రెక్కలు తెగిన పక్షులు…!

వలస జీవులు కాదు వీరు
బతుకు గతుకు బాటలో
మెతుకుల వేటలో
రెక్కలు తెగిన పక్షులు

అంతెత్తుకు ఎగసిన ఆకాశ హార్మ్యాలు
అందులో అనంత సౌకర్యాలు
అడుగడుగున అబ్బురపడే నగిషీలు
వీళ్ళు సృష్టించినవే

బెంజి కార్లు
గంజి పెట్టిన ఖద్దరు సార్లకు
ట్రాఫిక్ కష్టాలెరగకుండా ఓదార్చే
మెలికలు తిరిగిన ఫ్లైఓవర్ లు
వీరి కష్ట ఫలమే

హోటల్లో రెస్టారెంట్లో
క్లబ్బుల్లో పబ్బుల్లో
తిండి వండి వార్చేది
తిట్లు కొట్లు ఓర్చేది వీళ్ళే

పరిశ్రమల్లో
పంట చేలల్లో
మురికి కాలువల్లో
ఇంటిపనుల్లో
ప్రమాదకర గనుల్లో
రెక్కాడించే
శ్రమజీవులు వీళ్ళే

అందరికీ సౌకర్యాల గంధాలు వెదజల్లి
కష్టాల దుర్గంధాలు చుట్టుకున్న
త్యాగ జీవులు వీళ్లే
రెక్కలు ముక్కలు చేసుకుని
కునారిల్లే కూలీలు వీళ్ళే

సొంత వూరికి
సొంత వారికి
దూరంగా భారంగా
చెట్టు చాటునో గుడారం కిందో
తలదాచుకునే వలస పక్షులు వీళ్లే

వీళ్ళు రాకపోతే
వీళ్ళ శ్రమలేకపోతే
పరిశ్రమల్లేవ్ పరిమళాల్లేవ్
వస్త్రాల్లేవ్ వస్తువుల్లేవ్

బంగారం రేటు పెరిగిందని
కంగారే వుండదు వీరికి
స్టాకు మార్కెట్టు ఎగిరినా కూలినా
పట్టింపే లేదు వీరికి
పీవీసీ..పీఓపీ తప్ప
జీడీపీ తెలియని తింగరోల్లు వీళ్ళు

ఒరేయ్ తరెయ్ కూతలు
ఈసడింపులు తప్ప
ఊరడింపులు పొందని
వెతల కతల కపోతాలు వీళ్ళు

సైబీరియా నుంచి వలసొచ్చిన
కొంగలకుండే గౌరవం
పొట్ట చేతబట్టుకుని పనికొచ్చిన
ఈ వలస పక్షులపై వుంటే ఎంత బావుణ్ణు

ఓటుకూడా వేయలేని
డాలర్ల వేటగాళ్ళకేమో ఆకాశ యాత్రలు
దేశంలో శ్రమించే నిర్భాగ్యులకేమో
మండుటెండలూ ధూళి దారులూ

వీళ్ళు చేస్తున్న బాధయాత్రలు
రాజ్యంకోసం రాజకీయం కోసం కాదు
సొంతూరు మమకారం కోసం
కన్ను మూసినా కప్పుకుణేన్దుకు
ఆరడుగుల మట్టి కుప్పకోసం

రాలుతున్న కన్నీళ్లు
కాలుతున్న పేగులు
నెర్రెలు చీలిన పాదాలు
యాదృచ్ఛికం కాదు

వ్యవస్థ చేసిన పాపం
వ్యవస్థ పెట్టిన శాపం

అభివృద్ధి అభివృద్దని అరుస్తున్న
జీడీపీ లు చూసి జబ్బలు చరుస్తున్న
రంగుల హంగుల మాయగాల్లకు
ఓ వైరస్ చూపిన వాస్తవం
కరోనా చేసిన కఠిన సంతకం

కష్ట జీవుల కన్నీటి చుక్క
కష్ట జీవుల నిర్వేదం,
బడుగుల నైరాశ్యం
సమాజానికి శాపం

– గంటా మోహన్
(వలస కార్మికులకు అండగా నిలిచిన దాతలు,అధికారులు,నాయకులకు అభినందనలు…పట్టించుకోని స్వయం ప్రకటిత మేధావులకు దండాలు)

SA: