పట్టుదలలో గట్టివాడు – పొట్టి శ్రీరాములు

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.

ధృవతారలు – 22

శ్రీరాములుగారు మొదట మద్రాసులోను, అటుపిమ్మట బొంబాయిలోని విక్టోరియా జూబిలీ టెక్నికల్ ఇనిస్టిట్యూట్ లోనూ శానిటరీ ఇంజనీరింగ్ చదివి, గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో ఉద్యోగి గానూ పనిచేశారు. గుజరాత్ సబర్మతీ ఆశ్రమంలో గాంధీగారి అనుయాయుడిగా చేరిన శ్రీరాములు గారు స్వాతంత్ర్యోద్యమం, క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాల్లో పాల్గొన్నందుకు పలుమార్లు జైలుపాలయ్యారు. మహాత్ములకు లోకమే కుటుంబం కనుక హరిజన ఆలయ ప్రవేశానికిగానూ, హరిజనోద్దరణకు గాను అనేక పర్యాయాలు నిరాహార దీక్షలకు పూనుకుని అనుకున్నది సాధించిన కార్యశూరుడు పొట్టి శ్రీరాములు గారు. తెలుగు మాట్లాడే వారందరికీ మద్రాసు రాజధానిగా ఓ రాష్ట్రం కావాలని నిరాహార దీక్ష చేసి అప్పటి ప్రధానమంత్రి నెహ్రూగారి వాగ్దానం మేరకు ఆ దీక్షను విరమించి ప్రత్యేక రాష్ట్ర నిర్మాణ ఆదేశాల కోసం వేచినారు. 58 రోజుల కఠోర నిరాహారదీక్ష కారణంగా ఆరోగ్యం క్షీణించి 15-12-1952 ఆంధ్రరాష్ట్ర ఆశయంతోనే అసువులు బాసినారు. చివరికి దిగొచ్చిన ప్రభుత్వం అక్టోబరు, 1953 న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఆ తరువాత నవంబరు 1956 హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రరాష్ట్రమవతరించింది. అచ్చ తెలుగు త్యాగనిరతి, ఆంధ్రుల ఆశాజ్యోతి సత్యాగ్రహ సమరసింహం, అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు నేటికీ మన ధృవతార.

(పొట్టి శ్రీరాములు జన్మదినం 16 మార్చి 1901)

SA: