‘ప్రగతి’ రథసారథి … హనుమంతరావు

ఆసియా ఖండంలోనే ప్రసిద్ది గాంచిన అత్యాధునిక ప్రగతి ప్రింటర్స్ వ్యవస్థాపకుడు, కమ్యూనిస్ట్ నాయకుడు, నటుడు, విలేకరి, జీవితాంతమూ వామపక్ష పురోభివృద్ధిని కాంక్షించిన పరుచూరి హనుమంతరావుగారి స్మృతిదినం!

పరుచూరి హనుమంతరావుగారు కృష్టా జిల్లా దివిసీమలో ఘంటసాల మండలానికి చెందిన చిట్టూర్పు గ్రామంలో 1921 లో పేద రైతు కుటుంబంలో పుట్టారు. బందరు హిందూ ఉన్నత పాఠశాలలో మెట్రిక్‌ వరకు విద్యాభ్యాసం చేశారు. మద్రాసు పచ్చయ్యప్ప కాలేజి నుంచి బి.ఏ. పట్టా అందుకున్నారు. కమ్యూనిస్టు కార్యకర్తగా పనిచేశారు. బొంబాయి పీపుల్స్‌ ధియేటర్‌లో బలరాజ్‌ సహానీ వంటి ప్రముఖులతో కలిసి నాటక ప్రదర్శనలిచ్చారు. వూరూరా తిరిగి ప్రదర్శనలిచ్చి రాజకీయ ప్రచారం చేశారు. తెలంగాణా రైతాంగసాయుధ పోరాటంలో జైలుకు వెళ్లారు. కడలూరు జైలులో ఎ.కె. గోపాలన్‌, మోటూరు హనుమంతరావు తదితర కమ్యూనిస్టు యోధులతో కలసి శిక్ష అనుభవించారు. మద్రాసు పచ్చయప్ప కాలేజీలో బి.ఏ. చదువుతూ విద్యార్థి ఉద్యమంలో పనిచేశారు. విశాలాంధ్ర దినపత్రికలోనూ కొంత కాలం విలేకరిగా పనిచేశారు. విద్యార్థి దశ నుండి విద్యార్థి సమాఖ్యలో చురుకైన కార్యకర్తగా పనిచేశారు. చిన్నప్పటి నుండి అభ్యుదయ భావాలు ఉండటం వల్ల చండ్ర రాజేశ్వరరావు లాంటి కమ్యూనిస్టు నాయకులతో పరిచమేర్పడటంతో ఉమ్మడి కమ్యూనిస్టుపార్టీలో పార్టీ హోల్‌టైమర్‌గా, ఏ.ఐ.ఎస్‌.ఎఫ్‌. రాష్ట్ర నాయకులుగా విశేష కృషిచేశారు.

1951 నాటి రాయలసీమ కరవు సమయంలో వ్యాధులు వ్యాపించగా పాతిక మందికి పైగా వైద్యులతో కలసి ప్రజలకు అమూల్యమైన సేవలందించారు. 1956 వరకు మద్రాసులో విలేకరిగా పనిచేశారు. 1952, 1956 ఎన్నికలలో ప్రజానాట్యమండలి కళాకారుడిగా వివిధ కళారూపాల ద్వారా ప్రచారం చేశారు. 1962లో హైదరాబాద్‌లో ప్రగతి ప్రెస్‌ స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‍‌లో దానిని అత్యుత్తమ, అత్యాధునిక ముద్రణాలయంగా తీర్చిదిద్ది పురస్కారాలు అందుకున్నారు.

1962 తర్వాత చలన చిత్రరంగంలో తాపీ చాణక్య వంటి దర్శకుల దగ్గర పనిచేశారు. మహాకవి శ్రీశ్రీ కి సన్నిహితంగా మెలిగారు. ఆ రోజుల్లో నటించడానికి ఎవరూ ముందుకు రాకపోతే ప్రకటనలిచ్చి ఇంటర్వ్లూలు జరిపి మరీ తీసుకొచ్చారు. ముడిఫిల్ము కొరత సినిమా పరిశ్రమను సంక్షుభితం చేసిన దశలో ఆయన దృష్టి ముద్రణా రంగం వైపు మరలింది. ఆరు వేల పెట్టుబడితో పాత యంత్రాలతో అచ్చుపని మొదలెట్టారు. ఒక సెకండ్‌ హాండ్‌ ఆఫ్‌సెట్‌ యంత్రం కొన్నారు. హనుమంతరావు కుమారులు నరేంద్ర మహేంద్ర ప్రగతి సంస్థను సాంకేతికంగా అభివృద్ధి పరిచారు. 1979లో వారు దక్షిణ భారత దేశంలోనే తొలిసారి ఫోటో కంపోజింగు విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈయనకు ఇద్దరు కుమారులు. మనుమళ్ళు హర్ష, హేమంత్‌లు కూడా ఈ బృందంలో భాగస్వాములయ్యారు. అయిదు రంగుల ఆఫ్‌సెట్‌ ముద్రణాయంత్రం కంప్యూటర్‌ కంట్రోల్స్‌తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. 1996లో స్పాట్‌ యువి కోటింగ్స్‌ కూడా అలాగే ప్రథమ పర్యాయం మొదలైంది.

ఆయన వివాహం చాలా నిరాడంబరంగా ఆ రోజులో 25 పైసలతో చేసుకొని నేటి తరానికి ఆదర్శంగా నిలిచారన్నారు. వారు వ్యాపార రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డాక వామపక్ష పురోభివృద్ధిని కాంక్షించి, వాటి అభివృద్ధికి తన సహాయ సహకారాలు అందిచారు. సీఆర్‌.ఫౌండేషన్‌లో వృద్ధాశ్రమం, మహిళా సెంటర్‌, మెడికల్‌ సెంటర్‌ నిర్మాణంలో, వాటి అభివృద్ధికి నిర్వీరామంగా కృషి చేశారు. కాట్రగడ్డ గంగయ్య స్మాకర కమిటీ “శాంతి స్వర్ణ పతకాన్ని” హనుంతరావుకు ప్రకటించింది. ఆ పతకం స్వీకరించకుండానే ఆయన మృతి చెందారు.
మరణం : గతకొద్ది కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడున్న హనుమంతరావు మార్చి 2, 2015 సోమవారం హైదరాబాద్‌ లో కన్నుమూశారు.

Gold Asian Print Award

అవార్డుల పరంపర :
1) ప్రగతి ప్రింటర్స్‌కు మూడు సార్లు సార్లు గోల్డెన్‌ ఎలిఫెంట్‌ పురస్కారం లభించింది.
2) 1962లో రూ. 6 వేల పెట్టుబడితో ప్రగతి ప్రింటర్స్‌ని ప్రారంభించారు.
3) 1985 నుంచి 2010 మధ్య ప్రగతి ప్రింటర్స్‌కు 200 జాతీయ అవార్డులు లభించాయి.
4) 1996లో దక్షిణాసియా దేశాల్లో బెస్ట్‌ ప్రింటర్‌ ఇన్‌ క్వాలిటీ అవార్డు
5) 2001 నుంచి 2006 మధ్య వరసగా ఆరేళ్లు ఏషియన్‌ ప్రింటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పురస్కారం
6) 2004లో 9 కేటగిరీల్లో ప్రగతికి ఏషియన్‌ ప్రింట్స్‌ అవార్డులు
7) 2004లో ట్రేడింగ్‌ ప్రింటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు
8) 2006, 2008, 2009లో ప్రగతి ప్రింటర్స్‌కు గోల్డెన్‌ ఎలిఫెంట్‌ పురస్కారం.
9) ప్యాకేజింగ్‌ రంగంలో సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికింది ప్రగతి ప్యాక్‌.
మొహమ్మద్ గౌస్

SA: