స్వర్ణపురి కళాకీర్తి – నాటకాల విశ్లేషణ-1

పొన్నూరు కళాపరిషత్ రజితోత్సవాల సందర్భంగా ప్రచురించిన ‘కళా వైజయంతి (2000-2026)’ ప్రత్యేక సంచికలోని ప్రముఖ వ్యాసాల సారాంశం ఇక్కడ సంక్షిప్తీకరించబడింది.

పొన్నూరు కళాపరిషత్ నేపథ్యం:
2000 ఫిబ్రవరి 26న ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేతుల మీదుగా ఈ కళాపరిషత్ ప్రారంభమైంది. సామాజిక చైతన్యాన్ని, వినోదాన్ని పంచే కళలను ప్రోత్సహించడమే లక్ష్యమని సంస్థ అధ్యక్షులు ఎస్. ఆంజనేయులు నాయుడు తెలిపారు. వీరు ఏటా మే నెలలో నాటికల పోటీలతో పాటు వైద్య శిబిరాలు, వరద బాధితులకు సాయం, కళాకారులకు ఆర్థిక సాయం, వివిధ రంగస్థల పురస్కారాలు అందజేస్తున్నారు. ఈ సంచికలోని మొత్తం 33 వ్యాసాలు ఉన్నాయి. ఇందులోని కొన్ని సుప్రసిద్ధ తెలుగు నాటకాల మీద విశ్లేషణ చేస్తూ రాసిన ఒక పది వ్యాసాల నుంచి ఇప్పటి తరం వారి కోసం ఆ నాటకాల గొప్పదనం ప్రదర్శనా రీతులు, అవి రంగస్థలం చరిత్రలో సంపాదించుకున్న స్థానం వగైరా విషయాలను సంక్షిప్తంగా మీ ముందుకు తీసుకు వస్తున్నాను. నాలుగు ప్రముఖ నాటకాల విశ్లేషణల సారాంశం ఈ మొదటి భాగం మీకోసం:

వ్యాసాలలోకి వెళితే తెలుగు నాటక ప్రయోగ పతాక –మరో మొహంజొదారో అన్న వ్యాసాన్ని డాక్టర్ కందిమళ్ళ రాశారు. ఇందులో ఆయన తెలియజేసిన విశేషాలు ఇలా ఉన్నాయి. “నాటకం నాలుగు గోడల మధ్య జరిగే సెంటిమెంట్తో, డ్రామా బుర్ర బద్దలు కొట్టిన నాటకం ఇది. తరతరాలుగా మనిషిని సాటి మనిషి ఏ విధంగా దోచుకుంటున్నాడో, వివిధ కోణాల నుండి విశ్లేషించిన నాటకం ఇది. వ్యక్తిగత స్వార్థాలతో పార్టీల కక్షలతో, సమాజం మొత్తాన్ని ఎలా మొహంజొదారో నాగరికత లాగ, నాశనం చేస్తున్నారో చూపించిన నాటకం ఇది. థారన్టన్ వైల్డర్ రాసిన ‘అవర్ టౌన్’ నాటకాన్ని, ఆ నాటకం నాటకీయ శిల్పం గురించి సుప్రసిద్ధ నటులు దర్శక ప్రయోక్త డాక్టర్ చాట్ల, సుప్రసిద్ధ సినీ నాటక రచయిత ఎన్.ఆర్.నంది గారికి సవివరంగా చెప్పారట. నంది గారు తాను రాసిన ‘నైమిశారణ్యం’ నవలలోని ఇతివృత్తాన్ని చాట్ల, చెప్పిన ప్రయోగ శైలిలో రాశారు. నాటకం ద్వారా ఫ్రీజ్ తాదాత్మ్య విచ్ఛిత్తి (ఎలియనేషన్) మూకాభినయం, ప్రతీకాత్మక రంగాలంకరణ వంటి అంశాలు తెలుగు నాటక రంగంలోనికి అలా తొలిసారిగా ప్రవేశించాయి. ఈ ప్రయోగ నేపథ్యంలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకోవడం జరిగింది. మరో మొహంజొదారో నాటక ప్రయోగంలో నూతనత్వాన్ని ప్రదర్శించి తెలుగు నాటక రంగం చరిత్రను ఒక మలుపు తిప్పింది. సెంటిమెంట్ ను గుప్పిస్తూ నాలుగు గోడల ఇతివృత్తాలకే పరిమితమైన సమయంలో మొహంజొదారో పాత సంప్రదాయాలను బద్దలు కొట్టింది. వ్యవస్థను రకరకాల కోణాల్లో పరిశోధించి ఎన్నో అంశాలను రంగస్థలం పైకి తెచ్చి చూపించింది. 1964కు ముందు ఒక నాటకాన్ని వేరే ప్రాంతానికి వెళ్లి ప్రదర్శించాలంటే వ్యయ్యప్రయాసలతో కూడిన పని. పోటీలలో ఒక నాటకాన్ని ప్రదర్శించిన తర్వాత మరొక సమాజం రంగాలంకరణ చేసుకోవడానికి ఎంతో సమయం పట్టేది. ఆ విరామాన్ని తగ్గించి పది నిమిషాల వ్యవధిలో నాటకాన్ని ఎలా ప్రారంభించాలనే ఆలోచనల మధ్య మహంజొదారో నాటకం పుట్టింది. “మూడు కుర్చీలు వేస్తే ధనవంతుడి ఇల్లు, రెండు కుర్చీలు వేస్తే మధ్యతరగతి ఇల్లు, ఒక కుర్చీ వేస్తే పేదవాడి ఇల్లు” ఈ పరిచయం ముందుగా చేస్తే ప్రేక్షకునికి తర్వాత అంతా తేలికగా బోధపడుతుంది.

“మరో మొహంజొదారో” నాటకం తెలుగు నాటకరంగంలో వినూత్న ప్రయోగాలకు నాంది పలికింది. నాటక ప్రారంభంలో శాస్త్రజ్ఞుడు స్విచ్ వేయగానే నిశ్చలంగా ఉన్న ఆరు పాత్రలు మాట్లాడటం ఆనాటికి ఒక సరికొత్త పద్ధతి. పాశ్చాత్య నాటక రంగంలోని ‘తాదాత్మ్య విచ్ఛిత్తి’ (ఎలియనేషన్) సిద్ధాంతాన్ని ఇందులో తొలిసారిగా ప్రవేశపెట్టి, ప్రేక్షకులు కథలో పూర్తిగా లీనమైపోకుండా తాము నాటకం చూస్తున్నామనే ఎరుకతో ప్రతిక్షణం ఆలోచించేలా చేశారు. సంస్కృత నాటకాల తరహాలో ప్రయోక్త ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ, వారిలోని మంచితనాన్ని, దుర్మార్గాన్ని, అవకాశవాదాన్ని ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు వివరించడం ఇందులో మరో ప్రత్యేకత. అలాగే, వర్తమానాన్ని స్తంభింపజేసి కథను భూత, భవిష్యత్ కాలాల్లోకి నడిపించే ‘ఫ్రీజ్ టెక్నిక్’ను, మూకాభినయాన్ని దర్శకుడు చాట్ల శ్రీరాములు ఈ నాటకంలో అద్భుతంగా ప్రయోగించారు. తదనంతర కాలంలో రావూజీ ప్రొడక్షన్స్, కళాంజలి సంస్థలు దీనిని విస్తృతంగా ప్రదర్శించాయి. ఇటువంటి వినూత్న ప్రయోగాల వల్లే ‘మరో మొహంజొదారో’ తెలుగు నాటక రంగాన్ని ఒక మలుపు తిప్పి, సరికొత్త నాటక ఆవిర్భావానికి విశేషంగా దోహదం చేసిందని ప్రముఖ నాటక రంగ విశ్లేషకులు డాక్టర్ కందిమళ్ళ అభిప్రాయపడ్డారు.

అజరామరం- సత్యహరిశ్చంద్ర నాటకం అన్న వ్యాసంలో డాక్టర్ జోశ్యుల కృష్ణబాబు బలిజేపల్లి లక్ష్మీకాంత కవిని గురించి అలాగే ఆ నాటకం గురించిన ఎన్నో విశేషాలు మన ముందుకు తీసుకు వస్తారు. ‘పౌరాణిక నాటక శాఖకు పూచిన పారిజాతం ప్రసూనమే బలిజేపల్లి’. బలిజేపల్లి 1905లో ‘బుద్ధిమతీ విలాసం’ 1910లో ఉత్తర రాఘవం’ 1912 లో సత్యహరిశ్చంద్రీయము 1914లో సాత్రాజితీయము’ అనే నాలుగు నాటకాలను రచించారు. చిత్తజల్లు పుల్లయ్య గారి ప్రోత్సహంతో చిత్రసీమలోకి అడుగు పెట్టారు. 20 సినిమాలకు మాటలు పాటలు సంభాషణలు రాయడమే కాకుండా కొన్ని సినిమాల్లో పాత్రలు కూడా ధరించారు. తెలుగు నేల నాలుగు చెరగులా నాటక సమాజాలకు గొప్ప ప్రేరణ ఇచ్చిన నాటకం సత్యహరిశ్చంద్ర. బలిజేపల్లి 1912 లో తన 31వ ఏట ఈ నాటకం రాశారు రాయటమే కాదు, ఇందులోని హరిశ్చంద్ర నక్షత్రక పాత్రలని స్వయంగా ఈ కవి పోషించారు. ఇందులో పద్య రచన ఒక జలపాతం. ఒక కవి పేరు చెప్పగానే ముందుగా ఏ ఒకే గ్రంథం గుర్తుకొస్తే, దాన్ని ఆ రచయిత ‘మాగ్నమ్ ఓపస్’అంటారు. అలాంటిదే బలిజేపల్లి వారి సత్యహరిశ్చంద్ర. తెలుగులో హరిశ్చంద్ర నాటకాన్ని సుమారు 50 మందికి పైగా కవులు రాశారు. తొలి నాటకర్త కందుకూరి వారే! ఆ తర్వాత ధర్మవరం, కోలాచలం నాదెళ్ల పురుషోత్తమ కవి తోలేటి వెంకటసుబ్బారావు వడ్డాది సుబ్బరాయ కవి.. ఇలా మరికొందరు రాశారు. అందులో విశ్వనాథ, దివాకర్ల వంటి ప్రసిద్ధులు కూడా ఉన్నారు. బలిజేపల్లి వారు ఈ నాటకాన్ని మిక్కిలి సులభ శైలిలో రాశారు. హృద్యమైన పద్య రచన చక్కని సంభాషణలు, కరుణరస పోషణ ఈ నాటక దిగ్విజయానికి కారణమయ్యాయి. పద్యాల్లో దీర్ఘ సమాసాలు కాఠిన్యం లేకుండా వ్యవహారిక పలుకుబడిలో సామాన్యులకు కూడా అర్థమయ్యే సులభ శైలిలో బలిజేపల్లి పద్య రచన సాగింది. ఈ నాటక విజయానికి ఇది ఒక ముఖ్య కారణం. అలాగే వాడుక భాష, వ్యవహారిక పలుకుబడులతో కూడిన ధారాశుద్ధి, పదాల కుదింపు, పదములు చిన్న పెద్ద పదాలు కవి పద్య శిల్ప దృష్టికి తార్కాణాలు’ అంటారు కృష్ణ బాబు. కవి దృష్టి నాటక రచయిత దృష్టి నటుని దృష్టి- ఈ మూడు ఈ నాటకంలో అపూర్వ సమ్మేళనాన్ని పొందాయి. నాటకాన్ని ఉన్నత శిఖరాగ్రాన నిలబెట్టాయి.

నాటకాల్లో అప్పటివరకు శృంగార వీర రసాలే ప్రధానంగా ఉండాలన్న నిర్ణయానికి విరుద్ధంగా ఇందులో కరుణ అంగీరసంగా పోషించబడింది. కరుణ ఏవ ఏకో రసః అని కరుణ రసానికే పట్టం కట్టారు కదా భవభూతి. భారతీయ భాషల్లో ఇప్పటివరకు 25 హరిశ్చంద్ర సినిమాలు వచ్చాయి. మొట్టమొదటి మూకీ చిత్రం కూడా 1913 లో వచ్చింది. తెలుగులో అద్దంకి శ్రీరామ మూర్తి 1935 లోను, ఎస్వీ రంగారావు 1956 లోను ఎన్టీ రామారావు హరిశ్చంద్రుడిగా 1965 లోను తీశారు. భారత రామాయణాల్ని మినహాయిస్తే ఒక పౌరాణిక గాధను ఇన్నిసార్లు తెరకెక్కించటం ఒక హరిశ్చంద్ర విషయంలోనే జరిగింది అని స్పష్టం చేస్తారు వ్యాస రచయిత. నక్షత్రకుని పశ్చాతాపం కవి గారి స్వతంత్ర సృష్టి. ఈయనకు ముందు రాసిన హరిశ్చంద్ర నాటకాల్లో ఈ ఘట్టం కనిపించదు. బలిజేపల్లి- జాషువాల పద్య శైలి విడదీయరానంతగా కాటిసీను సన్నివేశంలో కలిసిపోవడం గమనార్హం.

ప్రపంచంలో సత్యం ఎప్పటి వరకు సజీవంగా ఉంటుందో.. అప్పటిదాకా సత్యహరిశ్చంద్రీయ నాటకం ఉంటుంది. ఆ నాటకం ఉన్నంతవరకు బలిజేపల్లి పేరు చిరస్థాయిగా ఉంటుంది” అంటారు కృష్ణబాబు.

ఈ వ్యాసరచయితే (అంటే నేను) గొల్లపూడి మారుతీ రావు గారి రాగరాగిణి నాటకం పై రాసిన ఒక విశ్లేషణా వ్యాసం ఉంది. గొల్లపూడి మారుతీ రావు గారి ‘రాగరాగిణి’కి మూలం, స్ఫూర్తి యూజీని ఓ నీల్ ‘బియాండ్ ది హొరైజన్’. రాగరాగిణిలో.. అది ఒక ‘భారతీయ గ్రామీణ సంప్రదాయ నేపథ్యంలో, కుటుంబం.. ముఖ్యంగా ఒక స్త్రీ, ఇద్దరు పురుషులు వారిద్దరు -అన్నదమ్ములే! ప్రేమ ఉంది ముగ్గురి మనసులలో, కానీ వివాహం వారిద్దరిలో ఒకరితో జరుగుతుంది. ఊహించని మలుపుగా వివాహమై భర్తగా మారిన బంధువు. వ్యవసాయానికి అతడు అసమర్థుడు. అతని చేతకానితనం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితులు తలకిందులవుతాయి. అనారోగ్యాలు చుట్టుముడతాయి. వార్ధక్యంతో కొందరు మరణిస్తే, మరికొందరు అకాల వ్యాధి, అనారోగ్యం కారణంగా. అత్తెసరు ఆదాయం వల్ల కుపోషణకు గురై మరణిస్తారు. అల్పాదాయం వల్ల పంట గింజలు మిగలకపోగా అప్పులతో పొలం తనఖా లోకి వెళుతుంది. మనసులో ఊగిసలాట. భార్యాభర్తల మధ్య అనుమానం సందేహాలు.. దుర్భర దారిద్య పరిస్థితిలో ఒకరిపై ఒకరికి గల ప్రేమ ఉందో లేదో తెలియని స్థితిలో మనసులోని తడిని ఎండబెట్టేస్తాయి. తమ్ముడి స్థానంలో పెద్దవాడైన శేషు, రఘుకు బదులుగా విదేశాల్లో డబ్బు సంపాదించుకొని వస్తే, పేదరికంతో భార్య మీద అనుమానంతో కలిగే బాధ వల్ల సాగిన మాటల యుద్ధంలో అతడు మానసికంగా బాగా చితికిపోతాడు. అన్నదమ్ముల కలుపుగోలుతనం కాల గతిలో కరిగిపోగా శేషు డబ్బుతో వచ్చినా పరిస్థితులు. చక్కదిద్ద లేని ఆ స్థితిలో రఘును కోల్పోతారు రాధా శేషులు.
“మనిషి తనకు నచ్చినట్లు జీవించ లేకపోతే, ఆ అసంతృప్తి అతనిని నీరస పరిచి జీవితం పై నమ్మకాన్ని, ఆసక్తిని కోల్పోయేలా చేసి, నిరాశ అతని జీవితాన్నే మెల్లగా విరిచేస్తుంది.

రాగరాగిణి శీర్షిక ఒక సంకేతాత్మక శబ్దం. స్త్రీ పురుషుల భైరవి రాగం (ఆనంద/ విషాద). ఈ నాటకాన్ని సూక్ష్మంగా చెప్పాలంటే.. గ్రామీణ సంప్రదాయ నేపథ్యం, త్రికోణ ప్రేమ, వివాహం, ప్రేమించిన ఇరువురిలో ఒకరితోనే అయినా ఆ భర్త మాత్రమే సంపాదనపరుడైన కారణంగా ఆ కుటుంబంలో అతని భావుకత అసమర్ధత, చేస్తున్న వ్యవసాయం మీద పట్టు లేకపోవడంతో కుటుంబం ఆర్థికంగా కుంగుబాటుకులోనైతే.. అందుకు తోడు అతడి కుటుంబంలోని బాధలు అనారోగ్యాలు ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులు లేకపోవడంతో జీవితం క్రమంగా కూలిపోవడం ప్రారంభమవుతుంది. అటువంటి సందర్భంలో రక్త సంబంధీకుడి ఆర్థిక తోడ్పాటు ఇస్తానన్నా కూడా ఆత్మ న్యూనతతో, అనుమానంతో అర్థం లేని అహంతో తిరస్కరిస్తే, ఆ జీవిత నౌక తప్పక అప్పుల్లో, అనారోగ్యాల్లో ఆర్థిక ఆటు పోట్లలో మునిగిపోవడం తథ్యం. నాటకం ముగింపులో శేషు తిరిగి వచ్చేసరికి పరిస్థితులు చేయి దాటిపోతాయి. రఘు జీవితానికి ఒక పెద్ద రిలీఫ్ అతని అనుమానిత హృదయంలో, ఆ విషయంలో అతడి భయం అర్ధ రహితం నిర్హేతుకమని తెలుసుకొని సంతృప్తిగా కన్నులు మూయడం జరుగుతుంది.

ఈ నాటకంలో రాధ అంటే ప్రేమ బాధ్యత బలహీనత సహనం పరిస్థితులకు లొంగిపోయి బతుకునెట్టడం. రాగం అంటే- ఆకర్షణ కోరిక మనసు లాగుపీకుడులు. రాగిణి ప్రతిస్పందన ఒక బంధానికి కట్టుబడి ఉండడం. ఒక మాటలో చెప్పాలంటే ఈ నాటకం- ‘జీవిత న్నిశ్శబ్ద విషాదాన్ని మాటలుగా మలిచిన సాహిత్య కృతి’ అని చెప్పుకోవాలి’.

పాంచాల పరాభవం అన్న వ్యాసాన్ని డాక్టర్ ఎస్వీ కృష్ణారావు రాశారు. వీరు తెలుగు శాఖధిపతి ప్రాచ్య భాషా విభాగం ఆచార్యులు, నాగార్జున విశ్వవిద్యాలయం.

ఇది ఐదు అంకాలు గల నాటకం. త్యాగం దేశభక్తి దీని ప్రధాన ఇతివృత్తం. డయ్యరు అరాచక పాలన, భారతమాత దీనస్థితి, జలియన్ వాలాబాగ్ దారుణ మారణకాండ మొదలైన సంఘటనలు సన్నివేశాలతో ఆనాటి భారతీయుల వాస్తవిక పరిస్థితిని కళ్ళ ముందు చూపించిన నాటకం. పాంచాల పరాభవం -నాటకర్త దామరాజు పండరీకాక్షుడు ఈ నాటకంలో ప్రధాన పాత్రలు గాంధీ కృష్ణుడు భరతమాత పాంచాల మాత డయ్యర్ సత్యపాల్ కిచ్లులు ధీర్ సింగ్ వీర్లాల్ విద్యార్థులు భటులు మొదలైన వారు. నాటక రచయిత దామరాజు పుండరీకాక్షుడు గారు ఈ నాటకం గురించి చెబుతూ
“1920వ సంవత్సరంలోనే,నా విద్యార్థి దశలో పంజాబ్ దేశంలో అమృత్సర్ నగర స్వర్ణ దేవాలయం వద్ద కూర్చుని స్వయంగా ఆయా ప్రదేశాలు చూచి రచించిన నాటకం” అంటారు. నాటి రాజకీయ ఆంధ్ర నాయకులు ఈ నాటకాన్ని ప్రదర్శించి లాఠీ దెబ్బలు తిని జైళ్లకు వెళ్లారు. అలా వెళ్లిన వారిలో ఈ రచయిత కూడా ఉన్నాడు. సైన్యాధికారి డయ్యర్ గడ్డి బొమ్మను స్టేజ్ పై తగలబెట్టినందుకు ఇంగ్లాండ్ పార్లమెంటులో రచయితపై, నాటక సమాజం- ‘సంఘ సేవ నాట్యమండలి’ పై ఇండియా ప్రభుత్వం వారిచే 121ఏ ఐపిసి కింద ద్వీపాంతర వాస శిక్షను కొద్దిలో తప్పించుకొని ఆ తరువాత ఆంధ్ర ప్రభుత్వ ద్రవ్య సహాయంతో ఈ గ్రంథాన్ని మరలా ముద్రించ గలిగాను’ అంటారు రచయిత.1920లో మొదటి ముద్రణ పొందిన వెంటనే ప్రభుత్వం దాన్ని నిషేధించింది. ఆ తర్వాత 1921లో ద్వితీయ ముద్రణ పొందిందినప్పుడూ ప్రభుత్వం నిషేధించింది. అప్పటి ప్రభుత్వం వేలకు వేల గ్రంధాల ప్రతులను తగల పెట్టించిన వాటిలో ఇదొక చారిత్రక నాటకరాజము. ఈ నాటకంలో దేశభక్తి ఎంత గొప్పదో చూసినవారికి బాగా అర్థమవుతుంది.

మల్లేశ్వర రావు ఆకుల (7981872655)

      Share via
      Copy link
      Powered by Social Snap