‘పులి’ నన్ను కౌగిలించుకుంది

నా చందమామ రోజుల్లో(1977)… (ఇలస్టేటర్‌గా వున్నప్పుడు)… చందమామలో ముగ్గురు కళా మాత్రికులు వుండేవారు. అప్పటికే శ్రీ చిత్రగారు దేవుడి దగ్గరకు వెళ్లిపోయారు. మిగిలినది ఇద్దరు, ఆ ఇద్దరిలో… ఒకరు శ్రీ శంకర్ గారు, వారు చాలా ప్రేమగా స్పోర్టివ్ గా వుండేవారు. కనుక లంచ్ టైంలో వెళ్లి పలుకరిస్తే వారి లంచ్ బాక్స్ లోంచి కొంత మిక్స్డ్ రైస్ నాకు ఆ స్టీల్ డబ్బా మూతలో వేసి తినమనేవారు. అది మహాప్రసాదంగా తినేవాడిని. మరి శ్రీ శంకర్ గారు కూడా ఇటీవలనే దేవుడి పిలుపుని అందుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
ఇక వపా గారి సంగతికి వస్తే… చందమామ ఆఫీస్లో ఆయనకి ప్రత్యేకమైన గది ఒకటి మేడమీద ఏర్పాటుటు చేసారు. అక్కడ ఆయన ఒంటరిగా బొమ్మలేసుకునేవారు.
ఆయన్ని కలవాలనే తీవ్రమైన కోరిక, కుతుహలం వున్నా… అందరి మాట వినవలసి వచ్చింది… ఓరేయి! అక్కడికి వెళ్లకు… అయన భలే కోపిష్ఠి.. తిడతాడు… ఎవ్వరిని రానివ్వడు. అలా నన్ను ఆయన ఒక పులి అని భయపెట్టేసారు.

Sudha Mohini artist VaPa

కానీ నాకు ఆయన్ని కలవాలనే కోరిక చావలేదు.. సరే కొడితే కొట్టించుకుంటా.. తిడితే తిట్టించుకుంటా.. ఏమైనా సరే వెళ్లి కలవాలసిందే… అని అనుకొని ఓ రోజు లంచ్ టైంలో ఆయన గది వైపు నడిచాను. మెట్లు ఎక్కాను.. ఆయన గది ముందలకి వెళ్లాను. నా ఉనికిని గమనించి తను చేసే పనిని ఆపి నావైపు చూసి.. ఎవరూ అన్నారు. నేను ధైర్యంగా నా పేరు బాబు… పి.యస్. బాబు, నేను ఇంగ్లీషు చందమామలో బొమ్మలు వేస్తుంటాను. అని అనగానే మీరు ఇంగ్లీషు బాబా?! (నేను ఇంగ్లీషులో సైన్ చేసేవాడిని) అని… నీ బొమ్మలు బాగుంటాయి అని నన్ను రెండు చేతులతో ఆహ్వానించి.. ప్రేమతో పలకరించారు. మరి ‘పులి’ అని భయపెట్టారు… అదే ‘పులి’ నన్ను కౌగిలించుకుంది. సంభ్రమాశ్చర్యంతో మునిగితేలాను.

-పి.యస్. బాబు, చిత్రకారుడు

SA:

View Comments (1)