సుప్రసిద్ధ సుబ్బారావులు

తెలుగు జాతికి విశేష గుర్తింపు తెచ్చిన పేరు సుబ్బారావు. ఈ పేరులోనే అదృష్టం ఉందనుకుంటాను. ఖ్యాతి కెక్కిన సూపర్ సుబ్బారావులు ఎంతోమంది ఉన్నారు. విజయా సంస్థ చక్రపాణి అసలు పేరు ఆలూరి వెంకట సుబ్బారావు. రచయిత బుచ్చిబాబు అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు. మీసాల కృష్ణుడిగా వాసికెక్కిన రంగమార్తాండ బెల్లంకొండ సుబ్బారావు. సుబ్బారావు పాణిగ్రాహి చిరపరిచితులే. పత్రికారంగానికి ఎనలేని కృషి చేశారు ఖాసా సుబ్బారావు. ఎంకిపాటల వెన్నెల కురిపించిన వారు నండూరి వెంకట సుబ్బారావు. రేడియోలో నాటకాలలో ప్రసిద్ధుడైన హాస్యనటుడు నండూరి సుబ్బారావు, ప్రముఖ వైద్యులు పరిశోధకులు ఎల్లాప్రగడ సుబ్బారావు కీర్తి ఖండాంతరాలు దాటింది. రాయలసీమలో రాజకీయ చైతన్యం నింపిన వ్యక్తి కొల్లూరి సుబ్బారావు. చలనచిత్ర నాటక రత్నం గోవిందరాజుల సుబ్బారావు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా అని ఎలుగెత్తి చాటారు రాయప్రోలు సుబ్బారావు. నాయని సుబ్బారావు పేరు జాతి మరువలేదు. రామాయణాన్ని రచించి ఆంధ్ర వాల్మీకి గా పేరు తెచ్చుకున్న వారు వావికొలను సుబ్బారావు. ఫ్రీ లవ్ సొసైటీ వ్యవస్థాపకుడు వల్లభజోస్యుల సుబ్బారావు.

నాటకరంగంలో స్త్రీ పాత్రలు పోషించి మంచిపేరు తెచ్చుకున్నారు పారుపల్లి సుబ్బారావు. నాటక రంగానికి వన్నె తెచ్చిన శ్రీకృష్ణ పాత్రధారులు డి.వి. సుబ్బారావు & ఎ.వి. సుబ్బారావు, శ్రీకృష్ణ తులాభారం నాటక రచయిత ముత్తరాజు సుబ్బారావు. రంగస్థల కళాకారుడు, నాట్యకళాయోగి పామర్తి సుబ్బారావు, తోలేటి సుబ్బారావు గొప్ప పద్యకవి. సినిమా రంగం దర్శకత్వపు విభాగంలో అగ్రస్థానం ఆదుర్తి సుబ్బారావు గారిది. ఇల్లరికం భార్యాభర్తలు కులగోత్రాలు వంటి సూపర్ హిట్స్ సారథి.. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత ఆనుమోలు వెంకట సుబ్బారావు. ఈయన అక్కినేని నాగేశ్వరరావు కి వియ్యంకుడు కూడా. కళా దర్శకుడు తోట సుబ్బారావు చిరస్మరణీయుడు. జస్టీస్ సుబ్బారావు పేరు తెలిసిందే. కోకా సుబ్బారావు గొప్ప ఇంజనీర్. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వార్తలు చదివిన కొప్పుల సుబ్బారావు, విజయవాడ సిద్ధార్ధ కళాశాల కి కృషి చేసిన వ్యక్తి మొవ్వ సుబ్బారావు. రాష్ట్ర ఉన్నత విద్యకు అధ్యక్షుడుగా ఉన్నప్పుడు వార్తల్లోకి ఎక్కిన వ్యక్తి సి. సుబ్బారావు. పిల్లల కోసం సురభి పుస్తకాన్ని రూపొందించిన వారి పేరు బుడ్డిగ సుబ్బారావు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా చేసిన దువ్వూరి సుబ్బారావు, తంగిరాల వెంకట సుబ్బారావు నిత్య పరిశోధకులు. ఒకనాటి గొప్ప చిత్రకారుడు అంకాల వెంకట సుబ్బారావు , ఆర్ట్ డైరెక్టర్ జి.వి. సుబ్బారావు, రాజమండ్రి కి చెందిన చిత్రకారుడు యల్లా సుబ్బారావు, కార్టూనిస్ట్ గీతా సుబ్బారావు, బాపట్లలో ఒకనాటి ప్రముఖ న్యాయవాది యడ్లపాటి వేంకట సుబ్బారావు. సుబ్బయ్య గారి హోటల్ గురించి వేరే చెప్పనక్కరలేదు. ఇలా ఎంతోమంది విఖ్యాత సుబ్బారావులు మన తెలుగు జాతికి ఎంతో గౌరవాన్ని తెచ్చారు. దువ్వూరి సుబ్బమ్మ గొప్ప స్వాతంత్ర్య యోధురాలు. ఇంతేకాక ఈ పేరుకి దగ్గరగా ఉన్న సుబ్బిరామిరెడ్డి వంటి ప్రఖ్యాతులు కూడా ఉన్నారు. ఇక ఆఫీసుల్లో కార్యాలయాల్లో పనిచేస్తున్న సుబ్బారావు లు కోకొల్లలు. చూశారా.. ఎంతమంది సూపర్ సుబ్బారావు లు ఉన్నారో. ఈ జాబితాలో లేనివారెవరైనా గొప్ప సుబ్బారావు ఇంకా ఉండవచ్చు. నా ఈ పరిశోధనలో ఇంత మంది సుబ్బారావులు కనిపించారు. ఈ సుబ్బారావు లందరీకీ సూపర్ గా జై కొడదామా…..

శ్రీరమణ గారు రాసిన వ్యాసానికి మరికొన్ని చేర్పులతో….
-కళాసాగర్

Share via
Copy link
Powered by Social Snap