విజయా సంస్థకు ఇరవై సంవత్సరాల సుదీర్ఘకాలం ఆస్థాన కవిగా భాసిల్లిన సాహిత్య స్రష్ట పింగళి నాగేంద్రరావు. ఆయన సినిమాలలో వాడిన మాటలు కొన్ని భావి సినిమాలకు మకుటాలయ్యాయి. ‘సాహసం శాయరా డింభకా’, ‘చూపులు కలిసిన శుభవేళ’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘అహ నా పెళ్ళంట’ వంటి సినిమాల పేర్లు పింగళి పాటల్లోనుంచి జాలువారినవే. ఆయన మాటల రచనలో ప్రావీణ్యతను, భాషా సౌందర్యంలో ప్రత్యేకతను, పాటల సృజనలో రసజ్ఞతను, కథాకల్పనలో విశిష్టతను మనం వెలకట్టలేం. ఆయన పాటలు తేలిక పదాలతో అల్లినవే కావడం విశేషం. ఇక వారు అల్లిన మాటలు సాహితీ సుగంధ కుసుమాలు. పింగళి చిత్ర విచిత్ర ప్రయోగాలతో సామెతలు, లోకోక్తులు జోడించి చమత్కారంగా సంభాషణలు సమకూర్చేవారు. ఆయన కలం వెలువరించిన పరిమళ సాహిత్య సంపద తెలుగు చిత్రసీమలో గుబాళించింది. ‘ఎంత ఘాటు ప్రేమయో’ వంటి పదప్రయోగం తరవాతి తరం కవివరేణ్యుడు వేటూరిని ప్రభావితం చేసింది. ‘అందాల రాక్షసివే’ అంటూ వేటూరి పింగళి బాటలోనే మరొక అడుగు ముందుకు వేశారు… అటువంటి పింగళి నాగేంద్రరావు వర్ధంతి సందర్భంగా వారి ప్రతిభగురించి కొన్ని విశేషాలు…
పింగళి పూర్వ ప్రస్థానం…
పింగళి పూర్వ వంశీయులు మహారాష్ట్ర లోని ‘పింగళ’ అనే గ్రామానికి చెందినవారు. వీరంతా పద్నాల్గవ శతాబ్దంలో కృష్ణా తీరం ప్రాంతమైన దివి సీమకు వలస వచ్చారు. వీరిది పండిత వంశం కావడంతో వారు వివిధ ప్రాంతాలకు వెళ్లి ఆయా సంస్థానాధీశుల కొలువుల్లో అమాత్యులుగాను, కవివరేణ్యులుగాను రాణించారు. గోలుకొండ ప్రభువు తానీషా వద్ద అమాత్యులుగా పనిచేసిన అక్కన్న, మాదన్నలు ఈ వంశంవారే. అటువంటి కవుల వంశంలో ప్రఖ్యాత సినీ రచయిత పింగళి నాగేంద్రరావు 29 డిసెంబరు 1901న శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో జన్మించారు. నాగేంద్రరావు తండ్రి గోపాలకృష్ణయ్య, తల్లి మహాలక్ష్మమ్మ. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు శ్రీరాములు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. చిన్నవాడు నాగేంద్రరావు. పింగళి తల్లి కవయిత్రి. తల్లి నాగేంద్రరావుకు చిన్నతనంలోనే భారత భాగవత రామాయణాది కావ్యాలను పాటల రూపంలో తల్లి పరిచయం చేసింది. పింగళి తండ్రి కరణీకం చేస్తూ మచిలీపట్నంలో స్థిరపడ్డారు. అలా పింగళి బాల్యం, విద్యాభ్యాసం మచిలీపట్నంలోనే జరిగింది. పింగళి చిన్నతనంలోనే సాహిత్యంతోబాటు వృత్తి విద్యలను కూడా అధ్యయనం చేశారు. పింగళి లోని సాహిత్య పిపాసను గమనించిన ప్రముఖ జాతీయనాయకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సాహిత్య విశ్లేషకుడు ముట్నూరి కృష్ణారావు పింగళిని ఆశీర్వదించి బాగా ప్రోత్సహించారు. 1917లో పింగళి మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా తీసుకున్నారు. తరవాత మచిలీపట్నంలోనే కొంతకాలం ఉపాధ్యాయునిగా పనిచేశారు. 1918లో ఖరగ్పూర్ రైల్వే వర్క్ షాపులో అప్రంటీసుగా చేరారు. ప్రముఖ యోగా గురువు బులుసు రామజోగారావు ఉపన్యాసాలకు ప్రభావితుడై 1920లో రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసి పింగళి జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. థియోసాఫికల్ సంఘ సభ్యుడిగా నమోదై ఉత్తర భారతదేశాన్ని పర్యటించి సబర్మతీ ఆశ్రమంలో చేరి బ్రహ్మచర్యం పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే జీవితాంతం బ్రహ్మచారిగా వుండిపోయారు. తరవాత కొంతకాలం కృష్ణాజిల్లా కాంగ్రెస్ కార్యకర్తగా వ్యవహరించారు. అప్పుడే ‘జన్మభూమి’ అనే దేశభక్తి పద్యకావ్యాన్ని రచించారు. ఆ కావ్యం బ్రిటీష్ ప్రభుత్వాధికారులకు ఆగ్రహం కలిగించింది. దాంతో పింగళి జైలుపాలయ్యారు. జైలు నుంచి విడుదలయ్యాక పట్టాభి సీతారామయ్య సలహామీద 1923లో ‘శారద’ అనే పత్రికకు సహసంపాదకుడుగా చేరి తన సాహిత్య రచనా వ్యాసంగం మీద దృష్టి సారించారు. అదేసమయంలో బెంగాలి నాటకకర్త డి.ఎల్.రాయ్ రచించిన ‘మేవార్ పతన్’, ‘పాషాణి’ నాటకాలను తెలుగులోకి అనువదించారు. ఈ అనువాద నాటకాలు కృష్ణాపత్రికలో ధారావాహికలుగా వెలువడ్డాయి. అదే స్పూర్తితో ‘జేబున్నీసా’, ‘వింధ్యరాణి’, ‘నారాజు’, ‘క్షాత్రహిందూ’, ‘ఒకే కుటుంబం’ వంటి నాటకాలను రాసి నాటక రచయితగా మంచి పేరు సంపాదించారు. వాటిలో ‘ఒకే కుటుంబం’ నాటక రచనకు 1939లో నవ్యసాహితి సమితి సంస్థ ఉత్తమ నాటక రచనా బహుమతిని ప్రదానం చేసింది. పింగళి పనిచేస్తున్న ‘శారద’ పత్రికా ప్రచురణ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రంగస్థల నటులు డి.వి. సుబ్బారావు నిర్వహిస్తున్న ఇండియన్ డ్రమెటిక్
కంపెనీలో కార్యదర్శిగా చేరి 1946 వరకు పనిచేశారు.
సినిమా అవకాశాలు…
ఇండియన్ డ్రమెటిక్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలోనే 1941 లో వేల్ పిక్చర్స్ వారు ‘తారుమారు & భలేపెళ్లి’ పేరుతో జంట సినిమాలను నిర్మిస్తూ పింగళిని రచనా సహకారంకోసం కబురుచేశారు. శ్రీమతి జగన్నాథ్ దర్శకత్వంలో మొదలుపెట్టిన ఈ సినిమాల నిర్మాణం రెండవ ప్రపంచయుద్ధ వాతావరణం ముమ్మరం కావడంతో కుంటుపడినా తరవాత పూర్తిచేశారు. ఈ వినోదప్రదాన చిత్రంలో డాక్టర్ కె.శివరామకృష్ణయ్య హీరో పాత్రను పోషించడం విశేషం. ఇక ‘తారుమారు’ చిత్ర విషయానికి వస్తే, ఈ చిత్రానికి ‘టర్న్ అబౌట్’ అనే ఆంగ్ల నవల ఆధారం. కొడవటిగంటి కుటుంబరావు మాటలు, పాటలు రాశారు. ఈ హాస్యరస చిత్రంలో వేమూరి పరబ్రహ్మశాస్త్రి, హేమలత ఆలుమగలుగా నటించి హాయిగా నవ్వించారు. తరవాత పింగళి విజయవాడ వెళ్ళిపోయారు. సహచర మిత్రుడు దుర్గా నాగేశ్వరరావు సహకారంతో రంగస్థలనటుడు డి.వి. సుబ్బారావు 1948లో వైజయంతి ఫిలిమ్స్ అనే సంస్థను నెలకొల్పి పింగళి రచించిన జనరంజకమైన ‘వింధ్యరాణి’ నాటకాన్ని సినిమాగా నిర్మిస్తూ పింగళి చేత సినిమాకు అవసరమయ్యే రీతిలో సంభాషణలు రాయించారు. చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వంలో ఈ నాటకం సినిమాగా రూపుదిద్దుకుంది. మద్రాసు జెమినీ స్టూడియోలో చిత్రనిర్మాణం జరిగింది. పుష్పవల్లి వింధ్యరాణిగా, డి.వి. సుబ్బారావు వింధ్యరాజుగా నటించిన ఈ సినిమాలో జి.వరలక్ష్మి, రేలంగి, ఎ.వి.సుబ్బారావు, శ్రీవత్సవ ఇతర పాత్రలు పోషించారు. జెమినీ వారి ఆర్కెస్ట్రా సహకారంతో సాలూరు రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు. సినిమా సంక్రాంతి కానుకగా 14 జనవరి 1948 న విడుదలైంది. అయితే ఈ చిత్రం ఘోర పరాజయం చవిచూసింది. దాంతో పింగళి మరలా బందరు వెళ్ళిపోయారు. ఆ సమయంలో పింగళికి మిత్రుడు, సహవాసి కమలాకర కామేశ్వరరావు బందరు వెళ్ళినప్పుడు పింగళిని కలిసి ధైర్యం చెప్పి మద్రాసుకు తీసుకొనివచ్చి వాహినీ సంస్థ వద్దకు తీసుకెళ్ళి బి.ఎన్.రెడ్డి, బి.నాగిరెడ్డి, కె.వి.రెడ్డిలకు పరిచయం చేశారు.
గుణసుందరితో వాహినీలో…
వాహినీవారు 1939లో ‘వందేమాతరం’ సినిమానుంచి 1947 వరకు ఆరు సినిమాలు నిర్మించారు. ఏడవ ప్రయత్నంగా కె.వి. రెడ్డి దర్శకత్వంలో ఒక జానపద చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచనవచ్చి సముద్రాల ఇతర సినిమాల రచనలో బిజీగా వుండడంతో కొత్త రచయితను తీసుకుందామనుకున్నారు. అప్పుడు కమలాకర కామేశ్వరరావు పరిచయం చేసిన పింగళికి కబురెళ్ళింది. షేక్ స్పియర్ రచినచిన ‘కింగ్ లియర్’ నాటకంలోని రాజు, కూతుళ్ళ పాత్రలు తీసుకొని కె.వి.రెడ్డి ఒక కథను అల్లారు. పింగళితో కూర్చుని ఆకథకు ఒక రూపునిచ్చి స్క్రిప్టు తయారు చేశారు. అందుకు మూడు నెలలు పట్టింది. పింగళి సంభాషణలు, పాటలు రాయగా కె.వి.రెడ్డి, కమలాకర కామేశ్వరరావు స్క్రీన్ ప్లే రూపొందించారు. హీరోయిన్ గా జూనియర్ శ్రీరంజనిని తీసుకుందామని పింగళి సూచించగా కె.వి.రెడ్డి అంగీకరించారు. ఇతరపాత్రలను గోవిందరాజుల సుబ్బారావు, వల్లభజోస్యుల శివరాం, శాంతకుమారి, మాలతి, రేలంగి, కస్తూరి శివరావు, టి.జి. కమలా దేవి, హేమలత, కనకం పోషించారు. సినిమా 29 డిసెంబరు 1949 న విడుదలై అద్భుత విజయాన్ని సాధించింది. జనం విరగబడి చూశారు. ప్రేక్షకుల కోరికమేరకు రోజుకు నాలుగు ఆటలు ప్రదర్శిస్తే తెల్లారిపోయేది. ఇందులో పింగళి రాసిన ‘శ్రీతులసి ప్రియతులసి జయమునీయవే’ (శ్రీరంజని), ‘ఉపకార గుణాలయవై’ (లీల), ‘ఈవనిలో కోయిలనై’ (టి.జి. కమలాదేవి) పాటలు మహిళాలోకానికి ప్రీతిపాత్రమై వెలిగాయి. పింగళి కస్తూరి శివరావుతో పలికించిన ‘గిడి గిడి’ అనే ఊతపదం బాగా ప్రాచుర్యం పొందింది. పింగళి వాహినీ సంస్థకు పనిచేసిన మొదటి, ఆఖరి చిత్రం కూడా ఇదే!
విజయా సంస్థలో పింగళి కేతనం…
విజయా సంస్థ ఏర్పడిన తరవాత పింగళి అందులో ఆస్థాన రచయితగా నిలబడిపోయారు. ముఖ్యంగా దర్శకుడు కె.వి. రెడ్డితో పింగళి మైత్రీబంధం ‘గుణసుందరి కథ’ చిత్రంతో బలపడింది. విజయా సంస్థతో పింగళి బంధం 1950 నుండి 1971 వరకు అప్రతిహతంగా సాగింది. విజయా సంస్థ తొలిసారి నిర్మించిన ‘షావుకారు’ చిత్రాన్ని యెన్నోఆశలతో, ఆశయాలతో నిర్మించినా అది క్లాసిక్ గా పేరు తెచ్చుకుందే గాని కాసులు రాల్చలేదు. దాంతో కె.వి.రెడ్డి దర్శకత్వంలో ఒక జానపద చిత్రాన్ని నిర్మించుదామని తలచి నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి పింగళి నాగేంద్రరావుకు కబురు చేశారు. అరేబియన్ నైట్స్ కథల్లోని ‘అల్లావుద్దీన్ అండ్ వండర్ లాంప్’ కథను ప్రేరణగా తీసుకొని కాశీమజిలీ కథల ధోరణిలో పింగళి ‘పాతాళభైరవి’ కథను తయారుచేశారు. ఆ కథలో ఒక సామాన్య యువకుడు రాజుగారి కూతురిరి పెళ్లి చేసుకునేందుకు చేసే సాహసకార్యాలు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయి. ఈ కథను, స్క్రిప్టును రూపొందించేందుకు పింగళికి నాలుగు నెలలు పట్టింది. ఈ సినిమాకు కథ, మాటలు, పాటలు పింగళి రాయగా ఎన్.టి.రామారావు, ఎస్.వి.రంగారావు, సి.ఎస్.ఆర్, రేలంగి, మాలతి నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ఏకకాలంలో నిర్మించారు. 1951 మార్చి 15న విడుదలై తెలుగు, తమిళంలో ఈ చిత్రం 28 థియేటర్లలో శతదినోత్సవం జరుపుకొని జైత్రయాత్ర చేసింది. నేపాళమాంత్రికుడుగా నటించిన రంగారావు చేత షైలాక్ పాత్ర తరహా నటన రాబట్టారు. రంగారావు పలికే ‘సాహసం శాయరా…రాజకుమారి లభిస్తుందిరా’, ’ఏ డింభకా… హే బుల్ బుల్ … ఏ డింగరీ’ అనే మాటలు, పద్మనాభం పలికే ‘ఏం గురూ’, ‘మోసం గురూ’ అనే ఊతపదాలు, హీరో రామారావు పలికే ‘నిజం చెప్పమన్నారా… అబద్ధం చెప్పమన్నారా’ అనే మాట, పాతాళభైరవిగా గిరిజ పలికే ‘నరుడా ఏమి నీ కోరిక’ అనే మాటలు ప్రేక్షకులలోకి దూసుకొని వెళ్ళాయి. అలతి పదాలతో పింగళి సంభాషణలు సమామకూర్చిన ఈ చిత్రం తొలుత 13 ప్రింట్లతో విడుదలై పది కేంద్రాల్లో శతదినోత్సవం, నాలుగు కేంద్రాలలో రజతోత్సవం జరుపుకుంది. అంతేకాకుండా ద్విశతదినోత్సవం జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా చరిత్ర పుటల కెక్కింది. ఈ సినిమా ఎన్.టి.ఆర్ ని పెద్ద స్టార్ ని చేసింది. కట్నాలమోజుతో కాపురాలను కూల్చే ఆశబోతులకు గుణపాఠం నేర్పాలనే నేపథ్యంలో విజయా వారు 1952లో ‘పెళ్ళిచేసిచూడు’ అనే హాస్యచిత్రాన్ని ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించారు. పింగళి సంభాషణలు ఈ చిత్రానికి అద్దంపట్టాయి. రెండు పాటలు మినహాయిస్తే మిగతా పదమూడు పాటలు కూడా పింగళే రచించారు. పింగళి సాహిత్యానికి ఘంటసాల సంగీతం తోడై సినిమా గొప్ప మ్యూజికల్ హిట్ గా నిలిచింది. రంగారావును ఉద్దేశించి ‘దూపాటి వియ్యన్నకు ఆపాటి ఈపాటి ఆస్తి లేకపోయినా ఘనాపాటిగా బతికేయడం పరిపాటి’ అనే మాట, రేలంగి అలవాటుగా వాడే ‘తప్పుతప్పు’ వంటి మాటలు ప్రేక్షకులను అలరించాయి. ఇందులో అంతర్నాతకంలో వినిపించే ‘ప్రియాప్రియా ఓ ప్రియాప్రియా’ అనే పాటను సావిత్రి, జోగారావుల మీద చిత్రీకరించారు. ఈ పాటకోసం గోఖలే నిర్మించిన దేవలోకం సెట్ ప్రేక్షకులకు కనువిందుచేసింది. పాతాళభైరవి చిత్రంలో చిన్న నాట్యపాత్రలో కనిపించిన సావిత్రి ఈ చిత్రంలో సైడ్ హీరోయిన్ గా ప్రమోటయింది. 1954లో విజయా వారు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో ‘చంద్రహారం’ సినిమా నిర్మించారు. శాపాలు, వరాలు, అనుగ్రహాల మధ్య మానవ సంబంధాలు ఎలాఉంటాయో ఈ చిత్రకథలో చూపారు. ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు పింగళి సమకూర్చారు. పాతిక లక్షల భారీ బడ్జట్ తో ఎన్.టి.రామారావు, శ్రీరంజని ముఖ్య తారాగణంగా నిర్మించిన ఈ చిత్రం ఘోరంగా విఫలమైంది.
చక్కన్న మనోనేత్రం… మిస్సమ్మ…
1955లో ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో మరలా ఒక కామెడీ చిత్రం ‘మిస్సమ్మ’ని విజయా సంస్థ నిర్మించింది. ‘మన్మయీ గరల్స్ స్కూల్’ పేరుతో రవీంద్రనాథ్ మైత్రా రచించిన బెంగాలి హాస్య నవలను ‘ఉదరనిమిత్తం’ పేరుతో చక్రపాణి తెలుగులో అనువదించారు. అలాగే శరబిందు బెనర్జీ రాసిన మరో నవల ‘డిటెక్టివ్’ ను కూడా అదేపేరుతో చక్రపాణి అనువదించారు. ‘ఉదరనిమిత్తం’ కథను ‘డిటెక్టివ్’ కథను మధించి ‘మిస్సమ్మ’ కథకు చక్రపాణి రూపకల్పన చేశారు. అలా చక్రపాణి అనబడే ‘చక్కన్న’ వజ్రపేటిక నుంచి జాలువారిన ఆణిముత్యం ‘మిస్సమ్మ’. మిస్సమ్మ అంటే పెళ్ళికాని ‘మిస్’ అనే అర్థం ఒకటైతే, తప్పిపోయిన (మిస్ అయిన) అమ్మాయి అనేది రెండో అర్థం. ఈ రెండు అర్థాలూ సినిమా నేపథ్యానికి అతికినట్లు సరిపోయాయి. అంటే… సినిమా పేరులోనే కథను చెప్పినట్లయింది. మిస్సమ్మ పాత్రకోసం పింగళి ఆత్మాభిమానం, పెంకితనం, తలబిరుసుతనంతో కూడిన సంభాషణలు రచించారు. అయితే అనూహ్యంగా భానుమతి ధరించాల్సిన పాత్ర సావిత్రికి దక్కింది. ఇందులో రామారావు, నాగేశ్వరరావు, రంగారావు, రేలంగి, ఋష్యేంద్రమణి, రమణారెడ్డి ముఖ్యపాత్రలు పోషించారు. ఇందులో కథే హీరో అనుకోవాలి. పాటలన్నీ అద్భుతాలే. ఈ చిత్రానికి సాలూరు రాజేశ్వరరావు సంగీతం అందించగా రామారావుకు ఎ.ఎం.రాజా చేత పాటలు పాడించారు. ‘ఇది పెద్దవాళ్ళు కూడా చూసి ఆనందించదగ్గ చిన్నపిల్లల సినిమా’ అంటూ ఈ సినిమాకు గోరాశాస్త్రి కితాబు ఇవ్వడం సముచితం. మిస్సమ్మ ఎగరేసిన విజయకేతనం విజయావారి చేత ‘మాయాబజార్’ అనే మాగ్నం ఓపస్ చిత్రాన్ని నిర్మించడానికి బాటలు పరచింది.
పింగళి మాయాజాలం… మాయాబజార్…
పాండవుల ప్రస్తావన అడుగడునా వస్తూనేవున్నా వారు తెరమీద కనపడకుండా పింగళి చిత్రకథను రూపొందించి హిట్ చేసిన పౌరాణిక సినిమా ‘మాయాబజార్’. భారతీయ సినీ స్వర్ణోత్సవం సందర్భంగా CNN-IBN సంస్థ వంద ఆల్ టైం గ్రేట్ భారతీయ సినిమాల గుర్తింపు మీద సర్వే నిర్వహిస్తే, మాయాబజార్ సినిమా ప్రధమ స్థానంలో నిలిచింది. కర్నాటకలో గుబ్బివీరన్న బృందం నడిపే శశిరేఖా పరిణయం నాటకంలోని శశిరేఖా పరిణయ ఘట్టం ఆధారంగా తీసుకొని పది నెలలు శ్రమించి కె.వి.రెడ్డి తయారు చేసుకున్న కథకు పింగళి సంభాషణలు, పాటలు సమకూర్చగా విజయావారు 1957లో ‘మాయాబజార్’ చిత్రాన్ని నిర్మించారు. చక్రపాణి నడిపే ‘కినిమా’ పత్రికలో మాయాబజార్ స్క్రిప్టులోని పాత్రలను పేర్కొని ఏ నటులు పోషిస్తే ఏపాత్ర బాగుంటుందో తెలపవలసిందని ప్రకటన ఇచ్చారు. అలా 1955లో మొదలైన మాయాబజార్ సినిమా పనులు 1956లో నటీనటుల ఎంపికతో ఒక కొలిక్కివచ్చాయి. పాండవుల పాత్రలకు సరైన నటులు దొరక్కపోవడంతో వారి ప్రమేయం లేకుండానే కథను నడిపించారు. రామారావు, నాగేశ్వరరావు, రంగారావు, రేలంగి, గుమ్మడి, రమణారెడ్డి, సి.ఎస్.ఆర్, ముక్కామల, సావిత్రి, ఋష్యేంద్రమణి, ఛాయాదేవి, సంధ్య, మిక్కిలినేని, వంగర, అల్లు, చదలవాడ, నల్లరామమూర్తి వంటి హేమాహేమీలు నటించిన ఈ సినిమా ‘నభూతో న భవిష్యతి’ గా నిలిచింది. రాజేశ్వరరావు ‘చూపులు కలిసిన శుభవేళా’, ‘శ్రీకరులు దేవతలు శ్రీరస్తులనగా’, ‘నీకోసమె నే జీవించునది’, ‘నీవేనా నను తలచినది’ అనే నాలుగు పాటలకు స్వరాలల్లి, మ్యూజిక్ సిట్టింగ్ లో విజయావారితో వ్యవహార శైలి నచ్చక తప్పుకుంటే ఘంటసాల సంగీత దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నారు. సినిమా నిర్మాణానికి ముప్పై లక్షలు వెచ్చించారు. ఘటోత్కచుడు రాక్షస నాయకుడు. తల్లి హిడింబ రాక్షస జాతి మహిళ. తండ్రి సుక్షత్రియుడైన వృకోదరుడు. అంచేతే అతనిలో అనాగరిక లక్షణాలు కనపడవు. ఇక కృష్ణుడు దారుకునితో(మాధవపెద్ది) “దారుకా…సుభద్రార్జునులు ద్వైతవనానికి బయలుదేరారు. కాని నువ్వేమీ చెప్పకుండా వారిని ఘటోత్కచుని ఆశ్రమానికి చేర్చు..అంతే” అంటాడు…. తర్వాత మాయను నడిపించే బాధ్యతను శ్రీకృష్ణుడు తీసుకుంటాదానే అర్ధంలో. ఘటోత్కచుని ‘ఆశ్రమం’ అంటేనే అది ఎంత పవిత్రమైన, హింసాకాండకు దూరంగా వుండే నివాస ప్రాంతం అనే విషయాన్ని ముందుగానే చెప్పారు పింగళి. ఘటోత్కచునితో సహా అతని అనుచరులందరూ కామరూపులని, మాయలు మంత్రాలు తెలిసినవాళ్ళనే విషయాన్ని అభిమన్యుని ప్రవేశంతోనే రధచలన శబ్దం భేరీనాదం చేయిస్తూ “కోరు కోరు శరణు కోర్” అంటూ ఎస్టాబ్లిష్ చేశారు. ఎలా అంటే లో వినిపిస్తుంది. సాధారణంగా ఘటోత్కచుని నివాస ప్రాంతానికి వెళ్ళే సాహసం ఎవరూ చేయరు. అలాంటిది అభిమన్యుని రధం ఆ భేరిలో కనపడగానే ఘటోత్కచునిచేత “ఓహో! ఎవడీ మహారథుడు. మేరమీరి నా సీమలోకే జొరబడినాడు” అనిపించారు. దానర్థం…అతడి సీమలోకి అడుగు పెట్టినవాడు గొప్ప పరాక్రమశాలి అయివుంటాడని ముందే ఊహించడం. వెంటనే కుడ్యాసురుడనే రాక్షసవీరుణ్ణి వెళ్లి పేరుచెప్పించి, ‘శరణు’ అనిపించమని శాసిస్తాడు. కుడ్యాసురుడు హాహాకారాలు చేస్తూ ‘కోరు కోరు శరణు కోరు’ అని అశరీర వాక్కులతో హెచ్చరిస్తాడు. సుభద్ర “దారితప్పలేదుకదా” అని దారుకుని ప్రశ్నిస్తుంది. “దారి మాత్రం ఇదే తల్లీ. తెలిసే వచ్చాను. పోనీ వెనక్కి తిరిగిపోదామంటారా” అని అడుగుతాడు. అభిమన్యుడు కల్పించుకొని ‘వెనక్కి తిరగడం మనకు తెలియని విద్య. పోనీ ముందుకు” అంటాడు. పింగళి రచనా పటిమ ఈ డైలాగులోనే వుంది. భారత యుద్ధంలో అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తాడు. వెళ్ళడం తెలుసు…కానీ వెనక్కి తిరిగి రావడం మాత్రం అతనికి తెలియదు. ఆ విషయాన్ని ముందే ఇక్కడ చెప్పించాడన్న మాట. ఘటోత్కచ రాక్షస గణం లోని గురువు పేరును ‘చినమయ’ (చిన్న తరహా మయుడు అనే అర్ధంలో) అని నామకరణం చేశారు పింగళి. ఈ కథకు ముందు మయసభ జరగడం. పాండవులు మాయాజూదంలో అపజయం పొందడం జరుతుంది. ఇవేమీ దృశ్య రూపంలో కాకుండా ఇవన్నీ సంభాషణల ద్వారా పింగళి మనకు తెలియపరుస్తారు. ‘మాయ’ తెలుగు పదానికి ‘బజార్’ అనే ఉర్దూ పదం చేర్చి పౌరాణిక చిత్రానికి మకుటంగా పెట్టడం, ఎక్కడా ‘బజార్’ అనే పదాన్ని చిత్రంలో రానీయకుండా జాగ్రత్తపడడం పింగళి రచనా పటిమకు ఉదాహరణ. ఈ సినిమా అద్భుతవిజయాలను నమోదు చేసిన విషయాన్ని గుర్తుచేయాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు కథే హీరో కాగా, దానికి మాటలు, పాటలు అందించిన పింగళి వారే అసలైన హీరో అని చెప్పక తప్పదు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో యేకకాలంలో నిర్మించిన సంగతి తెలిసిందే. అభిమన్యుని పాత్రను తమిళంలో జెమిని గణేశన్, లక్ష్మణకుమారుని పాత్రను తంగవేలు పోషించారు. లక్ష్మణుని పాత్ర వెకిలిగా ఉందనే విమర్శలు రావడంతో పింగళి దానికి బలమైన వివరణ ఇచ్చారు. “రారాజు దుర్యోధనుడు పరాక్రమవంతుడు అయినంతమాత్రాన అతని కుమారుడు వీరుడు కానవసరం లేదు. అసలు భారతంలో లక్ష్మణకుమారునిది చాలా చిన్నపాత్ర. యుద్ధభూమిలో కాలిడుతూనే అభిమన్యుని చేతిలో మరణించాడు. అందుకే ఆ పాత్రను వినోదానికి వాడుకున్నా” నని పింగళి చెప్పారు. శకుని పాత్రకు పేటెంట్ రైట్ సియ్యస్సార్ దే. ఈ పాత్రను తమిళంలో నంబియార్ పోషించారు. బలరాముని పాత్రను తమిళంలో బాలసుబ్రమణ్యం పోషించారు. ఘటోత్కచుని స్థావరంలో సుభద్ర హిడింబతో “పాండవులు, పాండవుల ప్రతాపాలు కౌరవుల గోటికి సరిరావు” అని బలరాముడు అన్నట్లు చెబుతుండగా వినిన ఘటోత్కచుడు, ఆవేశపడి, ద్వారకపై యుద్ధానికి సన్నద్ద మౌతాడు. “విన్నాను మాతా విన్నాను. ఇచ్చిన మాట తప్పుటయేగాక, తుచ్చ కౌరవుల పొత్తు కలుపుకొని జగద్విదిత పరాక్రమవంతులైన మా జనకులనే తూలనాడిరిగా యాదవులు! ఎంత మదమెంత కావరమెంత పొగరు. అంతకంత ప్రతీకారమాచరించి కౌరవుల యాదవుల కట్టగట్టి నేల మట్టుబెట్టకున్న నా మహిమేల” అంటూ సుదీర్ఘ సమాసం చెప్పిన వెంటనే ‘దురహంకార మదాంధులై’ అనే పద్యాన్ని పింగళి ఆ సన్నివేశంలో జోడించారు. ఈ సినిమాలో సత్యపీఠం, ప్రియదర్శిని, తస్మదీయులు, దుష్టచతుష్టయము, జియ్యా, వీరతాళ్ళు, రత్నగింబళి, గిల్పం, శాకంబరీ దేవి ప్రసాదం వంటి కొత్త పదాలను పింగళి ప్రవేశపెట్టారు. పైగా “ఎవరూ కనిపెట్టకుండా మాటలెలా పుడతాయి” అని సమర్ధించుకున్నారు కూడా. ‘రసపట్టులో తర్కం కూడదు’, ‘భలే మామా భలే’, ‘ఇదే మన తక్షణ కర్తవ్యము’ వంటి మాటల్ని కూడా ప్రయోగాత్మకంగా వాడారు. నేటికీ ఇవి వాడుకలో వుండటం విశేషం. ఈ సినిమాలో పింగళి హాస్యానికి పెద్దపీట వేయడం మరో పార్శ్వం. ఈ సినిమా చివర ఘటోత్కచుడు శ్రీకృష్ణుని “జై సత్య సంకల్ప జై శేషతల్పా” అని కీర్తిస్తూ ఈ చిత్రకథను చూసినవారు, వినినవారు శుభసంపదలు గలిగి వర్దిల్లుతారని, సుఖశాంతులను గలిగి శోభిల్లుతారని ఆశీర్వదించడం పింగళి చమత్కారమే.
సరస సంభాషణల జగదేకవీరుడు …
1958లో పింగళి నాగేంద్రరావు జయంతి సంస్థ పేరిట కె.వి.రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన ‘పెళ్లినాటి ప్రమాణాలు’ చిత్రానికి, 1960 లో సారణీ వారి ‘మహాకవి కాళిదాసు’ సినిమాకి కథ, మాటలు, పాటలు సమకూర్చారు. 1959లో విజయావారి ‘అప్పుచేసి పప్పుకూడు’ సాంఘిక కామెడీ చిత్రానికి పాటలు మాత్రం రాశారు. ‘మహాకవి కాళిదాసు’ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా రజత పతాకాన్ని పొందింది. తమిళంలోని ‘జగదల్ ప్రతాపన్’ చిత్రాన్ని స్పూర్తిగా తీసుకొని విజయా సంస్థ 1961లో ‘జగదేకవీరుని కథ’ అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రంలో పౌరాణిక అంశాలను మేళవిస్తూ పింగళి ఈ చిత్రానికి నవరసభరితంగా రచన చేశారు. రామారావు, బి.సరోజాదేవి, ఎల్.విజయలక్ష్మి, రాజనాల, రేలంగి, సి.ఎస్.ఆర్, ముక్కామల, గిరిజ, కన్నాంబ, ఋష్యేంద్రమణి ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి పెండ్యాల సంగీతం అందించారు. సావిత్రిని కాదని బి.సరోజను ముఖ్య హీరోయిన్ గా తీసుకున్నారు. ఇందులో పింగళి గీతం ‘శివశంకరీ శివానంద లహరి’ కోసం నెలరోజులు శ్రమించి దర్బారీ కానడ రాగంలో పదిహేను నిమిషాల పాటగా తొలుత రూపొందించారు. తరవాత దీనిని ఏడు నిమిషాలకు కుదించి రికార్డింగ్ చేయించారు. ‘చంద్రహారం’ చిత్రం పరాజయం పాలయ్యాక విజయావారు మరో జానపద చిత్రాన్ని నిర్మించేందుకు సాహసించలేదు. అయితే కె.వి.రెడ్డి ఇచ్చిన భరోసా మీద ‘జగదేకవీరుని కథ’ చిత్రాన్ని నిర్మించారు. పింగళి ఈ చిత్రంలో రేలంగికి రెండుచింతలు, గిరిజకు ఏకాశ, రాజనాలకు త్రిశోకానందుడు, సి.ఎస్.ఆర్ కు బాదరాయణుడు వంటి నామధేయాలను తగిలించి వినోదపరిచారు. ‘హే రాజన్… శృంగార వీరన్’ అని సి.ఎస్.ఆర్ అంటుంటే, రాజనాల ‘హే… బాదరాయణ ప్రగ్గడా’ అంటూ సంబోదించడంగానీ, బి. సరోజాదేవి దేవకన్య కావడంతో ముద్దు ముద్దు పలుకులు పలకడం గానీ ప్రేక్షకులను ఆనందాంబుధిలో ముంచెత్తాయి. పింగళి రాసిన పాటల సాహిత్యం గురించి యెంత చెప్పినా తక్కువే. ఈ చిత్రం రజతోత్సవం చేసుకుంది. ఈ చిత్ర విజయంతో విజయా వారు ‘గుండమ్మ కథ’ (1962) సాంఘిక చిత్రానికి పావులు కదిపారు. గుండమ్మ కథ చిత్రానికి అద్భుతమైన పాటలు రాసి పింగళి తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు.
కొనసాగిన రచనా ప్రభంజనం…
1962లోనే బి.ఎస్. రంగా నిర్మించిన ‘మహామంత్రి తిమ్మరుసు’ చిత్రానికి కథ, మాటలు పాటలు పింగళి సమకూర్చారు. ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో రాష్ట్రపతి రజత పతకం దక్కింది. గుమ్మడి చలనచిత్ర జీవితంలో ఈ చిత్రం ఒక కలికి తురాయి. 1963లో కె.వి.రెడ్డి జయంతి పిక్చర్స్ బ్యానర్ మీద ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు పింగళి సమకూర్చారు. రామారావు, నాగేశ్వరరావు, గుమ్మడి, ముక్కామల, నాగయ్య, బి.సరోజాదేవి, ఎస్. వరలక్ష్మి, శ్రీరంజని, ఋష్యేంద్రమణి ప్రధాన పాత్రలు పోషించారు. చిలకమర్తి వారి ‘గయోపాఖ్యానం;’ నాటకం, నంది తిమ్మన ‘పారిజాతాపహరణం’ ఈ సినిమా కథకు ఆధారం. “భావి భారత యుద్ధంలో అర్జునుడి ప్రతిభా పాటవాలను, ఆయుధ సంపత్తిని పరీక్షించడానికే ఈ యుద్ధం” అంటూ పింగళి ఈ సినిమా చివరలో శ్రీకృష్ణునితో అనిపించడం ఆయన మేధాపాటవానికి ప్రతీక. యతీంద్రునిగా అర్జునుడు వేసే వేషానికి సరదాగా ‘అజిభీదఫపా స్వాములు’ అని అర్జునుని వివిధనామాలను గుర్తుచేస్తూ పేరు పెట్టారు పింగళి. ఈ చిత్ర విడుదల సమయంలోనే వచ్చిన ‘లవకుశ’, ‘నర్తనశాల’ చిత్రాల ప్రభంజనాన్ని తట్టుకొని ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ సినిమా శత దినోత్సవాన్ని జరుపుకుంది. అయితే విజయావారు నిర్మించిన ‘సత్యహరిశ్చంద్ర’ (1965), ఎస్.ఆర్.మూవీస్ అధినేత నాగుమణి నిర్మించిన ‘ప్రమీలార్జునీయం’ (1965), విజయావారే నిర్మించిన ‘శ్రీకాకుళ ఆంద్ర మహావిష్ణువు కథ’ (1966), ‘ఉమా చండీ గౌరీ శంకరుల కథ’ (1968), ‘భాగ్యచక్రం’ (1968) చిత్రాలకు పింగళి రచనచేసి, మాటలు, పాటలు సమకూర్చినా ఆ చిత్రాలు విజయాలను చవిచూడలేదు. అయితే విజయావారే నిర్మించిన ‘సి.ఐ.డి’ (1965)చిత్రం మాత్రం శతదినోత్సవం చేసుకుంది. దానికి కథ, మాటలు, పాటలు సమకూర్చింది పింగళివారే. తరవాతి సినిమాల వివరాలలోకి వెళితే 1968లో ‘అగ్గిమీద గుగ్గిలం’ చిత్రానికి పింగళి మాటలు, పాటలు రాశారు. ‘రాజకోట రహస్యం’ (1971) చిత్రానికి, ‘శ్రీకృష్ణసత్య’ (1971) చిత్రానికి పింగళి మాటలు, పాటలు సమకూర్చారు. ‘నాగసుందరి కథ’ అనే సినిమాకోసం స్క్రిప్టు రాసినతరవాత ఆ చిత్ర నిర్మాణం ఆగిపోయింది. ఎన్.టి. రామారావు 1977లో నిర్మించిన ‘చాణక్య చంద్రగుప్త’ సినిమాకు చివరిసారిగా పింగళి కథ, మాటలు సమకూర్చారు. అయితే 1971లో విడుదలైన ‘శ్రీకృష్ణ సత్య’ కు కథ, మాటలు, పాటలు; 1973లో విడుదలైన సింగీతం శ్రీనివాసరావు తొలిచిత్రం ‘నీటి-నిజాయితీ’ చిత్రానికి మాటలు, ఒక పాట; 1977లో విడుదలైన ‘చాణక్య చంద్రగుప్త’ చిత్రానికి కథ మాటలు సమకూర్చగా ఆ చిత్రాలు పింగళి మరణానంతరం విడుదలయ్యాయి. జీవితాంతం బ్రహ్మచారిగానే గడిపిన పింగళి, రామమూర్తి అనే అబ్బాయిని దత్తత తీసుకున్నారు. ఆయన చివరిరోజుల్లో క్షయ, ఉబ్బస వ్యాధులతో బాధపడ్డారు. 1971లో ప్రియ మిత్రుడు కె.వి.రెడ్డి మరణించడంతో పింగళి మరింత వేదనకు గురయ్యారు. అదే సంవత్సరం మే నెల 6 వ తేదీన పింగళి దివంగతులైనారు. తెలుగు చలనచిత్ర సాహితీ చరిత్రకు మల్లాది రామకృష్ణశాస్త్రిని కవిత్రయంలోని నన్నయ కవితో పోల్చగలిగితే, సముద్రాలను తిక్కన సోమయాజిగా, పింగళికి ఎర్రాప్రగడ మరియు పోతనగా పోల్చుతూ మనం కావ్యగౌరవాన్ని ఆపాదించవచ్చు.
–ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)
GOOD ARTICLE