చిత్రకారుడు పొలిమేర అప్పారావు కన్నుమూత

విశాఖపట్నానికి చిత్రకారుడు, చిత్రకళా పరిషత్ సభ్యులు పొలిమేర అప్పారావు (85 ఏళ్ళు) ఈ రోజు 7-9-2022 ఉదయం కన్నుమూశారు.
చిత్రకళలో ఎన్నో శైలులు, దోరణులు రీతులు ప్రాచుర్యంలో కొచ్చాయి. వాటిలో ల్యాండ్ స్కేప్ (ప్రకృతి దృశ్యం) అనేది అతి ప్రాచీన కాలం నుండి వారసత్వంగా వస్తున్న అపూర్వకళాధోరణి. ప్రకృతి లేకపోతే మనుగడ లేదనేది యదార్థం. అందమైన వస్తువుకాని ప్రదేశంకాని ప్రాంతంగాని చూడటం తటస్థిస్తే మనకు ఆహ్లాదం ఆనందం ప్రశాంతత ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రకృతి దృశ్యాలు వేస్తున్నవారు చాలా అరుదు. కేవలం ప్రకృతి చిత్రాలు మాత్రమే వేస్తూ ఉత్తరాంధ్రలో విఖ్యాతి పొందిన చిత్రకారుడు అప్పారావు. వీరు పదివేల ప్రకృతి దృశ్యాలు, మూడు వందలకు పైగా రూపచిత్రాలు (పోర్టరైట్స్) చిత్రించారు.

గతంలో తెలుగు సిన్మాలు ఘాటింగ్స్ అన్నీ స్టూడియోల్లోనే జరిగేవి. ఏది ఏ సమయంలో కావాలంటే అది ఆ సమయంలో స్టూడియోలో తయారు చేసేవారు. ఒక రాజకోట కావాలన్నా, ఒక దేవాలయం చూడాలన్న, పల్లె వాతావరణం కావాలన్నా అడవి దృశ్యాలు కావాలన్నా కళాదర్శకులు అప్పటికప్పుడు రూపకల్పన చేసేవారు. లేని దానిని లక్షణాలలో అక్కడ సృష్టించాలంటే ఎలాంటి ప్రతిభావంతులైన ఆర్టిస్టులు కావాలో అలాంటి వారి వద్ద వీరు సహాయకునిగా ఎనిమిది పద్నాలుగోయేట మద్రాసు వెళ్లి వాహినీ స్టూడియోలో ఆర్డు డిపార్టుమెంటులో చేరారు. అప్పటికే అక్కడే ముఖ్యకళాకారుడిగా ఉన్న ముత్తు భరణి స్టూడియోకి వెళ్లడం వారి స్థానంలో కె.ఎస్.ఎన్. రావటం ఒక్కసారిగా జరిగాయి. వాటర్ పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్, బేనర్ ఆర్టు, ఫొటో పబ్లిసిటీ డిజైన్ వర్క్ సెట్టింగ్ మొదలైన అన్నిరకాల పనులు వీరు మూర్తి వద్ద నేర్చుకొన్నారు. వీరు స్టూడియోలో చేరేటప్పుడు విజయా ప్రొడక్షన్స్ గుణసుందరి సినిమా తీస్తున్నారు. తర్వాత మాయాబజార్ రెండున్నర సంవత్సరాలు తీశారు. పాండు రంగమహాత్యం, తోటికోడళ్లు, లవకుశ, చరణదాసి, చెంచులక్ష్మి కార్తవరాయునికథ ఇంకా పలు తెలుగు, తమిళ, హిందీ మలయాళ, కన్నడ చిత్రాలకు కూడా వీరు పనిచేశారు.మాధవపెద్ది గోఖలే, కళాధర్, కృష్ణారావు, సుబ్బారావు, తోట శ్రీవాణి, నాగేశ్వరరావు, శేఖర్, పెరుమాళ్, అన్నామలై, టి.వి.ఎస్. శర్మ వంటి ఆర్డుడైరెక్టర్ల వద్ద పనిచేశారు. వీనస్, గోల్డెన్, భరణి, ప్రకాష్, పేరమౌంట్ స్టూడియోలకు చెందిన రాయ్ కుమార్, అంగము వంటి స్టూడియో ఆర్టిస్టుల కేతాశ్రీ, వేలు బ్రదర్స్ వంటి పబ్లిసిటీ ఆర్టిస్టుల వద్ద కూడా వీరు పనిచేసి అనుభవం గడించారు. 1962లో వీరి కళాప్రతిభ చూచి విశాఖకు చెందిన హిందుస్థాన్ షిప్ యార్డు ఉద్యోగం ఇచ్చింది. చేసేది ప్రభుత్వ ఉద్యోగం అయినా ఆ ఉద్యోగం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగంతో ఈ కళకు ప్రోత్సాహం లేక ఈ కళపట్ల ఉన్న అభిరుచి మేరకు డ్రామా సీనరీలు, ఫొటోస్టూడియో బ్యాగ్రౌండ్స్ రాశారు.

Landscape by P. Apparao

1964లో హైదరాబాదులో నెహ్రూ పార్కు ప్రారంభ సమయంలో జరిగిన జాతీయ చిత్రకళా పోటీలో వీరు వేసిన వన్యమృగాల చిత్రానికి ద్వితీయ బహుమతి లభించింది. వివిధ నాటక సంస్థలకు వీరువేసిన సెట్టింగులకు పలు బహుమతులు లభించాయి. హైద్రాబాద్ లో నిర్మల్ పెయింటింగ్లను చూచి విశాఖలో ఒక ఆర్డుగ్యాలరీ ప్రారంభించి సుమారు పదివేల చిత్రాలు చిత్రించి అతితక్కువధరకు అమ్మారు. విశాఖలో పలువురి ఇళ్లలో వీరి చిత్రాలు ఉన్నాయి. నేవీ మేళాలో ఒకసారి వ్యక్తిగత చిత్రకళా ప్రదర్శన నిర్వహించారు. స్త్రీ పెయింటింగ్స్ లో వీరికి ప్రత్యేక నైపుణ్యం ఉన్నప్పటికీ ఎనామిల్ పౌడర్స్, ట్యూబ్ వాటర్ కలర్స్ తో కూడా వీరు చిత్రాలు సృష్టించగలరు కేవలం గంట వ్యవధిలో మనకు నచ్చిన దృశ్యాన్ని రంగుల్లో చిత్రించి ఇవ్వగల ప్రతిభాశాలి. వీరి వద్ద ఈ కళను అభ్యసించిన బి.ఎస్.రాజు, బి.వి.రమణ ఒకరు కార్టూనిస్టుగా ఒకరు లెటరు పెయింటరుగా ఉన్నారు. వీరు విశాఖ నౌకా నిర్మాణ కేంద్రంలో పెయింటింగ్ సూపర్ వైజర్ గా రిటైర్ అయ్యారు.

సుంకర చలపతిరావు

1 thought on “చిత్రకారుడు పొలిమేర అప్పారావు కన్నుమూత

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap