పెరియార్ రామస్వామి జీవిత చరిత్ర

పెరియార్ రామస్వామి ఎనాయకర్… ద్రవిడనాట నాస్తిక, ఆత్మగౌరవ, స్త్రీ హక్కుల కోసం పోరాటాన్ని నడిపించినవాడు. తమిళ భూమి మీద నిలబడి “తమిళ భాష ఒక ఆటవిక భాష” అని అనగలిగి, ఎందుకలా అనవలసి వచ్చిందో చెప్పిన ధైర్యం పెరియార్ ది. ఇప్పటికీ చాలామందికి పెరియార్ అనగానే నాస్తిక ఉద్యమం మాత్రమే గుర్తుకు వస్తుంది.

కానీ ఆయన ఆలోచనలు అనంతమైన పీడనకు వ్యతిరేకంగా ఉండేవి.
‘ఎందుకు?’ అని ప్రశ్నించటం మొదలు పెట్టినవాడు ఎంత సామాజిక మార్పు తీసుకురాగలడో నిరూపించి చూపించిన రామస్వామి నాయకర్ జీవితం గురించి తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. ఆయన కేవలం “దేవుడు లేడు” అనే మాట దగ్గరే ఆగిపోలేదు. నిజానికి నాస్తికత్వం అనేది రామస్వామి చెప్పిన వాటిల్లో ఒకటి మాత్రమే. తమిళ, ఇంగ్లీష్లో పెరియార్ జీవితం మీదా, ఆయన ఆలోచనల మీద పుస్తకాలు వచ్చినా.. అవి మిగతా ప్రాంతీయ భాషల్లోకి పెద్దగా అందుబాటులోకి రాలేదు. అందుకే ఆయన సమగ్ర జీవితం మీదా, ఆయన పూర్తిస్థాయి ఆలోచనల మీదా ఇప్పటికీ చాలా అపోహలున్నాయి. వివక్షలకు వ్యతిరేకంగా, విలువల పేరుతో బానిసత్వాన్ని సమర్థించే పోకడలకు ఎదురు నిలవడం అంటే జీవితాన్నే ఉద్యమం చేసుకోవటం. ఆ ఉద్యమాన్ని రాబోయే తరాలకు అందించటం.

పెరియార్ తన జీవితంలో కొన్ని దేవాలయాలను కూడా రిపేర్ చేయించాడని తెలిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. చిన్నకూలీ ఇంటి బిడ్డగా మొదలైన వ్యక్తి ఒక రాష్ట్ర రాజకీయాలని ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఒక పొలిటికల్ పార్టీని నిర్మాణం చేసేదాకా ఎదిగిన క్రమం, ఆ పోరాటం, కోట్లమంది ఒక చట్రంలో బతుకుతుంటే… అది సరైంది కాదని చెప్పటానికి. వాళ్ళ నుంచి వచ్చే వ్యతిరేకతని ఎదుర్కొంటూ నిలబడటం మామూలు విషయం కాదు. దేశదేశాలలో ఇప్పటికీ ఆయన ప్రభావం ఉన్న మనుషులు లక్షల సంఖ్యలో పెరుగుతున్నారు. స్త్రీల హక్కులలో, వాళ్ళ అభివృద్ధిలో, అంగీకరించే దిశలో మార్పు జరుగుతూ వస్తోంది. ఈ విషయాలన్నీ తెలుసుకోవటానికి, పెరియార్ ని, ఆయన ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవటానికి “వీరే పెరియార్” పుస్తకం చాలా ఉపయోగపడుతుంది. పెరియార్ జీవితంలోని అతిముఖ్యమైన సందర్భాలని కలుపుకుంటూ ఒక జీవిత చరిత్రగా తమిళంలో “మంజైవసంతన్” ఈ పుస్తకాన్ని రాశారు. వైకోమ్ పోరాటం, ఆత్మగౌరవ సంస్థ ప్రారంభం, ఆత్మ గౌరవం వివాహాలు, తమిళభాషలోని అక్షరాల మీద చేసిన రీసెర్చ్ లాంటి అంశాలతో పాటు అత్యంత వివాదాస్పదం అయిన ఆయన లేటువయసు వివాహం, స్త్రీల హక్కులు, సామాజిక న్యాయం గురించి ఆయన ఆలోచనలు ఎలా ఉండేవో చర్చించిన ఈ పుస్తకం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలుగులోకి రావటం చాలా అవసరం. ఇసనాక మురళీధర్ “వీరే పెరియార్” అంటూ తెలుగులోకి చేసిన అనువాదం మూలానికి ఏమాత్రం తీసిపోకుండా, భాషాడంబరాలు లేకుండా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేంత సరళంగా ఉంది. మరింతగా పెరియార్ వాదాన్ని ముందుకు తీసుకుపోవటానికి, పెరియార్ జీవితాన్ని తెలుసుకోవటానికి. ప్రాథమికంగా ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది…
-ఉదయ్

ప్రతులకు : జూబ్లీహిల్స్ లో ఉన్న ఫౌండేషన్ ఆఫ్ రేషనల్ థింకింగ్ ఆఫీస్, 8008045231 వెల: 190 రూపాయలు

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link