పదేళ్ల అక్షర తపస్సుకు – ప్రపంచ రికార్డ్

వికీపీడియాలో తెలుగువాడి అరుదైన ప్రపంచ రికార్డు: ప్రణయ్‌రాజ్ వంగరి 10 ఏళ్ల అక్షర తపస్సు
ఉచిత సమాచార విజ్ఞాన వ్యాప్తిలో తెలుగు భాషకు ప్రపంచస్థాయిలో గర్వకారణమైన అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూర్ కి చెందిన తెలుగు వికీపీడియన్ ప్రణయ్‌రాజ్ వంగరి వికీపీడియాలో సరికొత్త చరిత్ర సృష్టించారు. వరుసగా 10 ఏళ్ల పాటు (3,652 రోజులు) ఏ ఒక్క రోజు కూడా విరామం తీసుకోకుండా రోజూ ఒక వికీ వ్యాసం రాసిన తొలి వికీపీడియన్‌గా ఆయన అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పారు.

నిరంతర శ్రమ – సుదీర్ఘ ప్రయాణం: వికీపీడియాలో ప్రణయ్‌రాజ్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. 2016 సెప్టెంబరు 8న ‘100 రోజులు – 100 వికీవ్యాసాలు’ అనే చిన్న ఛాలెంజ్‌తో ఆయన తన అక్షర యజ్ఞాన్ని ప్రారంభించారు. ఆ సంకల్పం రోజుకొక వ్యాసం చొప్పున నిరంతరాయంగా 10 సంవత్సరాల పాటు కొనసాగి, ప్రపంచంలోనే మరెవరికీ సాధ్యంకాని అరుదైన ఘనతగా మారింది. 2016 సెప్టెంబరు 8 నుండి 2026 సెప్టెంబరు 7 నాటికి ఆయన తన 10 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ కాలంలో ఆయన తెలుగు వికీపీడియాలో ఏకంగా 11,500 కి పైగా కొత్త వ్యాసాలను సృష్టించడం విశేషం.

ప్రణయ్‌రాజ్ వికీపీడియా ప్రయాణంలోని ప్రధాన మైలురాళ్ళు:
100 రోజులు – 100 వ్యాసాలు: సెప్టెంబరు 8, 2016న మొదలైన ఈ ఛాలెంజ్ డిసెంబరు 16, 2016 నాటికి దిగ్విజయంగా పూర్తయింది.

వికీవత్సరం (365 రోజులు): 2017 సెప్టెంబరు 7 నాటికి 365 రోజులు పూర్తిచేసి, ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్‌గా రికార్డు సృష్టించారు. దీనికిగానూ అప్పటి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తదితరుల నుండి ప్రశంసలు, సత్కారాలు పొందారు.

1000 నుండి 2000 రోజుల వరకు:

*2019 జూన్ 4 నాటికి వరుసగా 1000 రోజుల్లో 1000 వ్యాసాలు పూర్తి చేశారు.
*2020 అక్టోబరు 17 నాటికి 1500 రోజుల్లో 1500 వ్యాసాల మైలురాయిని దాటారు.
*2022 మార్చి 1 నాటికి 2000 రోజుల్లో ఏకంగా 3,015 వ్యాసాలు రాశారు.

10 ఏళ్ళ ప్రపంచ రికార్డు: 2026 సెప్టెంబరు 7 నాటికి 3,652 రోజులు పూర్తిచేసి, 11,500+ వ్యాసాలతో ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన ఏకైక వికీపీడియన్‌గా చరిత్ర పుటల్లోకెక్కారు.

ప్రభుత్వ గుర్తింపులు – ప్రతిష్ఠాత్మక సత్కారాలు: ప్రణయ్‌రాజ్ కృషికి తగిన గుర్తింపు లభించింది. 2018 తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో ‘లోకలైజేషన్ (స్థానికీకరణ)’ విభాగంలో మంత్రి కేటీఆర్ చేతులమీదుగా తొలి అవార్డును అందుకున్నారు.

ఈ 10 ఏళ్ల చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని, 2026 సెప్టెంబర్ 6న కేరళలోని కొచ్చిలో జరిగిన ‘వికీ కాన్ఫరెన్స్ ఇండియా (2026)’ సదస్సులో ప్రణయ్‌రాజ్ కు ఘన సత్కారం లభించింది. తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మెంబర్స్ లోరెంజో లోసా, విక్టోరియా డోరోనినా లు పాల్గొని ఆయనను జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. ఈ వేడుకలో వికీమీడియన్లు విజే సుశీల, కృపాల్ కశ్యప్, పవన్ సంతోష్, నేతి సాయికిరణ్, దివ్య, బత్తిని వినయ్ కుమార్ గౌడ్ లతో పాటు వివిధ భాషలకు చెందిన సుమారు 250 మంది వికీమీడియన్లు పాల్గొని ఆయనను అభినందించారు.

Share via
Copy link
Powered by Social Snap