా భగవంతుడే అని భక్తుల విశ్వాసం. కాని కాలం పుట్టుకనూ, ప్రారంభాన్నీ సైన్స్ కూడా అంకెలతోనే అంచనా వేస్తుంది. ఈ కాలం విలువ అనే నాల్గవ పేరా విస్తృతిలో భాగంగా రచయిత విశ్వం పుట్టుక, ఆవిర్భావం, కాంతివేగం , బిగ్ బాంగ్, గెలాక్షీ ల నుండి సూర్య చంద్ర నక్షత్రాలు ,నవగ్రహాల వరకూ మాత్రమే గాక కాలాన్ని లెక్కించేందుకు మనిషి ఎంచుకున్న ఇసుక, లోలక గడియారాలతో పాటు నేటి ఆధునిక క్వార్ద్జ్ గడియారాల వరకూ ఇంకా జీవ ప్రక్రియ రహశ్యం వరకూ గల ఎన్నో ఎన్నెన్నో వినూత్న విషయాలను మనకు అందంగా అందించేందుకు చైనా యువ కవి జంగ్, టూడేస్ట్ రోజ్విక్ట్ అనే పోలెండ్ కవితో పాటు ఎసాజే విల్ అస్మర్ అనే పాలస్తీనా కవుల యొక్క సమయోచిత కవితలతో రక్తి కట్టిస్తూ సాగించిన నాలుగవ పేరా “కాలం విలువ”.

సాహిత్యానికి సంభందించిన విభిన్న ప్రక్రియల్లో ఈ రచయిత సమర్ధులు అని చెప్పడానికి ఆయన ఇంతవరకూ వెలువరించిన మూడు గ్రంధాలను ఉదాహరణగా తీసుకోవచ్చు .వీటిల్లో మనసును హత్తుకునే పరిమళ భరితమైన కవితా సుమాలను వీరి తొలి రచన “పరిమళ వసంతాలు “లో అందిస్తే “ కలల పల్లకి “పేరుతో ఉత్తమ కథలను రెండవ పుస్తకంలో అందించారు .ఈ గ్రందానికి ముఖ చిత్రంతో బాటు లోపలి కథలన్నింటికి నేనే బొమ్మలు వేయడం జరిగింది .ఇక మూడవ గ్రంధం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్రాజ్యంగ రచనలో చేసిన కృషిని నిర్వీర్యం చేయాలనే స్వార్ధంతో రాజ్యంగ సమీక్షా ప్రయత్నాలు చేస్తున్న కొందరి మనువాదుల ప్రయత్నాలపై అద్భుతమైన పరిశోధన చేసి “అమరజీవి అంబేద్కర్ “అనే మూడవ గ్రంధం అందించారు.

ఇక నవ్య రీతిలో సాగిన నేటి ఈ నాల్గవ రచనలో కళా సాహితీ సాంస్కృతికపరమైన అంశాలతో పాటు సాంఘిక ఆర్ధిక వైజ్ఞానికపరంగా వుండే బిన్న వైరుధ్య మైన అంశాలను ఒకదానితో ఒకటి “డీ “కొట్టించడమే గాక చమత్కారంగా సమన్వయ పరుస్తూ ఎన్నెన్నో వైజ్ఞానిక విషయాలను ఏక కాలంలో పాటకునికి అందించే గొప్ప విశిష్ట రచన ఈ”పేరా”డీలు. వృత్తి రీత్యా ఎంతో భాద్యతాయుతమైన మండలాబివృద్ధి అధికారి (MPDO)గా పనిచేస్తూ కూడా విస్తృతమైన అధ్యయనంతో ఈ గ్రంధంలో రచయిత చేసిన కృషి నిజంగా పాటకులను అలరిస్తుంది మరియు అబ్బురపరుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇంత మంచి జ్ఞానంతో కూడిన గ్రంధానికి ముఖ చిత్రమే గాకా ముందుమాట కూడా రాసే అవకాసం కూడా నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను, అందుకే రచయిత గంటా వరప్రసాద్ గారికి సాహితీ కళాభినందనలతో…….

వెంటపల్లి సత్యనారాయణ

SA: