“ఫ్రీలాన్స్” పొలిటికల్ కార్టూనిస్టుగా పాతికేళ్ళు

( కార్టూనిస్టు హరి అనుభవాలు: 1 )

రోజూ లాగే ఆ రోజు కూడా రోజంతా రక రకాల పనుల్లో వున్నాను, ఇంటికి చేరి సాయంత్రం రెండు పొలిటికల్ కార్టూన్లు వేసి (దాదాపు మూడు గంటల సమయం పడుతుంది) పత్రికలకు పంపించేసరికి మెల్లగా తొమ్మిదయ్యింది. మా అమ్మాయితో కూర్చొని మాట్లాడుతుంటే నా చిన్న కీ పాడ్ ఫోన్ కి ఒక పెద్దాయన ఫోన్ వొచ్చింది, అట్నుంచి గత ముప్పయ్యేళ్లుగా ఛత్తీస్గఢ్ నుంచి ‘కార్టూన్ వాచ్’ పత్రిక నడుపుతున్న త్రయంబక్ శర్మ, ఆ సంస్థ ప్రతియేటా లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డులు ఇస్తుంది, ఈ సంవత్సరం ఆ అవార్డు ఫంక్షన్ విశాఖపట్నంలో జరుపుతున్నామని, సీనియర్ పొలిటికల్ కార్టూనిస్టుగా నన్ను ఎన్నిక చేసినట్లు చెప్పాడాయన.

ఇప్పటి వరకు చాల మంది పెద్ద వాళ్లకు ఆ అవార్డు దేశమంతా ఇచ్చుకుంటూ వొస్తున్నాడాయన, సరే దేన్నీ కాదు, వొద్దు అనకూడదు అని పెద్దలు చెప్పారు కదా, ఆయనేమో లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డు అంటున్నాడు, నా వయసేమో ఇప్పటికింకా నిండా 47 సంవత్సరాలు, జీను పేంట్లు వేసుకుంటూ ఇంకా చిన్న వయసు కింద ఫీలైతే సరిపోదు కదా.

సరే ఒకసారి అంత సమయం అయ్యిందా అని రివ్యూ చేసుకుంటే పాతికేళ్ళు కావస్తుంది రాజకీయ కార్టూన్లు మొదలు పెట్టి …

ఒక కార్టూన్ నేను వేసిందే వేదిక మీద ఒక బుడ్డాగాడు ఉంటాడు, వాడికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తుంటారు, ఇప్పుడు నా పరిస్థితి అంతే.

  • * *

“కమెండో” రాజకీయ వారపత్రిక

ఉద్యమాలలో తిరిగి, కార్టూన్లు, సాహిత్యం పిచ్చిలో తిరిగే సరికి 1997 లో బీ.కామ్. డిగ్రీ పూర్తయ్యింది, అక్కౌంటంట్, సూపెర్వైజర్ లాంటి ఉద్యోగాలు ప్రయత్నించినా ఎవ్వరూ ఇవ్వలేదు, సరే విశాఖపట్నంలో ఎందుకు హైదరాబాద్లో ప్రయత్నిద్దామని అప్పటికి అమెరికా వెళ్ళడానికి ప్రయ్తర్ణాలు చేసుకుంటున్న మా కజిన్స్ రూమ్ నారాయణగూడ లో సర్దుకున్నాను. సాఫ్ట్వేర్, డాలర్ డ్రీమ్స్, “ద ” ని ” ” బ్రా ” ప్రేమించి అమెరికా వెళ్లడం, “చౌ” బహుజనుణ్ణి ప్రేమించి అమెరికా సర్దేసుకోవడం ఇవ్వన్నీ నా చుట్టూ చూస్తున్నాను, ప్రపంచం మారిపోతోంది , సదుపాయాలు వొచ్చేస్తున్నాయి, హైదరాబాద్ బిర్యానీలు, చాయ్ లు, పళ్లీలు, పార్కులు, చెట్లు లెక్క పెట్టు కుంటూ రోడ్లు కొలవడం ఏదో నడుస్తోంది, ఒక రోజు పేపర్ లో “కమెండో” పత్రికలో కార్టూనిస్టు కావాలని పడింది, సరే ట్రై చేద్దాము అని పంజాగుట్టలో వున్న ఆ ఆఫీసుకు వెళ్ళాను, వినుకొండ నాగరాజు హోరెత్తించారు, నా కార్టూన్లు నచ్చాయి అన్నాడాయన, “ఇన్నాళ్లు ఎక్కడున్నావ్ కమాన్ రేపు జాయిన్ అయిపో ” అన్నాడు.

రెగ్యులర్ కార్టూనింగ్ కి కమెండో కార్టూనింగ్ కి చాలా తేడా ఉంటుంది, పంచ్ ఉండాలి, చర్నాకోలతో కొట్టినట్లు ఉండాలి, వాడుక భాషే ఉండాలి, ఇష్యూ ఫైనల్ కి వెళ్ళేటప్పుడు ఎడిటర్ ఎదురుగా కూర్చొనే కార్టూన్లు వేయాలి, ఒక ఇష్యూ లో 55 కార్టూన్లు కూడా ఉండేవి.
రోజంతా ఆ కమెండో పాత బౌండ్ బుక్స్ చూడటం, (ఒకప్పుడు కమెండో పత్రిక రాతలు ఒక ఊపు ఊపాయి ఆంధ్ర దేశాన్ని) రాత్రి లేట్ గ రూమ్ కి వెళ్లడం ఇలా గడుస్తోంది, భోజనానికి, టిఫిన్ కి మెస్సులు ఆధారం. కమెండో కార్టూన్ విధానం పట్టుకున్నాను, అది ఆయనకు నచ్చింది, అయితే ఆ ఎన్నికల ముందు పెట్టిన పత్రిక కు పెట్టుబడి లేక కుంటింది, నేను మానేసాను.

ఇక్కడ వినుకొండ నాగరాజు వ్యక్తిత్వం చెప్పాలి, అయన చాలా విభిన్నమైన వాడు, ఒక రోజు బాల్కనీలో సిగరెట్ తాగుతూ “ఈ రచయితలు, కళాకారులు నంగి నంగిగా ఉంటారండీ, నాకు నచ్చదు, ఏదైనా సరే కొట్టి పార దొబ్బాలి “బాంచెన్ అన్నాడు, “వెన్నెల, అన్నం, అమ్మ చేసిన వంట, ఏంటండీ ఆ కథలు” “ఏదో ఒక పావలా డబ్బులు వస్తాయని రచనలు చేయకూడదు” అని అయన రాసిన “ఊబిలో దున్న” నవల మిత్రులు హరిగారికి అని సంతకం చేసి ఇచ్చాడు. జీవితాన్ని ఆయన దబాయిస్తున్న తీరు,అయన పొందుతున్న కంఫర్ట్స్, రెగ్యులర్ జనాలకు దూరంగా ఆయనకై నిర్మించుకున్న ఒక ప్రపంచం, రాజకీయాలు, సాహిత్యం పై అయన అనుభవాలు నన్ను డ్రైవ్ చేశాయి.

తరువాత అప్పటికి నేను స్టాఫ్ కార్టూనిస్టుగా అయన దగ్గర నుంచి వెళ్ళిపోయాను, కానీ తిరిగి మూడేళ్లకు 2001 లో బంజారాహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో వున్న వాళ్ళ మెడికో అబ్రాడ్, కమెండో ఆఫీస్ దగ్గర ప్రతి వారం కలిసి ఒకే ఊపులో 35 కార్టూన్లు ఆయన చెపుతుండగా, లేదా నా స్వంతగా వేసేసి వాడిని. ఎదురుగా అయన చిన్న పెగ్ వేసుకుంటూ ఆ కార్టూన్లు చూసి నవ్వుతూ డీటీపీ కి ఇచ్చేస్తుంటే ఆ నైట్ కి ఇష్యూ రెడీ అయిపోయేది, తొమ్మిదింటి కల్లా నా కార్టూన్లు పూర్తిచేసేసే వాడిని తిరిగి మరుసటి రోజు నా రెగ్యులర్ యానిమేషన్ వర్క్ లోకి వెళ్లిపోయే వాడిని అలా తిరిగి మళ్లి వైజాగ్ 2007 లో వొచ్చే వరకు ఆ బంధం కొనసాగింది. ఆయన చనిపోయాక అయన శిష్యుడు శ్రీకాకుళానికి చెందిన రామారావు నడిపాడు గాని ఇప్పుడు ఆ పత్రిక అయిపు అజా లేదు.

సాధారణంగా ఇలాంటి పత్రికలలో కార్టూన్లు హుందాగా వేయడం అవసరం, నేనదే అక్కడ చేసాను, ఫీచర్స్ కుదరడం, పొలిటికల్ లైన్ ఉండడం కమెండోలో చాలా కాలం అస్సోసియేట్ అవడానికి కుదిరింది, ఆయనకు ఏ ఆర్టిస్టు అంత తొందరగా నచ్చి చావడు.

నేను కమెండో వినుకొండ నాగరాజు నుంచి నేర్చుకుంది మాత్రం దబాయించైనా గట్టిగ, స్ట్రాంగ్గా వుండాలని, విభిన్నంగా ఉండాలని, ముందు కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలని. జీవితంలో మనకు కావాల్సింది సాధించుకోవాలని.

  • * *

చిన్న పత్రికలలో చిన్న కార్టూనిస్టు

హైదరాబాద్ లో అప్పుడు చిన్న పత్రికలు ఎక్కువ ఉండేవి, జవహర్ నగర్ లో వున్న బైస దేవదాస్ టుడే ఫ్రీడమ్, నేటి నిజం పత్రికకు కార్టూన్లు వేస్తాను అని వెళ్ళాను, వాళ్ళ స్వంత ఆఫీసు, ఆయన సాహిత్యాభిమాని రోజూ రెండు కార్టూన్లు వేసి వెళితే చాలు అన్నాడాయన, ఆ పేపర్లకు కార్టూన్లు దేనికో అవి ఎవరు చదువుతారో నాకు తెలీదు కానీ, అవసరం నాది వేయడం మొదలు పెట్టాను, పొద్దున్న నారాయణగూడ నుంచి నడుచుకుంటూ వెళ్ళేవాడిని నో బ్రేక్ ఫాస్ట్, ఓన్లీ సమోసా అండ్ టీ, పేపర్లు చదవడం అక్కడ వున్న ఒక్కో పేపర్ ఇంచార్జికి ఆ కార్టూన్లు చూపించడం వారు సెలెక్ట్ చేసిన ఐడియాని ఇంక్ చేసి ఇవ్వడం ఇలా మరో మూడు నెలలు కాలక్షేపం.

అక్కడ “రెడ్డి” గారని తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి, అన్ని చిన్న పేపర్లలో పని చేసిన అనుభవం ఉన్నాయన ఉండేవారు, పొద్దున్న ఒకరోజు పెద్దాయన కదా అని “గుడ్ మార్నింగ్” అన్నాను. “నాకు గుడ్ మార్నింగ్ చెప్పొద్దు, వొచ్చి నీ పని చూసుకొని వెళ్ళిపో ” అన్నాడాయన, ఇంగ్లీష్ పేపర్ కి ఒక సబ్ ఎడిటర్ ఉండేవాడు ఆయన డెస్క్ అక్కడే, రెడ్డి గారు డెస్క్ ఆ చిన్న గదిలోనే, నేనూ ఆ గదిలోనే మొత్తం మూడు టేబుళ్లు ఉండేవి. ఇద్దరికీ చెరొక కార్టూన్ ఇచ్చి మధ్యాహ్నానికి నారాయణగూడ రూమ్ కి వెళ్లిపోయే వాడిని.

ఖచ్చితంగా వుండే రెడ్డి గారితో మంచి స్నేహం కుదిరింది, చక్కగా చిన్న పిల్లాడిలా నవ్వేవాడాయన, కార్టూన్లు, రాజకీయాలు వివరించేవాడు, ఆయనతో పని చేయలేనేమో అనుకున్నాను గాని, తనకు ఏం కార్టూన్ కావాలో అదే తీసుకునేవాడు.

ఈ మధ్యే పేపర్ లో చూసాను, తన చివరి రోజుల్లో అయన ఇబ్బంది పడటం, తెలంగాణ ప్రభుత్వం ఆయనను ఆదుకోవటం, ఆ విషయంలో కూడా ఆయన ఖచ్చితత్వం.

ఇక్కడ నేను నేర్చు కున్నదేం వుంది. ? ఒకే రోజు ఆరేడు కార్టూన్ ఐడియాలు సృష్టించి పత్రికాధిపతులకు సబ్మిట్ చేసే ప్రాక్టీస్ అయ్యింది అంతే , మన కార్టూన్ ఎవరికి చేరుతుంది, పాఠకులు వున్నారా ?ఉంటే యెంత మంది ? ఇవ్వన్నీ ప్రశ్నలుగా తొలిచేవి, కాస్త జనానికి రీచ్ అయ్యే పేపర్ ఏమిటి అని వెతుకుతున్నాను.

అప్పటికి నాకు శేఖర్ తో బాగా పరిచయం, ప్రజాశక్తి వాళ్ళు పొలిటికల్ కార్టూనిస్టు కోసం చూస్తున్నారు ఒకసారి కలు, కాకపొతే ఇంకా హెడ్ ఆఫీస్ విజయవాడ లో వుంది అక్కడకు వెళ్లి పనిచేయాలి అన్నాడు. నేను వెళ్లి ఆ టీవీలో మాట్లాడే తెలకల పల్లి రవి ని కలిసాను, ఆయన చాల ఎక్కువ జీతం ఆఫర్ చేసాడు, (1500/-) అంత జీతానికి అయితే రావొచ్చు అన్నాడు, ఇక్కడ నారాయణగూడ లో ఈ ప్రేమాయణాలు, అమెరికా గోల, డాలర్ల గోల కంటే విజీవాడ భోజనాలు చేసుకుంటూ, మంచిగా చదువుకొని, చక్కటి కార్టూన్లు వేద్దాము అనుకొని దానికి “సరే” అన్నానో లేదో తెలీదు. మొత్తానికి వెళ్ళడానికి ఒప్పుకున్నాను.

Hari political cartoons

ఇక ఈ మాత్రం దానికి హైదరాబాద్లో ఉండటం దేనికి ఈ విషయం తెలిసే లోగ వైజాగ్ లో ఉందామని నా లగేజ్ తీసుకొని విశాఖ ఎక్స్ప్రెస్ ఎక్కేసాను, అప్పుడు వరుసుగా రైళ్లన్నీ పట్టాలు తప్పుతున్నాయి, పాపం అక్కడ మా అమ్మా, నాన్న నేను ఎక్కిన రైలు వస్తుందో రాదో అని తెగ టెన్షన్ పడ్డారు గాని మరుసటి రోజు మధ్యాహ్నానికి ఆ ట్రైన్ వైజాగ్ చేరింది.

ప్రజాశక్తి నుంచి కబురు రాలేదు, ఇలాగే నేను డిగ్రీ చదువుతుండగా కూడా జరిగింది, నేను స్టూడెంట్ ఫెడరేషన్ లో ఉండేవాడిని, అది సీ.పీ.ఏం. అనుబంధ విద్యార్థి సంఘం అని అందరికి తెలుసు, ఆ పార్టీ రాజకీయ తరగతులకు నా ఎనిమిదో తరగతి నుంచి అటెండ్ అయ్యి వినే వాడిని ప్రపంచ చరిత్ర, తత్వశాస్త్రం, మానవ పరిణామ క్రమం, మార్క్సిస్టు సూత్రాలు వినీ వినీ రాజకీయాలను చూసే చూపు మారింది. చలో విజయవాడ ఇలాంటి కార్యక్రమాలు ఉండేవి, వెళ్లి శేఖర్ని కలిసే వాడిని, ఈ నేపద్యం వున్న పిల్లవాడిగా పాపమ్ శేఖర్ నన్ను అభిమానించి ఆయన ఆంధ్రప్రభకు వెళుతున్నాడు కనుక నన్ను ప్రజాశక్తి కి పరిచయం చేసాడు, ఆలా డిగ్రీ మధ్యలోనే నేను కార్టూనిస్టుగా జాయిన్ అవ్వాలి కానీ, చదువు మధ్యలో మానేయడానికి ఇంట్లో ఒప్పుకోరు కదా, ఇలా నిన్ను కార్టూనిస్టుగా రమ్మని అడుగుతున్నారు వెళ్లవు కదా, చదువుకుంటావుగా అని అడిగారు మా పేరెంట్స్ నన్ను, లేదు ఈ చదువులు వృధా కదా నేను కార్టూనిస్టు ని అవుతాను అన్నాను, మా నాన్న జస్ట్ నా లగేజ్ వాకిట్లో విసిరి పారదొబ్బారు. (రోడ్లు మీద బొమ్మలేసుకొని అడుక్కు తింటావ్ వెధవా) సరే కుటుంబాన్ని అంత క్షోభ పెట్టి కార్టూనిస్టు అవడం ఎందుకు అకౌంటెంట్ అవుదాములే అనుకున్నాను, కానీ ఇలా జరిగి ఇన్ని మలుపులు తిరిగింది.

ప్రజాశక్తి నుంచి ఇంక ఏ కబురూ రాలేదు, అప్పుడు వైజాగ్ లో కొత్తగా “లీడర్” అనే పత్రిక ను వార్త నుంచి బయటకు వొచ్చిన వి.వి. రమణమూర్తి అనే ఒక జర్నలిస్ట్ ప్రారంభిస్తుంటే తెలిసిన వాళ్ళు అక్కడకు తీసుకెళ్లి పరిచయం చేశారు

పైన చెప్పిన వినుకొండ నాగరాజు, రెడ్డిగారు లాంటి వాళ్లకు ఏ మాత్రం తీసిపోని గట్టి, కరుడుగట్టిన వాస్తవిక వ్యక్తి రమణమూర్తి కూడా.

(లీడర్ అనుభవాలు తరువాయి భాగంలో….)

హరి వెంకట రమణ (హరి)
(కమెండోతో మొదలు పెట్టి), నేటి నిజం, Today Freedom, లీడర్, ఆంధ్రప్రభ (ఆదివారం) మీడియా ఇండియా (న్యూస్ ఏజెన్సీ,for Urdu and Hindi papers) కార్టూన్ సిండికేషన్ (ముంబై సమాచార్ నుంచి పంజాబీ పత్రికల వరకు)
ఇంకా అనేక చిన్న పత్రికలకు, ప్రస్తుతం 2014 నుంచి విశాలాంధ్ర జాతీయ దినపత్రికలో ప్రతిరోజూ “ఇదీ లోకం” పాకెట్ కార్టూన్ వేస్తూ పొలిటికల్ కార్టూనిస్టుగా వున్నారు. సోషల్ కార్టూన్లు కూడా వేలాదిగా వేశారు. హరి కార్టూన్లు, వికాసం కార్టూన్లు, జగమే మాయ, ఇదీలోకం హరి కార్టూన్లు ఇప్పటివరకు హరి ప్రచురించిన పుస్తకాలు, నా స్వస్థలం విశాఖపట్నం. ఫోన్ : 98660 84124

5 thoughts on ““ఫ్రీలాన్స్” పొలిటికల్ కార్టూనిస్టుగా పాతికేళ్ళు

    1. హరి నేను ఇంతకుముందు చదవలేదు ఇది టోటల్ జర్నీ బీకాం నుండి చాలా బాగుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap