సహయోగశక్తి

‘ఐకమత్యమే మహాబలం’ అన్నమాట విన్నప్పుడు గడ్డిపరక సైతం కరిని బంధించగలదనే శక్తి గుర్తుకువస్తుంది. ఐకమత్యంలో సహాయోగశక్తి దాగి ఉంటుంది. ఇది ఎంతటి కార్యాన్నైనా సునాయాసంగా పూర్తి చేసి విజయాన్ని అందిస్తుంది. కుంతీదేవి తన ఐదుగురు కుమారులు ఎల్లప్పుడూ ఐకమత్యంతో మెలగాలని కోరుకుంది. అందుకే అర్జునుడు ద్రౌపదిని స్వయంవరంలో వివాహమాడి తీసుకువచ్చినప్పుడు ఆ విషయమేమిటో క్షుణ్ణంగా తెలుసుకోకుండానే ఐదుగురుని సమానంగా తీసుకోమని చెప్పింది. ఆ విధంగా ద్రౌపది ‘పాంచాలి’ అయ్యింది

సమాజం, కుటుంబం వంటి వ్యవస్థల శక్తివంతమైన మనుగడకు సహాయోగశక్తి చాలా అవసరం. ఇది గుర్తించలేకపోతే విచ్ఛిన్నం తప్పదు. ధనం, అధికారం, హోదా ఉన్నాయనే భ్రమలో మనుషులు వారి మధ్య ఉండే సహాయోగశక్తిని నిర్వీర్యం చేసుకుంటారు. ఆధ్యాత్మికతలో సహయోగశక్తి సాధన చాలా ముఖ్యమైనది. అప్పుడే పరమాత్ముడు ఆదేశించిన కార్యాలను సాధించగలుగుతారు. శ్రీకృష్ణ పరమాత్మ తలచుకుంటే గోవర్ధనగిరి పర్వతాన్ని ఒక్కరే ఎత్తగలరు. కానీ తాను చిటికెనవేలిని పర్వతం క్రింద నిలిపి గోపికలకు సైతం సహాయోగశక్తిని వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఈ కార్యము ద్వారా సహాయోగశక్తి ఆంతర్యాన్ని లోకానికి చెప్పకనే చెప్పారు.

సహాయోగశక్తి సాధన కోసం దూరదృష్టి కలిగి ఉండాలి. అప్పటికప్పుడు లభించే విజయం తత్కాలికమైనదని గుర్తించకపోతే మనుషుల మధ్య దూరం పెరిగి సహాయోగశక్తి నిర్వీర్యం అవుతుంది. అందరి లక్ష్యం ఒకటేగా ఉన్నప్పుడు సహాయోగశక్తితో సాధించే విజయం ఐకమత్యమే మహాబలం అన్నదానికి నిదర్శనంగా నిలుస్తుంది. చేతి ఐదువ్రేళ్ళు ఒకే విధంగా ఉండనంత మాత్రాన అవి వాటి ప్రత్యేకతలను కోల్పోవు. అలాగే సహాయోగశక్తిలో ఉండే అందరి వ్యక్తుల యొక్క శక్తిసామర్థ్యాలు ఒకే విధంగా ఉండకపోవచ్చును. అలాగని వారిని దూరం చేసుకోకూడదు. అందరి వ్యక్తుల యొక్క ప్రత్యేకతలను ఏకం చేసినప్పుడు సహయోగశక్తి ద్వారా విజయం చేకూరుతుంది.

ఐకమత్యమనేది ఒక ఆధ్యాత్మిక భావన. దీని ద్వారా సహాయోగశక్తి సిద్ధిస్తుంది. కుటుంబం నుండి ప్రపంచం వరకు స్వేచ్చ, స్వాతంత్ర్యాలను సిద్ధింప చేసుకోవడానికి ఇదే మూలం. పురాణేతిహాసాలలో అనేక సంఘటనలు ఈ విషయాన్ని ఆవిష్కృతం చేసి మానవాళికి సందేశాన్ని అందించాయి.

ఎన్.బి.యస్. శ్రీనివాస్ పోలిశెట్టి
9989646639

Share via
Copy link
Powered by Social Snap