ఆయన కవిత్వం ‘వెన్నెల జలపాతం’

(అంతర్జాతీయ కవి డా. పెరుగు రామకృష్ణ మే 27, జన్మదిన సందర్భంగా)

సమాజం, వ్యక్తి, సాహిత్యం అనే ఈ మూడు అంశాలు పరస్పర సాహచర్యాంశాలు. ఏ యుగ సాహిత్యంలోనైనా సమాజం, అందులోని వివిధ సంఘర్షణలు వ్యక్తి స్థాయిలోనైనా, సమాజ స్థాయిలోనైనా భిన్న విభిన్న రూపాలతో మనకు దర్శనమిస్తుంది. అందువల్ల మనం గమనిస్తే వైయక్తిక దార్శనికతలు, ప్రాంతీయత, నిబద్ధతలు ఉన్న సాహిత్యంలోని మానవుడు పరిపూర్ణ సామాజిక మానవుడుగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి లక్షణాలన్నీ పుష్కలంగా పుణికిపుచ్చుకున్న కవి డా. పెరుగు రామకృష్ణ, వారి గ్రంధాలన్నిటిని మే 27న వారి జన్మదిన సందర్భంగా ఒక విహంగవీక్షణ యత్నం చేస్తున్నాను.

ఆయన రాసిన కవిత్వ సంపుటులలో మొదటిది 1996 లో వచ్చిన వెన్నెల జలపాతం. దీనిలో మొత్తం 20 కవితలున్నాయి. వెన్నెల కురుస్తుంది. వెన్నెల విరబూస్తుంది. కాని జలపాతంలా దూకి ప్రవహిస్తుంది అనడంలో కవి చమత్కృతి అంతా దాగి ఉంది. శ్రీశ్రీని గురించి చెబుతూ “భావ కవితాలోకం నుంచి యువకలాల దారి మళ్ళించి-అభ్యుదయ భావం బండ్లబాటపై తన కలం బలంతో సుదూరం నడిపించి”… అని చెప్తూ “అభ్యుదయాకాశం నుండి ఓ ధృవతార ఎర్రగా మెరుస్తూ రాలిపోయింది” అన్నారు. అభ్యుదయ కవిత్వం విప్లవ కవిత్వంగా మారిందన్న సంకేతం ఇందులో ఉంది. అలాగే అక్షర తపస్మాన్ అనే కవిత ప్రారంభంలో “వయసు వసంతాలు కరిగిపోయినా, కలసి పోయినా జీవితాలు రాలిపోయినా.. కాలిపోయినా, మిగిలేది ఈ లక్షల సమూహాలే! ఒక్క అక్షర సహస్రాలే” అన్నాడు. రామకృష్ణ కవిత్వాన్ని కవిత్వతత్త్వాన్ని, దానికున్న బలాన్ని ఇక్కడ చెప్పడం చూశాం. ఆ భావాలు చదివిన వారిలో తక్షణం మార్పు వస్తుందా, రాదా? అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. మారవలసిన వ్యవస్తాత్మక భావాలకు ఏ మేరకైనా దోహదం చేస్తున్నదా లేదా అనేది గమనించాల్సిన విషయం. అందుకే కవి తన ఆవేదనను తన కవిత్వంలో ప్రతింబించే విధంగాను ప్రతిఫలింపజెయ్యడానికి చేసిన గొప్ప ప్రయత్నంగా భావిస్తున్నాను. అక్షరజ్యోతిని వెలిగించండి అనే ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నాడు. ఇందులో కొన్ని మిని కవితలు కూడా ఉన్నాయి. కవిత్వంలో సామాజికసారాన్ని అంచనా వేయడంలోనే కవిప్రతిభ దాగిఉంటుంది. ఈనాటి కవిత్వాన్ని గురించి ఒక్క మాటలో చెప్పమంటే మనం కోల్పోతున్న వాటిని గురించి ఆవేదనను ప్రకటించడమే అని చెప్పుకోవచ్చు.

ఆ తరువాత “పూలమ్మిన ఊరు” అనే కవితా సంపుటి 2012 లో వెలువడిన పుస్తకం. ఈ గ్రంధంలో మొత్తం 41 కవితలున్నాయి. దీన్లో “కవిత్వమంటే ఒక ఆనందపు తెర, ఒక దుఃఖపు పొర, ఒక మహాద్భుత వైచిత్రి” అనే ఖలీల్ జీబ్రాన్ మాటలను గుర్తు చేసుకుని, “గత పాతికేళ్ళుగా కవిత్వాన్ని తింటూ బ్రతికేస్తున్నాను. ప్రాంతీయ, దేశీయ, విదేశీయ అన్ని రకాల కవిత్వ విందును ఆరగిస్తూ.. ఆస్వాదిస్తూ నెల్లూరునుండి గ్రీసు దాకా ఎందరో కవులతో ప్రవాహ కరచాలనం… కవితాగానం అంటారు. అంతే కాదు మంచి కవిత్వం సజీవంగా ఉండాలంటే, మంచి పాఠకుడు కూడా ఉండి తీరాలి. అందుకే ఇలా కొన్నాళ్ళ కవిత్వాన్ని ప్రోది చేసి, గుది గ్రుచ్చి, మంచి పాఠకుల కోసం పదిలపరిచి అందించే ప్రయత్నం అన్నారు. ఇందులో మృత్యుఘంటికలు కవితలో “మట్టితో… ప్రకృతితో మమేకమై… మహిమాన్వితమైంది మనిషి బ్రతుకు” అన్నారు. మానవ జాతి చరిత్ర అంటేనే ప్రయత్నాల చరిత్ర. మనిషి మనుగడంతా ప్రకృతికి అనుసంధానించబడింది. ఇంకా ఆ కవితలో “ఎవరో రహస్య శిబిరం నిర్మించుకొన్నట్లు/ పొలం మధ్యన పొగగొట్టాలు లేస్తున్నాయి. గెనాల పాదులు తీసిన పొలం/ రాత్రికి రాత్రి రొయ్యల గుంటలై / రసాయన స్నానం చేస్తుంది” అన్నారు. పచ్చని పొలాలన్ని రొయ్యల చెరువులు చేసేసి ప్రకృతిని చెరబడుతున్నాడు మానవుడు. ప్రకృతి కన్నెర జేస్తే మనిషి మనుగడ సాగుతుందా? చెప్పండి? అందుకే అంటారు “మనిషి స్వార్ధంతో మట్టిని మింగేస్తుంటే.. భద్రకాళి రుద్ర రూపం దాల్చి/ ప్రళయంలా మట్టి విరుచుకు పడి/ మనిషిని మింగేస్తుంది” అంటాడు. ఈ భూకంపాలు, అకాల వరదలు, కరువు కాటకాలు దేనికి సంకేతం చెప్పండి? అని అన్యాపదేశంగా ప్రశ్నిస్తున్నాడు కవి. అలాగే “అక్షర ఖడ్గం” అనే కవితలో “ప్రపంచపు ప్రథమ శత్రువుని అక్షర ఖడ్గంతో చీల్చగలగాలి. శాంతి చిహ్నపు బావుటా ఇనుప పాదాల క్రింద నలుగుతున్నప్పుడు అరికాళ్ళకు మాటల మేకులు గుచ్చగలగాలి” అంటాడు. ఈ కవిత సార్క్ దేశాల కవితోత్సవంలో 2010లో గానం చేసిన కవిత. ఒక కవితకు జాతీయ, అంతర్జాతీయ బారికేళ్ళు ఉండకూడదు. కవిత సర్వకాలాలకు ఉపయోగపడేది సర్వ మానవాళికి ఉపయోగ పడేది అయి ఉండాలి. ఆ కాన్సెప్టును గట్టిగా పట్టుకున్నాడు కాబట్టే అంతర్జాతీయ కవి కాగలిగాడు పెరుగు రామకృష్ణ, ఈ కవితా సంపుటిలో ఇంకా ఎన్నో మంచి మంచి కవితలను పూమాలగా చేసి అందించాడు.

ఆ తరువాత దీర్ఘ కవితలను చూస్తే, 2003లో “నువ్వెళ్ళిపోయాక” అనే దీర్ఘ కవిత రచించాడు. అనారోగ్యంతో వారి అన్నయ్య వెళ్ళిపోయాక, అంతే కాక ఇంకా పరిచయ సహచరులు బంధుబ్బందం, తోడు నీడైన వాళ్ళు హటాత్తుగా ఈ లోకం వీడి వెళ్ళిపోయాక కలిగే ఆవేదనలు ఈ దీర్ఘ కవితలో ఉన్నాయి. వారు వెళ్ళిపోయాక “మూగబోయిన కవితా ప్రవాహాన్ని చూస్తూ గ్రీష్మ వేదనను భరించలేకున్నా” నని, “వేరునుంచీ వేరు చేయబడ్డ చెట్టుగా” ఉన్నననీ, “ఒక సౌందర్య మహాసముద్రం హటాత్తుగా ఇంకిపోయిందని” వేదనాభరిత హృదయుడై, “నువ్వు పెంచి వెళ్ళిన పెరటిలోని/ ప్రేమ జాజితీగ పరిమళాల్ని వాడిపోనీక/ భావితరం బంధాలు ఏవీ/ క్షణికాలై కూలిపోకూడదని/ కూనిరాగం తీయమంటాను”. అని బంధాల్ని మరచిపోకూడదని హితవు చెబుతాడు.

ఆ తరువాత 2006లో నెల్లూరు జిల్లా నేలపట్టు ప్రాంతంలో, పులికాట్ సరస్సులో విడిదిచేసే “ఫ్లెమింగో” విడిది పక్షులపై ఓ దీర్ఘ కవిత వచ్చి, రామకృష్ణ కీర్తి ప్రతిష్టలను ఆకాశానికెత్తింది. అనేక భాషల్లో అనువాదం పొందింది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 9వ తరగతివారికి పాఠ్యాంశంగా వచ్చింది. కాలాన్ని గురించి, పక్షుల గురించి, వాటి ప్రవృత్తిని గూర్చి, ప్రకృతిని గురించి చెప్పి ఓ కావ్యగానం చేశాడు రామకృష్ణ, కల కాలం నిలిచిపోయే ఈ గ్రంధంలో “అనంతమైన స్వేచ్ఛకు రెక్కలు మొలిస్తే పక్షి” అని చెబుతూ “అక్కడ కొమ్మ కొమ్మకో కచేరీ/ గూటి గూటికో రాగ వల్లరి”… “నేలపట్టంతా పక్షుల జాతర” అని సంభావిస్తాడు. చివరలో “అంతరాత్మరాత్మలన్నీ ఏకీభావమౌతాయి. విశ్వాత్మా విభూతులన్నీ మహితాత్మలౌతాయి” అంటాడు. ఈ కవిత చదివాక విశ్వమనోజ్ఞ భావనలను మన కళ్ళముందు మెరుపులు మెరుస్తాయి. సృష్టిధర్మాలన్నీ స్పష్టమౌతాయి.

కవి లేకపోతే ఒక రచయిత ఒక రచనా బీజాన్ని తొలుత హృదయస్థం చేసుకుంటాడు. ఆలోచనా, మధనా, స్పందన, అనుశీలన, సంవేదన చింతనాదులతో ఆ క్రమం పరిపోషకమవుతుంది. అనుభవ క్షేత్ర సారాన్ని స్వీకరించి పెంపొందుతుంది. వై యక్తిక సంస్కారాన్ని, మానసికోద్రేకాలను పీల్చుకుంటుంది. ఈ మాటలకు ఉదాహరణగా 2017లో వచ్చిన “ఒక పరిమళ భరిత కాంతిదీపం” పేర్కొనవచ్చు. “ఒక నవనిర్మాణ దీక్షకావాలి”. అంటాడు. “మేమంతా ప్లాస్టిక్ బానిసలమైపోయాం” అంటాడు. జ్ఞాపకాల గని త్రవ్వి తీస్తాడు. కవిత్వమంటే ఏమిటో రహస్యాన్ని విప్పి చెబుతాడు. “అక్షరం చదవక ముందు మనిషినైన నేను/ అక్షరాన్ని గుండె నిండా నింపుకున్నాక రెక్కలొచ్చిన పక్షినై ఆకాశానికేగుతాను” అంటాడు. నా దృష్టిలో/ పుస్తకం ఒక పరిమళభరిత కాంతి దీపం”. అని చెప్పి కాంతికి రంగు, వాసనలుంటాయని తీర్మానిస్తూ.. అవన్నీ అనుభవం చేసుకున్న వారికే జీవయాత్ర అసలైన పరమార్ధం తెలుస్తుందని చెబుతాడు. ఇలా ఈ పుస్తకంలో 53 అద్భుతమైన కవితలున్నాయి. ఇటీవల తాజాగా 2023లో సంజీవని కలంతో “వర్ణలిపి” లిఖించి 30 స్వీయ కవితలను, 23 అనువాద కవితలను మనముందుంచారు. అనువాద కవితల్లో వివిధదేశాలలో ఉన్న గొప్ప గొప్ప కవులు కవిత్వాన్ని మనకు దృశ్యమానం చేశారు. “జీవితమంటే జనన మరణాల జ్యోతిష్పక్రం కాదు. జీవితమంటే వాసంత సమీర వేణుగానం” అంటారు ‘వర్ణలిపి’ కవితలో. అలాగే “మనిషే తెలుపు నలువుల సంఘర్షణలో/ ఒక జాతి గొంతుమీద కాలైనాడు. రంగు వివక్షలో బ్రతుకును కాలరాస్తున్నాడు” అంటాడు. సమాజమంటే అసంఖ్యాక మానవుల సమాహారం. కానీ ప్రతి వ్యక్తీ విశిష్ట రూపరేఖా గుణ వాసనా భిన్నత్వంతో బ్రతుకుతాడు. ఇంత భిన్నత్వం ద్యోతకమైనా, ఇందరినీ ఏకం చేసే జీవలక్షణం ఏమిటంటే మానవీయ రసగ్రహణానుభావ హృదయద్రవ్యం మాత్రమే! సర్వకర్మణ్యత్వాలకూ అవసరమైన ఆ చోదకశక్తి లోపిస్తే ‘నేడు నీదైన కాలం రేపు మరొకది కావచ్చు” తస్మాత్ జాగ్రత్త! అంటున్నాడు కవి.

కవిత్వం అంతిమంగా సామాజిక ప్రయోజనంలో అంతర్భవించినప్పటికీ, అనుషంగికంగా అనేక ఫలితాలను ఇచ్చే లక్షణం శక్తి కవిత్వానికి ఉన్నదన్న స్పృహ ఉన్నవ్యక్తి రామకృష్ణ ఇది ఏ కళకైనా ఉండదా అని మీరు అడగొచ్చు. ఉంటుంది. కానీ, “కవిత్వంలో భావనా శక్తికి జీవితాంతం వెంటాడే స్వభావమూ, మనిషి మానసిక స్థితిని బట్టి, దశను బట్టి అనేక భావ కోణాల్లో ఆవిష్కరించే అవకాశం కవిత్వానికి మాత్రమే పరిపూర్ణంగా ఉంద”ని చెప్పిన అద్దేపల్లి మాటలను ప్రగాఢంగా విశ్వసించే వాళ్ళలో నేనొకణ్ణి.
Courtesy: Srujana Kranthi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap