‘మా నాన్న పోలీసు..ఆయనకు సహకరించండి’.. వైరల్ అవుతున్న చిన్నారి విజ్ఞప్తి!
కరోనా వైరస్ ..ప్రస్తుతం ప్రపంచాన్ని వణికించేస్తున్న భయంకరమైన మహమ్మారి. ఈ వైరస్ తో ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి దేశం పోరాడుతుంది. దీనితో చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఇక భారత్ లో కూడా ఈ కరోనా వేగంగా విస్తరించడంతో ..దేశంలో లాక్ డౌన్ విధించారు. దీనితో దేశంలో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. విమానాలు రైళ్లు బస్సులు అన్ని కూడా ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. ఈ కరోనా కి మందు లేక పోవడంతో ప్రభుత్వాలు ప్రజలెవరూ ఇళ్లల్లో నుండి బయటకి రావొద్దు అని హెచ్చరికలు జారీచేశాయి.
అయితే ఈ మహమ్మారి మనుషులని చంపేస్తుంది అని తెలిసినప్పటికీ కుడా పోలీసులు వైద్యులు తమ విధులలో పాల్గొనాల్సి వస్తుంది. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ని అతిక్రమించి బయటకి వస్తే ..వారికీ తగిన విధంగా చెప్పి పంపిస్తున్నారు. ఈ సమయంలో తాజాగా ఒక చిన్నారి ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. “మా నాన్న పోలీసు.. కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు సహకరించండి’’ అంటూ ఓ పసి పాప ప్లకార్డు పట్టుకున్న ఫోటో అది. కదిలించే లా ఉన్న ఈ తరహా ఫొటోలను చాలామంది డీజీపీ ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేస్తున్నారు. ఇక డీజీపీ సైతం రోడ్లపైకి ప్రజలు రాకుండా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కరోనా మహమ్మారిని దేశంలో ఎక్కువగా వ్యాప్తి చెందనీయకుండా ఉంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులకు ఒక్కసారిగా పని భారం పెరిగింది. ఆదివారం జనతా కర్ఫ్యూ మొదలు పోలీసులకు క్షణం కూడా తీరిక లేదు. సోమవారం మధ్యాహ్నం నుండి పరిస్థితి పూర్తిగా మారింది. మంగళవారం ప్రధాని 21 రోజులపాటు లాక్డౌన్ ఉంటుందని ప్రకటించడం తో పోలీసుల పనిభారం రెట్టింపయింది. అత్యవసర పరిస్థితి కావడంతో పోలిసుల సెలవులన్నీ కూడా రద్దయ్యాయి.
ఈ కరోనా ని జయించడం లో వైద్యులది ఎంత ప్రముఖ పాత్ర ఉందొ ..పోలీసులది అంతే ఉంది. ముఖ్యంగా కరోనా బాధితుల గుర్తించడం ప్రజలను చైతన్యం చేయడం గ్రామపంచాయతీ రెవెన్యూ ప్రజాప్రతినిధులతో కలిసి గత మూడురోజులుగా నిర్విరామంగా విధి నిర్వహణలో బిజీగా ఉన్నారు. పలువురు కరోనా అనుమానితులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఉన్నతాధికారులు ఏ అర్ధరాత్రో ఇంటికి వెళ్లి వస్తున్నారు కానీ.. కానిస్టేబుళ్లలో చాలామంది ఇంటికి వెళ్లే సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలో విశ్రాంతి లేకుండా పనిచేస్తోన్న పోలీసుల ఆరోగ్యం పై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. జనసంచారం నియంత్రణ లో పడి ఎక్కడ ముందు జాగ్రత్తల విషయంలో నిర్లక్ష్యం వహిస్తారో అన్న ఆవేదనలో మునిగి పోయారు. దీనితో పోలిసుల కుటుంబ సభ్యులు కూడా దేశ ప్రజలందరినీ ..దయచేసి ప్రభుత్వాలు పోలీసులు చెప్పినట్టు నడుచుకోండి అని ప్రాధేయపడుతున్నారు.