తెలుగును అధికారభాషగా అమలు చేయాలి

1966 మే 14న తెలుగుభాషను అధికారభాషగా, పాలనా భాషగా, ప్రకటిస్తూ చట్టం వచ్చింది. దీన్ని పూర్తిగా పాటించడం పాలకుల విధి. ప్రభుత్వాన్ని కదిలించి పనిచేయించుకునే హక్కు ప్రజలకు ఉంది. ఇది ప్రభుత్వ వ్యతిరేక చర్య కాదు. ఇది రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కు అని తెలుగు భాసోధ్యమ సమాఖ్య గౌరవాధ్యక్షులు డా. సామల రమేష్ బాబు అన్నారు.

విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం(13-5-2023) జరిగిన ప్రజా చైతన్య సభలో ఆయన మాట్లాడుతూ ఉద్యం యొక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని వివరించారు. తెలుగు భాషోద్యమ సమాఖ్య జాతీయ అధ్యక్షులు ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించిన ఈ సభలో డా. సామల రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్రంతో ఉత్తరప్రత్యుత్తరాలను తెలుగులో రాసే హక్కు మనకు ఉంది. పార్లమెంటులో మన ప్రతినిధులు కూడా తెలుగులో మాట్లాడే హక్కు ఉంది. దాన్ని వాళ్ళు ఉపయోగించుకొనేట్లు మనం ఒత్తిడి చెయ్యాలన్నారు.

మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ, నేటి సాంకేతిక విప్లవ సమయంలో కేవలం ఒక్క మీట నొక్కితే జివోలను తెలుగు భాషలో అందించే పరిజ్ఞానం అందుబాటులొ ఉన్నప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగు లో పరిపాలన చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షునిగా తన అనుభవాలను ఈ సందర్భంగా పంచుకున్న ఆయన ముఖ్యమంత్రుల అంగీకారం సహకారం లేకుండా అధికార భాషా సంఘం ఏ చట్టాన్నీ అమలు చేయలేదన్నారు.

ఈ సభలో మాజీ రాజ్యసభసభ్యులు పి.మధు మరియు తెలుగు భాషోద్యమ సమాఖ్య సభ్యులు డా. గుంటుపల్లి శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు.

SA: