ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ చెరగని ‘సినిమా పోస్టర్’

పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ (21-09-2021, మంగళవారం) తెల్లవారు జామున తన 83 వ యేట మద్రాసు విజయా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈశ్వర్ గారు తన చిత్రాలద్వారా ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారు. వారి వర్ణ ప్రపంచం చాలా గొప్పది. వారు ఎందరికో స్ఫూర్తిదాయకులు, వారి బొమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము.. ఈశ్వర్‌ పుట్టింది (ఫిబ్రవరి 1, 1938లో) పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో. ఈశ్వర్ గారికి ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు సంతానం.

ఈరోజు వారు భౌతికంగా మన మధ్య లేనప్పటికీ, వారు సినిమా పోస్టర్ రూపంలో మన మదిలో ముద్రించిన జ్ఞాపకాలు ఎప్పటికీ చెరగనివి. వారి కుటుంబానికి 64కళలు పత్రిక తరపున ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.

నాలుగు దశాబ్దాలుగా ఆ కుంచెకు విశ్రాంతి లేదు. ఒకటా.‌.రెండా..? సుమారు 3000 తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల సినిమాలకు అద్భుతమైన పోస్టర్స్ను డిజైన్ చేసిన ‘అందమైన కుంచె’ అది. ఈశ్వర్.. అంటే సినిమా పోస్టర్..,సినిమా పోస్టర్ అంటే.. ఈశ్వరే.. అన్నట్లు.. ఆయన చిత్రకళా ప్రస్థానంలో.. దశాబ్దాలే చిన్నబోయాయి. ఒక్కో సినిమాకు కనీసం పది నుంచి ఇరవై వరకు పోస్టర్లను డిజైన్ చేయిస్తారు. ఇప్పుడైతే టీవీలు,ఫోన్లు,వీడియోలు, యూట్యూబ్ లు వున్నాయి కానీ…ఈశ్వర్ కుంచె పట్టే నాటికి సినిమా పబ్లిసిటీ అంటే వాల్ పోస్టర్లు మాత్రమే..పోస్టర్ డిజైన్, బొమ్మలు బాగుంటే…

ప్రేక్షకుడు థియేటర్ కు వస్తాడు. అంటే..ప్రేక్షకులను థియేటర్ కు రప్పించడంలో పోస్టర్ ఎంతో ముఖ్యమైంది వేరే చెప్పాల్సిన పనిలేదు.అలాంటి పోస్టర్ డిజైన్ కు ఈశ్వర్ పెట్టింది పేరు. ఆరోజుల్లో సినీనిర్మాతలు, హీరోలు..పోస్టర్ డిజైన్ లకు ఈశ్వర్ పేరునే రికమెండ్ చేసేవారు. ఆయన చేతి వాటం అలాంటిది మరి. 1960 నుంచి 2000 సం. వరకు అంటే.. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు ఈశ్వర్ పబ్లిసిటీ రంగంలో తిరుగులేని కుంచెగా వెలుగొందాడు. సినిమా పోస్టర్ కు ఆయన ఓ శిఖరాగ్రంగా పేరుతెచ్చుకున్నారు. నాటి నటీనటులు ముచ్చటపడి ఈశ్వర్ చేత తమ పోర్ట్రైట్ లు వేయించుకొని,ప్రేమ్ కట్టించుకొని మరీ ఇళ్ళల్లో పెట్టుకునే వారు. అలా ఈశ్వర్ బొమ్మ లేని నటీనటుల ఇళ్ళు, కార్యాలయాలు లేవంటే అతిశయోక్తి కాదు..

కొసనా ఈశ్వరరావు తెలుగు సినీ పరిశ్రమలో “ఈశ్వర్” నామంతో నాలుగు దశాబ్దాలపాటు సినిమా పోస్టర్లని డిజైన్ చేసినవారు. పోస్టర్‌ డిజైనింగులో అందెవేసిన చేయి ఈశ్వర్‌ది. ఈయన రాసిన సినిమా పోస్టరు పుస్తకానికి 2012లో ఉత్తమ చలనచిత్ర పుస్తకం విభాగంలో నంది అవార్డు వచ్చింది. ఈ పుస్తకం ఈశ్వర్ గారి నలభై యేళ్ళ సినిమా పోస్టర్ అనుభవాలు మాత్రమే కాదు, ఎందరో కళాకారుల జీవిత విశేషాలుంటాయి. అందుకే ఈ పుస్తకం ఈశ్వర్ గారిని ప్రత్యేకంగా నిలబెట్టింది.

Nandi Award receiving from Amitab Bachan in 2012 year

ఈశ్వర్‌ ‘సినిమా పోస్టర్‌” పేరుతో తన జీవితచరిత్రను గ్రంథస్తం చేస్తూ పోస్టర్ల గురించి సాంకేతిక అంశాలను, ఆ రంగంలో నిష్ణాతులైన సీనియర్ల, జూనియర్ల జీవిత రేఖాచిత్రాలనూ పరిచయం చేశారు. తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పనిచేసిన కరుణానిధి స్వయంగా తన యింటికి వచ్చిన సందర్భం గురించి ఆయన ఆ పుస్తకంలో చాలా ఆశక్తికరంగా రాశారు. ఈ పుస్తకానికి మరి కొన్ని కొత్త రంగుల పేజీలు జతచేసి మూడవ ముద్రణ చేయాలని సర్వం సిద్ధం చేశారు. కాని ఆ పుస్తకాన్ని చూడకుండా నే వెళ్ళిపోయారు.

-కళాసాగర్
పైన ఈశ్వర్‌ గారి బొమ్మలు చిత్రకారులు పి.ఎస్.బాబు, సోమశేఖర్

4 thoughts on “ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ చెరగని ‘సినిమా పోస్టర్’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap