కవిత్వం ఒక ప్రత్యేక భాష అనుమానం లేదు. చాలా విలక్షణమైన భాష. తెలిసిన మాటల్లోనే ఉంటుంది. కానీ తెలియని భావాల్లోకి తీసుకెళుతుంటుంది. అర్థమౌతూనే, అర్థం కానట్లూ! అర్థానికీ – అనుభూతికీ మధ్య దోబూచులాట ఆడిస్తున్నట్లు….
అందుకే పూర్వులు దాన్ని ‘అపూర్వ నిర్మాణ క్షమ’ కలిగిన భాష అన్నారు. వారు సూటిగా ‘భాష’ అనే మాట వాడకపోయినా, దాని ఉద్దేశ్యం అదే! భాషలోనేగా కవితా నిర్మాణం!!
అయితే ఈ నిర్మాణ క్షమ కొత్త ‘భావానుబంధాలు’ నిర్మించడం లోనా (భిన్నభావరూపాలమధ్య అనుబంధాలు)? లేక వాటిని అభివ్యక్తి పరిచే పదబంధాలు నిర్మించుకోడం లోనా? లేక కొత్త పదాలను సృష్టించుకోడం లోనా? ప్రస్తుతమున్న భాషానిర్మాణ వ్యవస్థకు, దాని సూత్రాలకు లొంగని కొత్త పదాలను నిర్మించుకోడం లోనా? ఈ చివరిదాన్ని ‘కొత్తభాష’ అందాం. కవిత్వం అలాటి కొత్త ప్రత్యేక భాషా?
ఇలాటి ప్రశ్నలు వచ్చినప్పుడే ఈ కింది ప్రశ్నలు రెలెవెంట్ అవుతాయి.(ఈ రిలవెన్సుకు ‘ప్రస్తుతం’, ‘సాందర్భికత’ అనే మాటల్ని వాడుతున్నాం. అవి ఏ మాత్రం పొసగకున్నా, మరో అర్థంలో అవి రూఢి కెక్కివున్నా, ఆ పాత పదాలకు కొత్త అర్థాన్ని నిర్దేశించు కొంటున్నామన్నమాట. ఇదో ఆర్బిట్రరీ అంశం. ఆర్బిట్రరీనెస్ ప్రధానలక్షణమైన భాషలో అనువాద సమస్యల పరిష్కారంలో ఇదో విధం. ఆ మాత్రం చేత, అది కవితాభాషకు సాధారణ సూత్రం చేసుకొనే అవకాశం ఉందా?
ఇక్కడ మరో మూడు విషయాలు ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను.
1. ఆర్బిట్రరీగా, మనకు తోచిన రీతిలో పాతపదాలకు కొత్త అర్థాలను కల్పించుకొని వాడవలసిన అగత్యముందా?
2.సహజమైన అనుభూతులను వ్యక్తం చేసే సందర్భంలో కూడా కొత్త పదాలను సృష్టించాల్సిన అవసరముందా, పూర్తి వ్యక్తిగత అనుభవం లోని మార్మిక అవసరాలకు తప్ప! అలా సృష్టిస్తే, అవి నేటివిటీ ఫీలింగ్ ని, సహజ స్పందనని ఎంతవరకు కలిగించగలుగుతాయి.. దానివల్ల కవిత్వ భాష నష్టపోతోందా? లాభపడుతోందా?
3. కవిత్వం, ఎదుటివారి అనుభవంతో నిమిత్తం లేని పూర్తి వైయక్తిక మార్మిక అభివ్యక్తి కావడంలో ఎంతవరకు సామంజస్యం ఉంది ? మన వైయక్తిక అనుభవాన్ని, ఎదుటి వారి అనుభవంలోకి మార్చడానికి కవిత్వం వారధి కావద్దా? కనీసం ఓ verbal transformer గా నైనా ఉండొద్దా? ఆ verbal motor – శాబ్దిక వాహిక – కూడా లోకం తయారుచేసిందే కదా, మన నైపుణ్యం దాని స్టీరింగ్ లోనే కదా చూపాల్సింది! (కావాలంటే మనం మన అభిరుచి మేరకు కొత్త అలంకారాలు చేయవచ్చు).
కవిత్వం ఒక ప్రత్యేక భాషంటూ, భాషలో, పదబంధాల్లో కొత్త ప్రయోగాలు చేస్తున్న కవులు, ఈ అంశాలను ఓ మారు పరిశీలించుకొంటే, అటు వారికీ, పాఠకలోకానికి, కవిత్వ భాషకు మేలు జరుగుతుందేమో!!
-జి. లక్ష్మినారాయణ