కవులు విజ్ఞాన సర్వస్వం కాకున్నా, విజ్ఞానులని సామాన్యుడి నమ్మకం. వారికి జ్ఞానచక్షువులున్నాయని భావిస్తాం. ఉన్నత ఆలోచనలు గలవారని మనభావన. మానవుల సమిష్టి అవసరాల్ని చర్చించి సిద్ధాంతీకరించ టానికి బాధ్యత వహిస్తారు. కవికి సమాజం ఊపిరి. మెరుగైన ఆలోచనలు, విశాల దృక్పథం, వ్యక్తిత్వం కవిని చిరంజీవిని చేసై. కవికి అంతరచర్చ గొప్ప సంపద. ఆ క్రమంలో కొన్ని అనుకూల భావనలు అనుసరిస్తుంటై. కొన్ని ప్రతిరేక భావనలు అడ్డువస్తుంటై. తనలో వాదోప వాదనల అనంతరం శ్రేయోభావన ఉపరితలానికొచ్చి కవిత్వంగా ప్రకాశిస్తుంది. కాని ప్రతిబద్ద(committed) కవికి అంతరచర్చ రాదు. అప్పటికే చతుర్వేద పారాయణ కోవెలలోనికో, కారల్ మార్క్ కమాను లోనికో ఒరిగి సమాగతి పొందిన కవికి వంట, వార్పు అంతా అదేలోకం. సర్వభావనల పై సమదృష్టి సానుకూలతలు వుండవు. తన భావన వైపుకు తూకం పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తాడు.
కాలం వేగంగా మార్పు చెందుతుంది. ప్రజలు వారివారి వన రులు అభినివేశాలతో చైతన్యవంతులౌతున్నారు. కవి కూడా వారిని అర్థం చేసుకోవటానికి, కలిసి నడవటానికి వివిధ అవతారాలెత్తాడు. పోనుపోను ప్రజల్లో భావభేదాలున్నట్లే కవులలోనూ వచ్చాయి. కవులూ ఎవరి భావజాలానికి వారు అంకితమైనారు. ప్రపంచీకరణ గవాక్షాల నుంచి తానూ రెక్క విప్పుతున్నాడేకాని రస్తాలు పరచి ప్రపంచాన్ని తన వెంట నడుపుకోగల శక్తిమంతుడు కాలేకపోతున్నాడు. ప్రభుత్వాలకు, ప్రజలకు సైద్ధాంతిక ప్రణాళిక ఇవ్వలేకపోతున్నాడు. కవిత్వం అంటే కాలక్షేప గులకరింత అనుకున్నాడే కాని సమస్యల పరిష్కారం అనుకున్నట్లు కనిపించలేదు.
కవులు తమకున్న మేధోసంపత్తితో దైవభక్తి కవిత్వం, దేశభక్తి కవిత్వం, ప్రకృతి కవిత్వం, రైతుకవిత్వం, అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం వగైరాలుగా పాయలు పాయలైనారు. కావచ్చు. తప్పులేదు. పద్యకవిత్వం, గేయకవిత్వం, మాత్రాబద్ధ కవిత్వం, వచన గేయం, వచన కవిత్వం, ముక్తకాలు, మూడు పంక్తుల్లో ముల్లోకాలు చూపే నవీన కురచ కవితలు (పిండి తక్కువ రొట్టె లెక్కువ) వగైరా ప్రక్రియా ప్రయోగాలు వచ్చాయి. ధ్వని కవిత్వం, సంకేత కవిత్వం, ఆధునికానంతర కవిత్వం అంటూ కవిత్వ విభజనలొచ్చాయి. పాఠకుడు కవిస్థాయికి రావాలేగాని కవి పాఠకుని స్థాయికి పోరాదనే వాదనలొచ్చాయి. పర్యవసానంగా కవి ప్రజలకు దూరమయ్యాడు. దురదృష్టం. ఆ కవిత్వాలు అక్షరాశుల శాతాన్ని పెంచలేదు, భాషా ప్రేమికుల శాతాన్నీ పెంచలేదు.
జనాభా ఏటికేటికీ పెరుగుతున్నది. చిన్న, పెద్ద కవి జనాభా కూడ అగ్గలంగా పెరుగుతున్నది. కవుల మనస్తత్వాలు మారుతూ వస్తున్నై. ప్రాపకాల కోసం, ప్రాముఖ్యతల కోసం మాధ్యమాల ద్వారా ప్రకాశనం కోసం వెంపర్లాట మిక్కుటమైంది. రాజకీయాలు, వర్గాలు ప్రవేసించి ముఠాలు ముఠాలుగా ఏర్పడ్డారు. ఒక ముఠాలో వారు ఒక గ్రంథానికి ముందుమాట రాస్తే మరొక ముఠా వారు ఆ గ్రంధం మొదటి పేజీ కూడ చదవటం లేదు. కవులలో ఎవరికి వారికే ICONIC TENDENCY వచ్చింది దురదృష్టం. ICONOCLAST (విధ్వంస కీలలు) పరిస్థితులూ వచ్చాయి.
సమాజం తన ప్రయాణంలో చాలా విభాగాల కవిత్వాలను చూసింది. ఏ విభాగంలో కవిత్వం చెప్పినా కవులు ప్రజల సమస్యలకు పరిష్కారమార్గం చూపకుండా సమాజం వెంట కాళ్ళీడ్చుకుంటూ నడు స్తున్నారు తప్ప, ముందు నిలిచి ధైర్యంగా కేలెత్తి మార్గదర్శనం చేయ లేకున్నారు. దుర్మార్గాలను తప్పు పట్టలేకున్నారు. వాటి నుండి ప్రజల్ని మరల్చలేకపోతున్నారు. పరిష్కారం చూపలేక పోతున్నారు. కనీసం చర్చలూ లేవు. 20 శతాబ్దాలు కవుల కవిత్వం ఫలితాలనివ్వలేదని అర్ధమౌతున్నది.
సందర్భం: నేటికి (2019కి) ముందు 11 ఆర్ధిక సంవత్సరాలలో ప్రజలు బ్యాంకులను మోసం చేసిన సంఘటనలు 53,000 వున్నాయి (రిజర్వు బ్యాంకు సమాచారం ప్రకారం) వీటిలో బ్యాంకులకు లక్షల కోట్లు నష్టం వచ్చింది. పోయిందంతా ప్రజల సంపదే. కవులు unreco gnised legislators అని చెప్పుకుంటున్నారు. సాహిత్యం , కవిత్వం వలన ప్రజల్లో నేరప్రవృత్తి తగ్గకపోవటానికి కారణాలేమిటి? కవిత్వానికి తగ్గించే శక్తి లేకనేనా? మరొక ఉదా:- కుల, వర్గ రిజర్వేషన్ల పేర సమాజాన్ని ముక్కలు ముక్కలు చేసి తమ స్వార్ధాల కోసం 70 సంవత్సరాల నుండి ప్రజలతో ఆటలాడుకుంటున్న రాజకీయ నాయ కులు, పరిపాలకుల విధానాల గూర్చి కవులు నోరు మెదపరేం? రాజ్యాంగం ఇలానే వుండాలని సమర్ధి స్తారా లేక ముక్కల్ని, తానును కలపాలని రాజ్యాంగ సవరణలు కోరతారా? ఉమ్మడి పౌరస్మృతి, ముమ్మారు తలాక్, ఒకే దేశం-ఒకే ఎన్నికలు (జమిలి), మహిళా బిల్లు వగైరా జటిల దేశసమస్యల పై కవులకు నిర్దిష్ట ఆలోచనుందా? గళం విప్పలేం? దేశంలోని 60 కోట్ల మహిళలు, పురుషులు కుటుంబాలు గుల్లయిపోతూ మద్యపానం నిషేధించాలని దశాబ్దాలుగా వీధుల వెంటబడి ఉద్య మాలు చేస్తుంటే కవులు నోరెత్తరేం? కాలక్రమంలో కవులు సాంప్రదాయ కవిత్వం, అందుండి భావ కవిత్వానికి, అభ్యుదయ కవిత్వానికి, విప్లవ కవిత్వానికి, దిగంబర, పైగంబర, నయాగరా, చేతనావర్త వగైరా వగైరా మార్గాలు అవలంభించారు. కొయ్యగుర్రాలు, మోర్గోపు దున్నలు కవిత్వంలోకి ప్రవేశించాయి. వీటికితోడు ఇమేజిజమ్, సింబాలిజమ్, సర్రియలిజం, డాడాయిజం వగైరా ఇజాలొచ్చాయి.
సాహిత్యపరంగా సామాజిక వస్తుపరంగా కన్యాశుల్కం, వర విక్రయం, చింతామణి సాక్షి, వగైరా గ్రంథాలు గొప్పవే. సమకాలీన సమస్యల పై వచ్చినవే. గౌరవించవలసినవే. ఆ గ్రంథాలు ఇప్పటికి వందేళ్ళ క్రితం సమాజంలో బాధలు చెప్పాయి. కాని ఆ దురాచారాలు సుదీర్ధకాలం అలానేవుండి కొన్ని చట్టాలవల్ల తగ్గిపోయాయి. కొన్నిటిని సమాజం దాని ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక పరిస్థితులను బట్టి జీవన విధానాలను దానంతటదే మార్చుకున్నది. సమాజంలో స్త్రీవాద కవిత్వం తెచ్చిన మార్పుల కంటే ప్రపంచీకరణ వలన, విద్యావిధానాల వలన సమాజం తమంత తామే మార్పు చెంది, వ్యవసాయ కుటుం బాలు, కార్మిక కర్షక కూలీ కుటుంబాలలోని బాలికలు, స్త్రీలు, విద్య ఉద్యోగాలవైపు ఆలోచనలు చేసి సఫలీకృతులైనారు. సమాజాన్ని, ప్రభుత్వ విధానాలను ఉపయోగించుకొని మహిళ తానే స్వయంగా స్వతంత్రురాలైంది. సాధికారత సంతరించుకున్నది. వివిధరంగాలలో ప్రావీణ్యత సంపాదించి తన కాళ్ళపై తాను నిలబడగలుగుతుంది. తన కోక, రవిక తానే సంపాదించుకుంటుంది. నేటి విద్యార్థినులు, ఉద్యోగినుల శాతం చూస్తే ఇది అర్ధ మౌతుంది. అది మహిళా విజయమే. వారిలో ఎందరు స్త్రీవాద కవిత్వం చదివి చైతన్య వంతులై వుంటా రనేది ప్రశ్నార్థకమే, దళితవాద కవిత్వానికొస్తే 1950లో వచ్చిన రాజ్యాంగమే గొప్ప దళిత సంక్షేమ గ్రంథం. తర్వాత కూడా ఆ కోణంలో ఇతర చట్టాలు వచ్చాయి. కవిత్వాలను చదివి రాజ్యాంగం రాయ లేదు. ప్రజల బాధల్ని చదివి రాజ్యాంగం రాశారు. స్త్రీవాద కవిత్వం, దళితవాద కవిత్వం ఏమి-ఎంత సాధించింది? ఇంకా ఆ కవిత్వ వాదాలతో అవసరముందా అని కవులు ఆలోచించుకోవాలి. 1960లో మొదలైన విప్లవ సిద్ధాంతం కవులను సిద్ధాంతపర విభాగాలు చేయటం తప్ప సాహిత్యం విప్లవకారులకిచ్చిన తోడ్పాటు దాదాపు లేదనే చెప్పాలి. విప్లవకారులు అడవుల్లో ఆకులు తింటుంటే, విప్లవ సాహితీకారుడిననే గుర్తింపు కార్డు తగిలించుకున్న కొందరు కవులు వేదికలు, విందులు, అవార్డులు పంచుకుంటున్నారు. కవులు అంతర్మధనం చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో వాస్తవాలకోసం అధ్యయనం చేయాలి.
నేటి సమాజం, సమర్ధ ప్రభుత్వాలు, పరిపాలన, రాజకీయం, ఆర్ధికం, విద్య, ఉద్యోగాలు, పరిశ్రమలు, వ్యాపారాలతో తనకు తానే వేగంగా ముందుకెళుతుంది తప్ప ఏ సిద్ధాంతపర నిర్ణయాలకు, పాలనాపర విధానాలకు కవుల కవిత్వ తోడ్పాటు లేదనే చెప్పాలి. కవులకు ఆ సామర్ధ్యం వున్నట్లు నిరూపణ కావటంలేదు. కవి సమాజాన్ని చదువుతున్నాడా అని ప్రశ్నించుకోవాలి. కవి వెనకబడ్డాడు. వారు కేవలం కవిత్వం కోసం కవిత్వం రాస్తున్నారని అర్థమవుతుంది. ఇది సంతోషించ దగిన పరిస్థితి కాదు. ఈ 21వ శతాబ్దంలో సమా జాన్ని, పరిపాలకులను నడుపుటలో కవులు ఎటువంటి బాధ్యత తీసు కుంటారో, ఎంత ప్రయోజనం సాధిస్తారో వేచి చూడాలి.
బి. హనుమారెడ్డి (మల్లెతీగ)
Good article.
Nice essay and nice clarity in my view .Thank you .